కోపోద్రేకాల్నే కాకుండా ప్రేమించే స్వభావాన్నీ పెంచే హార్మోన్‌ ఇదీ!

మగవాళ్లలోని లైంగిక హార్మోన్‌ టెస్టోస్టెరాన్‌ వల్లే ఆడవాళ్లకన్నా దూకుడుగా ఉంటారని అంటారు. అయితే ఈ హార్మోన్‌ స్నేహబంధాల్ని పెంచుకునేందుకూ సామాజిక బంధాలు బలపడేందుకూ

Updated : 25 Sep 2022 15:10 IST

కోపోద్రేకాల్నే కాకుండా ప్రేమించే స్వభావాన్నీ పెంచే హార్మోన్‌ ఇదీ!

మగవాళ్లలోని లైంగిక హార్మోన్‌ టెస్టోస్టెరాన్‌ వల్లే ఆడవాళ్లకన్నా దూకుడుగా ఉంటారని అంటారు. అయితే ఈ హార్మోన్‌ స్నేహబంధాల్ని పెంచుకునేందుకూ సామాజిక బంధాలు బలపడేందుకూ కూడా తోడ్పడుతుంది అంటున్నారు ఎమోరీ యూనివర్సిటీ నిపుణులు. సాధారణంగా టెస్టోస్టెరాన్‌ హార్మోన్‌ గొడవలకీ సాహసప్రవృత్తికీ కారణమవుతుందని భావిస్తూ వచ్చారు. తాజా పరిశీలనలో- ఇది ప్రేమకు కారణమైన ఆక్సీటోసిన్‌ స్థాయుల్ని కూడా పెంచుతుందనీ తద్వారా సామాజిక బంధాలు బలపడేందుకూ కారణమవుతుందని గుర్తించారు. ఎలుకల ద్వారా ఈ విషయాన్ని నిర్ధరించుకున్నారు. మగ ఎలుకలు జతకట్టే సమయంలో వేరేవాటిని దగ్గరకు రానీయకుండా దుడుకుగా ఉంటాయి. అదేసమయంలో గర్భం దాల్చిన ఆడవాటిని కౌగిలించుకోవడంతోపాటు ఆ తర్వాత పిల్లల్నీ జాగ్రత్తగా సంరక్షిస్తుంటాయి. ఇది గమనించిన పరిశోధకులు ఆడవాటితో ఉన్న మగవాటికి టెస్టోస్టెరాన్‌ హార్మోన్‌ను ఇంజెక్టు చేశారట. దీనివల్ల వాటిల్లో ప్రేమ తగ్గి కోపంగా మారతాయనుకున్నారు. కానీ ఇందుకు విరుద్ధంగా అవి భాగస్వామిని మరింతగా దగ్గరకు తీసుకున్నాయట. సాధారణ ప్రవర్తనకు భిన్నంగా ఆ సమయంలో ఇతర మగ ఎలుకలతోనూ స్నేహంగా మెలిగాయట. దీన్నిబట్టి ఇంతకాలం భావిస్తున్నట్లుగా- టెస్టోస్టెరాన్‌ హార్మోన్‌ కోపోద్రేకాల్నే కాకుండా ప్రేమించే స్వభావాన్నీ పెంచుతుందని చెబుతున్నారు. అంతేకాదు, ఈ హార్మోన్‌ సందర్భాన్ని బట్టి ప్రేమగానూ దూకుడుగానూ ఉండేందుకూ తోడ్పడుతుంది అంటున్నారు.


మర కీటకాలు

సగం మనిషి- సగం యంత్రం కలిసినట్లుండే సైబర్గ్‌లు వచ్చే రోజు ఎంత దూరంలో ఉందో తెలియదుకానీ మర కీటకాలు మాత్రం త్వరలోనే రానున్నాయి అంటున్నారు రికెన్‌ క్లస్టర్‌ ఫర్‌ పయోనీరింగ్‌ రీసెర్చ్‌కు చెందిన పరిశోధకులు. తమ పరిశోధనలో భాగంగా వీరు సైబర్గ్‌ బొద్దింకల్ని రూపొందించారు. అయితే ఈ సైబర్గ్‌ కీటకాల్ని మాటిమాటికీ ఛార్జ్‌ చేయాలంటే కష్టం కాబట్టి వాటంతటవే ఛార్జయ్యేలానూ రిమోట్‌తో ఆపరేట్‌ చేసేలానూ తయారుచేశారు. ఇందుకోసం మడగాస్కర్‌కు చెందిన ఆరు సెం.మీ. పొడవున్న బొద్దింకల్ని తీసుకుని వీటికి పైభాగంలో అత్యంత పలుచని సౌరఫలకాల్ని ఏర్పాటుచేసి, వైర్‌లెస్‌ కంట్రోల్‌ మాడ్యూల్‌ను బొద్దింక లోపల అమర్చారట. పైగా ఈ పరికరాలన్నింటినీ కీటకాల శరీరానికి అనుగుణంగా సాగేగుణం ఉండేలా తయారుచేయడంతో అవి స్వేచ్ఛగా కదులుతున్నాయి. దాంతో ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని బీటిల్స్‌లోనూ ఎగిరే సికాడా కీటకాల్లోనూ చొప్పించే ఆలోచనలో ఉన్నారట. ఇంతకీ ఈ మర కీటకాలు ఎందుకూ అంటే-  ప్రమాదకర ప్రాంతాలను గుర్తించేందుకూ పర్యావరణాన్ని పర్యవేక్షించేందుకూ ఇవి తోడ్పడతాయి అని చెబుతున్నారు.


అడవిలో నడిస్తే..!

అడవిలో ఓ గంటసేపు నడవడంవల్ల మనసుకి హాయిగా అనిపించడం సహజం. ఆ నడక మెదడులో ఒత్తిడికి కారణమయ్యే భాగాన్ని ప్రభావితం చేస్తుందనీ దానివల్లే హాయిగా అనిపిస్తుందనీ పరిశోధనపూర్వకంగా తేల్చి చెబుతున్నారు మాక్స్‌ ప్లాంక్‌ ఇన్‌స్టిట్యూట్‌కి చెందిన నిపుణులు. కొన్ని దశాబ్దాలుగా చేసిన అధ్యయనాల్లో- నగర, గ్రామీణ వాతావరణాల్లో నివసించే ప్రజల ఆరోగ్యంలో తేడాలు ఉంటున్నట్లు గుర్తించారు. అడవిలో కనీసం ఓ గంట నడిచేవాళ్లలో ఒత్తిడి లేదని తేలిందట. అందుకే పల్లెల్లో నివసించే ప్రజలు ప్రశాంతంగా హాయిగా జీవిస్తున్నారని అంటున్నారు. ఎందుకంటే ప్రకృతి నేరుగా ఒత్తిడిని తగ్గిస్తుందట. దీన్ని తెలుసుకునేందుకు అరవై మంది వ్యక్తుల్లో ఎమ్మారై స్కాన్‌ చేసి, ఒత్తిడికి కారణమైన అమిగ్డాలా పనితీరుని గమనించారట. అందులో- నగరంలో నడిచినప్పుడూ అడవిలో నడిచినప్పడూ దాని పనితీరులో వ్యత్యాసం కనిపించిందట. పచ్చని ప్రకృతిలో నడిచివచ్చాక ఎమ్మారై తీసినప్పుడు- అమిగ్డాలాలో చురుకుదనం తగ్గడంతో ప్రశాంతత నెలకొంది. అదే నగరంలో నడిచిన వాళ్లలో ఈ మెదడు భాగంలో ఎలాంటి మార్పూ కనిపించలేదు. అంటే- ఒత్తిడికి కారణమయ్యే మెదడు చురుకుదనాన్ని తగ్గించే శక్తి ప్రకృతికి ఉందన్నమాట!


ఎ-గ్రూపు వాళ్లకే ప్రమాదం!

జన్యువులకీ గుండెపోటుకీ సంబంధం ఉందని ఇప్పటికే యాభై అధ్యయనాలు తేల్చి చెబుతున్నాయి. అయితే తాజాగా రక్తం గ్రూపు కూడా ఈ హార్ట్‌ స్ట్రోక్‌కు కారణమవుతున్నట్లు చెబుతున్నారు యూనివర్సిటీ ఆఫ్‌ మేరీల్యాండ్‌ నిపుణులు. ఇందుకోసం వీళ్లు అనేక సంవత్సరాలపాటు ఆయా గ్రూపుల రక్తాన్నీ అవి గడ్డకట్టే విధానాన్నీ పరిశీలించి 48 రకాలుగా అధ్యయనం చేశారట. అందులో 18 నుంచి 59 సంవత్సరాల వయసున్న వాళ్లను ఎంపిక చేసి- వాళ్లలో స్ట్రోక్‌కి గురయినవాళ్ల జన్యువుల్నీ ఆరోగ్యంగా ఉన్న వాళ్ల జన్యువుల్నీ విశ్లేషించారట. అందులో- ఓ ప్రత్యేకమైన జన్యువు ఉన్నవాళ్లలో చిన్నవయసులోనే గుండెనొప్పి వచ్చినట్లు గమనించారు. అదేసమయంలో ఆ జన్యువు ఉన్నవాళ్ల రక్తం గ్రూపుని విశ్లేషించి, ఎ- గ్రూపు రక్తం ఉన్నవాళ్లు మిగిలినవాళ్లకన్నా ఎక్కువగా 60 ఏళ్లలోపే స్ట్రోక్‌కు గురయినట్లు గుర్తించారు. అదే అరవై దాటిన వాళ్లలో రక్తం గ్రూపుకీ గుండెనొప్పి వచ్చే ప్రమాదానికీ పెద్ద వ్యత్యాసం కనిపించలేదు. దీన్నిబట్టి చిన్నవయసులో గుండెజబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఎ-గ్రూపు వాళ్లకే అంటున్నారు పరిశీలకులు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..