ఫోనుకూ బంగారు మెరుపులు!

ఎప్పుడూ చేతిలో ఉండే ఫోన్‌కి ఫ్యాషన్‌ లుక్కును తీసుకొస్తూ రకరకాల ఫోన్‌కవర్లు వేసుకోవడం మామూలే. ఇప్పుడు కొంతమంది ఇంకో అడుగు ముందుకేసి ఫోన్‌కే బంగారు తొడుగులూ పెట్టేస్తున్నారు.

Published : 09 Oct 2022 00:00 IST

ఫోనుకూ బంగారు మెరుపులు!

ఎప్పుడూ చేతిలో ఉండే ఫోన్‌కి ఫ్యాషన్‌ లుక్కును తీసుకొస్తూ రకరకాల ఫోన్‌కవర్లు వేసుకోవడం మామూలే. ఇప్పుడు కొంతమంది ఇంకో అడుగు ముందుకేసి ఫోన్‌కే బంగారు తొడుగులూ పెట్టేస్తున్నారు. అలాంటివారి ఆసక్తిని దృష్టిలో పెట్టుకునే తయారీదారులు- ఎన్నో రకాల ‘24 క్యారట్‌ గోల్డ్‌ ప్లేటెడ్‌ స్టిక్కర్స్‌’ తీసుకొస్తున్నారు. వేంకటేశ్వరస్వామి, శివపార్వతులు, శ్రీకృష్ణుడు... ఇలా దేవతా మూర్తులతోనూ ఈ స్టిక్కర్లు చేస్తున్నారు. వీటితోపాటు ఫోన్‌ అంతటికీ సరిపోయేలా వేరు వేరు డిజైన్లలో బంగారు ఫాయిల్‌ ఫోన్‌కవర్లూ అందుబాటులో ఉన్నాయి. ఉన్నవాటిలో కావాల్సింది ఎంచుకోవచ్చు, లేదంటే మనకు నచ్చింది తయారుచేయించుకోవచ్చు. అందరిలో కాస్త వైవిధ్యంగా ఉండాలనుకునేవారికి ఈ పసిడి కాంతుల ఫోన్‌ స్టిక్కర్లు తప్పకుండా నచ్చేస్తాయి!


లెక్కలు నేర్పించే ఆటబొమ్మ!

అప్పుడప్పుడే లెక్కలు నేర్చుకుంటున్న చిన్నారులకు మొదట్లోనే వాటిమీద భయం లేకుండా చూడాలి. అందుకే వీలున్నప్పుడల్లా అంకెలూ, తీసివేతలూ, కూడికలూ... అన్నీ వాళ్లకు అర్థమయ్యేలా ఒక్కోటి నిదానంగా నేర్పించాలి. కానీ పుస్తకమూ, పెన్నూ పట్టుకుని అస్తమానం కూర్చోమంటే పిల్లలు వినరు కదా. ఈ సమస్యకు పరిష్కారం కావాలంటే ‘చిల్‌హోల్డి లెర్నింగ్‌ టాయ్స్‌ మ్యాథ్‌ టాయ్‌’ని కొనండి. దీంట్లో విడివిడిగా అయస్కాంత బిళ్లలు వస్తాయి. రంగురంగుల్లో ఉండే వీటిమీద అంకెలూ, రకరకాల గణిత సంకేతాలూ ఉంటాయి. పెన్ను పట్టుకుని చేయాల్సిన లెక్కలన్నీ సులువుగా ఈ బిళ్లల్ని ఒకదానిపక్కన ఒకటి చేర్చుతూ చేసేయొచ్చు. అంతేకాదు... ఈ ఆట బొమ్మతో పిల్లలు ఎంచక్కా ఆడుతూనే ఎక్కాలూ కంఠతా పట్టేయొచ్చు.


గోడలూ వెలుగుతాయి!

కాస్త దూరం నుంచి చూస్తే ‘గోడ మీద ఏ ఆధారం లేకుండా ల్యాంప్‌ ఎలా ఉందబ్బా’ అనిపించేలా ఉంటుందా... దగ్గరకు వెళ్లాక మాత్రం అసలు విషయం అర్థం అవుతుంది. అది ల్యాంప్‌ కాదు... ‘త్రీడీ వాల్‌ ల్యాంప్‌ స్టిక్కర్‌’ అని. ‘కార్టూన్‌ త్రీడీ వాల్‌ స్టిక్కర్‌ రిమూవబుల్‌ లెడ్‌ నైట్‌ లైట్‌’ పేరుతో ఇవి రకరకాల బొమ్మలతో ఎన్నో డిజైన్లలో దొరుకుతున్నాయి. వీటిల్లో కొన్నింటిని నేరుగా గోడమీద అతికించి కావాల్సినప్పుడు స్టిక్కర్‌ లోపలున్న బటన్‌ని నొక్కితే చాలు... అందులోని బ్యాటరీల సాయంతో వెలిగిపోతూ అచ్చంగా అక్కడ ల్యాంప్‌ ఉన్నట్టే ఉంటుంది. మరికొన్నేమో విడివిడిగా వచ్చే స్టిక్కర్‌ భాగాలన్నింటినీ జతచేసి గోడమీద అతికించుకుని ప్లగ్‌తో కరెంట్‌కు కనెక్ట్‌ చేసుకోవాలి. పిల్లలకు ఇష్టమైన బొమ్మలతో ఉండే ఈ సరికొత్త లైట్లను గదిలో ఉంచామంటే... ఇటు చోటూ కలిసి వస్తుంది, అటు చూడ్డానికీ ఎంతో అందంగా ఉంటాయి.


బొమ్మే చొక్కా అయితే..

ఏడేళ్ల చింటూ స్నేహితులతో కలిసి సరదాగా ఆడుకుంటున్నాడు. కాసేపయ్యాక తన దగ్గరున్న బొమ్మను క్షణంలో కోట్‌గా మార్చుకుని వేసేసుకున్నాడు. అదెలా సాధ్యం అంటూ మిగిలిన పిల్లలందరూ తెగ ఆశ్చర్యపోయారు. మరి ఆ మాయ ఎలా జరిగింది అంటే... దానికి కారణం ‘కబ్‌కోట్స్‌ టూ ఇన్‌ వన్‌ కిడ్స్‌ ట్రాన్స్‌ఫార్మింగ్‌ పుల్‌ఓవర్‌ హుడీ అండ్‌ ప్లష్‌ యానిమల్‌’. వేసుకునే హుడీనే బొమ్మ రూపంలో వస్తోంది. కావాలంటే దాంతో ఆడుకోవచ్చు, అవసరమైనప్పుడు బొమ్మ వెనకాలున్న జిప్‌ తెరిచి
చొక్కాలా మార్చుకోవచ్చు. రెండు రకాలుగా ఉపయోగపడే వీటిల్లో బోలెడన్ని రంగులూ, ఎన్నో వెరైటీలూ అందుబాటులో ఉన్నాయి. ప్రయాణాల్లో చిన్నారుల కోసం బొమ్మలూ, హుడీ తీసుకెళ్లాల్సి వచ్చినప్పుడు ఈ ‘టూ ఇన్‌ వన్‌ కోట్‌ టాయ్‌’ ఎంతో ఉపయోగపడుతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు