ఉష్ణోగ్రతతో వైరస్‌ వ్యాప్తి!

రోజురోజుకీ వాతావరణ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. వన్యప్రాణులన్నీ తమ ఆవాసాల్ని మార్చుకుంటూ మనిషికి దగ్గరగా వస్తున్నాయి. ఈ పరిస్థితులన్నీ మరోసారి వైరస్‌ వ్యాప్తికి దారితీయనున్నాయా... అంటే అవుననే చెబుతున్నారు జార్జ్‌టౌన్‌ యూనివర్సిటీ మెడికల్‌ సెంటర్‌కు చెందిన పరిశోధకులు.

Published : 29 May 2022 00:41 IST

ఉష్ణోగ్రతతో వైరస్‌ వ్యాప్తి!

రోజురోజుకీ వాతావరణ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. వన్యప్రాణులన్నీ తమ ఆవాసాల్ని మార్చుకుంటూ మనిషికి దగ్గరగా వస్తున్నాయి. ఈ పరిస్థితులన్నీ మరోసారి వైరస్‌ వ్యాప్తికి దారితీయనున్నాయా... అంటే అవుననే చెబుతున్నారు జార్జ్‌టౌన్‌ యూనివర్సిటీ మెడికల్‌ సెంటర్‌కు చెందిన పరిశోధకులు. మానవాళికి సుదూరంగా నివసించే జంతువులు వాతావరణ మార్పులకి తట్టుకోలేక కొత్త ప్రదేశాలకు చేరుకోవడంతో అక్కడ ఉన్న ఇతర జంతువులకి వేలకొద్దీ కొత్త వైరస్‌లు సోకి వాటి నుంచి అవి మనుషులకీ చేరొచ్చు అంటున్నారు. ముఖ్యంగా వ్యాపారంకోసం వన్యప్రాణుల్ని ఇతర ప్రాంతాలకు తరలించడం వల్ల ఇప్పటికే ఎన్నో ప్రమాదాలను తెచ్చిపెట్టుకుంటున్నాం. జీవావరణంలో ఏ జంతువులు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. కానీ వాటిని అన్నింటినీ ఒకేచోట చేర్చితే కొత్త  వైరస్‌లు పుట్టుకురావడమే కాదు, ఒకదాని నుంచి మరొకదానికి వ్యాపించి, క్రమేణా మనుషులకీ సోకుతాయి. సార్స్‌, ఎబోలా, కరోనా, జికా వైరస్‌.. ఇవన్నీ అలా వచ్చినవే. ఉదాహరణకు గబ్బిలాలకే పరిమితమైన సార్స్‌ సివెట్‌లకు చేరి అక్కడి నుంచే మనిషికీ వచ్చింది. తాజా ఉష్ణోగ్రతల పెరుగుదలతో పరిస్థితి మరింత విషమిస్తుంది అంటున్నారు. ఇప్పటికే ఒక రకం గబ్బిలాలు వేడి తట్టుకోలేక ఇతర ప్రాంతాలకి తరలి వెళ్లడంతో వాటినుంచి ఆ వైరస్‌లు ఆ ప్రాంతంలోని జంతువులకి వ్యాపించే ప్రమాదం ఉందట. కాబట్టి దీన్ని అరికట్టాలంటే ఉన్న అడవుల్ని కొట్టకుండా వాటిని మరింతగా పెంచాలనీ వ్యాపార ఉత్పత్తులకోసం వన్యప్రాణుల్ని చంపడం మానాలనీ చెబుతున్నారు పర్యావరణ నిపుణులు.


పాత టైర్లతో కాంక్రీటు!


రోడ్లు, భవన నిర్మాణ రంగంలో కాంక్రీటు అవసరం తెలిసిందే. అయితే మున్ముందు కాంక్రీటులో ఇసుకకి బదులుగా వాడి పారేసిన టైర్లనీ వాడనున్నారు. దీన్నే క్రంబ్‌ రబ్బర్‌ కాంక్రీట్‌గా పిలుస్తున్నారు. దీనికోసం టైర్లను రేణువులుగా అచ్చం ఇసుక మాదిరిగా చేస్తారట. ఆపై దీనికి మరికాస్త ఇసుక, సిమెంట్‌, నీళ్లు చేర్చి కాంక్రీటులా కలుపుతారు. పర్యావరణ పరిరక్షణ కోసమే ఈ పద్ధతిని రూపొందించినప్పటికీ ఈ రకమైన కాంక్రీటు దృఢంగానూ వేడిని తట్టుకునేలానూ ఉంటుందని ధృవీకరించారు సౌత్‌ ఆస్ట్రేలియా, మెల్‌బోర్న్‌లోని ఆర్‌ఎమ్‌ఐటి యూనివర్సిటీ నిపుణులు. ఇప్పటికే రోడ్డు నిర్మాణంలో ఈ రబ్బరు కాంక్రీటుని వాడారట. నివాస భవనాలకీ ఈ రకమైన కాంక్రీటుని వాడినప్పుడు అవీ దృఢంగా ఉన్నట్లు గుర్తించారు. నాలుగేళ్ల క్రితం సంప్రదాయ కాంక్రీటుతో కొన్ని ఇళ్లనీ టైర్లతో చేసిన కాంక్రీటుతో మరికొన్ని ఇళ్లనీ కట్టి పరిశీలించగా రెండింటిలో క్రంబ్‌ రబ్బర్‌ కాంక్రీటుతో కట్టినదే పటిష్ఠంగా ఉందట. ఈ కాంక్రీటు తేలికగా ఉండటంతోపాటు ఇన్సులేషన్‌ గుణాన్నీ కలిగి ఉందట. పైగా రబ్బరు కాంక్రీటుతో పనిచేయడమే సులభంగా ఉందని కాంట్రాక్టర్లూ చెప్పారట. సో, ఇకనుంచి పర్యావరణానికి నష్టం లేకుండా పాతటైర్లనీ హాయిగా వాడుకోవచ్చన్నమాట.


మెదడు చార్ట్‌!

ఒక మనిషి మెదడు పుట్టినప్పటినుంచి చనిపోయేవరకూ దశలవారీగా ఎలా మారుతుందీ అన్నదాన్ని ఎమ్మారై స్కాన్‌ చార్ట్‌ ద్వారా తొలిసారిగా గుర్తించారట. ఇందుకోసం సుమారు లక్షా 24 వేల ఎమ్మారై స్కాన్‌లను పరిశీలించి ఓ చార్ట్‌ను రూపొందించారట. జీవితకాలంలో మనిషి మెదడులో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. కానీ అది ఏ వయసులో ఎలా ఉంటుందనే విషయం తెలుసుకు నేందుకు వైద్యులకు కచ్చితమైన నమూనా లేదు. ఆ కారణంతోనే కేంబ్రిడ్జి, పెన్సిల్వేనియా యూనివర్సిటీలకు చెందిన పరిశోధకులు ప్రపంచ నిపుణులతో కలిసి సుమారు లక్షమందిని పరిశీలించి మరీ ఈ చార్ట్‌ను తయారుచేశారు. వారిలో 14వారాల నవజాత శిశువు నుంచి వందేళ్ల వయసు వారి వరకూ ఉన్నారు. దీని ఆధారంగా- గ్రే మ్యాటర్‌ పరిమాణం ఆరేళ్లకి తార స్థాయికి చేరుకుంటుందనీ వైట్‌ మ్యాటర్‌ మాత్రం 29 ఏళ్ల వరకూ పెరుగుతుందనీ గుర్తించారు. యాభై ఏళ్ల వయసులో వైట్‌ మ్యాటర్‌ తగ్గడం మొదలైనట్లూ గమనించారు. మొత్తమ్మీద మెదడులో సంభవించే ఆకస్మిక మార్పుల్నీ తద్వారా వచ్చే సమస్యల్నీ గుర్తించేందుకు ఈ చార్ట్‌ ఉపయోగపడనుందని భావిస్తున్నారు.


రాత్రిపూటా సౌరశక్తి!

సౌరశక్తిని ఇంతవరకూ పగటివేళలోనే గ్రహించగలుగుతున్నాం. అయితే  థర్మల్‌రేడియేషన్‌ ద్వారా రాత్రివేళలోనూ విద్యుచ్ఛక్తిని తయారుచేయవచ్చని అంటున్నారు సిడ్నీలోని స్కూల్‌ ఆఫ్‌ ఫొటోవొల్టాయిక్‌ అండ్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ ఇంజినీరింగ్‌ నిపుణులు. చీకటిలో చూడగలిగే గాగుల్స్‌లో వాడిన థర్మో రేడియేటివ్‌ డయోడ్‌ల ద్వారా ఇది సాధ్యమేనట. అదెలా అంటే- పగటివేళలో సోలార్‌ ప్యానెల్స్‌ వేడిని గ్రహించినట్లే, ఈ డయోడ్‌లు రాత్రివేళలో వాతావరణంలోని చల్లదనాన్ని గ్రహించి దాన్ని విద్యుచ్ఛక్తిగా మారుస్తాయట. అయితే పగలు గ్రహించే సౌరశక్తితో పోలిస్తే ఇది తక్కువే కావచ్చు. కానీ ఈ రకమైన టెక్నాలజీ మున్ముందు మరెన్నో  ఆవిష్కరణలకి ఉపయోగపడనుంది అంటున్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..