సాంకేతికత... సమాజం కోసం!

విదేశాల్లో రహదారుల నిర్మాణాలకి అత్యాధునిక టెక్నాలజీ వాడుతున్నారు... దాన్ని మన దగ్గర పబ్లిక్‌ రోడ్లకీ ఎందుకు ఉపయోగించకూడదని ప్రశ్నించుకుంది ఓ సంస్థ. హైడ్రోపోనిక్స్‌... సాగుపద్ధతిలో ఇదో విప్లవం. దాన్ని సామాన్య రైతులకీ చేరువచేయాలనుకుంది మరో సంస్థ.

Published : 06 Nov 2022 00:02 IST

సాంకేతికత... సమాజం కోసం!

విదేశాల్లో రహదారుల నిర్మాణాలకి అత్యాధునిక టెక్నాలజీ వాడుతున్నారు... దాన్ని మన దగ్గర పబ్లిక్‌ రోడ్లకీ ఎందుకు ఉపయోగించకూడదని ప్రశ్నించుకుంది ఓ సంస్థ. హైడ్రోపోనిక్స్‌... సాగుపద్ధతిలో ఇదో విప్లవం. దాన్ని సామాన్య రైతులకీ చేరువచేయాలనుకుంది మరో సంస్థ. అరవైపైబడ్డ వాళ్ళకి స్మార్ట్‌ఫోన్స్‌ వాడకంపైన ఓ పాఠశాలనే నిర్వహిస్తోంది మరో స్టార్టప్‌! సాంకేతికతని సామాజిక అవసరాలకి సమర్థంగా వాడుతున్న ఆ మూడు సంస్థల పరిచయమిది...


సామాన్య రైతులకూ హైడ్రోపోనిక్స్‌!

ఆహారపంటల పోషకవిలువలు ఏమాత్రం తగ్గకుండా, కాలుష్య రహితంగా, కూలీల ఖర్చు లేకుండా నీటితో సాగుచేసే విధానమే ‘హైడ్రోపోనిక్స్‌’. ఈ పద్ధతి మనదేశంలో దశాబ్దకాలం నుంచీ ఉన్నా... సామాన్య రైతులందరికీ చేరువకాలేదు. దానికి కారణమేంటో పరిశోధించి, వాటి ఫలితాలని సన్నకారు రైతులకి అందిస్తున్నాడు గౌరవ్‌ నారంగ్‌... ‘సిటీగ్రీన్స్‌’ అన్న తన స్టార్టప్‌తో. అలా దేశవ్యాప్తంగా ఐదువేల మంది రైతుల్ని లాభాలబాట పట్టించాడు. ఈ విధానంలో కేవలం ఆకుకూరల్ని మాత్రమే పండించగలమన్న భావనని మార్చి... ఇతర కూరగాయల్నీ పెంచడం ఎలాగో నేర్పుతున్నాడు. కోల్‌కతా ఐఐఎం-లో చదువుకున్న గౌరవ్‌ మొదట ఓ ఫార్మా సంస్థలో పనిచేస్తుండేవాడు. మందులతోకన్నా, తినే ఆహారం శుభ్రంగా ఉంటేనే నిండైన ఆరోగ్యం సొంతమవుతుందని నమ్మి... సాగుపైన దృష్టిసారించాడు. అందులోనూ హైడ్రోపోనిక్స్‌ మార్గాన్ని ఎంచుకున్నాడు. అందరిలాగే ఆరంభంలో ఎన్నో సమస్యలూ, ఇబ్బందులూ ఎదుర్కొన్నాడు. తనకే ఇలా ఉంటే... చదువులేని రైతుల పరిస్థితేమిటన్న ఆలోచనతో వాళ్ళకి సహకరించడం ప్రారంభించాడు. కొంత రుసుము తీసుకుని... రైతుల గ్రామంలోనే రెండువారాలుండి హైడ్రోపోనిక్స్‌ పంటని వేసి వస్తాడు. నీటి సరఫరా నియంత్రణకి కావాల్సిన మోటార్లని బిగించి... వాటిని ‘ఆప్‌’ సాయంతో ఎలా నడపాలో నేర్పిస్తాడు. మధ్యలో ఏ సమస్య వచ్చినా తీరుస్తాడు. అంతేకాదు, హైదరాబాద్‌ సహా నగరాల్లో పెరటితోటల్ని వేసుకుంటున్నవాళ్ళకి ‘హైడ్రోపోనిక్స్‌’ సాగుని పరిచయం చేస్తున్నాడు గౌరవ్‌.


అత్యాధునిక రోడ్లు... అతి చవగ్గా!

ప్రతాప్‌ భీమసేన రావు... అమెరికాలోని హార్వర్డ్‌లో పీహెచ్‌డీ చేసినవాడు. కంప్యూటర్లు తయారుచేసే హెచ్‌పీ సంస్థలో వైస్‌ ప్రెసిడెంట్‌గా బెంగళూరు వచ్చాడు. అక్కడో రోజు వాళ్ళ ఫ్రెండ్‌ కూతురు అరుంధతి స్కూటర్‌ ప్రమాదంలో చనిపోయింది. రోడ్డుమీది గుంతల కారణంగానే తను ప్రమాదానికి గురైందని తేలింది. అప్పటి నుంచి... రహదారి గుంతల్ని పూడ్చడం మొదలుపెట్టాడు ప్రతాప్‌. వెయ్యిరోడ్లని అలా సమూలంగా మార్చేసిన అతణ్ణి ‘పాట్‌హోల్‌ రాజా’ అని ముద్దుగా పిలవడం మొదలుపెట్టారు బెంగళూరువాసులు. ఆ పేరుతోనే స్నేహితుడు సౌరభ్‌కుమార్‌తో కలిసి సోషల్‌ స్టార్టప్‌ని ప్రారంభించాడు ప్రతాప్‌. విదేశీ టెక్నాలజీ స్ఫూర్తితో కేవలం 15 నిమిషాల్లో రోడ్డుమీది గుంతల్ని పూడ్చే సరికొత్త యంత్రాల్ని డిజైన్‌ చేశారు. ప్లాస్టిక్‌ వ్యర్థాలతో ‘గ్రిడ్‌మ్యాట్స్‌’ అనే పొడవైన ‘ప్లాస్టిక్‌ షీట్ల’ని కనిపెట్టి... దానికి పేటెంట్‌ కూడా తీసుకున్నారు. తేనెతుట్టె గడుల ఆకారంలో ఉండే ఈ గట్టి షీట్లని... రోడ్డు నిర్మాణంలో రాళ్లూ, ఇనుమూ, తారుకి బదులుగా వాడుతున్నారు. వీటితో 30 శాతం తక్కువ ఖర్చులోనే రోడ్లని వేయొచ్చట. గురుగ్రామ్‌లోని మారుతీ సుజుకీ వంటి పలు కార్పొరేట్‌ కంపెనీలు ఈ ‘గ్రిడ్‌మ్యాట్‌’ రోడ్లనే ఏర్పాటుచేసుకున్నాయి. కొన్ని కార్పొరేట్‌ కంపెనీల సహకారంతో పలు చోట్ల ఉచితంగానే ఇలాంటి రోడ్లని నిర్మించి ఇస్తోంది పాట్‌హోల్‌ రాజా సంస్థ! ఇటీవలే ‘హ్యుందాయ్‌’ సంస్థ సాయంతో కేరళలోనూ రోడ్లు వేయించింది.


ఇది వయోజన ‘టెక్‌’ విద్య!

నీలమ్‌ వాళ్ళ నాన్న ఆ రోజు తన స్నేహితుడి ఇంటికి కారులో వెళుతున్నాడు. మధ్యలో నీలమ్‌కి ఫోన్‌ చేసి ‘నా ఫ్రెండ్‌ గూగుల్‌ మ్యాప్‌ లింక్‌ పంపాడమ్మా! దాన్ని ఎలా వాడాలో తెలియట్లేదు... అర్ధగంట నుంచీ ఇక్కడే తిరుగుతున్నాం!’ అన్నాడు. దాన్ని ఎలా వాడాలో వివరించి... ఆయన్ని గమ్యం చేర్చడానికి పావుగంట పట్టిందట నీలమ్‌కి. ఆ అనుభవం తనని ఆలోచనలో పడేసింది. ప్రస్తుతం అరవైలు దాటిన ఎంతోమంది దగ్గర స్మార్ట్‌ఫోన్స్‌ ఉన్నా వాటిని ఎలా వాడాలో వాళ్ళకి తెలియడంలేదు. సైబర్‌ నేరగాళ్లూ వీళ్లని చాలాసార్లు లక్ష్యంగా చేసుకుంటున్నారు. ‘అలాంటివాళ్ళకి స్మార్ట్‌ఫోన్‌ వాడకాన్ని నేర్పిస్తే ఎలా ఉంటుంది?’ అన్న ఆలోచన వచ్చింది నీలమ్‌కి. తన ఆలోచనను స్నేహితురాలు పింకీతో పంచుకుంది. ఇద్దరూ కలిసి ‘మొబైల్‌ పాఠశాల’ పేరుతో కోల్‌కతాలో ఓ స్కూల్‌ ప్రారంభించారు. కొద్దినెలల్లోనే నాలుగుబ్యాచ్‌ల్లో వందమంది రావడం మొదలుపెట్టారు కానీ... కరోనా లాక్‌డౌన్‌తో ఆ పాఠశాల ఆగిపోయింది. దాంతో ఆన్‌లైన్‌ మార్గాన్ని ఎంచుకున్నారు. ఇందుకోసం అతిసులువైన ఆప్‌ని రూపొందించారు. వాట్సాప్‌లో డీపీ పెట్టడం, ఫొటోకి ఎఫెక్ట్‌ ఇచ్చి షేర్‌ చేయడం దగ్గర్నుంచి... మొబైల్‌ బ్యాంకుల నిర్వహణ దాకా సమస్తం ఇందులో నేర్పిస్తున్నారు నీలమ్‌, పింకీలు. ఈ మధ్యే దేశనలుమూలల నుంచి ఐదువేలమంది సబ్‌స్క్రైబర్‌ల మైలురాయినీ దాటింది వీళ్ల ‘మొబైల్‌ పాఠశాల’ ఆప్‌!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..