Published : 01 May 2022 00:25 IST

ప్రసవమయ్యాక భర్తదే బాధ్యత!

పందొమ్మిదేళ్ల అనిస్‌ ఆయునీ ఉస్మాన్‌కీ, ఇరవై ఒక్కేళ్ల వెల్డన్‌ జుల్‌కెఫ్లీకీ గతేడాది పెళ్లైంది. మలేషియాలోని కెలాంతన్‌ అనే ప్రాంతానికి చెందిన ఈ జంట ఇటీవల పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. విటా మిల్క్‌ పేరుతో సౌందర్యోత్పత్తుల సంస్థను నడుపుతున్న అనిస్‌ ఈ మధ్య తన భర్తకు దాదాపు మూడున్నర కోట్లకుపైనే ఖర్చు పెట్టి లాంబొర్గిని కారును బహుమతిగా ఇవ్వడం వైరల్‌ అయింది. ఎందుకంటే సంప్రదాయం ప్రకారం... భార్యకు ప్రసవమయ్యాక సుమారు మూడునెలలపాటు భర్త అత్తారింట్లోనే ఉండి ఆమెనీ, బిడ్డనీ రాత్రింబగళ్లూ చూసుకోవాల్సి ఉంటుంది. ప్రసవమైన మహిళలు మంచి ఆహారం తీసుకుంటూ పూర్తిగా విశ్రాంతిలోనే ఉంటారు. అలా ఉండటం వల్ల ప్రసవానంతర సమస్యల నుంచి త్వరగా కోలుకుంటారని వారి అభిప్రాయం. ఈ క్రమంలో వెల్డన్‌ కూడా భార్యకు తోడుగా ఉండి బిడ్డ ఆలనాపాలనా చూసుకుంటున్నాడు. అందుకే అనిస్‌ తన భర్తకు ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చిందట.


పంటకోసం ఎలుగుబంటి

పంటపొలాల్లో అడవి జంతువులు పడ్డాయంటే ఏమీ మిగలదు. ముఖ్యంగా మొక్కజొన్న పంటను కోతులూ, అడవి పందుల వంటివి నాశనం చేస్తుంటాయి. వాటి నుంచి పంటని కాపాడుకోవడానికి రైతులు రాత్రింబగళ్లూ కాపలా కాస్తుంటారు. అయినాసరే వాటి బెడద మాత్రం తప్పట్లేదు. అలా ఎన్నో ఏళ్లుగా పంటను కాపాడుకునే ప్రయత్నంలో కుక్కల్నీ, కొండముచ్చుల్నీ తీసుకొచ్చి కాపలా ఉంచేవాడు సిద్ధిపేట జిల్లా కొహెడ మండలం నాగసముద్రాలకు చెందిన భాస్కర్‌రెడ్డి. అయినా ఏ మాత్రం ఫలితం లేకపోవడంతో ఓ ఆలోచన చేశాడు. పెద్దపెద్ద షాపుల ముందు రకరకాల కాస్ట్యూమ్స్‌ వేసుకుని వినియోగదారుల్ని ఆకట్టుకునేవారిని చూసిన భాస్కర్‌ రెడ్డి- ఎలుగు బంటిని పోలి ఉండే డ్రెస్‌ను తెప్పించి ఒక వ్యక్తికి వేసి మొక్కజొన్న పొలంలో కాపలాగా ఉంచడం మొదలుపెట్టాడు. దాంతో అతడిని చూసిన అడవి జంతువులు అటుగా రాకుండా పారిపోవడంతో ఆ వ్యక్తిని అక్కడే ఉంచి... నెలకి 15వేల రూపాయలు చెల్లిస్తున్నాడు.


కాగితం రాకెట్‌ చేయడం వచ్చా...?

హైదరాబాద్‌కి చెందిన ఆ ఇంజినీరింగ్‌ విద్యార్థి పేరు దీపక్‌ చౌదరి. ఆ మధ్య చెన్నైలోని ఒక కాలేజీలో జరిగిన అరుదైన పోటీలకి వెళ్లాడతను. దీపక్‌ అక్కడ అడుగుపెట్టగానే చేతికి ఒక ‘ఏ4’ సైజ్‌ పేపర్‌ ఇచ్చారు. దాన్నో కాగితం రాకెట్‌గా మలిచాడు దీపక్‌. ఆ తర్వాత తనలాంటివాళ్లెందరితోనో పోటీపడి... తన రాకెట్‌ని సుమారు 10.7 సెకన్లు గాల్లోనే ఉండేలా విసిరాడు. ఆ ఫీటుతో నేరుగా ఆస్ట్రియా దేశంలో జరగబోతున్న వరల్డ్‌కప్‌ పోటీలకి ఎంపికయ్యాడు! అవును, చిన్నప్పుడు స్కూల్లో నోట్‌బుక్‌ పేజీలు చింపి మరీ మనం నేర్చుకున్న కాగితం రాకెట్‌కి నేడు ప్రపంచస్థాయి గౌరవం దక్కుతోంది! వాటికోసం ‘వరల్డ్‌ కప్‌’ పోటీలూ జరుగుతున్నాయి. ప్రముఖ ఎనర్జీ డ్రింక్‌ సంస్థ పేరుమీద ‘రెడ్‌బుల్‌ పేపర్‌ వింగ్స్‌’ అని చెప్పుకుంటున్న ఈ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ పోటీలు మూడేళ్లకోసారి జరుగుతాయి. 2006 నుంచే వీటిని నిర్వహిస్తున్నా... భారత్‌ ఈసారి ఫైనల్‌కి వెళుతోంది!


ఉద్యోగుల ‘హోర్డింగ్స్‌’!

వినాశ్‌ జైన్‌ ఆ రోజు ఉదయం నిద్రలేవక ముందే వాళ్లావిడ ‘ఏమండీ, మన అపార్ట్‌మెంట్‌ ఎదురుగా ఆ హోర్డింగ్‌ చూడండి... రండి!’ అంటూ హడావుడిగా బాల్కనీకి తీసుకెళ్లింది. అంతగా ఆ హోర్డింగ్‌లో ఏముందా అని చూస్తే... ఆశ్చర్యం... అందులో తనే ఉన్నాడు! దానికింద ఉద్యోగిగా తన విజయాలు రాసి ఉన్నాయి. ఒక్క అవినాశ్‌కే కాదు... తమ దగ్గర పనిచేస్తున్న డజనుమంది ‘ఉత్తమ ఉద్యోగుల’కి ఇలా ఇండోర్‌ నగరమంతా హోర్డింగ్‌లు ఏర్పాటుచేసి వాళ్లని ఆశ్చర్యంలో ముంచెత్తింది ఇన్ఫోబీమ్‌ సంస్థ. ‘మంచి ఉద్యోగులకి ఇంక్రిమెంట్లు ఎలాగూ ఇస్తాం. దాంతోపాటూ వాళ్లే మా సూపర్‌స్టార్స్‌ అని ప్రపంచానికీ చెప్పాలనుకున్నాం. అందుకే ఈ దారి ఎంచుకున్నాం!’ అంటోంది ఆ ఐటీ కంపెనీ. అన్నట్టు, ఇండోర్‌ నగరంలో ఈ హోర్డింగులు మరో ఆరునెలలపాటు అలాగే ఉంటాయట. ఆ తర్వాత తమదగ్గరున్న పదిహేనువందలమంది ఉద్యోగుల నుంచి మరో 12 మందిని ఎంపికచేసి కొత్త హోర్డింగ్స్‌తో సన్మానిస్తారట!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని