ఊరంతా ఒకే వీధి...

గ్రామాల్లోనైనా పట్టణాల్లోనైనా పలు వీధులు ఉండి... వాటికి ఇరువైపులా ఇళ్లుంటాయి. కొన్నిచోట్ల అక్కడో ఇల్లూ ఇక్కడో ఇల్లూ ఉంటుంది. ఏ ఇంటి డిజైన్‌ ఆ ఇంటిదే. అదే లండన్‌లోని మిల్టన్‌ అబ్బాస్‌ గ్రామానికి వెళితే భలే చిత్రంగా అనిపిస్తుంది.

Updated : 13 Mar 2022 02:01 IST

ఊరంతా ఒకే వీధి...

గ్రామాల్లోనైనా పట్టణాల్లోనైనా పలు వీధులు ఉండి... వాటికి ఇరువైపులా ఇళ్లుంటాయి. కొన్నిచోట్ల అక్కడో ఇల్లూ ఇక్కడో ఇల్లూ ఉంటుంది. ఏ ఇంటి డిజైన్‌ ఆ ఇంటిదే. అదే లండన్‌లోని మిల్టన్‌ అబ్బాస్‌ గ్రామానికి వెళితే భలే చిత్రంగా అనిపిస్తుంది. ఆ గ్రామంలో ఐదు కిలోమీటర్ల తారురోడ్డు ఉండి... దానికిరువైపులా ఒకే ఒక్క వరుసలో 262 ఇళ్లు ఉంటాయి. అవన్నీ చూడ్డానికి ఒకే విధంగా ఉండి... చక్కగా అమర్చినట్టు కనిపిస్తాయి. కాటేజీలను పోలి ఉండే ఆ ఇళ్లని దూరంగా చూస్తే పూరి గుడిసెల్లా అనిపిస్తాయి. పచ్చని ప్రకృతి ఒడిలో ఓ క్రమపద్ధతిలో ఉన్న ఈ గ్రామంలో రెండేళ్లకోసారి వేసవిలో ‘విలేజ్‌ ఫెస్ట్‌’ పేరుతో సంబరాలు నిర్వహిస్తుంటారు. ఆ సందర్భంగా గ్రామస్తులంతా 18వ శతాబ్దపు దుస్తులు ధరించి సందడి చేస్తారు. పెద్ద ఎత్తున జరిగే ఈ సంబరాన్ని చూడ్డానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలాది మంది వస్తుంటారు.


నారింజలో నారింజలు!

హజంగా నారింజపండును ఒలిస్తే లోపల తొనలు ఉంటాయి. అయితే తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఓ వీడియోలో నారింజపండును ఒలిస్తే మాత్రం దానిలోపల తొనలకు బదులుగా తొమ్మిది చిన్న చిన్న నారింజలు ఉన్నాయి. రైజింగ్‌ టెక్‌ అనే ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్‌ చేసిన ఈ వీడియోని చూసిన నెటిజన్లు ఇదెలా సాధ్యమంటూ ఆశ్చర్యపోతున్నారు. కొందరేమో ఇది ప్రెగ్నెంట్‌ నారింజ అంటుంటే, మరికొందరు పెద్ద నారింజలో చిన్న వాటిని ఉంచి వీడియో తీశారని కామెంట్లు పెడుతున్నారు. ఈ మధ్య అచ్చం నారింజ పండ్లలానే ఉండే బ్రెడ్‌లు సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొట్టాయి. అయితే బ్రెడ్‌నే నారింజ పండ్లలా చేశారని చెబుతున్నారు చెఫ్‌లు. ఏది ఏతైనేం చూడ్డానికి భలేగా ఉంది కదూ!


మంచినీళ్లకే నెలకి లక్షన్నర..!

చాలామంది ఇరవై రూపాయలు పెట్టి ఇంటిల్లిపాదికీ ఓ వాటర్‌క్యాన్‌ వేయించుకోవడానికే ఎన్నో అనుకుంటారు. కొందరైతే బయట మంచి నీళ్ల సీసా కొంటే డబ్బులు వృథా అని ఎక్కడికెళ్లినా ఇంటి నుంచే తీసుకెళ్లి డబ్బులు ఆదా చేస్తుంటారు. అదే కెనడాకు చెందిన రయాన్‌ డబ్స్‌ అనే కుర్రాడు మాత్రం మంచినీళ్ల కోసం నెలకి అక్షరాలా లక్షన్నర ఖర్చు చేస్తున్నాడు. అలాగని అతనేమీ సినీ ప్రముఖుడూ కాదూ, రాజకీయ నాయకుడు అంతకంటే కాదు. టిక్‌టాక్‌లో వీడియోలు చేస్తూ సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే కుర్రాడు. అతనికి చిన్నతనం నుంచీ ఇంట్లో మంచి నీళ్లు నచ్చేవి కాదట. హోటళ్లూ, థియేటర్లూ, ఇతర ప్రాంతాలకు ఎక్కడికెళ్లినా అక్కడా మంచినీళ్లు రుచించకపోవడంతో పదిహేనేళ్లుగా నార్వేకు చెందిన వోస్‌ అనే సంస్థ మంచి నీళ్లనే తాగుతున్నాడు. వాటిని నాలుగైదుసార్లు ఫిల్టర్‌ చేయడంతోపాటు ప్రత్యేకంగా శుద్ధి చేస్తారని చెబుతారక్కడ. అందుకే రయాన్‌ ఖరీదు ఎక్కువైనా గాజు సీసాల్లో వచ్చే వోస్‌ నీళ్లను నెలకు సరిపడా ఒకేసారి తీసుకుంటాడు. వాటిని నిల్వ చేసుకోవడానికి నాలుగు ఫ్రిజ్‌లు కూడా కొనిపెట్టాడు. హోటల్‌, సినిమా థియేటర్‌, జిమ్‌, షాపింగ్‌... ఇలా ఎక్కడకు వెళ్లినా ఆ నీళ్ల సీసాలు అతని వెంట ఉండాల్సిదే. ఈ మధ్య ఆ విషయాన్ని సోషల్‌ మీడియాలో పంచుకోవడంతో వైరల్‌ అయ్యాడు రయాన్‌.


హనుమంతుడంటే కోపం!

క్కడైనా హిందువులు హనుమంతుడిని పూజించడమన్నది సర్వసాధారణం. అయితే, ఉత్తరాఖండ్‌ ద్రోణగిరి గ్రామంలోని భూటియా తెగకు చెందిన హిందువుల వద్ద పొరుగు గ్రామాలవారెవరైనా ఆంజనేయుడి పేరెత్తితే ఆగ్రహిస్తారు. ఒకవేళ ఆ ఊరి వారే స్వామిని తలిస్తే కొంత కాలం గ్రామం నుంచే బహిష్కరిస్తారు. ఎందుకంటే ద్రోణగిరి వాసుల దృష్టిలో హనుమాన్‌ దొంగ. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా... వింతగా తోచినా అది నిజం. అందుకే కొలవడానికీ తలవడానికీ ఇష్టపడరు. దీనికి సంబంధించి అక్కడో పౌరాణిక గాథ ప్రాచుర్యంలో ఉంది. రామ-రావణ యుద్ధంలో బాణం తగిలి మూర్చపోయిన లక్ష్మణుడిని బతికించేందుకు సంజీవనీ పర్వతాన్ని తీసుకొస్తాడు ఆంజనేయుడు. ఆ సంజీవనీ పర్వతం ద్రోణగిరిని ఆనుకొని ఉండేదనీ, దానికి గ్రామస్తులు పూజలు చేసేవారనీ- దాన్నే హనుమంతుడు ఎత్తుకు పోయాడనీ వారి నమ్మకం. అందుకే ఆ గ్రామంలో హనుమాన్‌కి స్థానం లేదని చెబుతారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..