ఈ థాలీ తింటే రూ.8.5 లక్షలు మీవే!

వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ వీడియోలు చేసే ఫుడ్‌ బ్లాగర్‌ ఒకరు ఇటీవల దిల్లీలోని ఓ రెస్టరంట్‌కు వెళ్లాడు. అక్కడి మెనూలో ‘ఐరన్‌ మ్యాన్‌ థాలీ’ అని వెరైటీగా కనిపించడంతో ఆర్డర్‌ చేశాడు.

Published : 06 Feb 2022 00:16 IST

ఈ థాలీ తింటే రూ.8.5 లక్షలు మీవే!

వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ వీడియోలు చేసే ఫుడ్‌ బ్లాగర్‌ ఒకరు ఇటీవల దిల్లీలోని ఓ రెస్టరంట్‌కు వెళ్లాడు. అక్కడి మెనూలో ‘ఐరన్‌ మ్యాన్‌ థాలీ’ అని వెరైటీగా కనిపించడంతో ఆర్డర్‌ చేశాడు. మొదట సిబ్బంది ఆశ్చర్యపోయినా, కస్టమర్‌ అడిగింది తీసుకొచ్చి ఎదురుగానున్న టేబుల్‌పై పెట్టడంతో నోరెళ్లబెట్టడం అతడి వంతయ్యింది. ఎందుకూ అంటే - సాధారణంగా థాలీ అంటే అయిదారు పదార్థాలు ఉంటాయి కానీ ఈ ‘ఐరన్‌ మ్యాన్‌ థాలీ’లో మాత్రం దాదాపు 35 రకాలు ఉన్నాయి మరి! అంతేకాదు... ఈ పదార్థాలన్నింటినీ అరగంటలో తినగలిగితే రూ.8.5 లక్షల బహుమతీ ఇస్తారట. ఒక్కరితోనే సాధ్యం కాకపోతే ఇంకొకరి సహాయం కూడా తీసుకోవచ్చనే మినహాయింపుతో పాటు అరగంటలోనే ఆ బాహుబలి కంచాన్ని ఖాళీ చేయాలనేది నిబంధన. ఎంత ప్రయత్నించినా ఆ ఫుడ్‌ బ్లాగర్‌ అవన్నీ తినలేకపోయాడు. అయితేనేం, ఈ విషయం మొత్తాన్ని అతడు ఇన్‌స్టాలో షేర్‌ చేయడంతో నెటిజన్లు చిత్రవిచిత్రమైన కామెంట్లతో స్పందిస్తున్నారట.      


తండ్రి ప్రేమ

కూతుళ్లకు నాన్నతో, కొడుకులకు అమ్మతో అనుబంధం కాస్త ఎక్కువ అని అంటుంటారు. అందుకు ఉదాహరణే ఈ సంఘటన. ఈ చిత్రంలోని తండ్రీకూతుళ్లది ఏ ప్రాంతమో తెలియదు కానీ సోషల్‌ మీడియాలో ప్రతి ఒక్కరి మనసునూ కదిలిస్తున్నారు. ఓ పాపకు బ్రెయిన్‌ సర్జరీ అవసరం కావడంతో వైద్యులు ఆమె తలపైన కొంతభాగంలో వెంట్రుకలు తొలగించారు. ఆ చిన్నారి బాధను పంచుకునేలా తండ్రి కూడా అదే మాదిరి తన జుట్టును కత్తిరించుకున్నాడు. అంతేకాదు... ఆపరేషన్‌ తాలూకు కుట్లను తలపించేలా డిజైనూ చేయించాడు. ‘ఏమీ కాదమ్మా, నీలాగే నాకూ ఉంది. త్వరలోనే ఇద్దరికీ తగ్గిపోతుంది’ అని బిడ్డకు ధైర్యం చెప్పాడతను. ‘నాన్నంటే రిలేషన్‌ మాత్రమే కాదు... ఎప్పటికీ అర్థం కాని ఓ ఎమోషన్‌’ అనీ, ‘తండ్రి ప్రేమకు ఈ చిత్రం సజీవ సాక్ష్య’మంటూ నెటిజన్లు ఫిదా అవుతున్నారు.


నూనె డబ్బాలతో  పక్షులకు ఆవాసం

రచూ దుకాణాలకు వెళ్లే అవసరం లేకుండా... పల్లెల్లో ఎక్కువగా స్టీల్‌ డబ్బాల్లో నూనెను కొనుగోలు చేస్తుంటారు. అవి ఖాళీ అయ్యాక పడేయడమో పాతసామానులా అమ్మేయడమో చేస్తుంటారు. కానీ, రాజస్థాన్‌లోని సంకర్దా గ్రామ ప్రజలు మాత్రం అందుకు భిన్నంగా ఆలోచించారు. ఖాళీ స్టీల్‌ డబ్బాలను పక్షులకు ఆవాసంగా మార్చారు. ఒకవైపు కత్తిరించిన డబ్బాలను ఒకదానికొకటి జతచేసి దండెంలా స్తంభాల మధ్యలో కట్టి పక్షులకు నీడ కల్పించారు. కొందరు యువకులు చేసిన ఈ ఆలోచనను అక్కడి వారంతా అభినందించడంతో పాటు నూనె డబ్బాలను పడేయకుండా తీసుకొచ్చి మరీ వారికే ఇస్తున్నారట. ఈ విషయం తెలియడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలూ సంకర్దాకు వచ్చి చూసి మరీ వెళ్తున్నారట.


ఆకలితో వస్తే... ఆఫర్‌ దక్కింది  

ష్టమైన వ్యక్తుల కోసమో, నచ్చిన ఆహారం కోసమో ఎంతదూరమైనా వెళ్తుంటాం. తీరా అక్కడికి వెళ్లాక ఆ వ్యక్తో ఆ హోటలో అందుబాటులో లేకపోతే చాలా బాధపడతాం. అటువంటి పరిస్థితే కెనడాలోని ఓ యువకుడికీ ఎదురైంది. మామూలే కదా అంటారా - సాధారణంగా అయితే మామూలే కానీ మోకాళ్లలోతు మంచులో అతికష్టమ్మీద నడుచుకుంటూ మరీ వెళ్లాడతను. తనకిష్టమైన ఫుడ్‌ తిందామని అంత శ్రమపడి రెస్టరంట్‌కు వెళ్తే... తీరా అది మూసివేసి ఉండటంతో అసహనానికి గురయ్యాడు. దాంతో నిరాశతో అక్కడే మోకాళ్లపై కాసేపు కూర్చొని తిరిగివెళ్లిపోయాడు. అదేరోజు ఆ రెస్టరంట్‌లోని సీసీ ఫుటేజ్‌ను పరిశీలించిన యజమానికి... ఆహారం కోసం యువకుడు రావడంతో పాటు బాధగా వెళ్లిపోవడమూ కనిపించింది. అంత మంచు కురుస్తున్నా... ఆ కస్టమర్‌కు రెస్టరంట్‌ మీదున్న నమ్మకానికి ఆమె పొంగిపోయింది. అంతేకాదు, పరిస్థితులు చక్కబడ్డాక అతడు ఏం తిందామని వచ్చాడో ఆ పదార్థాలను ఉచితంగా అందిస్తామనీ ప్రకటించిందా యజమాని.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..