వృద్ధాప్యం త్వరగా రాకుండా ఉండాలంటే..!

అలవాట్లే వయసునీ శాసిస్తాయి అంటున్నారు నిపుణులు. దాంతో జ్ఞాపకశక్తి తగ్గడం, చర్మం ముడతలు పడటం, అలసట... వంటివన్నీ తలెత్తుతాయి. కాబట్టి ఈ రకమైన అలవాట్లను మానడానికి

Updated : 06 Mar 2022 10:07 IST

వృద్ధాప్యం త్వరగా రాకుండా ఉండాలంటే..!

అలవాట్లే వయసునీ శాసిస్తాయి అంటున్నారు నిపుణులు. దాంతో జ్ఞాపకశక్తి తగ్గడం, చర్మం ముడతలు పడటం, అలసట... వంటివన్నీ తలెత్తుతాయి. కాబట్టి ఈ రకమైన అలవాట్లను మానడానికి ప్రయత్నించండి...

* టీవీ ముందో కంప్యూటర్‌ ముందో రోజంతా కూర్చుంటే అనారోగ్యాన్ని కొనితెచ్చుకున్నట్లే. దీనివల్ల క్యాన్సర్లు, బీపీ, ఊబకాయం, డిప్రెషన్‌, ఆందోళన... వంటి దీర్ఘకాలిక వ్యాధులు తలెత్తుతాయి.

* కూర్చుని టీవీ లేదా ఫోన్‌ చూస్తూ ప్రాసెస్‌డ్‌ స్నాక్స్‌లాంటివి తినే అలవాటు ఉంటే తక్షణం మానుకోవాలి. వాటిల్లోని సంతృప్త కొవ్వులు, చక్కెర, ఉప్పు కారణంగా శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ పెరుగుతుంది. దాంతో వయసు త్వరగా మీదపడుతుంది.

* హాయిగా నవ్వడం మర్చిపోతే మరీ ప్రమాదం. ఒత్తిడిని తగ్గించుకోవడానికి కాసేపయినా నవ్వుతూ గడపాలి. ఇష్టమైన షో లేదా సినిమా చూడటం, స్నేహితులతో, కుటుంబ సభ్యులతో గడపడం వల్ల ఆనందంగా అనిపిస్తుంది. ముఖ్యంగా నవ్వడం వల్ల మనసునీ శరీరాన్నీ ఉల్లాసంగా ఉంచే సెరటోనిన్‌, డోపమైన్‌ వంటి హార్మోన్లు విడుదలవుతాయి.

* ఇంటికే పరిమితమవడం అస్సలు మంచిది కాదు. కొవిడ్‌ కారణంగా ఈమధ్య అంతా ఇళ్లలో బందీలయిపోయారు. ఇదే అలవాటుగా మారిపోతే మానసికంగా కుంగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మధ్యమధ్యలో కొత్త ప్రదేశాలకు వెళుతుండాలి. కనీసం వారాంతాల్లో చుట్టుపక్కల ప్రదేశాలకు వెళ్లడం వల్ల ఎంతో రిలీఫ్‌గా అనిపిస్తుంది.

* నిద్రలేమి ఆరోగ్యానికి ప్రధాన శత్రువు. ఒక్క రాత్రి నిద్ర లేకున్నా అది కణాల వయసుమీద ప్రభావాన్ని కనబరుస్తుంది. కాబట్టి నిద్రపోవడం మర్చిపోతే, కొన్నాళ్లకు మిమ్మల్ని మీరే మర్చిపోతారు అన్నది గుర్తుంచుకోండి అంటున్నారు నిపుణులు.


చనిపోయేముందు...

పుట్టినవాళ్లంతా ఏదో ఒక రోజున చనిపోక తప్పదు. అయితే మరణం ఎప్పుడు ఎలా వచ్చినా చనిపోయేముందు ఏం ఆలోచిస్తామో తెలుసుకోవాలనే కుతూహలం అందరికీ ఉంటుంది. జీవితమంతా సినిమా రీలులా కళ్లముందు కనిపిస్తుందని కొందరు అంటారు. ఆ విషయం కొంతవరకూ నిజమే అంటున్నారు లూయీవిల్లె యూనివర్సిటీకి చెందిన నిపుణులు. అదెలా అంటే- మూర్ఛ రోగంతో బాధపడుతున్న 87 ఏళ్ల వృద్ధుడిని ఈఈజీ ద్వారా పరీక్షిస్తున్నప్పుడు- అతను ఆకస్మిక గుండెపోటుతో మరణించాడట. దాంతో 15 నిమిషాలపాటు రికార్డయిన అతని మెదడు తరంగాల్ని పరీక్షించగా, అవి అచ్చం- కల కనేటప్పుడూ పాత విషయాల్ని గుర్తుచేసుకుంటున్నప్పుడూ స్పందించే మెదడు తరంగాల్ని పోలి ఉన్నాయట. ముఖ్యంగా గుండె ఆగిపోవడానికి ముందు 30 సెకన్ల సమయాన్ని నిశితంగా పరిశీలించగా- అవి జీవితంలో జరిగిన సంఘటనల్ని గుర్తుతెచ్చుకుంటున్నట్లు తెలిసిందట. దీన్నిబట్టి చనిపోయేముందు ప్రతి మనిషికీ జీవితంలోని ముఖ్యమైన సంఘటనలు గుర్తురావచ్చు అంటున్నారు. ఈ రకమైన తరంగాల్ని గతంలో ఎలుకల్లోనూ గుర్తించారట. అదీగాక రక్త సరఫరా ఆగిపోయిన తరవాత కూడా మెదడు కొద్దిసేపు పనిచేస్తుందనీ చెబుతున్నారు సదరు పరిశోధకులు.


నెయ్యి తింటున్నారా?

నెయ్యి తింటే కొలెస్ట్రాల్‌ అనీ, మొటిమలు వస్తాయనీ, బరువు పెరుగుతామనీ...వంటి కారణాలతో దాన్ని దూరంగా పెట్టేస్తున్నారు. కానీ ఆయుర్వేదం నెయ్యి వాడమనే చెబుతుంది. పరగడుపునే టీస్పూను నెయ్యి తినడం వల్ల జీర్ణవ్యవస్థ బాగుంటుందట. పోషకాహారలోపం, ఒత్తిడి, నిద్రలేమి, కదలకుండా కూర్చోవడం, యాంటీబయోటిక్స్‌ వాడటం... వంటి అనేక కారణాల వల్ల ఈమధ్య చాలామందిలో పొట్ట ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇలాంటివాళ్లంతా నెయ్యి తింటే మంచిదట. నెయ్యి వృద్ధాప్యంలో ఆల్జీమర్స్‌ నుంచీ కాపాడుతుంది. ఇది కొవ్వులో కరిగే ఎ, డి, ఇ, కె విటమిన్లు శరీరంలో శోషణ చెందేలా చేస్తుంది. నేతిలోని ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలూ యాంటీ ఆక్సిడెంట్లూ చర్మాన్నీ సంరక్షిస్తాయి. ఎముకల సామర్థాన్నీ రోగనిరోధకశక్తిని పెంచేందుకూ, కంటి సంబంధిత సమస్యల్ని తగ్గించేందుకూ తోడ్పడుతుంది.


ఇన్ఫెక్షన్‌తో జాగ్రత్త!

వైరల్‌ ఇన్ఫెక్షన్లు ఎంత ప్రమాదరకమో కొవిడ్‌-19 ద్వారా ప్రపంచానికంతటికీ అనుభవంలోకి వచ్చింది. కేవలం అది మాత్రమే కాదు, ఫ్లూ నుంచి మీజిల్స్‌ వరకూ అన్నీ కూడా కొన్నిసార్లు విషమ పరిస్థితులకు దారితీస్తాయి. అందుకే తాజాగా వాటిమీద దృష్టి సారించినప్పుడు వీటిని తేలికగా తీసుకోకూడదు అంటున్నారు యోర్క్‌ యూనివర్సిటీ నిపుణులు. ఇన్ఫెక్షన్ల వల్ల అప్పటికప్పుడు వ్యాధి బారిన పడటమే కాదు, కొన్ని సంవత్సరాల తరవాతా దాని ప్రభావం ఉంటుందట. చిన్నతనంలో వచ్చిన వైరల్‌ ఇన్ఫెక్షన్‌ భవిష్యత్తులో మూత్రాశయ క్యాన్సర్‌కు కారణం కావచ్చనీ, హెపటైటిస్‌-సి అనేది  స్కిజోఫ్రెనియాకి దారి తీయవచ్చనీ అంటున్నారు. పైగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఐదు క్యాన్సర్‌ కేసుల్లో ఒకటి వైరల్‌ ఇన్ఫెక్షన్‌ కారణంగానే వస్తున్నట్లు గుర్తించారు. హ్యూమన్‌ పాపిల్లోమా వైరస్‌ వల్లే సెర్వైకల్‌ క్యాన్సర్‌ వస్తుందనేది గతంలోనే తెలిసింది. అదేవిధంగా బికె పాలీయోమా వైరస్‌ వల్లే మూత్రశయ క్యాన్సర్‌ వస్తున్నట్లు కనుగొన్నారు. తరచూ సోకే వైరల్‌ ఇన్ఫెక్షన్ల కారణంగా నాడీసంబంధిత వ్యాధులూ తలెత్తుతున్నట్లు భావిస్తున్నారు. కాబట్టి వైరల్‌ ఇన్ఫెక్షన్లు రాకుండా చూసుకోవడమే ఉత్తమం అన్నమాట.


ఈ-తరగతుల్లో.. సెలెబ్రిటీలే టీచర్లు!

బాక్సింగ్‌లోని మెలకువల్ని స్వయంగా మేరీకోమ్‌ వివరిస్తే... అంతర్జాతీయ వంటకాలను ప్రముఖ చెఫ్‌లే నేర్పిస్తే... సంగీతం, నటన, డాన్స్‌లోని నైపుణ్యాలను పెద్ద స్టార్లే తెలియజేస్తే... బాగానే ఉంటుంది కానీ అందరికీ అవకాశం ఉండదేమో, ఎక్కడికో వెళ్లాలేమో, ఫీజూ లక్షల్లో కట్టాలేమో... అంటూ బోలెడు సందేహాలు మొదలవుతాయి కదూ... వాటన్నింటినీ వదిలేసి, నచ్చిన సెలెబ్రిటీ నుంచి శిక్షణ తీసుకునేందుకు రెడీ అయిపోండి. ఎందుకంటే ఇప్పుడు ఎందరో ప్రముఖులు... ఆన్‌లైన్‌లో శిక్షణ ఇచ్చేస్తున్నారు.

సంగీతం, డాన్స్‌, నటన, రచన, వంటలు, క్రీడలు, ఫొటోగ్రఫీ... వంటి అంశాల్లో ఆఫ్‌లైన్‌/ఆన్‌లైన్‌లో శిక్షణ ఇచ్చేందుకు ఇప్పుడు ఎన్నో సంస్థలు అందుబాటులో ఉన్నాయి. అక్కడ ఎంత మంచి శిక్షకుల నుంచి నేర్చుకున్నా కూడా... ఆ రంగానికి చెందిన ప్రముఖుల దగ్గర కాస్తో కూస్తో మెలకువల్ని తెలుసుకుంటే ఆ థ్రిల్లే వేరు. కానీ... ఆ అవకాశం ఎక్కడిదీ... ఇక, ఉద్యోగాలూ, చదువులూ, బాధ్యతల్లో పడి... ఇష్టమైన హాబీని పక్కన పెట్టేసి... కాస్త టైం దొరికితే మళ్లీ సాధన చేయాలనుకునేవారూ ఎందరో ఉంటారు. ఇలాంటివాళ్లందరినీ దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు కొన్ని సంస్థలు ప్రముఖుల చేత రకరకాల అంశాల్లో శిక్షణ ఇప్పించే ఏర్పాట్లు చేస్తున్నాయి. నటనలో మనోజ్‌ బాజ్‌పేయి, నవాజుద్దీన్‌సిద్ధికీ... సంగీతంలో బాలీవుడ్‌ గాయని ఆశాభోంస్లే... క్రీడల్లో సానియా మీర్జా, సురేష్‌ రైనా, యుజ్‌వేంద్ర చాహల్‌, మేరీకోమ్‌...రచనలో రస్కిన్‌బాండ్‌...చెస్‌లో గ్రాండ్‌మాస్టర్‌ శ్రీనాథ్‌ నారాయణన్‌... డాన్స్‌లో గణేష్‌ ఆచార్య... వంటల్లో సెలెబ్రిటీ ఛెఫ్‌లైన వికాస్‌ ఖన్నా, రణ్‌వీర్‌బ్రార్‌... వంటివాళ్లందరూ శిక్షణ ఇచ్చేందుకు ముందుకొచ్చేశారు. అదే విధంగా ఫొటోగ్రఫీ, దర్శకత్వం, కమ్యూనికేషనల్‌ స్కిల్స్‌, డబ్బింగ్‌, పాటల రచన, వ్యాయామాలు, స్టాండప్‌ కామెడీ... వంటి అంశాల్లోనూ ఆ రంగాలకు చెందిన ప్రముఖుల నుంచి శిక్షణ తీసుకోవచ్చు. ఇలా ప్రముఖుల చేత శిక్షణ ఇప్పించే సంస్థల్లో ‘సెలెబ్రిటీ స్కూల్‌’, ‘అన్‌లుక్లాస్‌’, ‘ఫ్రంట్‌రో’... వంటివి అందుబాటులో ఉన్నాయి.

ఎలా పనిచేస్తాయంటే...

ఈ సంస్థల్లో సభ్యత్వం తీసుకోవాలంటే... ప్రత్యేక అర్హతలు ఉండాలేమో అనే సందేహం అక్కర్లేదు. కేవలం నేర్చుకోవాలనే తపన ఉంటే చాలు... ఆ వెబ్‌సైట్‌లలోకి వెళ్లి మనం శిక్షణ తీసుకునే అంశాన్ని ఎంచుకుంటే ఎవరెవరు పాఠాలు చెబుతున్నారో తెలుస్తుంది. దాన్ని బట్టి సభ్యత్వం తీసుకుంటే సరిపోతుంది. ఉదాహరణకు ‘సెలెబ్రిటీ స్కూల్‌’ను తీసుకుంటే... ఇందులో గాత్రం, నటన, వంటలు, ఫొటోగ్రఫీ... వంటి అంశాలకు సంబంధించి ముప్ఫై నుంచి ముప్ఫైఅయిదు వరకూ వీడియోలు... రెండు నుంచి నాలుగైదు గంటల నిడివిలో ఉంటాయి. సభ్యత్వం తీసుకున్నవారు వాటిని డౌన్‌లోడ్‌ చేసుకుని కావాల్సినప్పుడల్లా చూసుకోవచ్చు. ఒకవేళ విద్యార్థులకు వాటిల్లో ఏవైనా సందేహాలు ఉంటే సెలెబ్రిటీ స్కూల్‌ నిర్వాహకులు ఆ ప్రముఖులను సంప్రదించి నివృత్తి చేస్తారు. శిక్షణా కాలం పూర్తయ్యాక ప్రముఖులు సంతకం చేసిన సర్టిఫికెట్‌ను కూడా అందిస్తుందీ సంస్థ. అదే అన్‌లుస్కూల్‌ అయితే... విద్యార్థులకు శిక్షణతోపాటూ అదనంగా అసైన్‌మెంట్లు కూడా ఇస్తుంది. విద్యార్థులు వాటిని పూర్తిచేసి ఎప్పటికప్పుడు అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ఇలా ఏ విధంగా చూసినా తమ సంస్థలు అందించే శిక్షణల వల్ల లాభమే కానీ నష్టం ఉండదని చెబుతారు వీటి నిర్వాహకులు. కాబట్టి... ఈసారి బాక్సింగ్‌లో మెలకువల్ని నేర్చుకుని...‘‘నేను మేరీకోమ్‌ దగ్గర శిక్షణ తీసుకున్నా తెలుసా...’ అంటూ మీ ఫ్రెండ్స్‌కు ఆ సర్టిఫికెట్‌ చూపించేసి ఆనందించేయండి. ఆలస్యమెందుకు మరి!

 

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..