అక్కాచెల్లెళ్లను అద్దెకిస్తాం!

ఎక్కడికైనా  వెళ్లాలంటే కారు అద్దెకు దొరుకుతుంది. ఈమధ్య ఇంటితోపాటు మనకి కావాల్సిన ఫర్నిచర్‌ కూడా అద్దెకిస్తున్నారు. ‘ఓస్‌ అంతేనా... మేమైతే చెల్లినో, అక్కనో కూడా అద్దెకిస్తాం’ అంటోంది ఓ కంపెనీ.

Updated : 07 Aug 2022 01:02 IST

అక్కాచెల్లెళ్లను అద్దెకిస్తాం!

ఎక్కడికైనా  వెళ్లాలంటే కారు అద్దెకు దొరుకుతుంది. ఈమధ్య ఇంటితోపాటు మనకి కావాల్సిన ఫర్నిచర్‌ కూడా అద్దెకిస్తున్నారు. ‘ఓస్‌ అంతేనా... మేమైతే చెల్లినో, అక్కనో కూడా అద్దెకిస్తాం’ అంటోంది ఓ కంపెనీ. ‘అబ్బ, ఇదేదో బాగుందే ఈసారి సిస్టర్‌ని అద్దెకు తీసుకుని రాఖీ కట్టించుకోవచ్చు’ అనుకునేరు అక్కాచెల్లెళ్లు లేనివాళ్లు. కానీ అలా ఏం కుదరదులెండి. ఎందుకంటే ఆ సౌకర్యం ఉన్నది జపాన్‌లో. అక్కడి సంస్థ ‘రెంట్‌ ఏ సిస్టర్‌’ పేరుతో ఈ సేవల్ని ప్రారంభించిందట. అమ్మానాన్నలకు ఒక్కరే సంతానం ఉండటం వల్ల కొంతమంది పిల్లలు ఒంటరితనంతో బాధపడుతూ...  ఎవరితోనూ కలవలేకపోతున్నారట. ఇలాంటి పిల్లల ఒత్తిడిని తగ్గించి, ఆనందంగా ఉంచడానికే ఈ ‘అద్దెకు అక్కాచెల్లెళ్ల’ ఆలోచన పుట్టిందట. ఇలా అద్దెకు వచ్చిన అమ్మాయిలు సరదాగా ముచ్చట్లు చెబుతూ... వాళ్ల బాధలు వింటూ రోజంతా గడుపుతారట. ఇదేదో బాగానే ఉన్నట్లుంది కదూ!


రాఖీ కట్టాలని ఎదురు చూస్తున్నారు!

రాఖీపౌర్ణమిని మన దేశంలో దాదాపుగా అన్ని చోట్లా చేసుకుంటారు. కానీ ఉత్తర్‌ ప్రదేశ్‌లోని గోండా జిల్లా భిఖాంపూర్‌ జగత్‌ పూర్వ గ్రామంలో మాత్రం కనీసం ఆ పండుగ పేరు చెప్పినా... అన్నా తమ్ముళ్లకు రాఖీలు కట్టినా అశుభం జరుగుతుందని నమ్ముతారు. ఎందుకూ అంటే... 1955లో ఓసారి ఆ ఊళ్లో రాఖీపౌర్ణమి రోజు ఒకరు చనిపోయారట. ఆ తర్వాత కూడా వరుసగా రాఖీపౌర్ణమి రోజునే చెడు సంఘటనలు జరిగాయట. దీంతో ఆ వేడుకను జరుపుకోవడం పూర్తిగా మానేశారు గ్రామస్థులు. కానీ ఇప్పుడు- అందరిలాగే వారు కూడా రాఖీపండుగ చేసుకోవాలని ఆశపడుతున్నారట. అయితే, సరిగ్గా రాఖీపౌర్ణమి రోజే ఎవరింట్లోనైనా పాపాయి పుడితే కీడుపోతుందనే నమ్మకంతో ఆ శుభవార్త కోసం ఊరంతా ఎదురుచూస్తున్నారట!


ఇల్లంతా దేశభక్తే!

అనంతపురం జిల్లా గుంతకల్లులోని భాగ్యనగర్‌ కాలనీకి చెందిన జోసెఫ్‌ స్టాన్లీ బాబుకి దేశభక్తి ఎక్కువ. ఆ విషయం ఆయన ఇంటిని చూడగానే అందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే ఇంటి ముందు భారతదేశ చిత్ర పటం దగ్గర్నుంచి ఇంటి లోపల జాతీయ నాయకుల ఫొటోలూ, ఇప్పటివరకూ పనిచేసిన ప్రధానమంత్రుల, రాష్ట్రపతుల చిత్రాలూ కనిపిస్తుంటాయి. ఆర్మీలో కమాండర్‌గా పనిచేసిన తాతను చూసి చిన్నతనం నుంచే దేశభక్తిని పెంచుకున్న జోసెఫ్‌- పిల్లలకూ, పెద్దలకూ దేశభక్తిని చాటిచెప్పే కార్యక్రమాలు చేయడం మొదలుపెట్టాడట. ప్రతి స్వాతంత్య్ర దినోత్సవం రోజు పెద్దలచేత మహనీయుల గురించి ప్రసంగాలు ఇప్పించడం లాంటివి చేస్తుంటాడు. దేశభక్తితో నిండిన ఆయన ఇంటికి వివిధ పాఠశాలల విద్యార్థులు వచ్చి దేశ నాయకుల గురించి తెలుసుకుంటూ ఉంటారట.

- ఒబుళపతి, న్యూస్‌టుడే, గుంతకల్లు పట్టణం


పాకే వెండి పురుగు!

ఇక్కడున్న ఫొటోల్ని చూసీ చూడంగానే ఏదో లోహంతో చేసిన పురుగు బొమ్మ అనిపిస్తోంది కదా... కానీ ఇది అలా చేసింది కాదండోయ్‌. నిజమైన జీవి. దీనిపేరు ‘క్రిసినా లింబేటా’. ఎక్కువగా మధ్య అమెరికాలో ఉండే ఈ పురుగు వెండిరంగులో చమక్కుమంటూ అచ్చంగా మెటల్‌లా కనిపిస్తుంది. అసలు అది కదిలే వరకూ అదో జీవి అని నమ్మలేనంత చిత్రంగా ఉంటుంది దీని రూపం. ఆ ప్రత్యేకత వల్లే ఈ పురుగును ‘లివింగ్‌ జ్యువెలరీ’ అనీ పిలిచేస్తుంటారు. మొన్నీమధ్య ఓ రైతు కంటపడితే మెరిసే దాని ఆకారం చూసి అందరిలానే అతనూ ఆశ్చర్యపోతూ ఇదిగో ఈ ఫొటోల్ని తీశాడట.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..