Updated : 12 Aug 2022 16:09 IST

ఈ థెరపీలు చేయించుకునే ధైర్యముందా?

పాముల్ని తాకడం కాదు కదా చూడటానికే ఎంతో భయపడతాం. భారీగా ఉండే ఏనుగుల్ని దేవాలయాల వద్ద పూజిస్తే- పర్యటక ప్రాంతాల వద్ద పిల్లల్ని ఎక్కించి సంబర పడతాం. సముద్రాల్లో ఉండే డాల్ఫిన్లు రాగాలు తీస్తాయనీ, స్లైగల భాషలో తోటివాటితో మాట్లాడతాయనీ విని ఉన్నాం. అయితే వీటితోనూ నిపుణులు పలు థెరపీలు చేస్తూ రకరకాల సమస్యల్ని దూరం చేస్తున్నారని మీకు తెలుసా!

కొండచిలువతో మసాజ్‌

పాముల్నీ కొండ చిలువల్నీ చూస్తే వెన్నులో వణుకుపుడుతుంది. చాలామంది ఆ పేరును కూడా తలచుకోవడానికే ఇష్టపడరు. అలాంటిది ఫిలిప్పీన్స్‌లోని సెబూ నగరంలో ఉన్న జూ సిబ్బంది ఆసక్తి ఉన్నవారికి పాములూ, కొండచిలువలతో మసాజ్‌ చేయిస్తున్నారు. వినడానికి ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నా... ఇది వాస్తవమే. అక్కడ మసాజ్‌ చేయించుకోవాలనుకున్న వారిపైన ఓ నాలుగైదు పాముల్నో, కొండ చిలువల్నో వదులుతారు. ఇందుకోసం బాగా పొడవుగా లావుగా ఉన్నవాటినే ఎంచుకుని శిక్షణ ఇస్తారట. అవి శరీరంపై తిరుగుతూ  గట్టిగా చుట్టేసుకుంటూ ఉంటాయి. బరువైన వాటి కదలిక వల్ల శరీరంలో రక్తప్రసరణ బాగా జరిగి ఒత్తిడీ, ఒళ్లు నొప్పులూ దూరమవుతాయని చెబుతున్నారు మసాజ్‌ నిర్వహిస్తున్న ఫిజియోథెరపీ బృందం. పదిహేను నిమిషాల పాటు చేసే ఈ పైథాన్‌ మసాజ్‌కోసం శరీరంపైకి వాటిని వదిలేముందు- శ్వాసను నిదానంగా తీసుకోమనీ, భయంతో అరవద్దనీ- ఒకవేళ అవి మరీ గట్టిగా చుట్టేసినా, భయం వేసినా వెంటనే  సైగ చేయమనీ  సూచనలిస్తారు. అంతేకాదు, ఆకలిగా ఉంటే దాడి చేసే ప్రమాదముంటుందని కడుపు నిండా ఆహారం పెట్టాకే మర్దన చేయిస్తారట. ఇండోనేషియా, ఇజ్రాయిల్‌లోనూ పేరుగాంచిన ఈ మసాజ్‌ గురించి తలచుకుంటేనే ఒళ్లు జలదరిస్తోంది కదూ!


ఏనుగు తొక్కితే ఎంత హాయి!

నేల మీద బోర్లాపడుకున్నవారిని ఏనుగు తొండంతో, కాళ్లతో నొక్కుతుంటే వారు హాయిగా ఆస్వాదిస్తున్న వీడియో ఒకటి ఈ మధ్య సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. ఎవరైనా ఏనుగుపైన ఎక్కి దానిపైన దర్జాగా కూర్చుని సఫారీ చేస్తూ ఆనందిస్తారు. అది తొండంతో కుమ్ముతూ, కాళ్లతో తొక్కుతుంటే ఎందుకు హాయిగా పడుకుంటున్నారో అర్థం కాలేదు కదూ. మసాజ్‌లకు పెట్టింది పేరైన థాయ్‌లాండ్‌లో ఏనుగుల్నీ మసాజ్‌లకోసం ఉపయోగిస్తున్నారు. అక్కడ పర్యటకంగా పేరుగాంచిన చయాంగ్‌మాయ్‌ ప్రాంతంలో ఉన్న ఎలిఫెంట్‌ నేచర్‌ పార్కులోని ఏనుగులకు- ఫిజియోథెరపీ నిపుణుల చేత శిక్షణ ఇప్పించి వారి ఆధ్వర్యంలోనే మసాజ్‌లు చేయిస్తున్నారు అక్కడి సిబ్బంది. హాథీ మసాజ్‌ పేరుతో పర్యటకులకు సరికొత్తగా, సాహసోపేతమైన అనుభూతిని కలిగిస్తున్న ఈ మర్దన వల్ల వీపు, నడుము, కాళ్ల నొప్పులు తగ్గుతాయట. భారీగా బరువుండే ఏనుగులు సున్నితంగానే తట్టేలా నిపుణులు వీటికి శిక్షణ ఇవ్వడం వల్ల అవి ఎవరికీ హాని చేయకుండా మర్దన చేస్తున్నాయట. దాంతో పర్యటకులు వీటి ద్వారా సేదతీరడానికి బారులు తీరుతున్నారట.


డాల్ఫిన్‌తో మాట కలపాలనీ

సముద్రాల్లో డాల్ఫిన్లు చేసే విన్యాసాలు చూస్తుంటే ఎంతసేపైనా చూడాలనిపిస్తుంటుంది. అయితే కొన్ని జాతులకు చెందిన డాల్ఫిన్లు మనుషులపై దాడి చేసి తీవ్రంగా గాయం చేస్తుంటాయి. కొన్నేమో ప్రేమగా సైగలతో పలకరిస్తుంటాయి. అలాంటివాటితోనే ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు డాక్టర్‌ జానెట్‌ ఫ్లవర్స్‌ రకరకాల థెరపీలు ఇప్పిస్తోంది. గల్ఫ్‌లోని వరల్డ్‌ మెరైన్‌పార్కులో అనుమతులు తీసుకుని మరీ డాల్ఫిన్లకు శిక్షణ ఇచ్చి థెరపీ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ప్రత్యేక అవసరాలున్న చిన్నారులు డాల్ఫిన్లతో స్నేహం చేస్తారు. అవి సైగల ద్వారా వెల్లడించే భావాల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం, నోరు కదపడం వల్ల వారిలో మానసికంగా, శారీరకంగా ఎన్నో లాభాలు కలుగుతాయట. ఈ సంస్థను ఏర్పాటు చేసిన జానెట్‌ కొడుక్కి ఏడేళ్లు వచ్చినా మాటలు రాలేదట. ఒకసారి సముద్ర తీరంలో డాల్ఫిన్‌తో ఆడుకున్న తన కొడుకు వాటి శబ్దాలకు స్పందించడం, బదులివ్వడానికి  ప్రయత్నించడం గమనించిన ఆమె తరచూ వాటితోనే పిల్లాడు ఆడుకునేలా చేయడంతో మాటలు వచ్చాయట. దాంతో వాటిపైన అధ్యయనం చేసిన ఆమె ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు థెరపీ చేసేలా ఓ కోర్సును డిజైన్‌ చేసి తద్వారా మిగతా చిన్నారులకీ ఆ చికిత్స అందిస్తోంది.  


ఆల్కహాల్‌ తీసుకుంటే...

ఆల్కహాల్‌ వల్ల డీఎన్‌ఏ శాశ్వతంగా దెబ్బతింటుందనీ, క్యాన్సర్లు వస్తాయనీ, మెదడు పరిమాణం తగ్గడంతో ఆలోచనాశక్తి క్షీణిస్తుందనీ ఇప్పటికే అనేక పరిశోధనలు చెబుతున్నాయి. అయితే ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ చేసిన తాజా పరిశీలన వీటికి మరింత బలాన్నివ్వడంతోపాటు వయసు మీదపడేలా చేస్తుందనీ నొక్కి చెబుతుంది. ఎందుకంటే- మద్యాన్ని సేవించేవాళ్లలో టెలొమీర్ల పరిమాణం తగ్గిపోతుందని జన్యు పరిశీలనలు స్పష్టం చేస్తున్నాయి. అనేక డీఎన్‌ఏ సీక్వెన్సులతో నిండినవే ఈ టెలొమీర్లు. ఇవి క్రోమోజోమ్‌ల అంచుల్లో టోపీల మాదిరిగా ఉండి వాటిని రక్షిస్తుంటాయి. సాధారణంగా కణ విభజన జరిగినప్పుడల్లా టెలొమీర్ల సైజు కొంచెంకొంచెంగా తగ్గుతుంటుంది. ఆ ప్రభావం కీలకమైన డీఎన్‌ఏమీద పడి, కణ విభజనకు అంతరాయం ఏర్పడటంతో వయసు మీద పడుతుంటుంది. అయితే ఆల్కహాల్‌ తీసుకునేవాళ్లలో మామూలు వాళ్లలోకన్నా టెలొమీర్ల పరిమాణం త్వరగా కుంచించుకుపోతున్నట్లు గుర్తించారు. వారానికి నాలుగు గ్లాసులు తీసుకున్నవాళ్లతో పోలిస్తే 11 గ్లాసుల వైన్‌ తీసుకున్నవాళ్లలో మూడేళ్ల ఆయుఃప్రమాణాన్ని తగ్గించేంతగా టెలొమీర్ల పరిమాణం తగ్గిపోయిందట. కాబట్టి ఆల్కహాల్‌ ఏ మోతాదులో తీసుకున్నా దాని ప్రభావం ఈ టెలొమీర్ల మీద ఉంటుందని హెచ్చరిస్తున్నారు.


ఆ వాసన దోమలకి నచ్చుతుంది!

దోమలు కుట్టడానికి కొన్ని వైరస్‌లూ కారణమే అంటున్నారు కనెక్టికట్‌కు చెందిన పరిశోధకులు. ఉదాహరణకు శరీరంలోకి ప్రవేశించిన డెంగీ, జికా వైరస్‌లు ఎసిటోఫెనోన్‌ అనే రసాయనాన్ని విడుదల చేసే బాసిల్లస్‌ అనే బ్యాక్టీరియా శాతాన్ని చర్మంమీద పెరిగేలా చేస్తున్నాయట. ఆ వాసన నచ్చి వచ్చిన దోమలు ఆ వ్యక్తిని కుట్టడంతో వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి సులభంగా పాకుతుందట. ఈ విషయమై ఎలుకల్లో పరిశీలించగా- వైరస్‌ సోకిన ఎలుకలు మామూలు ఎలుకలకన్నా ఎక్కువగా ఈ రసాయనాన్ని విడుదల చేస్తున్నాయట. అదేవిధంగా, డెంగీ సోకని వాళ్లతో పోలిస్తే సోకిన వ్యక్తుల చంకల నుంచే ఈ ఎసిటోఫెనోన్‌ ఎక్కువగా విడుదలవుతుందట. దీన్నిబట్టి వైరస్‌లే ఈ రకమైన వాసనకు కారణమైన బ్యాక్టీరియా చర్మంమీద పెరిగేలా చేసి దోమల్ని ఆకర్షిస్తున్నాయనీ తద్వారా అవి వ్యాపిస్తున్నాయనీ వివరిస్తున్నారు. దాంతో ఆ వాసనని అరికట్టేందుకు ఐసొట్రెటినోయిన్‌ అనే మందుని చికిత్సలో భాగంగా వాడినప్పుడు-  అందుకు కారణమైన బ్యాక్టీరియా శాతం తగ్గిందట. దాంతో ఈ మందు ద్వారా ఈ వైరల్‌ వ్యాధుల వ్యాప్తిని అడ్డుకోవచ్చు అంటున్నారు.


