Updated : 30 Jan 2022 06:18 IST

ఆ కోరిక పవన్‌ కల్యాణ్‌ సినిమాతో తీరింది!

‘సవ్యసాచి’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది నిధి అగర్వాల్‌. తొలి సినిమాతోనే హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుని.. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’లో గ్లామర్‌ డాల్‌గా కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టింది. తాజాగా ‘హీరో’ చిత్రంలో తళుక్కుమన్న ఈ బ్యూటీ.. పవన్‌కల్యాణ్‌తోనూ ఓ సినిమా చేస్తోంది. ఈ సందర్భంగా తన మనసులోని ముచ్చట్లను పంచుకుంటోందిలా..


ఆ హోర్డింగులపై నేనుండాలని...  

నాన్న వ్యాపారవేత్త. అమ్మ ఫ్యాషన్‌ డిజైనర్‌. నాన్నకు ఐశ్వర్యారాయ్‌ అంటే అభిమానం. ఆమె హోర్డింగులు కనిపిస్తే చూస్తూ అలా ఉండిపోయే వారాయన. అప్పుడే... నేనూ ఆ హోర్డింగుల్లో కనిపించాలనీ, సినిమాల్లోకి వెళ్లాలనీ నిర్ణయించుకున్నా. ఇంట్లోనూ ప్రోత్సహించడంతో మోడలింగ్‌ ప్రారంభించా. బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ చదువుతూనే ఆడిషన్లకు వెళ్లేదాన్ని.


ఇక్కడే పుట్టా

మా అమ్మవాళ్లది హైదరాబాదే. నేనూ ఇక్కడే పుట్టా. బెంగళూరులో పెరిగా. ప్రస్తుతం సినిమాల కోసం ముంబయిలో ఉంటున్నా. వేసవి సెలవుల్లో హైదరాబాద్‌లోని అమ్మమ్మ ఇంటికి వచ్చేదాన్ని. తెలుగు పదాలు చాలావరకూ అప్పుడే తెలుసు. సినిమాల్లోకి వచ్చాక మాట్లాడటమూ నేర్చుకున్నా.


సినిమాల్లో అవకాశం

స్కూల్లో ఉన్నప్పుడే కథక్‌, బెల్లీ డ్యాన్స్‌ నేర్చుకున్నా. హిందీ సినిమా ‘మున్నా మైఖేల్‌’తో పరిశ్రమలోకి వచ్చా. అందులో టైగర్‌ ష్రాఫ్‌తో కలిసి నటించేందుకు డ్యాన్స్‌ తెలిసిన అమ్మాయే కావాలనడంతో ఆడిషన్‌కు 300 మంది వచ్చారు. వారిలో నాకు అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తుంటా.


కథనే నమ్ముతా

హీరోలూ, డైరెక్టర్లూ చిన్నా పెద్దా అని చూసుకోను. కథను మాత్రమే నమ్ముతా. నా పాత్రకు వందశాతం న్యాయం చేస్తా. వర్షంలో కళ్లు తెరిచి హావభావాలు పలికించడం కష్టం. అందుకే రెయిన్‌ సాంగ్స్‌ అంటే కొంచెం భయం.


యాక్టర్‌గా డాక్టర్‌

చాలామంది డాక్టర్‌ కాబోయి యాక్టర్‌ అయ్యామంటారు. నేను మొదట్నుంచీ యాక్టరే కావాలనుకున్నా... అయ్యాను. కానీ, ఇప్పటివరకూ ‘ఇస్మార్ట్‌ శంకర్‌’, ‘హీరో’తో పాటు ఓ తమిళ చిత్రంలోనూ డాక్టర్‌గా నటించా. అందుకే, యాక్టరై డాక్టరయ్యావంటూ స్నేహితులు ఆటపట్టిస్తుంటారు.


వాటిని పట్టించుకోను  

మోడలింగ్‌ చేస్తున్నప్పుడే ఇన్‌స్టాలో నాకు పది లక్షలమంది ఫాలోవర్లు ఉన్నారు. ఇప్పుడైతే కోటిన్నరకుపైగానే. ట్రోల్స్‌ను అస్సలు పట్టించుకోను.


ఎవరికీ తెలియనివి...  

మొదట్లో నాది ఎడమచేతి వాటమైనా అమ్మానాన్నలు కుడి చేయి అలవాటు చేయించారు. ఇంకోటి... స్కూల్లో ప్రపోజ్‌ చేసిన అబ్బాయిలనూ గొడవ పడిన అమ్మాయిలనూ చాలామందిని చెంపదెబ్బలు కొట్టా.


‘హరిహర’లో...

చారిత్రక నేపథ్యమున్న సినిమాలన్నా, యాక్షన్‌ పాత్రలన్నా ఇష్టం. ఆ రెండింటిలో ఒక కోరిక పవన్‌కల్యాణ్‌తో కలిసి ప్రస్తుతం నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’తో తీరనుంది.


అప్పుడు బాధపడ్డా

నాలుగో తరగతిలో అనుకుంటా.. స్కూల్‌ బస్‌లో ముందు సీట్లో కూర్చొని ఆపిల్‌ తింటున్నా. వెనుక నుంచి ఒకబ్బాయి వచ్చి అందంగా ఉన్నావన్నాడు. కోపంతో నా చేతిలోని ఆపిల్‌ని విసరడంతో ఏడ్చేశాడు. తరువాత ఎందుకు కొట్టానా అని బాధపడ్డా.


కోపానికి అలా చెక్‌

నాకు కోపం ఎక్కువే. ‘వాలెంటైన్స్‌ డే’కి చాలామంది గ్రీటింగ్‌ కార్డులూ, గులాబీలూ ఇచ్చేవారు. వాటిని అక్కడే చించేసేదాన్ని. ఇప్పుడా కోపాన్ని మెడిటేషన్‌తో తగ్గించుకుంటున్నా.


మెచ్చే ఆహారం

నేను శాకాహారిని. ఇడ్లీ అంటే ఇష్టం.  


హాలిడే స్పాట్‌

నాకిష్టమైన ప్రదేశం ఇల్లే. విదేశాల్లో అయితే లండన్‌.  


ఇష్టమైన నటులు

ణ్‌బీర్‌ కపూర్‌, దీపికా పదుకొణె. తెలుగులో విజయ్‌ దేవరకొండ. ‘అర్జున్‌రెడ్డి’ సినిమాను నాలుగుసార్లు చూశా.


ఖాళీ సమయాల్లో...

షాపింగ్‌ చేస్తా.. వందలాది ఇయర్‌ రింగ్స్‌, రకరకాల సాక్స్‌ కలెక్షన్‌ ఉంది నా దగ్గర.


నిధి అగర్వాల్‌ మరిన్ని చిత్రాల కోసం క్లిక్‌ చేయండి


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

ap-districts
ts-districts