సైన్స్‌ సంగతులు

జీవితంలో ఎన్నో సంఘటనలూ మరెన్నో అనుభవాలూ... అవన్నీ జ్ఞాపకాలుగా మెదడు పొరల్లో నిక్షిప్తమై ఉంటాయి. అయితే కొంతకాలానికి వాటిల్లో కొన్ని గుర్తుంటాయి. మరికొన్ని పూర్తిగా మర్చిపోతాం. ఇంకొన్ని ఎవరైనా గుర్తు చేస్తే గుర్తొస్తాయి. దాంతో మతిమరుపు వచ్చేసింది...

Updated : 30 Jan 2022 05:17 IST

సైన్స్‌ సంగతులు

ఎందుకు మర్చిపోతాం?.. గుడ్డులో ఉండగానే... అంతరిక్షంలోకి వెళితే...

జీవితంలో ఎన్నో సంఘటనలూ మరెన్నో అనుభవాలూ... అవన్నీ జ్ఞాపకాలుగా మెదడు పొరల్లో నిక్షిప్తమై ఉంటాయి. అయితే కొంతకాలానికి వాటిల్లో కొన్ని గుర్తుంటాయి. మరికొన్ని పూర్తిగా మర్చిపోతాం. ఇంకొన్ని ఎవరైనా గుర్తు చేస్తే గుర్తొస్తాయి. దాంతో మతిమరుపు వచ్చేసింది... అనుకుంటాం. కానీ అలా మర్చిపోవడం సహజ లక్షణమనీ అది ఒకరకంగా కొత్త విషయాలు నేర్చుకోవడంలో భాగమేననీ చెబుతున్నారు డబ్లిన్‌లోని ట్రినిటీ కాలేజ్‌కు చెందిన శాస్త్రవేత్తలు. ఎందుకంటే - అప్పటి పరిస్థితులూ చుట్టు పక్కల వాతావరణాన్ని బట్టి కొన్ని సంఘటనలు చోటుచేసుకుంటాయి. కాలంతోపాటు వాతావరణమూ అవసరాలూ కూడా మారుతుంటాయి. కాబట్టి వాటిని మర్చిపోవడం వల్ల నేటి పరిస్థితిని బట్టి సరైన నిర్ణయం తీసుకోగలుగుతాం. పాత జ్ఞాపకం స్థానంలో కొత్త విషయం చేరుతుందన్నమాట. అంటే- జ్ఞాపకశక్తికి సంబంధించిన న్యూరాన్లు చురుకుగానే పని చేస్తున్నాయని అర్థం. అదే ఆయా కణాల్లో చురుకుదనం లోపిస్తే... అప్పటికే నిక్షిప్తమైన సంఘటన లేదా విషయం ఎప్పటికీ గుర్తురాదు సరికదా, కొత్త విషయాన్నీ సంబంధిత న్యూరాన్లు నిక్షిప్తం చేయలేవు. ఆల్జీమర్స్‌ వచ్చినప్పుడే ఇలా జరుగుతుంటుంది. కాబట్టి సాధారణ మతిమరుపు వల్ల పెద్ద సమస్య లేదనీ అది సహజమేననీ నిరంతర అధ్యయనంలో భాగమేననీ వివరిస్తున్నారు.


కొత్త రకం ప్యాకింగ్‌ వస్తోంది!

ప్లాస్టిక్‌ ప్యాకింగ్‌తో తలెత్తే సమస్యలు తెలిసిందే. ముఖ్యంగా ఆహారపదార్థాలను అందులో ప్యాక్‌ చేయడం వల్ల పర్యావరణానికే కాదు, ఆరోగ్యానికీ ముప్పే. అందుకే నాన్‌యాంగ్‌ టెక్నలాజికల్‌ యూనివర్సిటీకి చెందిన నిపుణులు సరికొత్త స్మార్ట్‌ ఫుడ్‌ ప్యాకింగ్‌ పదార్థాన్ని రూపొం దించారు. ఇది భూమిలో కలిసిపోవడంతోబాటు హానికర సూక్ష్మజీవుల్నీ నాశనం చేస్తుందట. తాజా పండ్లూ లేదా ఇతర్రతా పదార్థాలను ఎక్కువ రోజులు నిల్వ ఉండేలానూ చేస్తుందట. వాటర్‌ప్రూఫ్‌ గుణం ఉన్న జెన్‌ అనే ఒక రకం ప్రొటీన్‌కి కొంత పిండిపదార్థాలనీ, బయోపాలిమర్లనీ, సహజమైన యాంటీమైక్రోబియల్‌ పదార్థాలనీ, థైమ్‌ అనే ఔషధమొక్క నుంచి తీసిన నూనెనీ, సిట్రిక్‌ ఆమ్లాన్నీ కలిపి ఈ సరికొత్త పదార్థాన్ని తయారుచేశారట. ఆ తరవాత దీన్ని హానికర సూక్ష్మజీవులకు గురిచేసినప్పుడు- ప్యాకింగ్‌లో ఉన్న పదార్థాలు వాటిని నాశనం చేశాయట. ఆహారపదార్థాలను విషపూరితం చేసే ఈ-కోలి, లిస్టీరియా, ఫంగై వంటివన్నీ చనిపోయాయి. దాంతో స్ట్రాబెర్రీలను వీటిలో ప్యాక్‌ చేసి చూడగా- అవి వారం వరకూ తాజాగానే ఉన్నాయట. ప్రస్తుతం చేస్తున్న ప్లాస్టిక్‌బాక్సుల్లో అయితే అవి కేవలం నాలుగురోజులే ఉంటున్నాయి. కాబట్టి రెడీ టూ ఈట్‌, పచ్చి మాంసం, పండ్లు, కూరగాయలు... వంటివాటిని అన్నింటినీ ఈ కొత్త పదార్థంతో ప్యాక్‌ చేస్తే అవి పాడవకుండానూ ఉంటాయి, పర్యావరణానికీ ముప్పు ఉండదు, కాబట్టి ఈ కొత్త పదార్థం అన్నివిధాలే మేలే.


అంతరిక్షంలోకి వెళితే...

చుక్కలలోకాన్ని చుట్టేయాలని ఎవరికి మాత్రం ఉండదు...అందుకే అంతరిక్ష పర్యటనలకోసం సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే అంతరిక్షయానం అంత సులభం కాదు అంటున్నారు నాసా పరిశోధకులు. రోదసిలోకి వెళ్లిన ఆస్ట్రొనాట్స్‌ రక్త హీనతకి గురవుతున్నారట. సెకనుకి సుమారు 30 లక్షల ఎర్రరక్తకణాలు నశిస్తున్నట్లు స్పష్టమైంది. మానవ శరీరంలో 35 ట్రిలియన్‌ ఎర్ర రక్త కణాలు ఉంటాయి. సాధారణంగానే సెకనుకి 20 లక్షల కణాలు పుడుతుంటాయి, మరణిస్తుంటాయి. అంతరిక్షంలో మాత్రం సెకనుకి 30 లక్షలదాకా మరణించడంతో కణజాలాలకు తగినంత ఆక్సిజన్‌ అందడం లేదట. అందుకే అక్కడినుంచి రాగానే వాళ్లకు చికిత్స అందిస్తుంటారు. మొదట్లో ఈ రకమైన రక్తహీనత కేవలం తాత్కాలికమేననీ అక్కడి వాతావరణానికి శరీరం అలవాటుపడే వరకూ మాత్రమేననీ అనుకున్నారు. కానీ ఈ సమస్య ఆరునెలల వరకూ కొనసాగుతున్నట్లు గుర్తించారు. దీనికోసం గత ఆరేళ్లలో స్పేస్‌లోకి వెళ్లి వచ్చిన 14మంది ఆస్ట్రోనాట్స్‌ రక్తనమూనాల్ని అధ్యయనం చేయగా - ఎక్కువకాలం ఉన్నవాళ్లలో ఈ రక్తహీనత ఎక్కువగా ఉందట. కాబట్టి అంతరిక్షంలోకి వెళ్లే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిందే.


గుడ్డులో ఉండగానే...

యుద్ధంలో పద్మవ్యూహంలోకి ఎలా వెళ్లాలనే విషయాన్ని అర్జునుడు సుభద్రకి వివరిస్తుంటే-  గర్భంలో ఉన్న అభిమన్యుడు అది విని నేర్చుకున్నాడని మహాభారతం చెబుతుంది. అలాగే పసిపిల్లల గ్రాహకశక్తిని చూసి వీడు పుడుతూనే అన్నీ నేర్చుకున్నాడు అంటారు. అదంతా నిజమే అంటున్నారు ఆస్ట్రేలియాలోని ఫ్లిండర్స్‌ యూనివర్సిటీకి చెందిన నిపుణులు. ఎందుకంటే- డయానె కొలంబెల్‌ అనే పర్యావరణ శాస్త్రవేత్త రెన్‌ జాతికి చెందిన తల్లి పక్షులు గుడ్లను పొదిగేటప్పుడు ఒకలాంటి శబ్దాలు చేస్తూ పాటలు పాడటాన్ని గుర్తించింది. గుడ్డులో ఉన్న బుల్లి పక్షులు ఆ శబ్దాల్ని గుర్తించి నేర్చుకునేందుకే అవి అలా చేస్తున్నట్లు గుర్తించారు. అంతేకాదు, తల్లి చేసే శబ్దాల్ని బట్టి గుడ్డులో ఉన్న పిల్ల పక్షి తమ జాతి పక్షుల్నీ తమకూ ఇతర పక్షులకూ మధ్య ఉండే వ్యత్యాసాన్నీ గుర్తించగలుగుతుందట. అదెలా అంటే- తల్లి పక్షులు శబ్దం చేసినప్పుడు గుడ్డులోని పిల్ల పక్షి గుండెరేటు నెమ్మదిస్తుందట. అంటే అది ఎంతో శ్రద్ధగా ఆలకిస్తుందని అర్థం. అదే వేరే జాతి పక్షి శబ్దాలను వినిపించినప్పుడు దాని గుండెరేటులో పెద్దగా తేడా లేదట. దీన్నిబట్టి మిగిలిన విషయాల సంగతెలా ఉన్నా- గర్భస్థ శిశువు తల్లిదండ్రుల గొంతును మాత్రం తప్పక గుర్తుపడుతుందని నిపుణులు వివరిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..