విమానాలకు ఇంధనం గాలి నుంచే!

భవిష్యత్తులో విమానాలూ హెలీకాప్టర్లకు అవసరమైన ఇంధనాన్ని సైతం సూర్యకాంతీ, గాలి నుంచే తయారుచేయవచ్చు అంటున్నారు ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ సస్టెయినబిలిటీ స్టడీస్‌కు చెందిన నిపుణులు. దీన్నే కార్బన్‌-న్యూట్రల్‌

Updated : 02 Jan 2022 01:11 IST

విమానాలకు ఇంధనం గాలి నుంచే!

విష్యత్తులో విమానాలూ హెలీకాప్టర్లకు అవసరమైన ఇంధనాన్ని సైతం సూర్యకాంతీ, గాలి నుంచే తయారుచేయవచ్చు అంటున్నారు ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ సస్టెయినబిలిటీ స్టడీస్‌కు చెందిన నిపుణులు. దీన్నే కార్బన్‌-న్యూట్రల్‌ ఇంధనం అని పిలుస్తున్నారు. ఇందుకోసం జ్యురిచ్‌లో ఓ ప్లాంట్‌ను సైతం రూపొందించారు. ఇది గాలి నుంచి నేరుగా కార్బన్‌డైఆక్సైడ్‌నీ నీటినీ గ్రహించి సౌరశక్తితో చర్య పొందడం ద్వారా కిరోసిన్‌, మెథనాల్‌, హైడ్రోకార్బన్లను ఉత్పత్తి చేస్తుందట. ఇలా వచ్చిన కిరోసిన్‌ ప్రస్తుతం వాడే ఏవియేషన్‌ కిరోసిన్‌ లేదా జెట్‌ ఫ్యూయల్‌గానే పనిచేస్తుంది అంటున్నారు. ఈ రకమైన ఇంధనం తయారీకి ఎడారి ప్రాంతాలు చక్కగా సరిపోతాయనీ చెబుతున్నారు. ఇది పూర్తిస్థాయిలో వాడుకలోకి వస్తే చమురు నిల్వలమీద ఆధారపడటం చాలావరకూ తగ్గిపోనుందన్నమాట.


అమ్మమ్మ ఉంటేనే మేలు!

కుటుంబవ్యవస్థలో అమ్మమ్మలూ నానమ్మల పాత్ర కీలకం. పిల్లలు చక్కగా పెరిగేందుకూ వాళ్లే కారణం. అయితే మనుషుల్లోనే కాదు, జిరాఫీల్లోనూ ఈ రకమైన వ్యవస్థ ఉంది అని బ్రిస్టల్‌ యూనివర్సిటీ  పరిశోధకులు అంటున్నారు. జిరాఫీ జీవితకాలం సుమారు 30 సంవత్సరాలు అయితే సంతానోత్పత్తి ఆగిపోయాక ఆడ జిరాఫీలు ఎనిమిది సంవత్సరాలు జీవిస్తాయట. ఆ సమయాన్ని అవి కూతురి లేదా సోదరి పిల్లల్ని పెంచేందుకు కేటాయిస్తున్నాయట. నిజానికి జిరాఫీలకు సామాజిక జీవనం లేదని ఇంతకాలం భావిస్తూ వచ్చారు. మనుషులూ కిల్లర్‌ జాతి తిమింగలాలూ ఏనుగుల్లో మాత్రమే సామూహిక జీవనం కనిపిస్తుందనీ, అవే తోటివాటికి సాయంగా ఉంటాయనీ అనుకున్నారు. కానీ జిరాఫీలూ తమ గుంపులోని ఇతర జిరాఫీలకు తోడుగా ఉంటూ పిల్లల్ని పెంచేందుకు సాయపడుతున్నట్లు గుర్తించారు. ముఖ్యంగా కరవు కాటకాలు సంభవించినప్పుడు- వృద్ధ జిరాఫీలు సమూహంలో ఉంటే- మందలో ఉన్నవన్నీ సురక్షితంగా ఉంటాయట. దీన్నిబట్టి పిల్లల ఆలనాపాలనా అమ్మమ్మలు చూడటం అనేది జంతువుల నుంచే మనుషులకీ వచ్చిందన్నమాట.


అంగారకుడి మీద నీటిజాడలు!

అంగారక గ్రహ వాతావరణం గురించి తెలుసుకోవడానికి ఇప్పటికే అనేక దేశాలు ఎన్నో అంతరిక్ష నౌకల్ని పంపడమూ; అందులో మన ఇస్రో ప్రవేశపెట్టిన మంగళ్‌యాన్‌-1 తొలి ప్రయత్నంలోనే విజయవంతమై అద్భుతమైన చిత్రాలను తీయడమూ తెలిసిందే. అక్కడ మీథేన్‌ వాయు నిక్షేపాలు బయటపడటంతో ఒకప్పుడు అక్కడ జీవం ఉండేది అని పరిశోధకులు నమ్ముతున్నారు కానీ నిర్ధరించుకోలేకపోతున్నారు. తాజాగా ట్రేస్‌ గ్యాస్‌ ఆర్బిటర్‌, ఫైన్‌ రెజల్యూషన్‌ ఎపిథెర్మల్‌ న్యూట్రాన్‌ డిటెక్టర్‌ అనే పరికరం ద్వారా అక్కడి నేలపొరల్లో నీటిజాడలు ఉన్నట్లు కనుగొంది. దీన్నిబట్టి ఒకప్పుడు మహాసముద్రాలు ఉండి ఉంటాయనీ అవన్నీ క్రమేణా ఎడారిగా మారిపోయాయనీ కొన్ని ప్రాంతాల్లో నీటి జాడలు మిగిలి ఉన్నాయనీ విశ్వసిస్తున్నారు. భూమిమీదున్న గ్రాండ్‌ కేన్యన్‌ కన్నా పదిరెట్లు పెద్దగా ఉండే వాలెస్‌ మెరైనెరిస్‌ అనే ప్రాంతంలో ఈ నీటి జాడల్ని గుర్తించారు. అక్కడి నేల పొరలు మన భూవాతావరణాన్నే పోలి ఉన్నాయట. దీన్నిబట్టి పురాణాల్లో పేర్కొన్నట్లు భూమికీ కుజుడికీ ఏదో చుట్టరికం ఉండే ఉంటుందనీ ఏదో ఒకరోజున మళ్లీ మనం అక్కడికి వెళ్లే అవకాశం లేకపోలేదనీ ఊహిస్తున్నారు శాస్త్రనిపుణులు.


చలికాలంలో వెచ్చగా... వేసవిలో చల్లగా..!

వేసవిలో ఎండ వేడినీ చలికాలంలో చలిగాలుల్నీ భరించడం ఎవరికైనా కష్టమే. కానీ ఆ రెండింటినీ తట్టుకునేలా ఇళ్లనీ భవంతుల్నీ నిర్మించుకోవచ్చు అంటున్నారు బెర్కలీ ల్యాబ్‌కు చెందిన ఇంజినీరింగ్‌ నిపుణులు. ఇందుకోసం వీళ్లు వనాడియం డై ఆక్సైడ్‌తో ఓ రూఫ్‌కోటింగ్‌ను రూపొందించారు. దీన్ని భవనం పై భాగంలో పూతలా వేస్తే అది వేసవిలో చల్లగానూ చలికాలంలో వెచ్చగానూ ఉంటుందట. ఇప్పటికే వేసవిలో వేడిని గ్రహించని వైట్‌ పెయింట్లు కొన్ని వాడుకలో ఉన్నాయి. అయితే వాటివల్ల చలికాలంలో ఎలాంటి ఉపయోగమూ ఉండదు. అవి సూర్యకాంతిని వెనక్కి ప్రతిఫలించేలా చేయడంతో వేసవిలోనే కాదు, చలికాలంలోనూ ఇంటిని చల్లగానే ఉంచుతాయి. అదే ఈ కొత్త పదార్థం రేడియో యాక్టివ్‌ కూలింగ్‌ విధానం ద్వారా పనిచేస్తుంది. అంటే- ఇది వాతావరణం నుంచే పరారుణ కాంతిని గ్రహించి, అది తిరిగి ఆకాశంలోకి విడుదలయ్యేలా చేస్తుంది. పైగా చలికాలంలో వాతావరణ ఉష్ణోగ్రతను బట్టి ఆటోమేటిగ్గా ఈ పదార్థం పారదర్శకంగా మారిపోయి వేడిని గ్రహిస్తుంది. అందుకే దీన్ని టెంపరేచర్‌ అడాప్టివ్‌ రేడియో యాక్టివ్‌ కోటింగ్‌ అని పిలుస్తున్నారు. ఈ విషయాన్ని పరిశీలించగా- 30 డిగ్రీల సెల్సియస్‌ కన్నా ఉష్ణోగ్రత పెరిగినప్పుడు అది 90 శాతం సూర్యకాంతిని తిప్పికొట్టింది. ఉష్ణోగ్రత 15 డిగ్రీల కన్నా తక్కువకి పడిపోయినప్పుడు 20 శాతం వేడిని మాత్రమే వాతావరణంలోకి విడుదల చేసిందట. అందుకే ఈ పూతని కిటికీలూ కార్లూ ఎలక్ట్రానిక్‌ పరికరాలూ శాటిలైట్లూ ఇలా అన్నింటికీ వాడే ఆలోచన చేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..