Published : 27 Aug 2022 23:41 IST

గీతలు వాటంతటవే చెరిగిపోతాయి!

డ్రైవింగ్‌  చేసేటప్పుడు కారుని ఏ గోడకో స్తంభానికో ఢీ కొట్టడంవల్ల గీతలు పడటం సహజం. అవి పోవాలంటే మళ్లీ షోరూమ్‌కి తీసుకెళ్లి పెయింట్‌ లేదా స్ప్రే చేయించాలి. ఇప్పుడా బాధ లేకుండా కేవలం 30 నిమిషాలపాటు ఎండకి ఉంచితే ఆ గీతలు వాటంతటవే చెరిగిపోయే కోటింగ్‌ని కొరియన్‌ శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఈ కొత్త రకం పూతలో ఆక్రిల్‌ పాలియోల్‌ అనే పాలిమర్లు ఉంటాయట. రసాయన బంధంతో ముడిపడిన ఈ పాలిమర్లు అవసరమైనప్పుడు బంధాల నుంచి విడివడి మళ్లీ అంతే సులభంగా కలుసుకుంటాయి. అంటే- కారుకు వేసిన పెయింటింగులోని పాలిమర్లన్నీ గీతలు పడినప్పుడు- తమ అమరికను సరిచేసుకుని మళ్లీ కలిసిపోతాయి. దాంతో గీత కనిపించదు. దీనికి చేయాల్సిందల్లా కారుని మిట్టమధ్యాహ్నం ఎండకి లేదా వేడికి గురిచేయడమేనట. అలా చేయగానే కోటింగ్‌లో వాడిన ఫొటొ థెర్మల్‌ రంగులోని అణువులు పరారుణ కాంతిని గ్రహించి తమ అమరికని సరిచేసుకుంటాయి. అరగంట చాలా ఎక్కువ సమయం అనుకుంటే- భూతద్దం పెట్టి కాంతి నేరుగా గీతలు ఉన్నచోట పడేలా చేస్తే కేవలం అరక్షణంలోనే అవి పోతాయట. ప్రస్తుతం వాడుకలో ఉన్న అకర్బన పెయింటింగులకన్నా, ఈ కొత్త కర్బన ఫొటోథెర్మల్‌ రంగు సమర్థంగా పనిచేస్తుంది. దీనికి పట్టే శక్తీ, సమయం కూడా తక్కువే. అదే మిగిలిన వాటికి ఎక్కువ సమయంతోపాటు హీట్‌ గన్స్‌ లేదా కాన్‌సెంట్రేటెడ్‌ యూవీ లైట్లూ అవసరమవుతాయట.


కృత్రిమ ఆకులతో ఇంధనం!

మొక్కలు ఆకుల ద్వారానే కిరణజన్య సంయోగక్రియ జరుపుకుని ఆహారాన్ని తయారుచేసుకుంటాయన్నది తెలిసిందే. దాన్ని ఆధారంగా చేసుకుని కేంబ్రిడ్జ్‌ పరిశోధకులు కృత్రిమ ఆకుల్ని రూపొందించారు. ఇవి సూర్యరశ్మి నుంచి కాంతిని గ్రహించి, కింది భాగంలో ఉన్న నీటితో ఇంధనాన్ని తయారుచేస్తాయట. గతంలో ఎల్‌ఈడీ లైట్లను అమర్చిన కృత్రిమ ఆకుల ద్వారా హైడ్రోజన్‌ని తయారుచేయగలిగారు. అయితే గతంలో చేసిన కృత్రిమ ఆకులకోసం వాడిన గాజు మందంగా ఉండేది. తాజా పరిశోధనలో- గాజును మరింత పలుచగా చేసి, మెటల్‌ ఆక్సైడ్‌లతో పూత పూయడంతో ఎలాంటి లైట్ల సాయం లేకుండానే, నేరుగా పగటివేళలో కాంతిని ఎక్కువగా గ్రహించి, శక్తిని తయారుచేయగలిగేలా డిజైన్‌ చేశారట. నీళ్లమీద తేలియాడుతున్నట్లుగా ఉండే ఈ ఆకుల్ని కలుషిత నీటి జలాలూ, నౌకాతీరాల్లోనూ పరచడం వల్ల ఇంధన ఉత్పత్తితోపాటు జలకాలుష్యాన్నీ తగ్గించవచ్చు. అంతేకాదు, ఈ కృత్రిమ ఆకుల ద్వారా పంటకాలువల్లోని నీరు ఆవిరైపోకుండానూ ఉంటుంది అని వివరిస్తున్నారు శాస్త్రవేత్తలు.


నైట్రోజన్‌ కూలర్లు!

ఇప్పటివరకూ గదిలోనో హాల్లోనో వాతావరణం చల్లగా ఉండేందుకు ఏసీలూ ఎయిర్‌కూలర్స్‌ మాత్రమే వాడుతున్నాం. మున్ముందు వాటిస్థానంలో లిక్విడ్‌ నైట్రోజన్‌ కూలర్లను వాడుకోవచ్చు అంటున్నారు ఇజ్రాయెల్‌కు చెందిన నిపుణులు. ఎందుకంటే ఆ దేశానికి చెందిన గ్రీన్‌ కినొకొ అనే కంపెనీ తొలిసారిగా ఆరుబయట వాతావరణం చల్లబడేందుకు ఓ పరికరాన్ని తయారుచేసింది. కింషో సిస్టమ్‌గా పిలుస్తోన్న ఇది విద్యుచ్చక్తి లేకుండానే పనిచేస్తుందట. ఈ సిలిండర్లలో -191 సెంటీగ్రేడు ఉష్ణోగ్రత కలిగిన నైట్రోజన్‌ను నింపుతారు. స్విచ్‌ ఆన్‌ చేయగానే అది గాల్లోకి విడుదలై వేగంగా వ్యాపిస్తుంది. దాంతో చుట్టుపక్కల చల్లని వాతావరణం నెలకొంటుందట. ఎయిర్‌కండిషనర్లతో పోలిస్తే ఇది పర్యావరణహితం కూడా. దీనివల్ల వాతావరణంలోకి ఎలాంటి వేడిగాలీ విడుదల కాదు. అదీగాక మన వాతావరణంలో సహజంగానే 78 శాతం నైట్రోజన్‌ ఉంటుంది. కాబట్టి గాల్లో కలిసిన నైట్రోజన్‌ను పీల్చడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదమూ ఉండదట. వాతావరణంలోని వేడిని బట్టి ప్రతి వారం పదిరోజులకీ ఈ ట్యాంకుల్ని నింపుకుంటే చాలు అంటున్నారు. ప్రస్తుతం ఈ కంపెనీ- నమూనాలుగా పన్నెండు కూలర్లే చేసిందట. కానీ ఎంతోమంది అడగటంతో త్వరలోనే మార్కెట్లోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు.


వాతావరణ మార్పులవల్లే!

ఈమధ్య ఎక్కువమంది నిద్రలేమితో బాధపడుతున్నారు. జీవనశైలిలోని మార్పులే ఈ సమస్యకు కారణం అనుకున్నారింతవరకూ. కానీ నిద్రపట్టకపోవడానికి భూగోళం వేడెక్కడమే ప్రధాన కారణం అంటున్నారు కాలిఫోర్నియా యూనివర్సిటీ నిపుణులు. వాతావరణంలోని గాలీ, ఉష్ణోగ్రతలూ నిద్రని బాగా ప్రభావితం చేస్తున్నాయనీ దాంతో ఇన్ఫెక్షన్లూ ఎక్కువగా సోకుతున్నాయనీ కొన్ని రకాల వ్యాక్సినేషన్లు ఎలాంటి ఫలితాన్నీ ఇవ్వకపోవడానికీ ఈ నిద్రలేమే కారణం అనీ తేల్చారు. కొవిడ్‌-19, మంకీపాక్స్‌, లండన్‌, న్యూయార్క్‌ల్లో పోలియోవైరస్‌ మళ్లీ విజృంభించడం... వీటన్నింటికీ వాతావరణంలో మార్పులే కారణం కావచ్చు. అదే సమయంలో ఈ మార్పులు నిద్రకీ భంగం కలిగిస్తున్నాయి. దాంతో రోగనిరోధక వ్యవస్థ గాడి తప్పుతోంది. అందువల్లే ఆ ఇన్ఫెక్షన్లని తట్టుకోలేకపోతున్నారు అని ఇర్విన్‌ బృందం వివరిస్తోంది. ఈ విషయమై వీళ్లు రాత్రిపూట గాల్లో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నివసించే కొన్ని లక్షల మందిని పరిశీలించి మరీ చెబుతున్నారు. వాతావరణ ప్రభావంతో నిద్రలేమికి గురయిన వాళ్లలోనే ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తి తక్కువగా ఉందనీ, దాంతో వాళ్లే ఈ వైరస్‌ల బారిన ఎక్కువగా పడుతున్నారనీ స్పష్టమైందట.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు