ఈ బడి... బతకడమెలాగో నేర్పుతుంది!

సాధారణంగా స్కూళ్లలో చదువు చెబుతారూ, ఆటలు ఆడిస్తారూ... మహా అయితే డాన్సులూ, సంగీతం వంటి వాటిల్లో శిక్షణ ఇస్తారు. అదే కేరళలోని కూనమ్మావు గ్రామంలో ఉన్న చవరదర్శన్‌ సీఎంఐ

Updated : 17 Apr 2022 04:35 IST

ఈ బడి... బతకడమెలాగో నేర్పుతుంది!

సాధారణంగా స్కూళ్లలో చదువు చెబుతారూ, ఆటలు ఆడిస్తారూ... మహా అయితే డాన్సులూ, సంగీతం వంటి వాటిల్లో శిక్షణ ఇస్తారు. అదే కేరళలోని కూనమ్మావు గ్రామంలో ఉన్న చవరదర్శన్‌ సీఎంఐ పబ్లిక్‌ స్కూల్లో మాత్రం అంతకు మించి నేర్పిస్తారు. ఎవరైనా ఒక్కసారి ఆ స్కూలుకి వెళితే ‘పిల్లల్ని చదివిస్తే ఇలాంటి చోటే చదివించాలి...’ అనక మానరు. ఎందుకో తెలుసుకోవాలంటే చదివేయండి మరి...

కొచ్చికి 27 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కూనమ్మావు. అక్కడున్న చవరదర్శన్‌ సీఎంఐ పబ్లిక్‌ స్కూల్లో అడుగు పెట్టీ పెట్టగానే పార్కుకో, పంట పొలానికో వెళ్లిన అనుభూతి కలుగుతుంది. ప్రధాన ద్వారానికి ఒకవైపు చూస్తే వెదురు వనం కనిపిస్తుంది. ఇంకోవైపు వరి పంటా, రెండు చేపల చెరువులూ దర్శనమిస్తాయి. మరికాస్త ముందుకెళితే కూరగాయ తోటలూ, ఔషధవనం- కోళ్లూ, బాతులూ, కుక్కలూ, పిల్లులూ, కుందేళ్లున్న ఫార్మ్‌ తదితరాలు స్వాగతం పలుకుతుంటాయి. ఆ జీవవైవిధ్యాన్ని దాటుకుని వెళ్లాక సువిశాల స్కూలు భవనం వస్తుంది. ఎల్‌కేజీ నుంచి పదో తరగతి వరకూ అక్కడ వేల మంది విద్యార్థులు చదువుకుంటుంటారు. ప్రతిరోజూ రెండుమూడు గంటలు పుస్తకాలకు దూరంగా ప్రకృతికి దగ్గరగా జీవవైవిధ్యంలో భాగమవుతుంటారు. చేపలు పట్టడం, వాటికి మేత వేయడం, నీళ్ల స్థాయిల్ని చూసుకోవడం, మొక్కలకి నీళ్లు పెట్టడం, కలుపు తీయడం, కాయగూరలు కోయడం వంటివెన్నో చేస్తుంటారు. వరి నాట్ల నుంచీ నూర్పిడి వరకూ అన్నీ దగ్గరుండి చూసుకుంటారు. ఆ పనులన్నింటినీ ‘నేచర్‌ క్లబ్‌’ పేరుతో ఏడేళ్లుగా చేస్తున్నారు విద్యార్థులు.

ఎందుకంటే....
వెదురు 30 శాతం ఆక్సిజన్‌ను విడుదల చేసి ఎక్కువ మొత్తంలో కార్బన్‌ డై ఆక్సైడ్‌ని తీసుకుంటుంది. ఆ ఉద్దేశంతోనే ఏడేళ్ల క్రితం చవరదర్శన్‌ స్కూలు ప్రిన్సిపల్‌ ఫాదర్‌ పౌలోస్‌ కిడంగన్‌ బడి ఆవరణలో వెదురు వనానికి శ్రీకారం చుట్టారు. వివిధ రాష్ట్రాల్లో అరుదుగా దొరికే 34 రకాల వెదురు జాతుల్ని తెప్పించి పిల్లల చేత నాటించారు. అంతేకాదు... ఈ తరం వారికి వ్యవసాయం గురించి తెలియట్లేదు, కనీసం వరీ కాయగూరలూ ఎలా పండుతాయో... తెలియజేయాలనే ఉద్దేశంతో విద్యార్థులతో ‘నేచర్‌ క్లబ్‌’ పేరిట ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు. అందులో భాగంగా చెరువుల్ని తవ్వించి చేపల సాగు మొదలుపెట్టించారు. ఆ పక్కనే ఓ అర ఎకరంలో ‘ఉమ’ అనే రకం వరినీ సాగు చేయిస్తున్నారు. మరో రెండెకరాల్లో అలసంద, సొర, టొమాటో, బెండ, పచ్చిమిర్చి, వంకాయ, కంద, కర్రపెండలం వంటివి పండిస్తున్నారు పిల్లలు. ఔషధ మొక్కలు నాటి వనాన్నీ పెంచుతున్నారు.

సాగు సేంద్రియ పద్ధతిలో....
జంతువుల పట్ల దయా జాలీ కూడా ఉండాలనే ఉద్దేశంతో నాటుకోళ్లూ, బాతులతో ఓ ఫామ్‌ని ఏర్పాటు చేయించారు ప్రిన్సిపల్‌. అక్కడే కొన్ని మేకలూ, కుక్కలూ, కుందేళ్లూ, పర్షియన్‌ పిల్లులూ, కొన్ని రకాల పక్షులను కూడా సాకుతున్నారు. చేపల చెరువులో సేంద్రియ ఆహారాన్నే చల్లుతారు. అలానే వరికీ, కాయగూరలకీ రసాయనాలను చల్లకుండా సేంద్రియ ఎరువుల్నే వాడతారు. ఇక, సాగు విషయంలో మెలకువలూ, చీడలకు చల్లే ఎరువులూ, వాటి తయారీ వంటివన్నీ అగ్రికల్చర్‌ విశ్వవిద్యాలయం నిపుణులు సూచిస్తున్నారు. వెదురును కేరళ బ్యాంబూ రీసెర్చ్‌ సెంటర్‌ వారితో కలిసి పెంచుతున్నారు విద్యార్థులు. ‘ఈ ఏడాది చెరువులో 5500 చేప పిల్లల్ని వేశాం. అవి పెద్దవయ్యాక జాలర్ల పర్యవేక్షణలో పిల్లలకి వల వేసి  పట్టడం నేర్పిస్తాం. అలా పట్టిన చేపల్ని కొన్నిసార్లు బయట అమ్ముతాం, లేదంటే పిల్లల తల్లిదండ్రులకి గానీ, స్టాఫ్‌కిగానీ ఇచ్చేస్తాం. కూరగాయల విషయానికొస్తే ఏడాదికి వెయ్యి కేజీలకిపైనే పండుతాయి. వాటిని స్కూలు ఆవరణలో ఓ స్టాల్‌పెట్టి అమ్ముతాం. అవన్నీ అమ్మగా వచ్చే డబ్బును అనాథ,వృద్ధాశ్రమాలకు ఇస్తాం. లేదంటే పేద విద్యార్థుల చదువుకి ఖర్చుపెడుతుంటాం...’ అంటున్నారు నేచర్‌ క్లబ్‌ బృంద సారథి అనితా టీచర్‌.


పాత వస్తువులకీ ఉందో కొత్త బేరం!

లక్షలు విలువ చేసే బ్రాండెడ్‌ హ్యాండ్‌ బ్యాగు వేలల్లో వస్తే... మనకు బోర్‌కొట్టేసిన కాస్ట్‌లీ వాచీకి సగం ధర వస్తే... నచ్చిన స్పోర్ట్స్‌ షూ నచ్చే రేటులో కనిపిస్తే... సైజు చిన్నదైన సూటుకూ అంతో ఇంతో డబ్బొస్తే... ఎంత బాగుంటుందో కదా... అయితే ఒక్కసారి ‘పాష్‌మార్క్‌ ఇండియా’ వెబ్‌సైట్‌లోకి వెళ్లి చూడండి... అందులో- వాడిన వస్తువులు అమ్ముకోవచ్చూ, అవసరం అనిపించినవాళ్లు వాటిని కొనుక్కోవచ్చూ!

‘లూయీ వుటాన్‌ లెదర్‌ వాలెట్‌ కావాలి’ ‘రే-బాన్‌ సన్‌ గ్లాసెస్‌ పెట్టుకోవాలి’ ‘ఫాసల్‌ వాచీ కొనుక్కోవాలి’... ఇలా బ్రాండెడ్‌, లగ్జరీ వస్తువులంటే కొంతమందికి ఎంతో క్రేజ్‌ ఉంటుంది. బడ్జెట్‌ లేకనో, ధర చాలా ఎక్కువగా ఉందనో ఇష్టం ఉన్నా కొనడం మానుకుంటారు. అయితే అలాంటి వస్తువులన్నీ కాస్త తక్కువ ధరల్లోనే కొనుక్కుని ఆ ముచ్చట తీర్చుకోవచ్చు. ‘పాష్‌మార్క్‌ ఇండియా’ అనే వెబ్‌సైట్‌లో ఇలాంటి బోలెడన్ని బ్రాండెడ్‌ వస్తువులు దొరుకుతాయి. మనకు కావాల్సిన వస్తువుల్ని కొనుక్కోవడమే కాదు, ఎంతో ఖర్చు పెట్టి కొని మనం పక్కన ఉంచేసిన వాటిని అమ్మేసి డబ్బు ఆదా చేసుకోవచ్చు కూడా.

ఏంటీ దీని ప్రత్యేకత...
ఇది కూడా మామూలు షాపింగ్‌ వెబ్‌సైట్‌లానే ఉంటుంది. కానీ ఇందులో కొత్త డ్రస్సులే కాదు, పాత దుస్తులూ, ఫ్యాషన్‌ యాక్ససరీలూ ఉంటాయి. పెద్దలకూ, పిల్లలకూ సంబంధించి ఎన్నెన్నో ఫ్యాషన్‌ వస్తువులూ దొరుకుతాయి.

ట్రెండీ నుంచి ట్రెడిషనల్‌ వరకూ రకరకాల డ్రస్సులతో పాటు నైకీ, లూయీ వుటాన్‌, గూచీ, రోలెక్స్‌, లివైస్‌, అడిడాస్‌, జారా, కాల్విన్‌ కెయిన్‌, ప్యూమా, ఆపిల్‌, గూగుల్‌... ఇలా మరెన్నో ప్రముఖ బ్రాండ్ల వాచీలూ, టోపీలూ, కళ్లజోళ్లూ, షూలూ, బెల్టులూ, జ్యువెలరీ, హ్యాండ్‌బ్యాగులూ, ఫోన్లూ, ఎలక్ట్రానిక్‌ వస్తువులూ ఉంటాయిక్కడ. అయితే ఇవన్నీ కూడా తక్కువ ధరకే దొరుకుతాయి. వాటి అసలు రేటు కన్నా బాగా చౌకగా వస్తాయి.

‘అది సరేకానీ నిజంగా అవి అసలైన బ్రాండ్‌వే అని నమ్మకం ఏంటీ? వాడిన వస్తువులు అంటున్నారు కదా సరిగా ఉండవేమో’ అన్న అనుమానాలు వచ్చే ఉంటాయి కదూ... పాతవి అనగానే ఏవి పడితే అవి అమ్మకానికి పెట్టలేరెవరూ. ముందు ఈ సైట్‌లోకి వెళ్లి ఫోన్‌ నంబరూ, వివరాలతో రిజిస్టర్‌ చేసుకోవాలి. అమ్మే వస్తువుకు సంబంధించిన ఫొటోలూ, రంగూ, సైజూ, బ్రాండూ సంగతులన్నింటినీ అందించాలి. కచ్చితంగా అసలు ధరనూ, అమ్మే రేటునీ పేర్కొనాలి. వాటి నాణ్యతా, మనం ఇచ్చిన వివరాలూ సరిగ్గా ఉంటేనే ఇక్కడ అమ్మే వీలు ఉంటుంది. ఇందుకు తగ్గట్టు షరతులన్నీ స్పష్టంగా ఉంటాయి. పైగా మనం ఏదైనా వస్తువు కొన్నామంటే అది మనకు డెలివరీ కాకపోయినా... వచ్చిన వస్తువు ఫొటోలో ఉన్నట్టు లేకపోయినా... దాని నాణ్యత సరిగా ఉండకపోయినా డబ్బులు తిరిగి ఇచ్చేస్తారు. ఎందుకంటే ఆ వస్తువు కస్టమర్‌కు అందిన మూడు రోజుల తర్వాతే దానికి సంబంధించిన డబ్బుల్ని అమ్మినవాళ్లకు అందజేస్తారు. ఇలా కస్టమర్‌కూ అమ్మేవాళ్లకీ వారధిగా ఉంటూ ప్రొడక్ట్‌ ఎంపిక దగ్గర్నుంచీ చేరే వరకూ అన్నింటినీ ఈ వెబ్‌సైట్‌వాళ్లే చూసుకుంటారు.

ఈ సోషల్‌ కామర్స్‌ వెబ్‌సైట్‌ అమెరికాకు చెందింది. దీని ప్రధాన కార్యాలయం కాలిఫోర్నియాలోని రెడ్‌వుడ్‌ సిటీలో ఉంది. 2011లో మొదలైన ఈ వెబ్‌సైట్‌ అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాల్లో మాత్రమే ఉండేది. ఇప్పుడు మన దేశంలోనూ అందుబాటులోకి వచ్చింది. మరెందు కాలస్యం... అవసరంలేదనుకున్న మీ పాత వస్తువుల్ని అమ్మకానికి పెట్టేయండి... తక్కువ ధరలో లగ్జరీ వస్తువులు కావాలనుకుంటే కొనేయండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..