బయో ప్లాస్టిక్‌తో..!

ఎంత వద్దు అనుకుంటున్నా ఎన్ని రకాలుగా నిషేధించినా ప్లాస్టిక్‌ వాడకం రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. అందులోని సౌలభ్యం అలాంటిది. అందుకే అచ్చం దాన్ని పోలిన మరో పదార్థాన్ని రూపొందించారు. అయితే దీన్ని వృథాగా పారేసే చెట్ల కలప,

Published : 31 Jul 2022 00:45 IST

బయో ప్లాస్టిక్‌తో..!

ఎంత వద్దు అనుకుంటున్నా ఎన్ని రకాలుగా నిషేధించినా ప్లాస్టిక్‌ వాడకం రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. అందులోని సౌలభ్యం అలాంటిది. అందుకే అచ్చం దాన్ని పోలిన మరో పదార్థాన్ని రూపొందించారు. అయితే దీన్ని వృథాగా పారేసే చెట్ల కలప, బెరడు నుంచే తయారుచేయడం విశేషం. వీటిని కొన్ని రకాల రసాయనాలతోనూ చక్కెర పదార్థంతోనూ చర్య పొందించడం ద్వారా ఈ కొత్త రకం ప్లాస్టిక్‌ని రూపొందించారట. ఈ రకంగా తయారుచేసిన బయో ప్లాస్టిక్‌ వంద డిగ్రీల సెంటీగ్రేడుని కూడా తట్టుకుంటుందనీ ప్లాస్టిక్‌లానే ఎంతో దృఢంగా ఉంటుందనీ అంటున్నారు ఎక్స్‌ట్రా ప్యాకేజెస్‌ ఫర్‌ ఎంటర్‌ప్రైజ్‌ లినక్స్‌ కంపెనీకి చెందిన శాస్త్రవేత్తలు. దీన్ని ప్యాకింగుల్లోనూ త్రీడీ ప్రింటింగుల్లోనూ దుస్తుల తయారీలోనూ కూడా వాడొచ్చట. ప్రస్తుతం ప్లాస్టిక్‌ రీసైక్లింగ్‌కోసం వాడుతున్న రసాయనాలనే ఇందులోనూ వాడటం వల్ల పర్యావరణానికి కొత్తగా వచ్చే హాని ఏమీ ఉండదనీ పైగా మైక్రో ప్లాస్టిక్స్‌తో పోలిస్తే ఇందులోని చక్కెర అణువులు పర్యావరణానికి అన్ని రకాలుగా మేలనీ అంటున్నారు. ఇప్పటికే అనేక కంపెనీలు ఈ బయోప్లాస్టిక్‌ని తయారుచేసే పనిలో ఉన్నాయట.


హైడ్రోజన్‌.. పొడి రూపంలో!

హైడ్రోజన్‌ ఒక వాయువు అనీ, ఇది ఆక్సిజన్‌తో కలిసి నీరుగా ఏర్పడుతుందనీ, ఇటీవల దీన్ని ఇంధనంగా వాడుతున్నామనీ తెలిసిందే. ఇంధనంగా వాడేందుకు కూడా హైడ్రోజన్‌ను బాగా శీతలీకరించి వాయు రూపంలో లేదా క్రయోజెనిక్‌ లిక్విడ్‌ రూపంలోనూ వాడుతున్నారు. అయితే దీన్ని ఈ రూపంలో నిల్వచేయడానికి ఎంతో యంత్రసామగ్రీ మరెంతో శక్తీ అవసరమవుతాయి. అందుకే తొలిసారిగా వాయు రూపంలోని హైడ్రోజన్‌ను పొడి రూపంలోకి మార్చడం ద్వారా ఆస్ట్రేలియాలోని డియాకిన్‌ యూనివర్సిటీకి చెందిన నానోటెక్నాలజీ పరిశోధకులు సంచలనం సృష్టించారు. ఎందుకంటే- పొడి రూపంలోని హైడ్రోజన్‌ను నిల్వచేయడం, రవాణా చేయడం చాలా సులభం. మెకనొకెమికల్‌ అనే సరికొత్త విధానం ద్వారా వాయువుల్నీ పొడి రూపంలోకి మార్చవచ్చనీ, దీనివల్ల పరిశ్రమలకు ఇంధన ఖర్చు ఎంతో తగ్గుతుందనీ అంటున్నారు. మెకనోకెమిస్ట్రీ... శాస్త్ర ప్రపంచంలో ఓ సరికొత్త విభాగం. అంటే- పదార్థాలను ఏకకాలంలో రసాయన చర్యకీ, యంత్రశక్తికీ గురిచేయడం అన్నమాట. ఇందుకోసం ఓ ప్రత్యేక సిలిండర్‌లో స్టీలు బంతుల్ని ఏర్పాటుచేసి అవి గుండ్రంగా అన్నివైపులకీ తిరిగేలా చేయడం వల్ల లోపల ఉన్న వాయువులమీద పీడనం పెరిగి, ఆ వాయువు పొడి రూపంలోకి మారుతుందట. ఇలా తయారైన పొడిని గది ఉష్ణోగ్రత దగ్గర నిల్వ చేయవచ్చు. దీన్ని అవసరమైనప్పుడు వేడి చేయడం ద్వారా మళ్లీ వాయురూపంలోకీ మార్చుకోవచ్చట. కాబట్టి హైడ్రోజన్‌ను పొడిగా మారిస్తే, ప్రస్తుతం దాన్ని నిల్వ చేస్తున్న పద్ధతులకన్నా తక్కువ ఖర్చు అవుతుంది అంటున్నారు. పైగా పొడి రూపంలోనే వాహనాలకి ఇంధనంగానూ వాడేలా చేయొచ్చు అని వివరిస్తున్నారు సదరు పరిశోధకులు.


కంటిచూపు తగ్గకుండా...

కంటి జబ్బుల సంగతి అలా ఉంచితే, వయసు వచ్చేకొద్దీ మన కంటిచూపు క్రమేణా తగ్గుతుంటుంది. కానీ చాలామందికి వృద్ధాప్యంలో ఇతర అవయవాల పనితీరు తగ్గిపోయినప్పటికీ చూపు మాత్రం స్పష్టంగానే ఉంటుంది. దీనికి కారణం పిగ్మెంట్‌ ఎపిథీలియమ్‌ డిరైవ్డ్‌ ఫ్యాక్టర్‌(పిఈడీఎఫ్‌) అంటున్నారు అమెరికన్‌ నేషనల్‌ ఐ ఇన్‌స్టిట్యూట్‌కి చెందిన పరిశోధకులు. దీన్నే ‘యూత్‌’ ప్రొటీన్‌గా పిలుస్తున్నారు. ఈ ప్రొటీనే ఎప్పటికప్పుడు కంటిచూపునకు సంబంధించిన కణాలను రీసైక్లింగ్‌ ప్రక్రియ ద్వారా మెరుగుపరుస్తుందట. ఈ విషయమై ఎలుకల్లో పరిశీలించినప్పుడు - ఈ యూత్‌ ప్రొటీన్‌ లేని వాటిలో రెటీనా పనితీరు వేగంగా మందగించిందట. రెటీనల్‌ పిగ్మెంట్‌ ఎపిథీలియం నుంచి ఈ ప్రొటీన్‌ ఉత్పత్తి అవుతున్నట్లు గుర్తించారు. అయితే ఈ ప్రొటీన్‌ శాతం వయసు పెరిగేకొద్దీ తగ్గుతుంటుంది. తద్వారా చూపూ కొంత మందగిస్తుంది. దీన్నిబట్టి చూపు బాగా తగ్గినవాళ్లలో జన్యుమార్పుల ద్వారా ఈ ప్రొటీన్‌ను ఉత్పత్తి అయ్యేలా చేస్తే పోయిన చూపుని తెప్పించడమే కాదు, చూపు పోకుండానూ చూడొచ్చన్న దిశగా ఆలోచిస్తున్నారు.


ఆనాటి మంట ఆనవాళ్లనీ గుర్తించొచ్చు!

లక్షల సంవత్సరాల క్రితమే మనిషి నిప్పును కనిపెట్టాడని తెలుసు. కానీ అది ఎప్పుడు అనేది కచ్చితంగా చెప్పలేం. ఆ విషయాన్ని తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు నిరంతరం అన్వేషిస్తూనే ఉన్నారు. కానీ అది అంత తేలిక కాదు. కట్టెల్ని మండించడం ద్వారా వచ్చిన బొగ్గు, నాటి మనుషుల ఎముకలు, పనిముట్లుగా వాడిన రాళ్లు... ఇలా ఎన్నింటినో సరిపోల్చి చూడాలి. తాజాగా వైజ్‌మ్యాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌కు చెందిన నిపుణులు కృత్రిమమేధతో ఆయా పదార్థాలను విశ్లేషించడం ద్వారా సుమారు పది లక్షల సంవత్సరాల క్రితం- ఇజ్రాయెల్‌ దగ్గర ఉన్న ఓ పురాతత్త్వ తవ్వకాల్లో నాటి మనిషి వేసిన మంటని గుర్తించగలిగారు. దీని ఆధారంగా నాటి మనిషి ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు మంట వేయడం నేర్చుకున్నాడో తెలుసుకోవచ్చు అనుకుంటున్నారు. నిజానికి 18 లక్షల సంవత్సరాల క్రితం- వండుకోవడం మొదలుపెట్టే సమయానికి మనిషి పొట్ట చిన్నగానూ మెదడు పెద్దగానూ ఉండేదట. అంటే- మంటని కనిపెట్టాకే మనిషి శరీర నిర్మాణంలోనూ అనేక మార్పులు సంభవించాయని ఊహిస్తున్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు