లక్షలు వదులుకుని స్వీపరుగా...

పీజీ చేసిన వారు కూడా ప్యూన్‌ ఉద్యోగాలకు క్యూలో నిల్చుంటున్నారనే వార్తలు వింటూనే ఉంటాం. పాపం నిరుద్యోగం మూలంగా వాళ్లకు అలాంటి పాట్లు తప్పడం లేదు. కానీ, రూ.82 లక్షల జీతం వచ్చే నిక్షేపం లాంటి ఉద్యోగాన్ని వదిలేసుకుని ఎవరైనా స్వీపర్‌గా చేరతారా?

Updated : 23 Oct 2022 01:06 IST

లక్షలు వదులుకుని స్వీపరుగా...

పీజీ చేసిన వారు కూడా ప్యూన్‌ ఉద్యోగాలకు క్యూలో నిల్చుంటున్నారనే వార్తలు వింటూనే ఉంటాం. పాపం నిరుద్యోగం మూలంగా వాళ్లకు అలాంటి పాట్లు తప్పడం లేదు. కానీ, రూ.82 లక్షల జీతం వచ్చే నిక్షేపం లాంటి ఉద్యోగాన్ని వదిలేసుకుని ఎవరైనా స్వీపర్‌గా చేరతారా? అలా చేరిన వారిని ఎవరైనా పిచ్చోడు అనే అంటారు. ఆస్ట్రేలియాకు చెందిన పాల్‌ మాత్రం అలాంటి విమర్శలను పట్టించుకోవడం లేదు. ఓ పెద్ద కంపెనీలో ఉన్నతాధికారిగా పని చేస్తూ రూ.82 లక్షల జీతం అందుకుంటున్నా... ఎప్పుడూ ఒకటే మూస పని చేయడం మాత్రం పాల్‌కి విసుగ్గా అనిపించి ఉద్యోగం మానేశాడు. వేరే ఉద్యోగాలకు దరఖాస్తు చేసినా అతని అర్హతలు ఉన్నతంగా ఉండటంతో చాలా సంస్థలు అవకాశమివ్వలేదు. దాంతో పాల్‌ చదువుకునే రోజుల్లో స్వీపర్‌గా పనిచేసిన మెక్‌డొనాల్డ్స్‌కే మళ్లీ వెళ్లాడు. ఊడ్చేవారి కొరత ఉండటంతో సంతోషంగా ఆ ఉద్యోగంలో చేరిపోయాడు. ఒత్తిడికి దూరంగా ప్రతిరోజూ ఉత్సాహంగా గడుపుతున్న పాల్‌ ఈ ఉద్యోగం ఎంతో సంతృప్తినిస్తోందంటున్నాడు.


ఇంట్లో చెట్లు!

చ్చదనం, ప్రకృతి అంటే బాగా ఇష్టపడేవారు ఏం చేస్తారు? పెరట్ల్లో మొక్కలు పెంచుకుంటారు. నగరజీవితంలో చాలామందికి అది కుదరదు. అలా కాకుండా కాంక్రీట్‌ జంగిల్‌లో ఉన్న మన ఇల్లే వనంలా మారిపోతే ఎలా ఉంటుంది? మొక్కలకు బదులు చెట్లే బాల్కనీలోనే నీడనిస్తే ఇంకెంత బాగుంటుంది? ఇది ఊహ కాదు... దాన్ని నిజం చేస్తూ ఈ మధ్య అలాంటి ఫారెస్ట్‌ అపార్ట్‌మెంట్స్‌ వస్తున్నాయి. ఇటలీ, చైనా, ఈజిప్టు, నెదర్లాండ్స్‌, సింగపూర్‌, మలేసియా లాంటి దేశాల్లో ఈ తరహా అపార్ట్‌మెంట్స్‌ ఎక్కువ. ఇప్పుడు మన దగ్గరా వస్తున్న ఈ అపార్ట్‌మెంట్స్‌లోని ఫ్లాట్లలో చిన్న చిన్న మొక్కలకి బదులుగా బాల్కనీల్లో అంతెత్తు చెట్లను పెంచడమే ఈ నయా కాన్సెప్ట్‌. ప్రతి ఫ్లాటు బాల్కనీలోనూ నాలుగైదు వరకూ పెద్ద చెట్లూ, కొన్ని మొక్కలూ వచ్చేలా ప్లాన్‌ చేస్తూ నిర్మాణం చేపడుతున్నారు. సెంట్రల్‌ డ్రిప్‌ ఇరిగేషన్‌ సిస్టమ్‌ ఉండటంతో పొద్దున, సాయంత్రం అన్ని ఫ్లాట్లలోని చెట్లకు నీళ్లు ఆటోమేటిగ్గా వెళ్లిపోతాయి. ఇదిగో అలాంటి గృహాలు ఇప్పుడు మనదేశంలో మొదటిసారి బెంగళూరులో అందుబాటులోకి వచ్చాయి. ఇంట్లోనే చెట్ల కింద సేద తీరడం... ఊహించుకుంటేనే ఎంతో బాగుంది కదూ!


