Published : 14 Aug 2022 00:34 IST

చెస్‌ నేర్పే పోలీసు స్టేషన్‌

చెన్నైలో మొన్ననే ముగిసిన 44వ ప్రపంచ చెస్‌ ఒలింపియాడ్‌ స్ఫూర్తితో... కేరళ రాజధాని నగరం తిరువనంతపురంలోని కరిమడం కాలనీ పోలీసు స్టేషన్‌ ఒక కొత్తపథకానికి శ్రీకారం చుట్టింది. నేరాలకి పేరుమోసిన కాలనీ అది. తల్లిదండ్రులు నిత్యం ఏదో ఒక నేరంతో పోలీసుస్టేషన్‌ చుట్టూ తిరుగుతూ ఉండటంతో... ఇక్కడి  పిల్లలు బడికి దూరమవుతున్నారు. వారిలో చాలామంది మళ్ళీ నేరస్థులుగా మారుతున్నారు. ఆ వలయాన్ని ఛేదించాలనుకున్న పోలీసులకి చెస్‌ ఒలింపియాడ్‌ కొత్త ఉపాయాన్నిచ్చింది. దాని స్ఫూర్తితో సుమారు 50 మంది పిల్లలకి సాయంత్రాల్లో పోలీసులు చదరంగంలో శిక్షణ అందిస్తున్నారు. ఇందుకోసం ఓ ఎస్సైని కోచ్‌గా నియమించారు. స్టేషన్‌లో ఓ భాగాన్ని పిల్లల్ని ఆకట్టుకునే ఫర్నిచర్‌తో తీర్చిదిద్దారు. ‘చదరంగం వల్ల ఏకాగ్రతా, తార్కిక నైపుణ్యమే కాదు... మంచి నడవడికా నేర్పగలమన్నది మా నమ్మకం. వీళ్లలో ఏ ఒకరిద్దరు ఆటలో రాణించినా సరే... మా ఆశయం నెరవేరినట్టే’ అంటున్నారు... ఈ పోలీసులు.


గుహలో పాడినా... లోకమే ఆడదా!

సముద్రగర్భంలోనూ, ఆకాశంలోనూ కచేరీలు చేయడం గురించి మనం అడపాదడపా వింటూనే ఉంటాం! వీటికి భిన్నంగా దేశంలోనే తొలిసారి ఓ గుహలో గానకచేరీ నిర్వహించారు మేఘాలయలో. ‘ఇదేదో కొత్తగా ఉందే’ అనుకుంటూ... యువతీయువకులు భారీ ఎత్తున తరలివచ్చారు. మేఘాలయలోని ఆర్వా గుహల్లో దీన్ని నిర్వహించారు. ఈ గుహ లోపల వింత ఆకారాల్లో ఉన్న రాళ్లే కాదు... ప్రకృతి రమణీయమైన జలపాతాలూ ఉంటాయి. ఆర్వా గుహల పర్యటనకి దేశ నలుమూలల్లోని యువతని ఆకర్షించాలనే ఆలోచనతో ‘ది గ్రాస్‌ రూట్స్‌ మ్యూజికల్‌ ప్రాజెక్ట్స్‌’ అన్న సంస్థ ఈ కచేరీని ఏర్పాటుచేసింది. ‘సమ్మర్‌సాల్ట్‌’ అన్న యువగాయక బృందం ఇక్కడ పాటలు పాడింది. నిజానికి, ఏ చిన్నమాట మాట్లాడినా చుట్టూ ప్రతిధ్వనించే గుహలో సంగీతవాయిద్యాల సహితంగా పాడి ప్రేక్షకుల్ని మెప్పించడం అంత సులభంకాదు. అయితేనేం- ‘ఎకో’ని కూడా తమ సంగీతంలో భాగంగా మలచుకుని అద్భుతాలే చేసిందట ఈ యువబృందం. అలా గుహలో పాడిన తొలి బృందంగా రికార్డుకెక్కింది!


పెళ్లికొడుకుల మార్కెట్‌!


 

పళ్లూ, కూరగాయలూ, పూలూ, బట్టలూ, నగలూ... తదితరాలు దొరికే మార్కెట్లు మనకి తెలిసినవే. అయితే పెళ్లి కొడుకులకు కూడా ఒక మార్కెట్‌ ఉందని తెలుసా... బిహార్‌లోని మధుబని జిల్లా సౌరత్‌ గ్రామం అందుకు పేరుగాంచింది. దాదాపు 700 ఏళ్లుగా అక్కడ పెళ్లి కొడుకుల సంత జరుగుతోంది. జులై, ఆగస్టునెలల్లో ఒకరోజు ‘సౌరత్‌ సభ’ పేరిట నిర్వహించే ఈ మార్కెట్‌కు పెళ్లికాని ప్రసాద్‌లతోపాటు, చుట్టుపక్కల రాష్ట్రాల వారు కూడా హాజరవుతుంటారు. సౌరత్‌ గ్రామ ప్రజల ఆధ్వర్యంలో జరిగే ఈ సంతకు ఆడపిల్లల తండ్రులూ, అన్నలూ వచ్చి తమ స్తోమతకు తగిన అబ్బాయిని ఎంచుకుని అక్కడే పెద్దల ఆధ్వర్యంలో మాట్లాడుకుని అన్నీ కుదిరాయంటే సంబంధం కలుపుకుంటారు. అందుకు గుర్తుగా పెళ్లికొడుక్కి ఎర్ర కండువా కప్పుతారు. ఒకప్పుడు ఈ మార్కెట్‌కు వేలల్లో హాజరయ్యేవారట. ఇప్పుడు మ్యాట్రిమోని సైట్లూ, పెళ్లిళ్ల పేరయ్యల హవా పెరగడంతో పెద్ద కుటుంబాలవారూ, విద్యావంతులూ ఈ సంతకు రావట్లేదట. రైతులు, చిన్నవృత్తులవారు మాత్రం ఈ సంతలోనే అమ్మాయిలను వెతుక్కుంటున్నారని చెబుతున్నారు సౌరత్‌ గ్రామ ప్రజలు.


శాస్త్రవేత్తకి పూజలు చేస్తారు!

కృష్ణాష్టమి రోజున దేశవ్యాప్తంగా ఎంతోమంది కృష్ణుడిని పూజిస్తారు. అయితే గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు చెందిన బీఎం కామర్స్‌ హైస్కూల్‌లో మాత్రం ఓ బ్రిటిష్‌ శాస్త్రవేత్తని పూజిస్తుంటారు. అవునండీ... మశూచికి టీకా కనిపెట్టి మానవాళికి మహోపకారం చేసిన ఎడ్వర్డ్‌ జెన్నర్‌ని పూజించడం ద్వారా ఆయనకు నివాళులర్పిస్తున్నారు. ఆ రోజునే ఎందుకూ అంటే- అమ్మవారు వచ్చినప్పుడు మనదగ్గర గ్రామదేవతల్ని ఆరాధించినట్లే గుజరాత్‌లో మశూచి రాకుండా రక్షించమని శీతలాదేవిని కొలుస్తారు. అందుకే శ్రావణ బహుళ అష్టమిని శీతలాష్టమి అనీ అంటారు. అయితే రాజ్‌కోట్‌ స్కూలు ఉపాధ్యాయులు మాత్రం మశూచి గురించీ దాన్ని నివారించడానికి వ్యాక్సిన్‌ను తెచ్చిన ఎడ్వర్ట్‌ జెన్నర్‌ గురించీ పిల్లలకు వివరించడానికి ఈ పండగను ఎంచుకున్నారు. ఆ రోజు విద్యార్థులతో జెన్నర్‌కి పుష్పాభిషేకం చేయించి, వ్యాక్సిన్‌ తయారీకి ఆయన పడ్డ కష్టనష్టాలన్నీ వివరిస్తారు. తాజాగా మంకీపాక్స్‌ భయాలు చుట్టుముట్టడంతో దానికి మశూచి టీకానే వాడమనడంతో అది మరోసారి వార్తల్లోకి వచ్చింది. దాంతో ఈసారి శీతలాష్టమి రోజున ఎడ్వర్డ్‌ జెన్నర్‌కి భారీయెత్తున పూజలు చేయాలనుకుంటున్నారు!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని