పిల్లల్లో జ్ఞాపకశక్తి!

చిన్నపిల్లలు ఏ విషయాన్నయినా త్వరగా నేర్చుకుంటారు. కొన్ని సంఘటనల్ని అంతే వేగంగా మర్చిపోతుంటారు కూడా. అయితే వాళ్లు నేర్చుకున్న పదాలు మాత్రం వాళ్లకు బాగా గుర్తు ఉంటాయి. పైగా చిన్నప్పుడు నేర్చుకున్న పదాలని అంత త్వరగా మర్చిపోరనీ అంటుంటారు.

Published : 20 Feb 2022 01:33 IST

పిల్లల్లో జ్ఞాపకశక్తి!

చిన్నపిల్లలు ఏ విషయాన్నయినా త్వరగా నేర్చుకుంటారు. కొన్ని సంఘటనల్ని అంతే వేగంగా మర్చిపోతుంటారు కూడా. అయితే వాళ్లు నేర్చుకున్న పదాలు మాత్రం వాళ్లకు బాగా గుర్తు ఉంటాయి. పైగా చిన్నప్పుడు నేర్చుకున్న పదాలని అంత త్వరగా మర్చిపోరనీ అంటుంటారు. అది నిజమేననీ, అలా నేర్చుకున్నవి గుర్తుండటానికి కారణమైన మెదడు భాగాన్ని తొలిసారిగా గుర్తించామనీ చెబుతున్నారు లాస్‌ఏంజెలిస్‌లోని కాలిఫోర్నియా యూనివర్సిటీ పరిశోధకులు. రెండుమూడేళ్ల వయసుని పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరిగే దశగా చెప్పవచ్చు. అందుకు కారణమైన భాగాన్ని ఎమ్మారై స్కాన్‌ ద్వారా గుర్తించడం శాస్త్రజ్ఞులకు సవాల్‌గా మారింది. అందుకే పిల్లలు పడుకున్నప్పుడు ఎమ్మారై స్కాన్‌ చేసి చూశారట. పిల్లలు అంతక్రితం నేర్చుకున్న పదాలను నిద్రలో ఉన్నప్పుడు మళ్లీ వినిపించగా, మెదడు కణాల్లో స్పందనని గుర్తించారట. వారం తరవాత మళ్లీ ఆ పదాల్ని వినిపించి చూశారట. అప్పుడు కూడా మెదడులోని హిప్పోక్యాంపస్‌లోని ముందు భాగం స్పందించిందట. దీన్నిబట్టి ప్రాథమిక దశలో జ్ఞాపకశక్తికి సంబంధించిన కీలక భాగం ఇదేననీ, దీని ఆధారంగా భవిష్యత్తులో అధ్యయనం, జ్ఞాపకశక్తికి సంబంధించిన లోపాలను సరిచేసే అవకాశం ఉంటుందనీ చెబుతున్నారు సదరు పరిశోధకులు.


బరువు తగ్గాలంటే?

చాలామంది బరువు తగ్గడం కోసం ఆహారం తగ్గించడం, ఎక్కువసేపు వ్యాయామం చేయడం చేస్తుంటారు. కానీ బాగా నిద్రపోతే బరువు తగ్గుతామన్న విషయాన్ని గుర్తించరు అంటున్నారు జామా ఇంటర్నల్‌ మెడిసిన్‌కు చెందిన నిపుణులు. ఎందుకంటే నిద్రపోయే సమయాన్ని పెంచితే చాలావరకూ బరువు తగ్గుతారట. పెద్దయ్యాక చాలామంది ఆరున్నర గంటలకన్నా తక్కువగా నిద్రపోతున్నారట. అందుకే వీళ్లు బరువు ఎక్కువగా ఉన్నవాళ్లని రెండు విభాగాలుగా చేసి ఒక వర్గాన్ని వాళ్లదైన పద్ధతిలోనే నిద్రపోనిచ్చి, మరో వర్గాన్ని ఓ గంట ఎక్కువ నిద్రపోయేలా చేశారట. రెండు వారాల తరవాత ఇరు వర్గాల బరువునూ చూస్తే నిద్ర ఎక్కువగా పోయినవాళ్లు మామూలుగా నిద్రపోయినవాళ్ల కన్నా బరువు తగ్గారట. అంతేకాదు, బాగా నిద్రపోయిన వాళ్లలో ముందుకన్నా తీసుకునే క్యాలరీల శాతం కూడా దానంతటదే తగ్గిందట. కాబట్టి తగినంత నిద్ర ఉంటే తిండి తినడం కూడా ఆటోమేటిగ్గా తగ్గుతుందనీ, అదేసమయంలో వీళ్లలో జీవక్రియ బాగుండటంతో క్యాలరీలు కొవ్వుగా పేరుకోవడమూ తగ్గుతుందనీ అంటున్నారు. మొత్తంగా నిద్రతో బరువు తగ్గొచ్చు అన్నదే ఈ పరిశోధన సారాంశం.


నీళ్లు తాగకపోతే...

కొత్తగా పెళ్లయిన జంటల్లో కూడా శృంగారం పట్ల ఒకలాంటి స్తబ్ధత నెలకొనడం ఈమధ్య ఎక్కువవుతోంది. పని ఒత్తిడే ఇందుకు కారణమని సరిపెట్టుకుంటున్నారు. అయితే భాగస్వామి శృంగారం పట్ల ఆసక్తి చూపించకపోతే వాళ్ల ఆరోగ్యం గురించి ఆరాతీయాల్సిన అవసరం ఉందట. అమ్మాయిల్లో అయితే హార్మోన్ల అసమతౌల్యం కొంతవరకూ కారణం కావచ్చు. కానీ ఆడ, మగా భేదం లేకుండా ఇద్దరిలోనూ శృంగారేచ్ఛ తగ్గిపోవడానికి డీహైడ్రేషన్‌ ప్రధాన కారణం అంటున్నారు పరిశోధకులు. శరీరంలో నీటి శాతం తగ్గిపోతే దాని ఫలితం సంసార జీవితం మీద చాలా ఉంటుందట. పైగా సరైన మోతాదులో నీటిని తాగకపోతే తీవ్రమైన అలసట, చికాకు, డిప్రెషన్‌, శృంగారంలో పాల్గొన్నప్పుడు నొప్పి... వంటివి కలుగుతాయి. కాబట్టి కాలంతో సంబంధం లేకుండా శరీరానికి సరిపడా నీళ్లు తాగుతున్నామా లేదా అన్నదానిమీద ప్రత్యేకంగా దృష్టిపెట్టాలని సూచిస్తున్నారు. అంతేకాదు, తరచూ నీటిని తాగడంతోపాటు సూప్‌లు తీసుకోవడం, పండ్లు తినడం ద్వారా కూడా ఈ సమస్యను చాలావరకూ తగ్గించుకోవచ్చు.


ఆందోళన పసిగట్టే వాచీ!

చేతికి పెట్టుకునే స్మార్ట్‌ వాచీలు ఇప్పటికే ఆరోగ్యం గురించి ఎన్నో రకాలుగా హెచ్చరిస్తున్నాయి. అయితే చెమటలోని కార్టిసాల్‌ శాతాన్ని బట్టి డిప్రెషన్‌, ఆందోళనల్ని పసిగట్టవచ్చు అంటున్నారు కాలిఫోర్నియా యూనివర్సిటీ పరిశోధకులు. ఈ వాచీకి అడుగుభాగంలోని పలుచని పొరలో ఉండే మైక్రో ఫ్లూయిడ్స్‌ కొద్దిపాళ్లలో చర్మంమీద పట్టే చెమటని పీల్చుకుంటాయి. అక్కడి నుంచి ఇవి వాచీ సెన్సరులోని అప్టామీటరుకి చేరుకోగా, అది కార్టిసాల్‌ని గుర్తించి వాచీ స్క్రీన్‌మీద చూపిస్తుంది. అయితే కార్టిసాల్‌ ఒక్కో వ్యక్తిలో ఒక్కోరకంగా ఉంటుంది. అందుకే ఈ వాచీ ముందుగా ఆయా వ్యక్తిలో సాధారణంగా విడుదలయ్యే కార్టిసాల్‌ శాతాన్ని లెక్కించి సెట్‌ చేసుకుంటుంది. ఆ బేస్‌లైన్‌కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే అది హెచ్చరిక చేస్తుందట. కాబట్టి దాన్ని చూసుకుని ఆందోళన తగ్గించుకునేందుకు ప్రయత్నించవచ్చు. ఎందుకంటే కార్టిసాల్‌ మరీ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంటే, మానసిక సమస్యల ముప్పు పొంచి ఉన్నట్లు గుర్తించాలి.+


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు