శ్రీరాముడు వెళ్లాడనీ...

ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజున చాలా ఊళ్లలో రకరకాల ఉత్సవాలు జరుపుతారు. ఆలయాల్లో కనులవిందుగా రాముడికల్యాణం చేస్తుంటారు. కానీ బిహార్‌లోని నౌరంగియా గ్రామంలో మాత్రం అలాంటివేమీ జరగవు.

Published : 22 May 2022 01:17 IST

శ్రీరాముడు వెళ్లాడనీ...

ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజున చాలా ఊళ్లలో రకరకాల ఉత్సవాలు జరుపుతారు. ఆలయాల్లో కనులవిందుగా రాముడికల్యాణం చేస్తుంటారు. కానీ బిహార్‌లోని నౌరంగియా గ్రామంలో మాత్రం అలాంటివేమీ జరగవు. పైగా రామనవమి రోజున ఊరంతా ఖాళీ చేసి పిల్లాజెల్లాతో కలిసి దగ్గర్లో ఉన్న అడవిలోకి వెళతారు. అంతేకాదు... ఆవుల్నీ దూడల్నీ ఆఖరికి ఇంట్లో ఉండే పెంపుడు పిల్లుల్నీ కూడా వెంటబెట్టుకుని తీసుకెళ్తారు. పొద్దున్నుంచి చీకటి పడే వరకూ అక్కడే ఉండి వస్తుంటారు. కారణమేంటని అడిగితే... శ్రీరాముడు పద్నాలుగేళ్లు అరణ్యవాసం చేశాడు కాబట్టి తాము కూడా ఇలా ప్రతి సంవత్సరం అడవికి వెళతామనీ, తరతరాలుగా ఈ సంప్రదాయాన్ని పాటించడం వల్ల తమ ఊరికి మంచి జరుగుతుందనీ చెబుతున్నారు ఈ ఊరి ప్రజలు.


నేనూ ఆడేస్తా టెన్నిస్‌!

ఈ కుక్క పేరు కాకర్‌ స్పానియల్‌. ఉండేది స్కాట్లాండ్‌లోనే అయినా ఇప్పుడు దీనికి ప్రపంచమంతా అభిమానులు ఉన్నారండోయ్‌. ఎందుకో తెలుసా... ఇది టెన్నిస్‌ ప్లేయర్‌ కాబట్టి. నిజమేనండీ... అవడానికి కుక్కే అయినా ఇది మనుషులకు పోటీగా టెన్నిస్‌ ఆడేస్తుందట. ఈ ప్రత్యేకమైన నైపుణ్యం వల్లే ఎంతో పేరు తెచ్చుకుంది. దీని యజమాని ఎమిలీ అండర్‌సన్‌ సరదాగా ఓసారి దీని నోట్లో టెన్నిస్‌ బ్యాట్‌ పెట్టి ఆడించిందట. కుక్క- దృష్టంతా బంతిని కొట్టడం మీదే ఉంచుతూ ఏకాగ్రతగా ఆడటం చూసి కొన్నిరోజులు టెన్నిస్‌ ఆడటంలో శిక్షణ ఇచ్చింది. ఇంకేముంది... అప్పటి నుంచి యజమానితో రోజూ టెన్నిస్‌ ఆడేస్తూ చూసినవాళ్లందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సోషల్‌మీడియాలో దీని పేరు మీద అకౌంట్లు కూడా ఉన్నాయి.


పాపం... పిల్లి మంచిదే!

అమెరికాలోని వాషింగ్టన్‌లో ఉండే అన్నా డానీలీ అనే ఆవిడ ఈమధ్య కోర్టులో కేసు గెలిచింది. అందుకు కారణం తన పెంపుడు పిల్లి మిస్కానే. పైగా ఆ పిల్లి ద్వారానే అన్నాకు దాదాపు కోటి రూపాయలూ అందాయి. పిల్లేంటీ... కేసేంటీ... అంటే దాని అసలు కథ తెలుసుకోవాల్సిందే. ‘మిస్కా అల్లరి పిల్లి... దాని వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతోంది’ అంటూ 2019లో అన్నా పొరుగింటివాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో యానిమల్‌ కంట్రోల్‌ పోలీసులొచ్చి ఆ పిల్లిని తీసుకెళ్లారు. అన్నా మీద దాదాపు ఇరవైలక్షల రూపాయల జరిమానా కూడా విధించారు. అందుకు అన్నా ‘మా పిల్లి మంచిది. చాలా సైలెంట్‌గా ఉంటుంది. నేను జరిమానా కట్టనేకట్టను’ అంటూ కోర్టుకెళ్లింది. దీంతో కొంత కాలంపాటు పిల్లిని గమనించమంటూ పోలీసుల్ని కోర్టు ఆదేశించింది. దాదాపు మూడు సంవత్సరాలు పిల్లి స్వభావాన్ని పరిశీలించిన పోలీసులు ‘గుడ్‌ క్యాట్‌’ అంటూ సర్టిఫై చేశారు. దీంతో కోర్టు మిస్కా వల్ల చుట్టుపక్కలవాళ్లకు జరిగే నష్టమేమీ లేదంటూ దాన్ని అన్నాకి తిరిగి ఇచ్చేసింది. అనవసరంగా మిస్కామీద కేసు పెట్టినందుకు పొరుగింటివాళ్లకు కోటిరూపాయల జరిమానా విధించింది.


రెండు రోజుల్లో సిక్స్‌ ప్యాక్‌!

యూకేకు చెందిన ఒకతనికి సిక్స్‌ప్యాక్‌ అంటే యమ క్రేజ్‌. ఎలాగైనా కండలవీరుడిగా మారాలన్నదే అతని లక్ష్యం. అందుకోసం కొన్ని రోజులపాటు జిమ్‌కి వెళ్లి ఎన్నో వ్యాయామాలు చేశాడు. అయినా సిక్స్‌ ప్యాక్‌ రాలేదు. కానీ ఓ కొత్త ఆలోచనతో- రెండు రోజుల్లో సిక్స్‌ప్యాక్‌ బాడీని సాధించేశాడు. అదెలా అంటే... ఒంటిపైన సిక్స్‌ప్యాక్‌ టాటూ వేసుకుని. అచ్చంగా కండలున్నట్టు పచ్చబొట్టు పొడిపించుకుని అతని కలను నెరవేర్చుకున్నాడన్నమాట. ఈ విషయాన్ని ఆ టాటూ వేసిన డీన్‌ గుంతర్‌ అనే ఆర్టిస్టు ఈ మధ్య సోషల్‌ మీడియాలో పంచుకోవడంతో ఫొటోలూ, వీడియో వైరల్‌ అయ్యాయి. అవి చూసిన నెటిజన్లు ‘ఎలాగైతేనేం అనుకున్నది దక్కించుకున్నాడు’ అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..