Published : 24 Jul 2022 00:50 IST

కటిక చీకటే మేలు!

సాధారణంగా లైటు ఉంటే ఎవరికీ సరిగ్గా నిద్ర పట్టదు. అయితే ఈమధ్య బెడ్‌లైట్లూ ఆల్‌అవుట్లూ ఫోన్‌లతో అంతో ఇంతో కాంతి గది మొత్తం పరుచుకుంటూనే ఉంటుంది. అయితే కాస్తంత కాంతి కూడా లేని కటిక చీకటిలో పడుకున్నప్పుడే మనిషికి ఆరోగ్యం అంటున్నారు నార్త్‌వెస్ట్రన్‌ పరిశోధకులు. నిద్రపోయేటప్పుడు కొంచెం కాంతికి గురయినా అది వాళ్లలో ఊబకాయం, మధుమేహం, బీపీ... వంటి వ్యాధులకు దారితీస్తుంది అంటున్నారు. ఎందుకంటే కాంతి ఎంత తక్కువ ఉన్నా దానికి శరీరం స్పందిస్తుందట. ఒక్క రాత్రి డిమ్‌లైట్‌కి గురయినా కూడా గుండె వేగం, రక్తంలో గ్లూకోజ్‌ శాతం పెరుగుతుంది. అంతేకాదు, పీనియల్‌ గ్రంథి రాత్రి వేళలోనే మెలటోనిన్‌ హార్మోన్‌ను స్రవిస్తుంది. అందుకే దీన్ని ‘హార్మోన్‌ ఆఫ్‌ డార్క్‌నెస్‌’గా పిలుస్తారు. అయితే రాత్రివేళలో  కాంతికి గురయితే ఈ మెలటోనిన్‌ స్రావం తగ్గిపోతుంది. శరీరానికి ఎంతో మేలు చేసే ఈ హార్మోన్‌ శాతం తగ్గిపోవడంతో మధుమేహం, బీపీ వచ్చే ప్రమాదం ఎక్కువట. కాబట్టి రాత్రివేళ గదిని ఎంత చీకటిగా చేసుకుంటే అంత మంచిది అంటోందీ పరిశీలక బృందం. ముఖ్యంగా వృద్ధుల్లో ఎక్కువమంది చిన్నదో పెద్దదో లైటు లేకుండా నిద్రపోరు. అందువల్లే వాళ్లలో బీపీ, మధుమేహం... వంటి సమస్యలు మరింత పెరుగుతున్నాయి అంటున్నారు.


పిల్లలు వేగంగా చదవాలంటే..

క్షరాల మధ్య దూరం ఎక్కువగా ఉంటే పిల్లలు దాన్ని త్వరగా చదవగలరని చెబుతున్నారు ఆంగ్లియా రస్కిన్‌ యూనివర్సిటీ నిపుణులు. డిస్లెక్సియాతో బాధపడుతున్న పిల్లల్లో 13 శాతం, సాధారణ పిల్లలో 5 శాతం చదివే వేగం పెరిగినట్లు గుర్తించారు. ఇందుకోసం వీళ్లు కొందరు సాధారణ పిల్లల్నీ మరికొందరు డిస్లెక్సియాతో బాధపడుతోన్న పిల్లల్నీ ఎంపిక చేసి వాళ్లకి రెండు రకాల రాతప్రతుల్ని ఇచ్చి గట్టిగా చదవమని రికార్డు చేశారట. అప్పుడు డిస్లెక్సియా పిల్లలు చదివే వేగంలో తేడా స్పష్టంగా కనిపించింది. అంతేకాదు, అక్షరాల మధ్య దూరం పెద్దగా లేని సాధారణ ప్రతి చదివినప్పుడు తప్పులూ, కొన్ని పదాల్ని వదిలేయడం... వంటివి డిస్లెక్సియా ఉన్న చిన్నారుల్లో ఎక్కువగా కనిపించింది. అదే సాధారణ పిల్లల్లో ఈ తేడా ఎక్కువగా లేదు. మొత్తమ్మీద మామూలుగా కన్నా అక్షరాల మధ్య దూరం ఎక్కువగా ఉన్నప్పుడు రెండు వర్గాల పిల్లలూ వేగంగా చదవగలిగారట.


వ్యాయామానికీ మాత్ర!

వ్యాయామానికి ప్రత్యామ్నాయంగానూ ఓ పిల్‌ను కనుగొన్నారు బేలర్‌ కాలేజ్‌ ఆఫ్‌ మెడిసిన్‌, స్టాన్‌ఫర్డ్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌కు చెందిన పరిశోధకులు. అదెలా అంటే- వ్యాయామం చేసినప్పుడు- రక్తంలో విడుదలయ్యే ఓ పదార్థాన్ని గుర్తించారు. అది ఎలుకల్లో ఆహారం తక్కువ తీసుకునేలా చేయడం ద్వారా ఊబకాయాన్ని నిరోధిస్తుందట. దీనివల్ల ఓ పద్ధతి ప్రకారం తినడం అలవాటు అవడంతోపాటు జీవక్రియ కూడా మెరుగవుతుంది. దాంతో ఆకలి తగ్గి బరువు అదుపులో ఉంటుంది. అందుకే ఏ రకమైన వ్యాయామం వల్ల ఆకలి తగ్గుతుందో తెలుసుకునే ప్రయత్నం చేశారట. అందుకోసం కొన్ని ఎలుకల్ని ట్రెడ్‌మిల్‌మీద వ్యాయామం చేయించినప్పుడు- వాటిలో ల్యాక్‌-ఫీ అనే అమైనో ఆమ్లాన్ని గుర్తించారట. ఆ తరవాత ఊబకాయం వచ్చిన ఎలుకలకి ఈ ల్యాక్‌-ఫీ అమైనో ఆమ్లాన్ని ఇచ్చినప్పుడు అవి ఆహారం తక్కువగా తీసుకోవడంతోపాటు బరువు కూడా తగ్గాయట. ఈ పరిశోధన ఆధారంగా- ఆస్టియోపొరోసిస్‌, హృద్రోగాల కారణంగా వ్యాయామం చేయలేని వృద్ధులకి ఈ అమైనో ఆమ్లంతో ఉన్న పిల్‌ను ఇవ్వడం ద్వారా వ్యాయామంతో వచ్చే ప్రయోజనాల్ని చేకూర్చవచ్చు అంటున్నారు సదరు పరిశోధకులు.


మెనోపాజ్‌తో గుండెజబ్బులు!

హిళల్లో మెనోపాజ్‌ సమయంలో జరిగే హార్మోన్లలోని మార్పుల కారణంగా చెడు కొలెస్ట్రాల్‌ పెరిగే ప్రమాదం ఎక్కువనీ దాంతో హృద్రోగ సమస్యలు పొంచి ఉంటాయనీ యూరోపియన్‌ సొసైటీ ఆఫ్‌ కార్డియాలజీ పేర్కొంటోంది. సాధారణంగా 48-52 మధ్య వయసులోనే మెనోపాజ్‌ దశ వస్తుంది. ఆ సమయంలో ఈస్ట్రోజెన్‌ శాతం తగ్గి ఫాలికల్‌ స్టిమ్యులేటింగ్‌ హార్మోన్‌ శాతం పెరుగుతుంది. దాంతో హృద్రోగాలకు కారణమైన లిపిడ్స్‌, లిపోప్రొటీన్లూ... వంటి మెటాబొలైట్ల శాతం పెరుగుతున్నట్లు గుర్తించారు. అందుకే మెనోపాజ్‌ దశ దాటిన పదేళ్లలో హృద్రోగాలు ఎక్కువవుతున్నాయట. మెనోపాజ్‌ను ఎటూ అడ్డుకోలేం, కానీ ఆరోగ్యానికి హాని కలిగించే ఈ మెటాబొలైట్లను నిరోధించగలం అంటున్నారు పరిశోధకులు. అదెలా అంటే- ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంతోపాటు శారీరకంగా చురుకుగా ఉండటం ద్వారా ఆ వయసులో పెరిగే చెడు కొలెస్ట్రాల్‌ను అడ్డుకోవచ్చట.


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని