Updated : 31 Jul 2022 03:23 IST

బట్టలమ్మే వ్యక్తికి బాడీగార్డ్స్‌

రాజకీయ నాయకులూ, సెలెబ్రిటీలకూ గన్‌లతో బాడీగార్డులుండటం సర్వసాధారణం. అదే ఓ సామాన్యుడికి గార్డ్స్‌ కాపలా కాస్తే... చూడ్డానికి కాస్త ఆశ్చర్యంగా ఉంటుంది. అసలు విషయం ఏంటంటే... ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన రామేశ్వర్‌ రోడ్డుమీద తోపుడు బండిపైన బట్టలు అమ్ముతుంటాడు. పేద కుటుంబానికి చెందిన అతను అలా రోజుకి రెండుమూడొందలు సంపాదిస్తేనే ఇల్లు గడుస్తుంది. అలాంటి రామేశ్వర్‌ని ఏకే47తో ఇద్దరు పోలీసులు కాపలా కాస్తున్నారు. వీఐపీ కాకుండా, నేరం చేయకుండా పోలీస్‌ల పర్యవేక్షణ ఎందుకనే కదా సందేహం... యూపీలోని ఎటా జిల్లాకు చెందిన అతనికి కొంత పొలం ఉంది గానీ, దానికి ఇంకా రిజిస్ట్రేషన్‌ అవ్వలేదు. ఆ పని త్వరగా అయ్యేలా చూడమని ఓ స్థానిక రాజకీయ నాయకుడిని కలిశాడు. ఈ క్రమంలో అనుకోకుండా వారిద్దరి మధ్యా గొడవ జరిగింది. ఆ వివాదం ముదిరి కేసు హైకోర్టు వరకూ వెళ్లింది. కోర్టు ఆవరణలోనే రామేశ్వర్‌ని ఆ రాజకీయనాయకుడు బెదిరించడంతో అతనికి కొంత కాలం భద్రత కల్పించమని ఆదేశించారు న్యాయమూర్తి. అందుకే రామేశ్వర్‌ ఎక్కడుంటే అక్కడ ఇద్దరు పోలీసులు కాపలాగా ఉంటున్నారు. దాంతో చాలామంది రామేశ్వర్‌ దగ్గర ఆగి మరీ సెల్ఫీలు తీసుకుని సామాజిక మాధ్యమాల్లో పెడుతున్నారు. అలా పాపులరైన రామేశ్వర్‌ వద్ద సామాన్యులే కాదు... మిగతావారూ బట్టలుకొని వ్యాపారాన్ని ప్రోత్సహిస్తుండడం కొసమెరుపు.


ఏనుగులకి జువైనల్‌ హోం!

మైనార్టీ తీరని పిల్లలు నేరం చేస్తే... జువైనల్‌ హోమ్‌లో పెడుతుంటారు కదా! తమిళనాడు అటవీ శాఖ అక్కడి ఆనమలై, ముదుమలై టైగర్‌ రిజర్వ్‌ ప్రాంతాల్లో ఇలాంటివాటిని నిర్వహిస్తోంది. ఈ జైలు క్యాంపులో పోలీసుల్లాంటి గుమ్కీ ఏనుగులుంటాయి. చుట్టుపక్కల ఉన్న పాంతాల్లో ఎక్కడైనా ఏనుగులు పంటల్ని నాశనం చేస్తున్నాయని ఫిర్యాదు వస్తే చాలు... అటవీశాఖ సిబ్బంది ఈ గుమ్కీలని తీసుకెళతారు. వాటి సాయంతో నేరం చేసిన ఏనుగుల్ని ‘అరెస్టు’ చేసి ఇక్కడికి తెస్తారు. అలా తెచ్చిన వాటికి అప్పుడప్పుడూ భోజనం పెడుతూ మూడురోజులపాటు చెట్టుబోదెలతో కూడిన ‘సెల్‌’లో ఉంచుతారు. ఆ మూడురోజులూ వాటిని అదుపులో పెట్టడానికి మన జైళ్ళలోలాగే ఇక్కడ కొన్ని ఏనుగులు ‘మ్యాట్రన్‌’లుగా వ్యవహరిస్తాయి! బుద్ధిగా చెప్పిన మాట వినే ఏనుగులకి రోజూ ఉదయం నదీస్నానం చేయించి, ఒళ్ళంతా నూనె పట్టించి, సంకటి, బెల్లంతో మంచి భోజనం పెడతారు. మనుషులతో ఎలా నడుచుకోవాలో మావటీలు శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణ రోజూ రెండు పూటలా మూడునెలల దాకా సాగుతుంది. ఆ తర్వాత వాటిని అడవిలోకి వదిలేస్తారు.


వధూవరుల్లేని పెళ్ళి విందులు

పెళ్ళికి వెళ్ళి బంధుమిత్రుల్ని కలుసుకోవడం ఎంత ముఖ్యమో... కడుపారా విందారగించడమూ అంతే ముఖ్యం చాలా మందికి! బంధువులూ మిత్రులూ ఎంత ఎక్కువగా ఉన్నా ప్రతిసారీ అలాంటి విందుభోజనం దొరుకుతుందా చెప్పండి... అదీ ఆషాఢమాసంలోనైతే అసలే ఉండదాయె. అలాంటివాళ్లకోసమే వధూవరులూ, ఇతర తంతులేమీ లేకుండానే వివాహ భోజనం ఏర్పాటుచేస్తున్నారు ఆ క్యాటరింగ్‌ దంపతులు! చెన్నై నగరంలో బ్రాహ్మణ వివాహాలప్పుడు వడ్డించే శాకాహార భోజనం చాలా ఫేమస్‌. శ్రీరంగం పులిహోర, పప్పూ బీన్సూ వేపుడు, మాడపల్లి పెరుగన్నం, అగ్రహారం పరమాన్నం... ఇలా దాదాపు 30 రకాలు వడ్డిస్తుంటారు. ఆ విందుభోజనాన్నే అందరికీ అందిస్తున్నారు కృష్ణా, సుశీలా దంపతులు. ప్రతివారం చెన్నైలోని ఓ ప్రాంతాన్ని ఎంపికచేసుకుని అక్కడున్న ఓ కల్యాణమంటపంలో ఆదివారాల్లో ఈ విందుభోజనం ఏర్పాటుచేస్తారు. ముందుగానే చుట్టుపక్కలవాళ్ళకి పోస్టర్‌లూ ప్రకటనలతో ఈ విందు విషయం తెలియజేస్తారు. అచ్చంగా పెళ్ళికి చేసినట్టే మంటపాన్నీ అలంకరిస్తారు. వచ్చినవాళ్లని దంపతులిద్దరూ తాంబూలాదులతో ఆహ్వానిస్తారు. భోజనాలయ్యాక చదివింపుల్లాగే డబ్బులు తీసుకుంటారు. ఈ విందులకి భోజనప్రియులు సకుటుంబ సపరివార సమేతంగా వస్తుండటంతో... ఆ పెళ్ళిమంటపాల బయట కొండవీటి చాంతాడంత క్యూలైన్‌లు తప్పడంలేదట..!


తలా... అయస్కాంతమా?

అయస్కాంతం ఇనుముని ఆకర్షించడం ప్రకృతి ధర్మం. మరి, చర్మం ఇనుమును ఆకర్షిస్తే... దాన్నేమనాలి? అసలు అలా జరిగితేనే కదా... దానికో పేరు పెట్టేది అంటారా. అమెరికాకు చెందిన జేమీ కీటోన్‌ చర్మం... కూల్‌డ్రింక్‌ టిన్నుల్నీ, ప్లాస్టిక్‌ డబ్బాల్నీ ఇట్టే ఆకర్షిస్తోంది. చిన్నవయసులోనే ఆ విషయాన్ని గుర్తించిన జేమీ వైద్యుల్ని సంప్రదిస్తే- మిగతా వారితో పోలిస్తే అతని చర్మం 23 శాతం అదనంగా ఆక్సిజన్‌ను గ్రహించడం వల్లనే అలా క్యాన్లను ఆకర్షిస్తోందనీ, అదీ ఒక రకమైన చర్మ సంబంధిత సమస్యనీ తెలిసింది. దాంతో జేమీ తన సమస్యని సానుకూలంగా తీసుకుని వ్యాపారంగా మలచుకున్నాడు. బహిరంగ ప్రదేశాల్లో క్యాన్లను తలకి అతికించుకుని ప్రదర్శనలు ఇస్తూ డబ్బులు సంపాదించడం ప్రారంభించాడు.క్రమంగా శీతలపానీయాల సంస్థలు జేమీని తమ ప్రచారానికి వాడుకోవడం మొదలు పెట్టాయి.అలా వారానికి దాదాపు ఇరవై లక్షల రూపాయలు సంపాదిస్తున్న అతన్ని అందరూ క్యాన్‌పా, క్యాన్‌ మెన్, క్యాన్‌ హెడ్‌ అనే పేర్లతో పిలుస్తుంటారు. అందుకే చాలామంది ‘జేమీది వింత సమస్య కాదు, విలువైన సమస్య’ అంటుంటారు.


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని