ఈ రైల్వే స్టేషన్‌ రూటే వేరు!

ఆదాయం లేని రైల్వే స్టేషన్లలో రైళ్ల స్టాపింగ్‌ను అధికారులు ఎత్తేస్తుంటారు కదా! రాజస్థాన్‌లోని జల్సూ నానక్‌ స్టేషన్‌దీ

Updated : 09 Jan 2022 08:41 IST

ఈ రైల్వే స్టేషన్‌ రూటే వేరు!

దాయం లేని రైల్వే స్టేషన్లలో రైళ్ల స్టాపింగ్‌ను అధికారులు ఎత్తేస్తుంటారు కదా! రాజస్థాన్‌లోని జల్సూ నానక్‌ స్టేషన్‌దీ అదే పరిస్థితి. ఈ గ్రామం నుంచి సైన్యంలో పనిచేసే వారు ఎక్కువ. కానీ, రైళ్లు ఆగకపోవడంతో వారి రాకపోకలకు ఇబ్బందిగా మారింది. రైల్వే అధికారులతో మాట్లాడితే.. రోజుకు 50 చొప్పున నెలకు 1500 టికెట్లు కొనుగోలు చేస్తేనే స్టేషన్‌లో రైళ్లను ఆపుతామని తేల్చిచెప్పారు. దాంతో గ్రామస్థులంతా కలిసి చర్చించుకున్నారు. తలాకొంత వేసుకొని ప్రతి రోజూ 50 టికెట్లు కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ ఊరి వాళ్లతో పాటు రైలు ఎక్కేందుకు వచ్చే చుట్టుపక్కల గ్రామాల ప్రజలకూ టికెట్లు అమ్మే బాధ్యతను ఓ వ్యక్తికి అప్పగించారు. అతడికి నెలకు రూ.5 వేలు కూడా ఇస్తున్నారట. టికెట్లు ఏమైనా మిగిలితే, ఆరోజుకు వృథా అయినట్లే. ప్రస్తుతం పది రైళ్లు ఆగుతున్న ఈ స్టేషన్‌లో గ్రామస్థులే తాగు నీరు, కుర్చీలు తదితర సౌకర్యాలనూ ఏర్పాటు చేసుకున్నారు. అలా 2005 నుంచి ప్రజలే నిర్వహిస్తున్న రైల్వే స్టేషన్‌గా దీనికి పేరొచ్చింది.


తింటూనే కరిగించండి

కొందరికి బాగా తినాలని ఉంటుంది. కానీ, ఎక్కడ లావైపోతామోనని నోరు కట్టేసుకుంటారు. ఇంకొందరికేమో తగ్గాలని ఉన్నా.. పొద్దున్నే లేచి వ్యాయామం చేయడమంటే బద్ధకం. అలాంటి వారి కోసమే మెక్‌డోనాల్డ్స్‌ సంస్థ సరికొత్తగా ఈ సైక్లింగ్‌ టేబుళ్లను తీసుకొచ్చింది. ఆగండాగండీ.. వెంటనే వెళ్దామనుకోవద్దు... ఎందుకంటే, మన దగ్గర ఇవి ఇంకా రాలేదు. ఇప్పుడిప్పుడే ప్రయోగాత్మకంగా చైనాలోని తమ అవుట్‌లెట్లలో వీటిని ఏర్పాటు చేస్తోందా సంస్థ. బరువు పెరుగుతామనే ఆందోళన ఏమాత్రం లేకుండా.. నచ్చిన ఫుడ్‌ లాగించొచ్చు. సైకిల్‌ తొక్కి ఆ అదనపు కెలొరీలనూ అక్కడికక్కడే కరిగించొచ్చు. సైక్లింగ్‌తో ఉత్పత్తయ్యే విద్యుత్తుతో ఫోన్లనూ ఛార్జింగ్‌ చేసుకోవచ్చట. భలే ఆలోచన కదూ!


ఇదో రకం పబ్లిసిటీ!

సాధారణంగా వస్త్ర దుకాణాలు పండుగలకో కొత్త స్టాక్‌ వచ్చినప్పుడో వివిధ ఆఫర్లతో పాటు ప్రకటనలూ ఇస్తుంటాయి. అందరూ ఎప్పుడూ ఇచ్చేలా కాకుండా కొందరు తమ సృజనాత్మకతను ప్రదర్శిస్తుంటారు. కోల్‌కతాలోని ఓ వస్త్ర దుకాణ సంస్థ ఇటీవల ఇచ్చిన ప్రకటనే అందుకు ఉదాహరణ. ‘మిస్సింగ్‌’ అంటూ పెద్ద అక్షరాల కింద ఓ యువకుడి ఫొటో ఉన్న యాడ్‌ అది. చూసిన వారంతా ఆ యువకుడు కనిపించడం లేదనుకోవడం సహజం. కానీ, తల్లిదండ్రుల మాటగా దాని కింద రాసింది చదివితేనే అసలు ట్విస్టు తెలుస్తుంది మరి! ఇంతకీ అక్కడ ఏం రాసుందంటే - ‘‘బాబూ ‘మజ్నూ’... నీ డిమాండ్లన్నీ ఒప్పుకొంటున్నాం. ‘లైలా’తోనే నీకు వివాహం జరిపిస్తాం. అంతేకాదు, పెళ్లికి షేర్వాణీ కూడా నువ్వు కోరుకున్న ‘సుల్తాన్‌’ దుకాణంలోనే కొందాం. కొత్తగా పెట్టిన బ్రాంచ్‌లో పార్కింగ్‌ సౌకర్యం కూడా ఉందట. అక్కడే షాపింగ్‌ చేద్దాం’’ అని ఉంది. ఇప్పుడర్థమైందా.. ఇదంతా ఆ దుకాణం పబ్లిసిటీ కోసం వెరైటీగా ఇచ్చిన యాడ్‌ అని!


‘రాణీ’ కోసం పరుగులు పెట్టాయి 

యూకేలోని వేల్స్‌ నగరానికి చెందిన మహిళ ఒకరోజు తన కారును రోడ్డు పక్కనే ఆపి షాపింగ్‌కు వెళ్లింది. తిరిగొచ్చి చూసేసరికి వేలాదిగా తేనెటీగలు కారు వెనుక అద్దాన్ని చుట్టుముట్టి ఉన్నాయి. భయపడిపోయిన ఆమె... తేనెటీగలు పట్టేవాళ్లను పిలవడంతో వాళ్లొచ్చి వాటిని పట్టుకెళ్లారు. దాంతో ‘హమ్మయ్యా’ అనుకొని ఇంటికెళ్లిపోయింది. మరుసటి రోజు ఉదయాన్నే చూసేసరికి కారు చుట్టూ తేనెటీగలు మళ్లీ కనిపించాయి. ముందురోజు వచ్చి పట్టుకెళ్లిన వారిని మరోసారి పిలిపించిందామె. వాళ్లకు అనుమానం వచ్చి... కారు డోర్లు తీసి చూశారు. లోపల ఒక తేనెటీగ కనిపించడంతో అప్పుడర్థమైంది అది రాణీ ఈగ అని! అంటే - లోపల చిక్కుకుపోయిన రాణీ ఈగ కోసం ఆ దండులోని తేనెటీగలన్నీ రెండు రోజులుగా కారును వెంబడిస్తున్నాయన్నమాట! రాణీ ఈగను బయటకు పంపడంతో మిగతావీ తుర్రుమంటూ దానివెంటే ఎగిరిపోయాయట.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..