సిల్లీపాయింట్‌

మనదేశంలోని థార్‌ ఎడారిలో ఉన్నంత జనాభా... ప్రపంచంలో మరే ఎడారిలోనూ కనిపించదు! జోధ్‌పూర్‌, బికనీర్‌, జైసల్మేర్‌ వంటి పెద్ద నగరాలున్న ఎడారి కూడా ఇదొక్కటే!

Updated : 17 Apr 2022 04:28 IST

సిల్లీపాయింట్‌

నదేశంలోని థార్‌ ఎడారిలో ఉన్నంత జనాభా... ప్రపంచంలో మరే ఎడారిలోనూ కనిపించదు! జోధ్‌పూర్‌, బికనీర్‌, జైసల్మేర్‌ వంటి పెద్ద నగరాలున్న ఎడారి కూడా ఇదొక్కటే!

* ఒకే దేశంలో ఉన్నా, అధికారికంగా ఒకే కాలమానాన్ని పాటిస్తున్నా... ఈశాన్య రాష్ట్రాలకీ మనకీ మధ్య రెండు గంటల తేడా ఉంటుంది. సూర్యోదయమూ అస్తమయమూ కూడా మనకన్నా చాలాముందే ఉంటాయి ఆ రాష్ట్రాలకి!

* ఏప్రిల్‌, జూన్‌... అమెరికాలో అమ్మాయిలకి ఎక్కువగా పెట్టే పేర్లలో ఈ రెండూ ఉంటాయట!

*తక్షణ శక్తినిచ్చే ఓఆర్‌ఎస్‌ పొడీ, అంబులెన్సూ, ప్లాస్టిక్‌ సర్జరీ... ఇవన్నీ యుద్ధ క్షేత్రాల్లో అప్పటికప్పుడు సైనికుల ప్రాణాలు నిలిపేందుకు కనిపెట్టినవే!

పిల్లి, ఒంటె, జిరాఫీ... వీటి మధ్య ఓ పోలిక ఉంది. నాలుగు కాళ్లలో ముందు కుడి కాళ్లనీ, ఆ తర్వాత ఎడమ కాళ్లనీ ఉపయోగిస్తూ నడుస్తాయివి. ఇవి తప్ప మరే జంతువులూ ఇలా నడవ్వు!

* 17వ శతాబ్దంలో ఐరోపాలోని అమ్మాయిలకు కనుబొమల వెంట్రుకల్ని కత్తిరించుకోవడం ఓ ఫ్యాషన్‌గా ఉండేది. ప్రఖ్యాత మోనాలిసా చిత్రంలోని మోడల్‌ నొసలు బోసిగా ఉండటానికి ఇదే కారణమంటారు!

* ఆధార్‌ ద్వారా ప్రభుత్వం సేకరించిన మన సమాచారాన్నంతా... బెంగళూరులో నిక్షిప్తం చేశారు. అక్కడ ఇందుకోసమే 116 కోట్లతో డేటా సెంటర్‌ని ఏర్పాటుచేశారు. నిప్పుకీ నీరుకీ భూకంపానికీ కూడా చెక్కుచెదరని విధంగా ఉంటుందీ కేంద్రం!

* పామూ నిచ్చెనల పరమపద సోపాన పటాన్ని... ప్రాచీనకాలంలో వ్యాపారంలో లాభనష్టాలని గుర్తించడానికే వాడేవారట!

లండన్‌లోని కింగ్స్‌ కాలేజీలో ఏటా నిర్వహించే ‘టాల్‌స్టాయ్‌ ట్రోఫీ’ ఫుట్‌బాల్‌ పోటీలంటే... అక్కడి ప్రజల్లో మంచి క్రేజ్‌ ఉంది! వింతేమిటంటే... ఈ పోటీ విజేతలకి కప్పుకి బదులు టాల్‌స్టాయ్‌ రచన ‘వార్‌ అండ్‌ పీస్‌’ పుస్తకాన్ని బహుమతిగా ఇస్తారు!

* జర్మనీలో పీహెచ్‌డీ చేసినవాళ్లని మాత్రమే ‘డాక్టర్‌’ అని పిలుస్తారు. వైద్యవిద్యలో పీహెచ్‌డీ చేస్తే తప్ప వైద్యులనీ అలా పిలవరు.... కేవలం ‘ఆర్ట్‌జ్‌’ అంటారంతే!

తన రచనల కోసం నోబెల్‌ పురస్కారం అందుకున్న ఏకైక రాజకీయ నాయకుడు బ్రిటన్‌ మాజీ ప్రధాని విన్‌స్టన్‌ చర్చిల్‌.

హైదరాబాద్‌ నిజాం కోడలు యువరాణి నిలోఫర్‌...  నాటి ప్రపంచ టాప్‌-10 సౌందర్యరాశుల్లో ఒకరు! రెండో ప్రపంచ యుద్ధంలో నర్స్‌గా సేవలందించారామె!

గుడ్డు తెల్లసొనలో జీవకణాలేవీ ఉండవు. ఆ కారణం వల్లే అమెరికా ఐరోపా దేశాల్లోని శాకాహారులు అందరూ దాన్ని ఇష్టంగా తింటుంటారట!

* చేతులు కడుక్కుంటే వ్యాధులు రావని నిరూపించిన వాడు ఇగ్నాజ్‌ సెమ్మెల్‌వేల్‌ అనే శాస్త్రవేత్త. ఇందుగ్గాను 19వ శతాబ్దంలో పిచ్చాసుపత్రిలో చేర్చారతణ్ణి!

విమాన ప్రమాదానికి సంబంధించిన కారణాలని తెలుసుకునేందుకు... ప్రతి ఫ్లైట్‌లోనూ బ్లాక్‌ బాక్స్‌ ఉంటుందని వినే ఉంటారు. నిజానికి అది నారింజ రంగులో ఉంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..