Published : 01 Oct 2022 23:46 IST

పూజారికి సాయంగా రోబో

సాంకేతిక రంగంతో పాటు కొన్ని సంస్థల్లోనూ, హోటళ్లలోనూ రోబోలు సేవ లందించడం మనం చూశాం. తాజాగా ఇప్పుడు ఓ రోబో భక్తుల సేవలో నిమగ్నమైంది. దేవీశరన్నవరాత్రుల సందర్భంగా కోల్‌కతాలోని అమ్మవారి మండపం వద్దకు దర్శనానికొచ్చిన వారికి కొత్త అనుభూతిని పంచుతోంది రోబో అన్నపూర్ణ. సెమీ- హ్యూమనాయిడ్‌ బట్లర్‌ రోబోగా పిలిచే ఈ స్వదేశీ హైటెక్‌ రోబో చాలా పనులు చేయగలదు. 63 భాషల్ని అర్థం చేసుకుని మాట్లాడగల ఈ రోబో- మండపం దగ్గర నిల్చొని భక్తులకు స్వాగతం పలుకుతోంది. వంటగది నుంచి ప్రసాదాలు తెస్తుంది. పూజారికి సాయంగా భక్తులకు తీర్థప్రసాదాలు అందిస్తుంది. మండపాన్ని శుభ్రం చేస్తుంది. సౌరభ్‌ గంగూలీ ఆటోగ్రాఫ్‌తో కనిపించే ఈ రోబో కొన్ని బెంగాల్‌ టీవీ రియాలిటీ షోలకూ, బెంగాల్‌ గ్లోబల్‌ బిజినెస్‌ సమ్మిట్‌కూ అతిథిగా హాజరైంది. ఆ రాష్ట్రంలో ‘అన్నపూర్ణ’కు ప్రత్యేకంగా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ కూడా ఉంది.


భార్యకి పాదాభివందనం

భార్యాభర్తలు సమానమని ఎవరు ఎన్ని చెప్పినా సంప్రదాయ తంతుల్లో మాత్రం మగవారికే పెద్ద పీట వేస్తారు. అలా ఈ మధ్య భోపాల్‌లో జరిగిన పెళ్లి తంతులో ఓ పెళ్లి కొడుకు మాత్రం నా భార్య నాతో సమానం... తను నా కాళ్లు మొక్కితే నేనూ తన కాళ్లు మొక్కుతానంటూ పెళ్లికూతురి పాదాల వద్ద మోకరిల్లాడు. పురోహితుడూ, తల్లిదండ్రులూ వద్దని వారించినా పెళ్లి కూతురి ఆశీర్వాదాలు తీసుకున్నాడు. పెళ్లిలో దండలు మార్చుకునే సంప్రదాయం దాదాపు అన్ని మతాల వారికీ ఉంటుంది. కొన్నిచోట్ల దండలు మార్చుకున్నాక పెళ్లి కూతురు వరుడి పాదాలకు నమస్కరిస్తుంది. అంతేతప్ప వరుడు వధువుకు పాదాభివందనం చేయడం మనం ఎక్కడా చూడం. స్త్రీని తక్కువగా చూసే ధోరణికి తాను వ్యతిరేకమంటూ ఆ అబ్బాయి చేసిన పనికి నెటిజన్లంతా ఫిదా అవుతున్నారు.


ఐఫోన్‌ ముందుగానే కొనేయాలని!

కప్పుడు చేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉండటం స్టేటస్‌ సింబల్‌. ఇప్పుడు దాన్ని భర్తీ చేస్తోంది ఐఫోన్‌. ఒక్క కుర్రకారు¸ కాదు, అన్ని వయసులవారినీ ఎంతగానో ఆకట్టుకుంటూ వారి ఫేవరెట్‌ గ్యాడ్జెట్‌గా మనసు దోచుకుంటోంది. అందుకే ఖరీదైనా ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవుతూ సరికొత్త ఫీచర్లతో వినియోగదారులకు మరింతగా చేరువవుతోంది. అదీ ఈ ఫోన్‌కి ఉన్న క్రేజ్‌. అలా ఫీలైన కేరళవాసి ధీరజ్‌ దుబాయ్‌ వెళ్లి భారత్‌లో ఐఫోన్‌ 14 విడుదలవడానికి కొన్ని గంటల ముందు దాన్ని కొనుగోలు చేశాడు. ఐఫోన్‌ 14ని కొన్న తొలిభారతీయుడిగానూ నిలిచాడు. అందుకోసమే దాదాపు నలభైవేల రూపాయలు ఖర్చు చేసి దుబాయ్‌ వెళ్లిన ధీరజ్‌- గతంలో ఐఫోన్‌ 8, ఐఫోన్‌ 11ప్రో మ్యాక్స్‌, ఐఫోన్‌ 12, ఐఫోన్‌ 13 సిరీస్‌ ఫోన్లనూ అదే విధంగా కొనుగోలు చేసి వార్తల్లోకి ఎక్కాడు. ప్రతిసారీ ఐఫోన్‌ కొత్త మోడళ్లను మనదేశంలో అందరికంటే ముందు దక్కించుకోవాలనేది తన కోరికట. అందుకోసమే ఇలా చేస్తున్నాడట.


పాఠాలు పాటలుగా..

చాలామందికి సినిమా కథలూ, పాటలూ బుర్రకెక్కినంత త్వరగా మరేవీ వాళ్ల బుర్రలోకి దూరలేవు. ఈ విషయాన్నే అర్థం చేసుకున్న ఈ టీచర్లు పిల్లలకు పాఠాలు కూడా అదే పద్ధతిలో చెప్పాలని నిర్ణయించుకున్నారు. అందుకే టీచర్లు ఎంత కష్టపడ్డా పిల్లలు అర్థం చేసుకోలేకపోతున్న హిందీ వ్యాకరణాన్ని పాపులర్‌ అయిన సినిమా పాటల ట్యూన్‌లతో చెబుతున్నారు. సరికొత్త బోధనతో చిన్నారులకు చదువుపైన ఆసక్తిని కలిగిస్తున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ స్కూల్‌కి తనిఖీకి వెళ్లిన ఐఏఎస్‌ అధికారి అర్పిత్‌ వర్మ ఆ దృశ్యాన్ని చూసి ఎంతో సంతోషించడమే కాదు, వీడియో తీసి ట్విటర్‌లో పెట్టి అందరితోనూ ఆ ఆనందాన్ని పంచుకోవడంతో విషయం కాస్తా వైరల్‌ అయింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని