Published : 03 Jul 2022 00:37 IST

ఎంత పేద్ద చెవులో...

సాధారణంగా మేక చెవులు మన అరచేయంత పొడవు ఉంటాయి. పాలలో వెన్న శాతం అధికంగా ఉండే నుబియన్‌ జాతి మేకల చెవులు అంత కంటే కాస్త పొడవుంటాయి. అయితే పాకిస్థాన్‌లోని సింధ్‌ ప్రావిన్స్‌కు చెందిన మహ్మద్‌ హసన్‌ అనే రైతు పాడి కోసం తన ఫామ్‌లో కొన్ని నుబియన్‌ జాతి మేకల్ని పెంచుతున్నాడు. వాటిలో ఓ మేక పిల్ల మాత్రం యావత్‌ ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది. ఈ మధ్యే పుట్టిన ఆ మేక పిల్లకున్న 19 అంగుళాల పొడవాటి చెవులే అందుకు కారణం.ఈ పిల్లకు హసన్‌ ‘సింబా’ అని పేరు పెట్టి ప్రేమగా పెంచుకుంటున్నాడు. అది ఇంట్లో నడుస్తుంటే దాని చెవులు నేలని చీపురులా ఉడ్చేస్తున్నాయనే హసన్‌ దాని పొడవాటి చెవులకు కారణం తెలుసుకోవాలని పశువైద్యుల్ని సంప్రదించాడు. జన్యుపరమైన మార్పుల కారణంగానే అది ఆ విధంగా జన్మించిందని దానిని పరీక్షించిన వైద్యులు తెలిపారు. ఏది ఏమైతేనేం జనాలను ఆకర్షిస్తూ ‘సింబా’ సెలబ్రిటీ కావడంతోపాటు తన యజమానికీ ప్రత్యేక గుర్తింపుని తెచ్చిపెట్టింది.


పెళ్లి కార్డులో 900 మంది

చాలామంది పెళ్లి కార్డుల్లో, ఇతర ఆహ్వాన పత్రికల్లో... తమ బంధుమిత్రుల పేర్లను కూడా పెట్టి వారితో ఉన్న అనుబంధాన్ని ప్రత్యేకంగా చాటుకుంటుంటారు. అయితే తంజావూరులోని తిరువిడైమరుదూరు సమీపంలో ఉన్న మల్లాపురం సర్పంచ్‌ రమేశ్‌ తన కుమార్తె పెళ్లి పత్రికలో చుట్టుపక్కల గ్రామాల్లోని 900 మంది పేర్లను ప్రచురించి అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. మల్లాపురం చుట్టుపక్కలున్న నాలుగు శివారు గ్రామాల్లోని 900 మంది ఓటర్లు ఆయన్ను ఈ మధ్య రెండోసారి సర్పంచిగా గెలిపించారు. వారిపైన ఉన్న అభిమానాన్ని చాటుకోవడానికి ఆయనకు తన కూతురి వివాహ ఆహ్వాన పత్రిక వేదికైంది. కుల మతాలకు అతీతంగా ఓటర్లందరి పేర్లనూ ముద్రించి ఇంటింటికీ వెళ్లి ఆహ్వాన పత్రికను పంచిన రమేశ్‌ కృతజ్ఞతకు ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారట.


ఎంత మంచోడో...

పంజాబ్‌కి చెందిన జస్విందర్‌ సింగ్‌ తన భార్య రమణ్‌దీప్‌ కౌర్‌తో కలిసి చాలాకాలం నుంచి అమెరికాలోని ఫీనిక్స్‌ నగరంలో ఉంటున్నాడు. అక్కడ ఓ సూపర్‌మార్కెట్‌, గ్యాస్‌స్టేషన్‌ను నిర్వహిస్తున్నాడు. పేద కుటుంబం నుంచీ వచ్చిన జస్విందర్‌ స్వశక్తితో ఎదిగి సూపర్‌ మార్కెట్‌నూ, గ్యాస్‌ స్టేషన్‌నూ సొంతంగా పెట్టుకుని ఆర్థిక సమస్యలన్నీ తీర్చుకున్నాడు. పిల్లల్ని బాగా చదివించాడు. తన కుటుంబానికి ఆర్థికంగా అన్నీ సమకూర్చుకున్న అతను సమాజం గురించి కూడా ఆలోచించడం మొదలుపెట్టాడు. గత నాలుగు నెలల నుంచీ తన గ్యాస్‌ స్టేషన్‌లో గ్యాస్‌ను అసలు ధరలో దాదాపు సగం రేటుకి అమ్ముతున్నాడు. అందుకుగానూ రోజుకి 40 -60 వేలు నష్టపోతున్నాడు. దయకి మించిన ధర్మం లేదనే జస్విందర్‌ తన తల్లిదండ్రుల నుంచే సాయపడే గుణాన్ని అలవర్చుకున్నాననీ, ప్రపంచమంతా ఇప్పుడిప్పుడే కరోనా చేసిన గాయం నుంచి కోలుకునే ప్రయత్నం చేస్తోందనీ- అందుకు తనకు చేతనైంది చేయాలని ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నాడు. మొదట్లో కేవలం భారతీయులకే ఈ ఆఫర్‌ ఇచ్చిన జస్విందర్‌ ఇప్పుడు అమెరికన్లకు కూడా తక్కువ ధరకే గ్యాస్‌ను విక్రయిస్తున్నాడు.


దిండు రూ.45 లక్షలు

కొందరికి దిండు ఉంటేనే నిద్రపడుతుంది. ఇంకొందరికి దిండు లేకుండా పడుకోవడమే అలవాటు. మరికొందరికి ఎంత మెత్తటి దిండున్నా అసలు నిద్రే పట్టదు. అలాంటి వారికోసం ప్రత్యేకంగా తయారు చేసిన రకరకాల దిండ్లు మార్కెట్‌లోకి వచ్చాయి. అయితే నెదర్లాండ్స్‌కి చెందిన ఓ ఫిజియోథెరపిస్ట్‌ తయారు చేసిన దిండు అలాంటి ఇలాంటి దిండు కాదు. కేవలం నిద్రలేమి సమస్యలతో బాధపడే వారికోసమే అతను దీన్ని తయారు చేశాడు. అయితే ఒకటి కొని తెచ్చుకుంటే పోలా అనుకుంటున్నారేమో. దాని ఖరీదు అక్షరాలా నలభై ఐదు లక్షల రూపాయలు. ఈ దిండులో రోబోటిక్‌ మిల్లింగ్‌ మిషన్‌ను అమర్చడంతోపాటు బంగారం, వజ్రాలను కూడా పొదిగి తయారు చేశాడట మరి. ఈ దిండు వేసుకుని పడుకున్నప్పుడు అందులోని రోబోటిక్‌ మిషన్‌ శ్రావ్యమైన శబ్దం చేస్తూ... తలకి మర్దన చేసిన అనుభూతిని కలిగించడంతో హాయిగా నిద్రపడుతుందట. అయితే సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్న ఈ దిండును కొనుక్కోవాలంటే ఉన్నవన్నీ అమ్ముకోవాలని కొందరూ, కొంటే కంటి మీద కునుకు ఉండదని మరికొందరూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని