Updated : 27 Nov 2022 03:45 IST

దానిమ్మ పండింది... ధనవంతుల్ని చేసింది..!

ఏ ఊళ్లో అయినా రైతు సంపన్నుల జాబితా లెక్కేస్తే... పదీ ఇరవైకి మించదు. కానీ మహారాష్ట్రలోని సోలాపుర్‌ జిల్లాలోని ‘అజనాలే’ గ్రామంలో మాత్రం అందరూ లక్షాధికారులే ఉంటారు. విలాసవంతమైన ఇళ్లు కట్టుకుని కార్లలో తిరుగుతుంటారు. ఆ సిరిసంపదలకు కారణం ఏమిటని అడిగితే... ‘అదిగో...’ అంటూ ఇంటి చుట్టూ ఉన్న దానిమ్మతోటను చూపిస్తారు. ఆ కథేంటో తెలుసుకోవాలంటే..!

దేశవ్యాప్తంగా దానిమ్మ సాగు చాలాచోట్ల ఉంది. కానీ సాంగోలే సమీపంలోని అజనాలే గ్రామీణులకి దానిమ్మ చెట్టే కల్పవృక్షం. అందుకే గ్రామ ద్వారం నుంచి ఇళ్ల పైకప్పుమీద వరకూ- అంతటా దానిమ్మకాయ బొమ్మ కనిపిస్తుంటుంది. దాదాపు ఐదువేలమంది జనాభా ఉన్న అజనాలే గ్రామంలోకి అడుగుపెడితే- అక్కడో ఇల్లూ ఇక్కడో ఇల్లూ ఉండి ఆ ఇంటి చుట్టూ దానిమ్మ తోటా దాని చెంతనే నీళ్లతో నిండిన కుంటలూ కనిపిస్తాయి. ఆ ఇల్లు కూడా సకల సదుపాయాలతోనూ ఖరీదైన ఫర్నిచర్‌తోనూ ఉంటుంది. ఈ రకమైన ఇళ్లు రెండు వందలకు పైగా కనిపిస్తాయి. ఎందుకంటే- ఈ ఊళ్లోని రైతులంతా సంపన్నులే. ఒక్కో రైతు టర్నోవర్‌ ఎనభై లక్షల రూపాయలకు పైమాటేనట. ఇదెలా సాధ్యం అని అడిగితే ‘దానిమ్మ పంటకు ముందూ... ఆ తరవాతా...’ అంటూ చెప్పుకొస్తారు. అయితే ఈ స్థాయికి చేరుకోవడానికి వాళ్లెంతో శ్రమించారు. పైసా పైసా కూడబెట్టినట్లుగా ఒక్కో నీటి బిందువునీ ఒడిసిపట్టుకున్నారు.

గొర్రెల కాపరులే..!

ఒకప్పడు అజనాలేలో గొర్రెల కాపరులే ఎక్కువ. వ్యవసాయం సంగతి దేవుడెరుగు... తాగడానికీ చుక్క నీరు ఉండేది కాదు. వానాకాలంలో కురిసే వర్షమే ఆధారం. బావులన్నీ ఎండిపోయి ఉండేవి. 500 అడుగులకు బోరు తవ్వినా నీళ్లు పడేవి కావు. పొట్ట నింపుకోవడం కోసం చుట్టుపక్కల ఊళ్లకి పనికి వెళ్లాల్సిందే. కూలి రూపాయి డెబ్భై పైసలు. ఆనాటి గడ్డు పరిస్థితే వాళ్ల తలరాతల్ని మార్చిందనుకోవాలి... 1972లో దేశంలో వర్షాభావంతో తీవ్రమైన కరవు నెలకొనడంతో భారత ప్రభుత్వం ‘కృషి పండరి’ స్కీమ్‌ కింద కొన్ని గ్రామాల్ని ఎంపిక చేసింది. నీటిని నిల్వచేసి, సాగుకి సాయపడటమే ఈ పథకం ఉద్దేశం. అందులో భాగంగానే నీళ్లన్నీ ఒకచోటుకి వచ్చేలా చెరువుల్ని పోలిన కుంటల్ని కట్టించింది ప్రభుత్వం టిపైకప్పు నుంచి జారే నీటినీ ఒడిసిపట్టేలా రీఛార్జ్‌ షాఫ్ట్‌ల్నీ నిర్మించింది. అది చూసి స్థానికులూ ముందుకు వచ్చి వర్షపునీటిలో చుక్క కూడా వృథా కాకుండా, భూగర్భజలం అడుగంటకుండా స్వయంగా కుంటల్ని తవ్వుకున్నారట. ఊళ్లో ఎవరూ కూడా మరీ లోతుకంటా బోరు వేయకుండా జాగ్రత్తపడ్డారట. కాస్త నీటిని జమ చేసుకున్నాక... 1980లలో ఇద్దరు ముగ్గురు రైతులు దానిమ్మ సాగును ప్రారంభించారట. వాళ్లకి లాభాలు రావడంతో మిగిలినవాళ్లంతా అదే బాట పట్టారు. అయితే నిల్వ చేసుకున్న నీరు మొక్కలకు సరిపోదని గ్రహించి బిందు సేద్యంతో పండించసాగారు. అలా 1994 నాటికి గ్రామంలో సగం మంది రైతులుగా మారి దానిమ్మతోట వేశారు. నీళ్ల విలువ తెలిసి రావడంతో పొలంలో ఒకటికి రెండు చొప్పున కుంటల్ని నిర్మించుకున్నారు. అందుకే దేశంలోనే మరెక్కడా లేని రీతిలో ఏడు వందలకు పైగా కుంటలున్నాయక్కడ. ఒక్కో కుంటలో 300 లీటర్లకు పైగా నీరు నిల్వ ఉంటుంది. ఊళ్లో మొత్తం పది వేల ఎకరాలు ఉంటే- ఎనిమిది వేల ఎకరాల్లో దానిమ్మ పండుతోంది. భూమిలేనివాళ్లు ఆ తోటల్లోనే పనిచేస్తారు. ఆ విధంగా దానిమ్మ పంట... వాళ్ల జీవితాల్నే మార్చింది.

ఆ ఊరి రైతులు వేరే ఏ ఊరికీ వెళ్లి తమ పంటను అమ్మరు. అక్కడ పండే నాణ్యమైన దానిమ్మకోసం దేశవ్యాప్తంగా ఉన్న వ్యాపారులే అజనాలేకి వచ్చి మరీ కొనుక్కుని విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. దాంతో ఆ ఊరే ఓ ఉపాధి కేంద్రంగానూ మారింది. ఒక్క రైతు ఆత్మహత్య కూడా లేని గ్రామంగానే కాదు, ‘కాలిఫోర్నియా ఆఫ్‌ మహారాష్ట్ర’గానూ పేరొందిన సంపన్న గ్రామం ఇది. శుభ్రత, తాగునీరు, ఆధునిక వ్యవసాయ పద్ధతులు, ప్రాథమిక ఆరోగ్యం, ప్రభుత్వ పథకాల అమలు... వంటి వాటితో 1997లో ఆదర్శగ్రామంగానూ అవార్డుని సొంతం చేసుకుంది. ‘నీటిని సంరక్షించు... సుసంపన్నంగా జీవించు...’ అన్నది ఈ గ్రామానికి చక్కగా సరిపోతుంది. అందుకే నీటి వసతి లేక కరవుతో అల్లాడే ఎన్నో గ్రామాలకు అజనాలే స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ఇంకా..