నిద్రపుచ్చే పరుపు!

ఆధునిక మనిషికి రాత్రింబగళ్లకు తేడా లేకుండా పోయింది. దాంతో పట్టుపరుపుల మీద బలవంతంగా కళ్లు మూసుకున్నా నిద్రరాని స్థితి నెలకొంది. అందుకే మంచంమీద అలా వాలగానే ఇలా నిద్ర ముంచుకొస్తే ఎంత బాగుంటుంది అన్న ఆలోచనతో ఆస్టిన్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌కు చెందిన పరిశోధకులు బయో ఇంజినీరింగ్‌ టెక్నాలజీ ద్వారా ఓ పరుపుని రూపొందించారు. శరీర అంతర్గత ఉష్ణోగ్రత తగ్గడంవల్లే నిద్ర వస్తుందన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకుని తయారుచేసిన ఈ పరుపు- ముందుగా శరీరంలోని కొన్ని భాగాలను వేడెక్కించి అదేసమయంలో అంతర్గత భాగాల్ని చల్లబరచడం ద్వారా త్వరగా నిద్రపోయేలా చేస్తుందట. సాధారణంగా మెడ దగ్గర ఉన్న చర్మమే శరీర ఉష్ణోగ్రతను త్వరగా గ్రహిస్తుంది. కాబట్టి ముందుగా దిండులో అమర్చిన సెన్సర్‌, అక్కడ ఉష్ణోగ్రత పెరిగేలా చేయడంతో పాదాలూ చేతుల్లో రక్తప్రసరణ వేగం పెరుగుతుంది. ఆపై పరుపులోని ఇతర సెన్సర్లు అంతర్గత ఉష్ణోగ్రత తగ్గేలా చేసి నిద్రకు వేళయింది అన్న హెచ్చరిక చేస్తాయి. దాంతో పడుకున్న వెంటనే నిద్రపడుతుంది అంటున్నారు. పడుకోవడానికి గంటా రెండు గంటల ముందు గోరువెచ్చని నీళ్లతో స్నానం చేస్తే మంచి నిద్ర పట్టడానికి కారణం కూడా ఇదేనట.


పండ్లు తినకపోతే చికాకే!

పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలిసిందే. అయితే వాటిని ఎక్కువగా తినేవాళ్లలో మానసిక సమస్యలూ డిప్రెషన్‌ లాంటివి తక్కువగా ఉంటాయని చెబుతున్నారు ఆస్టన్‌ యూనివర్సిటీ నిపుణులు. ఇందుకోసం సదరు నిపుణుల బృందం అస్సలు పండ్లు తినకుండా తరచూ స్నాక్సూ చిప్సూ తినేవాళ్లనీ వాటికి బదులుగా పండ్లని తీసుకునేవాళ్లనీ పోల్చి చూసినప్పుడు- పండ్లు తినని వాళ్లలో ఆందోళన, ఒత్తిడి స్థాయులు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అంతేకాదు, పండ్లు ఎక్కువగా తిన్నవాళ్లలో డిప్రెషన్‌ ఛాయలు ఎక్కడా కనిపించలేదట. అయితే రోజువారీ చేసే పనుల్లో వచ్చే మతిమరుపుకీ పండ్లు తినడానికీ సంబంధం కనిపించలేదట. కానీ పోషక విలువలు తక్కువగా ఉండే స్నాక్స్‌ తినేవాళ్లలో మాత్రం ఏది ఎక్కడ పెట్టామనేది మర్చిపోవడం, నోట్లో ఆడుతున్నట్లే ఉంటుంది కానీ పేరు గుర్తు రాకపోవడం... వంటి సందర్భాలు ఎక్కువగా ఉన్నట్లు మాత్రం గుర్తించారట. ఇది క్రమేణా పెరిగి మానసిక సమస్యలకీ దారితీయవచ్చు అని చెప్పుకొస్తున్నారు పరిశోధకులు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని