పాలరాతిని మరిపించే చెక్కబొమ్మలు

మరుమల్లెల్నీ శ్వేతగులాబీల్నీ మరిపించే తెల్లని ఆ పువ్వులు ఎప్పటికీ వసివాడవు. పాలరాతిని తలపించే ఆ విగ్రహాల శిల్పకళాచాతుర్యం కళ్లు తిప్పుకోనీయదు. ఇక, ధవళవర్ణంలో శోభిల్లే ఆ కిరీటం

Published : 27 Mar 2022 00:32 IST

పాలరాతిని మరిపించే చెక్కబొమ్మలు

మరుమల్లెల్నీ శ్వేతగులాబీల్నీ మరిపించే తెల్లని ఆ పువ్వులు ఎప్పటికీ వసివాడవు. పాలరాతిని తలపించే ఆ విగ్రహాల శిల్పకళాచాతుర్యం కళ్లు తిప్పుకోనీయదు. ఇక, ధవళవర్ణంలో శోభిల్లే ఆ కిరీటం లేకుండా బెంగాలీయుల వివాహం జరగదు. ఇంతకీ ఆ పూలకీ విగ్రహాలకీ ఈ కిరీటానికీ సంబంధం ఏమిటీ అనిపిస్తోంది కదూ. అదంతా ఓ మొక్క బంధం... ఇంకా చెప్పాలంటే కాండం ఉరఫ్‌ చెక్క సంబంధం. దానిపేరే షోలా(సోలా)పిత్‌... ప్రపంచంలోకెల్లా తేలికైన కాండం. దీనికి మరోపేరే హెర్బల్‌ ఐవరీ!

‘హెర్బల్‌ ఐవరీ లేదా ప్లాంట్‌ మార్బుల్‌... ఈ కాండానికి ఆ పేర్లే సరిపోతాయి’ అంటారు షోలాపిత్‌ కళాకారులు. ఆ కాండంతో విగ్రహాల్నీ అలంకరణ వస్తువుల్నీ చేస్తే అచ్చం పాలరాతితోనో ఏనుగు దంతంతోనో చేసినట్లే అనిపిస్తాయి. మడ అడవుల్లో సన్నగా పొడవుగా పెరిగే ఈ మొక్క శాస్త్రీయనామం ఎష్కినొమెనె ఆస్పరా. దీని కాండం లోపల ఖాళీ ఉండటంతో అది తేలికగా బెండులా ఉంటుంది. అందుకే దీనికి ఇండియన్‌ కార్క్‌ అని పేరు.

ఈ బెండు లేదా కాండంతో దేవతా విగ్రహాలనీ అలంకరణ వస్తువులనీ పూల మాలల్నీ బెంగాలీ వధూవరులు పెళ్లిలో పెట్టుకునే కిరీటాల్నీ చేస్తుంటారు. అయితే ఇటీవల దీంతో చేసే కళారూపాల సంఖ్య పెరిగింది. అచ్చం థెర్మాకోల్‌ లేదా స్టైరోఫోమ్‌ మాదిరిగా ఉండటంతోపాటు సోలాపిత్‌కి ఉన్న మెరుపు కారణంగా వీటితో అందమైన బొకేల్నీ చేస్తున్నారు. దాంతో అవి ప్రపంచం నలుమూలలకీ ఎగుమతి అవుతున్నాయి. పాశ్చాత్య దేశాల్లో వధువు చేతికిచ్చే పుష్పగుచ్ఛాలనూ ఈ కాండంతోనే చేస్తున్నారట. పైగా సహజ పూలని తలపించేలా వాటికి రంగుల్నీ అద్దుతున్నారు. ఇంట్లో అలంకరించుకునే కాక్టస్‌ మొక్కలనీ, పెళ్లిలో వేసుకునే వరమాలల్నీ కూడా ఈ పూలతోనే చేస్తున్నారు. మగువలు సిగలో తురుముకునే మల్లెపూల మాల అయితే అసలు పూలనే మరిపించేంత స్నిగ్ధ సోయగంతో మెరిసిపోతుంది. పైగా ఈ చెక్క పూలు తేలికగా ఉంటాయి, వాడిపోవు అన్న కారణంతో నేటితరం అమ్మాయిలు వీటిని అలంకరించుకుంటున్నారట. వీటితో బొమ్మలూ తొలుబొమ్మలూ చిత్రపటాలూ మీనియేచర్‌ విగ్రహాలూ... ఇలా ఎన్నో చేస్తుంటారు. అయితే, అసలైన షోలాపిత్‌ అందాలు చూడాలంటే బెంగాలీయుల దుర్గాపూజ మహోత్సవాల్ని చూసితీరాల్సిందే. ఆ సమయంలో అక్కడ వెలిసే పండాల్స్‌లోని విగ్రహాలకి తెల్లని షోలాపిత్‌ అలంకారాలే కనిపిస్తాయి. కొందరు కళాకారులైతే విగ్రహాల్ని కూడా ఈ చెక్కతోనే చేసి ఔరా అనిపిస్తుంటారు. అక్కడనే కాదు, ఇంట్లో చేసుకునే పూజలూ పండగల వేళలోనూ పెళ్లి వేడుకల్లోనూ కూడా వేదిక వెనుకభాగంలో ఈ చెక్కతో చెక్కిన వాటిని బ్యాక్‌డ్రాప్‌గా వాడుతుంటారు. ఇక, వేసవిలో పశ్చిమ
భారతావనిలో ఈ కాండంతో చేసిన టోపీల వాడకమూ ఎక్కువేనట. తేలికగా ఉండటంతోపాటు గాలి ఆడతాయని అనేక దేశాల్లో ఈ పిత్‌ టోపీలు పెట్టుకుంటుంటారు. క్రమేణా వీటి వాడకం తగ్గినప్పటికీ రక్షణదళాల్లో ఈ టోపీల్ని నేటికీ వాడుతున్నారట.

ఎక్కడెక్కడ?

బెంగాల్‌, అసోం, ఒడిశా ప్రాంతాల్లో ఎక్కువగా పెరుగుతాయీ షోలాపిత్‌ మొక్కలు. అందుకే ఆయా రాష్ట్రాల్లో ఈ కాండంతో కళారూపాలు చెక్కుతుంటారు. అలాగని ఈ కాండం మరీ లావుగా ఉండదు. రెండుమూడు అంగుళాలే ఉంటుంది. మృదువుగా ఉండే ఈ కాండంతో కోరిన రూపం తీసుకురావడం అంత సులభమేమీ కాదు. ఏ చిన్న తప్పు జరిగినా అది పాడైపోతుంది. కానీ అక్కడి కళాకారులకి ఇది వెన్నతో పెట్టిన విద్య. ఈ మొక్కలు బెంగాల్‌లోని అన్ని జిల్లాల్లోనూ పెరిగినా బిర్బూమ్‌, బర్ద్వాన్‌, ముర్షిదాబాద్‌, హుగ్లి, దక్షిణ 24 పరగణాల జిల్లాల్లోనే ఈ కళారూపాలు ఎక్కువగా తయారవుతాయి. అక్కడి నుంచి దేశవిదేశాలకు ఎగుమతి అవుతుంటాయి. ఇప్పుడిప్పుడు ఈ మొక్కల్ని తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోనూ పెంచడమే కాదు, అక్కడా వీటితో కళారూపాల్ని చేస్తున్నారు. కాండం ముదిరాక మొక్కను పీకి ఎండబెడతారు. తరవాత పై భాగాన్ని తీసి లోపలున్న తెల్లని బెండులాంటి కాండాన్ని కావలసిన సైజుల్లో కోసి లేదా పొరలా చీల్చి, వాటిని అతికిస్తూ చెక్కుతూ కోరిన రూపం వచ్చేలా చేస్తారు.

వివాహ వేడుకలో...

ఈ కాండంతో కళారూపాల్ని చేసేవాళ్లని మాలక్కార్‌ అని పిలుస్తారు. అంటే మాల కట్టేవాడని అర్ధం. అత్యంత పురాతనమైన ఈ కళ ఎప్పటిదో తెలియదు కానీ ఈ మొక్క కాండం తెల్లగా ఉండటంతో దీంతో చేసిన నగల్నీ కిరీటాల్నీ ఎంతో పవిత్రమైనవిగా భావించి శుభకార్యాలకీ పండగలకీ వాడతారు. ముఖ్యంగా బెంగాలీ పెళ్లి వేడుకలో వధూవరులు ధరించే టోపార్‌, ముకుత్‌ అనే కిరీటాలు దీంతోనే తయారవుతాయి. ఇటీవల ఇంటీరియర్‌ డిజైనింగ్‌లోనూ ఈ బెండు అందాల్ని వాడుతున్నారట. ఈమధ్య పాట్‌పోరిలోని పూలూ, వేజ్‌ల్లో పెట్టే ఎండుపూలనీ కూడా షోలాపిత్‌ తోనే చేస్తున్నారు. వీటిని గాజు వాటిలో సీలు చేసి మరీ దూరప్రాంతాలకు పంపిస్తారు.

ఈ మొక్క వెనుక ఓ పౌరాణిక గాథా

ప్రచారంలో ఉంది. ఒకసారి శివుడు విశ్వకర్మతో తన వివాహవేడుకలో ధరించేందుకు స్వచ్ఛమైన ధవళ వర్ణంలో మెరిసే పూలమాలనీ కిరీటాన్నీ తయారుచేసివ్వాలని కోరగా ఆయన చేయలేకపోయాడట. అప్పుడు శివుడు తన తలలోని వెంట్రుకల్ని తీసి అక్కడే ఉన్న సరస్సులో పాతగా దాన్నుంచి ఓ ప్రత్యేకమైన మొక్క వచ్చిందట. దాన్ని పీకి విశ్వకర్మకి ఇచ్చి మాల తయారుచేయమన్నాడట. అప్పటికీ అతనికి దాంతో ఏం చేయాలో తెలియలేదట. అప్పుడు శివుడు తన చేతిమీద ఉన్న వెంట్రుకల్ని కొలనులో వేయగా
ఓ యువకుడు పుట్టాడట. అతను ఆ తెల్లని కాండంతో పరమేశ్వరుడికి కిరీటాన్నీ మాలనీ చేసిచ్చాడట. అప్పుడు అతనికి మాలక్కార్‌ అనే పేరుని శివుడే పెట్టాడనీ చెబుతారు. అందుకే ఎంతో పవిత్రమైనదిగా భావించే ఈ మొక్క బెండుతో చేసిన కిరీటాన్ని బెంగాలీయులు పెళ్లిలో ధరిస్తుంటారు. ఒడిశాలో రథయాత్ర సమయంలో జగన్నాథుడికి పెట్టే కిరీటాన్నీ వీటితోనే చేస్తారట.

కొందరు ఈ కళ మొఘల్స్‌ కాలంనాటిదనీ అంటారు. అప్పట్లో పాలరాయి లేదా ఏనుగు దంతాలతో చేసే కళారూపాలు సంపన్నులకే పరిమితంగా ఉండేవి. ఆ సమయంలో అంతే స్వచ్ఛమైన తెలుపుతో మెరిసే షోలాపిత్‌ స్థానిక కళాకారుల్ని ఆకర్షించింది. దాంతో తక్కువ ధరలో దొరికే షోలాపిత్‌తో విగ్రహాలనీ పల్లకీల్నీ చేయడం ప్రారంభించారట. ఆ తరవాత ఏనుగు దంతాలను సేకరించడం చట్ట వ్యతిరేకం కావడంతో దానికి ప్రత్యామ్నాయంగా ఈ చెక్కతో కళాత్మక వస్తువుల్ని రూపొందించడం పెరిగిందట. అందుకే వీటిని దూరం నుంచి చూస్తే పాలరాయి లేదా ఏనుగు దంతంతో చేసినవనే అనుకుంటారు. కాలం గడిచేకొద్దీ వీటి రంగు గోధుమ రంగులోకి మారుతుంది. కానీ గాజుఫ్రేముల్లో భద్రపరిస్తే ఎప్పటికీ అలాగే నిలిచి ఉంటుందట. కాబట్టి ఇంట్లోనే కాదు, వేడుకల్లో ప్లాస్టిక్‌ పూలకి బదులుగా షోలాపిత్‌ పూలని అలంకరించినా, నిమజ్జనం వేడుకల్లో ఈ కాండంతో చేసిన దేవతారూపాల్ని నీళ్లలో కలిపినా పర్యావరణానికి ఎలాంటి నష్టం వాటిల్లదు. అందుకే ప్రపంచ పర్యావరణవేత్తలంతా షోలావుడ్‌ పూలకీ జై
అంటున్నారు.

మీరేమంటారు?


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..