Published : 23 Oct 2022 00:08 IST

ఈ చేపలకు ఆహారం అక్కర్లేదు!

క్వేరియమన్నా... అందులో అటూ ఇటూ తిరుగాడే చిట్టి పొట్టి చేపలన్నా... పిల్లలు ఎంతో ఇష్టపడతారు. చేపల్ని చూడ్డం సరదాగానే ఉంటుంది కానీ వాటి బాగోగులు చూడ్డం మాత్రం అన్నివేళలా కుదరకపోవచ్చు. సమయానికి నీళ్లు మార్చడం, ఆహారం వేయడం... ఇంట్లో ఉన్నప్పుడు సరే కానీ, ఓ రెండ్రోజులు ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే ఇబ్బందే. మరైతే ఏం చేయాలి అంటారా... ఏ బాధా లేకుండా మన ముచ్చటా తీర్చుకోవాలంటే ఈ ‘రోబో ఫిష్‌ టాయ్స్‌’ని ఇంటికి తెచ్చేసుకోండి. ‘వాటర్‌ ఆక్టివేటెడ్‌ టెక్నాలజీ’తో పనిచేసే ఈ చేపలు- బయట ప్లాస్టిక్‌ బొమ్మల్లానే కనిపిస్తాయా... నీళ్లల్లో వేయగానే చక్కగా చక్కర్లు కొడుతూ నిజమైన వాటిలానే తిరుగుతాయి. అన్ని రంగుల్లో దొరికే ఈ ఉత్తుత్తి చేపల్ని నీళ్లలో వేసి, చిన్న చిన్న రాళ్లతో అలంకరించామంటే ఆ అక్వేరియం ఎంత అందంగా ఉంటుందో. ఇంటికొచ్చిన అతిథులూ అవి బొమ్మలని తెలిసి ఆశ్చర్యపోతారంతే!


బుజ్జాయిలకూ రోలూ, రోకలీ!

పిల్లల కోసం మ్యూజిక్‌ టాయ్స్‌, ఎడ్యుకేషనల్‌ బొమ్మల్లాంటివి ఎన్ని ఉన్నా వాళ్లకు చిన్నచిన్న కిచెన్‌ సెట్లను పెట్టుకుని ఆడుకోవడమే ఎంతో ఇష్టం. అమ్మలా వంటచేయడం... పెద్దవాళ్లలా ఇంట్లో ఉన్న వస్తువుల్ని వాడటం... లాంటివి చేస్తుంటారు. అందుకే గ్యాస్‌పొయ్యి దగ్గర్నుంచి ఫర్నిచర్‌ వరకూ రకరకాల బొమ్మలు- ప్లాస్టిక్‌, కలప, ఇత్తడితో చేసినవి మార్కెట్లోకి వచ్చాయి. అమ్మమ్మల కాలం నాటి రాతి పనిముట్లు మళ్లీ ఈతరం వంటగదిలోకి వచ్చేసినట్టే
ఇప్పుడు ‘మినియేచర్‌ స్టోన్‌ కిడ్స్‌ కిచెన్‌ సెట్‌’ పేరుతో రాతి పనిముట్లు పిల్లల కిచెన్‌ బొమ్మల్లోకీ వచ్చేశాయి. తక్కువ బరువు ఉండే సోప్‌స్టోన్‌తో రోలు, రుబ్బురోలు, కల్వం, తిరగలి, పెనం, పొయ్యి... ఇలా అన్ని రాతి వస్తువులూ బుల్లి బుల్లి రూపాల్లో దొరుకుతున్నాయన్నమాట. పిల్లలు- వీటితో తమ బొమ్మల ఆటలో అచ్చంగా అమ్మ వంటగదిని తెచ్చుకోవడమే కాదు, ఆనాటి సంప్రదాయ వస్తువుల గురించి తెలుసుకోవచ్చు కూడా.


లెగోలతో ‘చిత్రం’

కదానిమీద ఒకటి పెడుతూ లెగోలతో రకరకాల బొమ్మలు చేయడం తెలిసిందే. మరి అవే లెగోలతో చక్కటి పూల చిత్రాన్నీ, వ్యక్తుల బొమ్మల్నీ గీస్తే ఎంత వెరైటీగా ఉంటుంది. అందుకే వచ్చేసింది ‘లెగో ఫ్లోరల్‌ ఆర్ట్‌’. ఎప్పుడూ లెగోలతో ఇళ్లూ, ఎత్తయిన భవంతుల్లాంటివి చేయడమేనా... కాస్త కొత్తదనం చూపితే ఎలా ఉంటుంది అనుకున్నారేమో దీన్ని తీసుకొచ్చారు. దీంట్లో రంగుల ముక్కలూ, బోర్డూ వస్తాయి. కిట్‌లో ఇచ్చిన బొమ్మల సాయంతో ఆ రంగుల ముక్కల్ని బోర్డు మీద పెడుతూ చక్కటి బొమ్మ ఆకారాన్ని తెప్పించొచ్చు. కావాలంటే మనమే సొంతంగా రంగుల్ని కలుపుతూ కొత్త కొత్త బొమ్మల్నీ తయారుచేయొచ్చు. ఆ లెగో ఆర్ట్‌ని గోడమీద వేలాడదీసుకోవచ్చు కూడా. పిల్లలకే కాదు పెద్దలకూ కాస్త ఆటవిడుపుగా ఉంటుందీ పజిల్‌.


నచ్చినచోట అచ్చేయొచ్చు!

చింటూ ఫ్రెండ్స్‌తో ఇప్పుడే వస్తానని చెప్పి ఇంట్లోకి వెళ్లాడు. తెల్లటి నోట్‌బుక్‌లో నిమిషాల్లో అన్ని జంతువుల బొమ్మలు వేసి తీసుకెళ్లి చూపించాడు. రంగు రంగుల ఆ బుల్లి బొమ్మల్ని చూసి అప్పుడే ఎలా వేశావని అడిగితే... అసలు విషయం చెప్పాడు. నా దగ్గర ‘క్యూట్‌ టాయ్‌ స్టాంప్స్‌’ ఉన్నాయని... బోలెడన్ని రంగుల్లో జంతువుల దగ్గర్నుంచి స్మైలీల వరకూ కావాల్సిన బొమ్మల అచ్చుల్ని వేసుకునేలా ఈ స్టాంపులు దొరుకుతున్నాయి. ఇంకుతో పాటే ఉండే ఈ స్టాంపులతో నచ్చిన చోటులో అచ్చు వేసేయొచ్చు. చిన్నారులు సరదాగా ఆడుకుంటూనే బొమ్మలు గీయడం నేర్చుకోవడానికో, కథల్లోని పాత్రల బొమ్మలు కాగితంపైన గీయడానికో వీటిని వాడుకోవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు