అబ్బాయికి జలుబా... లాలీపాప్‌ ఇవ్వండి!

పిల్లలకు ఒంట్లో కాస్త నలతగా ఉందనగానే చాక్లెట్‌, ఐస్‌క్రీమ్‌ వంటివన్నీ బంద్‌ అనేస్తుంటాం కదా... వాటిని ఆపేసినా సరే ఈ హెర్బల్‌/కషాయం లాలీపాప్‌లను మాత్రం ఎలాంటి సందేహం లేకుండా వాళ్ల

Updated : 23 Jan 2022 07:08 IST

అబ్బాయికి జలుబా... లాలీపాప్‌ ఇవ్వండి!

పిల్లలకు ఒంట్లో కాస్త నలతగా ఉందనగానే చాక్లెట్‌, ఐస్‌క్రీమ్‌ వంటివన్నీ బంద్‌ అనేస్తుంటాం కదా... వాటిని ఆపేసినా సరే ఈ హెర్బల్‌/కషాయం లాలీపాప్‌లను మాత్రం ఎలాంటి సందేహం లేకుండా వాళ్ల చేతికి ఇచ్చేయండి. ఎందుకంటే కషాయంలో ఉపయోగించే పదార్థాలతోనే వీటినీ తయారుచేస్తున్నారు మరి. సూటిగా చెప్పాలంటే... ఇప్పుడు కషాయం లాలీపాప్‌ రూపంలో దొరికేస్తోందన్నమాట.

ఓవైపు చలి, మరోవైపు కరోనా. ఎంత జాగ్రత్తగా ఉంటున్నా సరే జలుబూ, దగ్గూ, గొంతునొప్పి... వంటి సమస్యలు ఎదురు కావడం మామూలే. పెద్దవాళ్లయితే ఓ మాత్ర వేసుకుని వేడివేడిగా చారో, కషాయమో తాగి విశ్రాంతి తీసుకుంటారు. కానీ పిల్లలతోనే అసలు సమస్యంతా. ఒంట్లో బాలేనప్పుడే ఇంకాస్త ఎక్కువగా పేచీ పెడతారు. అలాంటి పిల్లలకు మందులు వేయడమే కష్టం అంటే... ఇక, కషాయాల్లాంటివి తాగించడానికి తలకిందులుగా తపస్సు చేయాల్సిందే. దీన్ని గుర్తించారో ఏమో... ఇప్పుడు వాళ్ల కోసమే అన్నట్లుగా హెర్బల్‌ లాలీపాప్‌లను తీసుకొచ్చేశారు తయారీదారులు. సాధారణ లాలీపాప్‌లు కేవలం తియ్యగా, కోరుకున్న ఫ్లేవర్‌లో దొరికితే వీటిల్లో సుగంధ ద్రవ్యాలతోపాటూ, ఇతర ఔషధాలు కూడా ఉండి, జలుబు, దగ్గు... వంటి సమస్యల్ని దూరం చేస్తున్నాయి. ఒకప్పుడు కషాయం తయారీ అంటే... పెద్దపని. లవంగాలూ, యాలకులూ, మిరియాలూ, దాల్చినచెక్క, శొంఠి, తులసి, బెల్లం... ఇలా ఒకటేమిటి, వీలైనన్ని మసాలా దినుసులను నీళ్లల్లో వేసి బాగా మరిగించి ఘాటుగా తయారుచేసేవారు. కరోనా కారణంగా ఇప్పుడు అది కూడా పొడి, సాచెట్ల రూపంలో అందుబాటులో ఉండటంతో కషాయం వాడకం బాగా పెరిగింది. కానీ పిల్లలు కషాయాన్ని తాగడానికి ఇష్టపడరు కాబట్టి వాళ్లకు నచ్చేలా ఇలా లాలీపాప్‌ రూపంలో అందుబాటులోకి తెస్తున్నారు తయారీదారులు.



ఎలా తయారుచేస్తారంటే...

కషాయం పొడి అనగానే సాధారణంగా అన్నిరకాల మసాలా దినుసులు, తులసి, పుదీనా, అశ్వగంధ... వంటివి కలిపి తయారు చేస్తారు. కానీ, లాలీపాప్‌లను అలా కాకుండా కావాలనుకున్న రుచిలోనే తయారుచేసుకోవచ్చు. ఉదాహరణకు దాల్చినచెక్క రుచిలో కావాలనుకుంటే.... ముందుగా బెల్లం పాకం పట్టుకుని అందులో దాల్చినచెక్కపొడి వేసి... ఆ మిశ్రమాన్ని లాలీపాప్‌ పుల్లలపైన వేస్తే కాసేపటికి గట్టి పడుతుంది. అదేవిధంగా సి విటమిన్‌ కోసం నిమ్మ లాలీపాప్‌ కూడా దొరుకుతోంది. దగ్గు, గొంతు నొప్పిని తగ్గించేందుకు మిరియాలు, బెల్లం, లవంగాల పొడితో చేసిన రకం కూడా అందుబాటులో ఉంది. కేవలం తేనె, అల్లం లేదా శొంఠితో తయారుచేసిన లాలీపాప్‌ కూడా వస్తోంది. వీటి తయారీలో బెల్లం, తేనె వంటివే ఎక్కువగా వేస్తారు కాబట్టి... ఎలాంటి సందేహం లేకుండా పిల్లలకు ఇవ్వొచ్చు. ఎవరికి వారు ఇంట్లోనూ తయారుచేసుకోవాలనుకుంటే... వీటి తయారీకి సంబంధించిన వీడియోలు యూట్యూబ్‌లోనూ ఉన్నాయి, సో... నాలుగైదు రకాల లాలీపాప్‌లను కొనిపెడితే... పిల్లలు కషాయాల్నీ ఇష్టంగా చప్పరించేస్తారు మరి!


త్రీడీ ఫొటోలో మీరూ, మీ ఇల్లూ!

పెళ్లినాటి ఫొటోఫ్రేములోని పెళ్లిపందిరిని నేరుగా తాకొచ్చు... పాపాయి మొదటి బర్త్‌డే ఫొటోలోని బెలూన్‌ని నిజంగా పట్టుకోవచ్చు... మన ఇంట్లోని టీవీని అచ్చంగా ఫొటోలోకి తీసుకొచ్చేయొచ్చు... ఇలా ఒక్కటేంటీ ఇంట్లోని ప్రతి వస్తువునూ ఫొటోఫ్రేములోకి చొప్పించేయొచ్చు...  ఎలా సాధ్యమంటారా... అదేంటో మీరే చదివేయండి!

ఇంట్లో ఫొటోఫ్రేము ఉండటం అనేది ఒకప్పటి మాటగా మారిపోయింది. హాల్లో, అందరికీ కనిపించే చోట ఫ్యామిలీ ఫొటో పెట్టుకునే ఆనవాయితీ చాలావరకూ తగ్గిందనే చెప్పొచ్చు. మరైతే ఆ పాత పద్ధతి మళ్లీ రావాలంటే, జ్ఞాపకాల చిత్రాలు ఇంటి గోడలపైన అలంకారం అవ్వాలంటే... కచ్చితంగా ఏదైనా మ్యాజిక్‌ టచ్‌ ఇవ్వాలి కదా. ఇదిగోండి... ‘బాక్స్‌నెస్ట్‌ ట్రెజర్‌’ పర్సనలైజ్డ్‌ ఫొటోఫ్రేములు ఆ టచ్‌తో వస్తున్నవే.  

సింపుల్‌గా చెప్పాలంటే అన్నింట్లో వచ్చిన త్రీడీ ఎఫెక్ట్‌ ఫొటో ఫ్రేముల్లోకీ దూకేసిందన్నమాట. మామూలు ఫొటోలో అయితే చుట్టూ ఉన్న పరిసరాలన్నీ కేవలం కనిపిస్తాయంతే. కానీ వీటిల్లో అయితే ముట్టుకోవచ్చు కూడా. అదెలా అంటే... మీ ఇంట్లో దిగిన ఫొటోను ఈ త్రీడీ ఫొటోలా చేయించుకోవాలి అనుకుంటే... ఇంటి గోడ, పక్కనే ఉన్న టేబుల్‌, దాని మీద ఉన్న ఫ్లవర్‌వేజ్‌, కంప్యూటర్‌, తగిలించిన ఫొటోఫ్రేములు, అందులోని చిత్రాలు... ఇలా ప్రతిదీ మినియేచర్‌లా తయారు చేసిస్తారు. అందులో మీరు దిగిన ఫొటోను జత చేస్తారు. అంటే మనం తప్ప అన్నీ త్రీడీలోనే ఉంటాయన్నమాట. ఇలా ఇంటా బయటా ఎంచుకున్న బ్యాక్‌గ్రౌండ్‌ను బట్టి వస్తువులన్నింటినీ బుల్లి నమూనాల్లా చేస్తారు. అంతేకాదు, పెళ్లి, పుట్టినరోజు, గృహప్రవేశం, బారసాల... ఇలా వేడుకలకు సంబంధించిన సన్నివేశాల్నీ అలంకరణలతో సహా ఉండేలా బొమ్మల్ని రూపొందిస్తూ ఈ త్రీడీ ఫ్రేముల్ని అందిస్తున్నారు. ఇంట్లోని సోఫా, తలుపులు, మంచం, అల్మరా, టేబుల్‌, ఊయల్లాంటివన్నీ అసలైన వాటిలా ఉండటానికి మినీరూపంలోని ఆ వస్తువుల్నీ కలప, ఇనుముతో చేస్తున్నారు. వాటికి సరిగ్గా సరిపోయే రంగులు వేస్తున్నారు. ఫోన్‌ గ్యాలరీల్లో ఉండిపోయిన ఫొటోల్ని నిజమైన పరిసరాల్లోకి తీసుకెళ్లి త్రీడీ హంగులు అద్ది, ప్రియమైన వారికి ఇలా కానుకగా ఇచ్చామంటే అది వారికి మధురమైన జ్ఞాపకం అవ్వకుండా ఉంటుందా! వాళ్ల ఇంట్లోని అలంకరణల్లో ఒకటిగా చేరకుండా ఉంటుందా. అంతెందుకు, ఫ్రేమ్‌ ఇంట్లోని వస్తువుల మినీరూపంతో ఉన్న ఈ త్రీడీ ఫొటో అదే ఇంట్లో గోడమీద కనిపిస్తుంటే వచ్చిన అతిథులు చూసి అవాక్కవ్వరూ! ‘అరె ఈ కొత్త రకం ఫొటో భలే ఉందే. ఎక్కడ చేయించారు, ఎవరు ఇచ్చారు’ అంటూ మెచ్చుకుంటూ ఆరా తీయరూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..