గాజులమ్మే ఎమ్మెల్యే!

పండుగరోజు ఆ గాజుల కొట్టు కిటకిటలాడిపోతోంది. వరసబెట్టి వస్తున్న వినియోగదారులకు అక్కడున్న ఓ పెద్ద మనిషి గాజులు చూపిస్తూ... వాటి గురించి వివరిస్తూ చకచకా అమ్ముతున్నాడు. ఆయనని అక్కడ చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. కారణం... ఆ వ్యక్తి దుకాణం యజమానే కాదు, స్థానిక ఎమ్మెల్యే కూడా. పండుగరోజు గిరాకీ ఎక్కువ ఉంటుందని... తన దర్పాన్ని అంతా పక్కన పెట్టి కుటుంబ వ్యాపారంలో నిమగ్నమయ్యాడు. ఆయనే రాజ్‌కుమార్‌ సహయోగి... ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఇగ్లాస్‌   ఎమ్మెల్యేగా రెండోసారి ఎన్నికయ్యాడు. రాజకీయాల్లోకి రాకముందు గాజుల వ్యాపారి. రాజకీయాల్లోకి వచ్చినా ఆ వృత్తిని వదలకుండా ఉదయం, సాయంత్రం గాజులమ్ముతుంటాడు. పనిలేని సమయంలో రోజంతా అదే పనిలో ఉంటాడు. తనని కలవాలనుకున్న సామాన్యులు కూడా ఆ షాపు వద్దే రాజ్‌కుమార్‌ని కలిసి తమ సమస్యలూ చెప్పుకుంటుంటారు. రాజకీయాల్లోకి రాగానే రాజకుమారుల్లా ప్రవర్తించే నాయకులతో పోలిస్తే... మూలాలను మర్చిపోకుండా సామాన్యుడిలా జీవిస్తున్న ఈ ఎమ్మెల్యే ప్రత్యేకమే కదా!


సెలవులతో రీఛార్జ్‌!

కంపెనీలకు లాభాలు రావాలంటే మంచి ఉద్యోగులు ఉండాలి. వాళ్లు వంద శాతం సామర్థ్యంతో పని చేయాలి. మరి ఉద్యోగులు సంతోషంగా ఉన్నప్పుడే కదా అలా పని చేయగలుగుతారు. అయితే, టార్గెట్లు, ప్రాజెక్టుల ఒత్తిడిలో అది సాధ్యమా? క్రియేటివిటీని చంపేసే ఆ ఒత్తిడి నుంచి ఉద్యోగులను దూరం చేయడానికి వివిధ కంపెనీలు రకరకాల విధానాలను అవలంబిస్తుంటాయి. ‘వుయ్‌ వర్క్‌’ అనే కో వర్కింగ్‌్ స్పేస్‌ కంపెనీ కూడా అలానే ఆలోచించి... తమ భారతీయ ఉద్యోగులకు పదిరోజులపాటు దీపావళి సెలవులు ప్రకటించేసింది. హైదరాబాద్‌లోనూ సేవలందిస్తున్న ఈ సంస్థ పండుగ సంబరాలను కుటుంబం, బంధుమిత్రులతో సంతోషంగా జరుపుకోమనీ... అలా రీఛార్జ్‌ అయ్యాక ఆనందంగా ఆఫీసుకు రమ్మనీ చెబుతోంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు