వికసించే కాలువ!

కొళికోడ్‌ జిల్లాలోని ఓ కాలువ గులాబీ మయమై చూపరులను ఆకట్టుకుంటోంది. కేరళకు వెళ్లే పర్యటకుల్ని ఆకర్షించి పర్యటక ప్రాంతంగానూ మారిపోయింది. అంత ప్రాధాన్యత సంతరించుకున్న ....

Updated : 19 Jun 2022 04:56 IST

వికసించే కాలువ!

కొళికోడ్‌ జిల్లాలోని ఓ కాలువ గులాబీ మయమై చూపరులను ఆకట్టుకుంటోంది. కేరళకు వెళ్లే పర్యటకుల్ని ఆకర్షించి పర్యటక ప్రాంతంగానూ మారిపోయింది. అంత ప్రాధాన్యత సంతరించుకున్న ఆ కాలువ వర్ణరంజితంగా మారడానికి గులాబీ రంగులో వికసించే ఫ్రంట్‌వార్ట్‌ పూలే కారణం. సౌత్‌ఆఫ్రికాకు చెందిన ఆ నీటి జాతి మొక్క కొళికోడ్‌లోని నదిపైన తీగలా అల్లుకుంటూ మొత్తంగా పూలతో నీటిని కప్పేసింది. ఆ పూలదుప్పటి కప్పుకుని పలు గ్రామాల్ని చుడుతూ వెళుతున్న ఆ కాలువ అందాలను వీక్షించడానికి పర్యటకులూ, ఫొటో షూట్‌కోసం కొత్తజంటలూ బారులు తీరుతున్నారు. ఈ పింక్‌ కాలువ అందానికి వ్యాపార దిగ్గజం ఆనంద్‌ మహీంద్రా కూడా ఫిదా అయిపోయి తన ఫోన్‌, పీసీ వాల్‌పేపర్‌గా ఆ ఫొటోలను పెట్టుకుని ట్వీట్‌ చేయడంతో సోషల్‌మీడియాలోనూ వైరల్‌ అయింది.


కుక్కల ఆహారం రుచి చూసే ఉద్యోగం

ఫుడ్‌ టేస్టర్లూ, టీ టేస్టర్ల గురించి ఇదివరకే విన్నాం. అయితే ఇప్పుడు కుక్కల ఆహారం తయారు చేసే ఓ సంస్థ డాగ్‌ఫుడ్‌ టేస్టర్‌గా ఓ ఉద్యోగాన్ని ఆఫర్‌ చేస్తోంది. అంతేకాదు, రోజుకి లక్షల రూపాయలు కూడా అందివ్వడానికి సిద్ధమైంది. బ్రిటన్‌కి చెందిన ‘ఓమ్నీ’ అనే కుక్కల ఫుడ్‌ బ్రాండ్‌ చిలగడదుంపలు, పప్పులు, బ్రౌన్‌రైస్‌, గుమ్మడి కాయ, బ్లూబెర్రీస్‌, బఠాణీల వంటి వాటితో ఆహారం తయారుచేస్తోంది. తాము కుక్కల కోసం తయారు చేసే ఈ ఆహారం ఆరోగ్యవంతమైందనీ, అది మనుషులు కూడా తినొచ్చనీ చెప్పడానికే ఈ ఉద్యోగ ఆఫరును ఇస్తోంది ఓమ్నీ సంస్థ. ఇక, ఆ ఉద్యోగంలో చేరిన వారు కుక్కల ఆహారం తింటూ... రుచీ వాసనా ఎలా ఉన్నాయో చెప్పాలి. తింటున్నప్పుడూ, తిన్నాకా ఎలా అనిపించిందో వంటివన్నీ ఓ రివ్యూ కూడా రాయాల్సి ఉంటుంది. అంతేకాదు, ఆఫీసులో ఉన్నంత సేపూ బయట ఆహారాన్ని తినడానికి వీల్లేదు. కేవలం కుక్కల ఆహారమే తినాలనే నిబంధన కూడా ఉంది.


గంజాయి తాగొచ్చూ తినొచ్చూ!

గంజాయిని తీసుకోవడం చట్టరీత్యా నేరం. అందులో ఔషధ గుణాలు ఉన్నప్పటికీ ఆ పంట వేయడం కూడా మన దగ్గర నిషేధం. మరి అలాంటి గంజాయి కలిపిన కాఫీలూ, శాండ్‌విచ్‌లూ, లస్సీ, ఇతర పానీయాలూ అందిస్తోంది పుణెలోని ‘ది హెంప్‌ కెఫెటేరియా’. అమృత ఏర్పాటు చేసిన ఆ కెఫే ప్రభుత్వ అనుమతితోనే నడుస్తోంది. అంతేకాదు, తినుబండారాల్లో కలిపే గంజాయి పొడిని భంగ్‌ అంటారు. దాన్ని లేలేత గంజాయి ఆకులూ, మొగ్గలూ, పువ్వుల నుంచి తయారుచేస్తారు. ఉత్తరాఖండ్‌లో గంజాయి సాగుకి అనుమతి ఉండటంతో అక్కడి నుంచి భంగ్‌ని కొనుగోలు చేస్తుంది అమృత. అలానే, ఉత్తరాదిన హోలీ వేడుకల్లో భాగంగా చాలామందికి భంగ్‌తో చేసిన పానీయాన్ని తీసుకోవడం ఆనవాయితీ. అది ఆ ఒక్కరోజునే చేస్తారు. చిన్నతనం నుంచీ ఆ పానీయాన్ని తీసుకోవడంతోపాటు అందులో ఔషధ గుణాలున్నాయని తెలుసుకున్న అమృత కెఫే ఏర్పాటు చేసి భంగ్‌ ఆధారిత ఉత్పత్తులను అందించడానికి ముందుకొచ్చింది. నాలుగేళ్లనుంచీ ఈ కెఫేని నడుపుతున్న ఆమె కాఫీలూ శాండ్‌విచ్‌లతోపాటు భంగ్‌ పానీయాన్ని కూడా ఏడాదంతా విక్రయిస్తోంది.


అక్కడికి నగ్నంగా వెళతారు!

ఆటవిక తెగకు చెందిన ఎందరో తమ సంప్రదాయాల్ని కాపాడుకోవడం కోసం ఎంత కష్టమైనా సరే చిత్రవిచిత్ర ఆచారాల్ని పాటిస్తుంటారు. ఇండోనేషియాలోని ఎంగ్రూవ్‌ కెంపుంగ్‌ ప్రాంతంలో నివసించే పపువా తెగవారు కూడా తమకు మంచి జరుగుతుందనే నమ్మకంతో స్థానికంగా మడ అడవుల్లోని నీటి ప్రవాహాల్లో ఆల్చిప్పల వేటకు వందల ఏళ్లుగా నగ్నంగానే వెళుతున్నారు. మగవారికి ప్రవేశం లేని ఆ మాంగ్రూవ్‌ ఫారెస్ట్‌లోని కలపను కాపాడుకోవడం కోసం కూడా వారు నగ్నంగానే కాపలా కాస్తుంటారు. ఒకవేళ మగవారు ఆ నీటిలోని అడవిలోకి ప్రవేశిస్తే వారిని గిరిజన కోర్టులో అప్పగించి శిక్షవేయిస్తారు. అంతేకాదు పపువా తెగవారు అడవిని స్త్రీగా భావించి పవిత్రంగా చూస్తారు. పైగా ఆల్చిప్పలు ఇంట్లో ఉంటే అదృష్టమని నమ్ముతుంటారు. అందుకే ఆడవారు నగ్నంగా వెళ్లి తీసుకొచ్చే ఆల్చిప్పల్ని వారి భర్తలు మార్కెట్‌లో విక్రయిస్తుంటారు. అంత చిత్రమైన ఆచారాలు ఉన్న ఆ ప్రాంతంలో ప్రతిపనిలోనూ మహిళలదే పైచేయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..