మీకు ఏ వయసు పాప కావాలి?

‘కలిసొచ్చే రోజొస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడు...’ అని ఓ సామెత. ఈ పిల్లల్ని చూస్తే అది నిజమే అనిపించకమానదు. అమ్మానాన్నల కోరికమేరకు ఎలా కావాలంటే అలానే కాదు, ఎంత వయసులో

Updated : 23 Jan 2022 07:14 IST

మీకు ఏ వయసు పాప కావాలి?

‘కలిసొచ్చే రోజొస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడు...’ అని ఓ సామెత. ఈ పిల్లల్ని చూస్తే అది నిజమే అనిపించకమానదు. అమ్మానాన్నల కోరికమేరకు ఎలా కావాలంటే అలానే కాదు, ఎంత వయసులో కావాలంటే అంత వయసులో పిల్లల్ని పుట్టించేస్తున్నారు. అవునండీ... వీళ్లంతా అలా పుట్టినవాళ్లే మరి..!

సైన్స్‌ ఫిక్షన్‌ సినిమాలోలా ఎన్టీఆర్‌ ముక్కూ శోభన్‌బాబు రింగులజుట్టూ సావిత్రి ముఖమూ శ్రీదేవి ఒడ్డూపొడుగూ ఉండేలా పిల్లల్నీ డిజైన్‌ చేయించుకోవచ్చనీ వాళ్లకి నాలుగైదేళ్లు వచ్చేవరకూ ప్రయోగశాలలోనే పెంచి ఇచ్చేస్తున్నారేమోననీ ఊహించేస్తున్నారా... సైన్స్‌ ఇంకా ఆ స్థాయికి ఎదగలేదు కానీ... వీళ్లంతా బొమ్మ పిల్లలు... కళాకారుల చేతిలో రూపుదిద్దుకున్న రీబోర్న్‌ డాల్స్‌..!

అసలేమిటీ రీబోర్న్‌?

ప్లాస్టిక్‌ బొమ్మల తయారీ తెలిసిందే. మార్కెట్లో దొరికే ఆ వినైల్‌ బొమ్మల్నిగానీ విడిభాగాల్నిగానీ కొని, అచ్చం పిల్లల్లానే వాటికో కొత్త రూపునిస్తున్నారు కళాకారులు. వాటినే రీబోర్న్‌ డాల్స్‌ లేదా రీబోర్నర్స్‌ అంటున్నారు. నిన్నమొన్నటిదాకా ఆ రియలిస్టిక్‌ డాల్స్‌లో పసిపిల్లలే ఎక్కువ. కానీ ఇప్పుడు వాటిని నడకొచ్చిన చిన్నారుల్లానూ రూపొందిస్తున్నారు.

ఈ రీబోర్న్‌ కళ ఐరోపా, పాశ్చాత్య దేశాల్లో 1990లలో మొదలై, భారీ పరిశ్రమగా ఎదిగిపోయింది. రీబోర్న్‌ డాల్స్‌కోసం కొన్ని సంస్థలు ముడి బొమ్మలతో కిట్స్‌ను తయారుచేస్తుంటే, తమదైన సృజనతో వాటిని పిల్లల్లా తీర్చిదిద్దుతున్నారు కళాకారులు. వీటి ఖరీదు సైతం లక్షల రూపాయల్లో ఉంటుంది. ఈ రీబోర్న్‌ డాల్స్‌ కోసం రకరకాల యాక్సెసరీల్నీ దుస్తుల్నీ కూడా కొన్ని సంస్థలు రూపొందిస్తున్నాయి. అయితే చిన్నారుల సైజుల్లోనే బొమ్మలు ఉండటంతో పిల్లల దుస్తుల్నే కొంటున్నారట. ఆడుకునే పిల్లల కన్నా- పిల్లలు పుట్టనివాళ్లూ ప్రమాదవశాత్తూ బిడ్డల్ని కోల్పోయినవాళ్లూ ఆ బాధని మరిచిపోయేందుకు ఈ బొమ్మల్ని కొనడమే ఎక్కువ. పిల్లల్ని ఎత్తుకున్న భావనే వీటివల్లా కలగడంతో కొన్ని హార్మోన్లు విడుదలై తల్లులు ఆనందంగా ఉంటున్నారని మానసిక నిపుణులూ చెబుతున్నారు. పిల్లల స్థానాన్ని భర్తీ చేయలేకపోయినా ఈ బొమ్మలతో కొంత ఊరట కలుగుతుందట. దాంతో ఎవరైనా పిల్లల ఫొటో ఇస్తే అచ్చం అలాగే చేసి ఇవ్వసాగారు కొందరు కళాకారులు. కొంతమంది తల్లిదండ్రులు పిల్లలకి తోడుగా ఉండేందుకూ వీటిని కొని, సినిమాలకీ షికార్లకీ కూడా తీసుకెళుతున్నారు. దాంతో కారు పార్కింగుల్లోనూ లేదా ట్రాలీల్లోనూ ఈ బొమ్మల్ని వదిలి నప్పుడు, నిజంగా చిన్నారులే అనుకుని పోలీసులు అమ్మానాన్నలకోసం వెతికిన సందర్భాలు విదేశాల్లో చాలానే ఉన్నాయి.

ఎలా చేస్తారు?

ప్లాస్టిక్‌ బొమ్మకి ముందుగా నీలం రంగు పూసి ఆపై వాటికి 15 నుంచి 30 పొరల్ని ప్రత్యేక స్పాంజితో పెయింట్‌ చేస్తారు. దాంతో చర్మంలోపల రక్తనాళాలూ కనిపిస్తూ ఎంతో సహజంగా జీవం తొణికిసలాడుతూ ఉంటాయి. ఆపై కళ్లూ ముక్కూ తీర్చిదిద్దుతారు. నిజమైన వెంట్రుకల్నే పెడతారు. గుండెచప్పుడు వినిపించేలానూ చిన్న మాటలు మాట్లాడేలానూ లోపల ఎలక్ట్రానిక్‌ పరికరాల్ని అమరుస్తున్నారు. బుజ్జాయిలు పెరుగుతున్నట్లే ఏడాదికీ మూడేళ్లకీ ఐదేళ్లకీ బొమ్మలూ పెరిగేలా రీ డిజైన్‌ చేయించుకునేవాళ్లూ ఉన్నారట. పిల్లల్లానే ఈ బొమ్మల్నీ నడిపిస్తున్నారు... ఆడిస్తున్నారు... వాటికోసం గదులూ ఏర్పాటుచేస్తున్నారు. అందుకే ఇవి బొమ్మ పిల్లలు..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..