Published : 17 Oct 2021 00:36 IST

పొలమైనా ఇల్లయినా స్వామి పేరుమీదే..!

ఆస్తి పత్రాలు లేకపోతే కుటుంబ సభ్యుల మధ్యే గొడవలు వస్తున్న రోజులివి. రాజస్థాన్‌లోని అజ్‌మేర్‌ జిల్లాలో ఉన్న దేవ్‌మలి గ్రామం మాత్రం ఇందుకు పూర్తి మినహాయింపు. సుమారు రెండు వేల జనాభా ఉన్న ఆ ఊళ్లో ఏ ఒక్కరి పొలాలకూ, ఇళ్ల స్థలాలకూ పత్రాలుండవు. అన్నీ అక్కడి ప్రజలు కొలిచే దేవ్‌నారాయణ్‌ స్వామి వారి పేరుమీదే ఉంటాయి. తమ తాతలూ తండ్రులూ సాగు చేసిన భూమి, ఉన్న ఇళ్ల స్థలాలూ తర్వాతి తరానికి వారసత్వంగా వచ్చాయి అంతే. ఇప్పటికీ అక్కడ ఎవరైనా పొలాన్ని కొన్నా అమ్మినా అది అనధికారికంగానే జరుగుతుంది తప్ప ప్రభుత్వ లెక్కల్లోకి రాదు. మరో విచిత్రం ఏంటంటే... ఆ ఊరి మొత్తమ్మీదా సిమెంటుతో కట్టిన ఒక్క ఇల్లు కూడా కనిపించదు. అన్నీ మట్టి ఇళ్లే. అది వారి ఆచారం. వారి ఆరాధ్య దైవమైన దేవ్‌నారాయణ్‌ స్వామి ఓసారి దేవ్‌మలి గ్రామానికి వచ్చి, తనకు పక్కా ఆలయాన్ని నిర్మించేవరకూ గ్రామంలో పక్కా ఇళ్లను నిర్మించడం మంచిది కాదని చెప్పారట. తర్వాతి కాలంలో స్వామివారికి కాంక్రీటుతో గుడిని కట్టారు కానీ తాము మాత్రం ఎప్పటికీ మట్టి ఇళ్లలోనే ఉంటామని గుడిలోని స్వామికి వాగ్దానం చేశారట ప్రజలు. మాట తప్పితే ఊరుకి ముప్పు వస్తుందన్నది వారి నమ్మకం.


దిండాటలో జాతీయ పోటీలు

ఇంట్లో పిల్లలు సరదాగా దిండ్లతో కొట్టుకుంటుంటే... ‘ఏంటా అల్లరి’ అంటుంటారు పెద్దవాళ్లు. ఆశ్చర్యం ఏంటంటే... ఈ ‘పిల్లో ఫైట్‌’ జపాన్‌లో జాతీయస్థాయి క్రీడ. ఏటా ఛాంపియన్‌షిప్‌ పోటీలు కూడా జరుగుతుంటాయి. ఇందులో జిల్లా, రాష్ట్ర స్థాయుల్ని దాటినవారు స్థానిక ఇటో నగరంలో జరిగే జాతీయస్థాయి పోటీలకు అర్హులవుతారు. పోటీల్లో రెండు టీమ్‌ల సభ్యులూ గీతకు అటూ ఇటూ ఉండి దిండ్లను విసురుకుంటారు. ఒక బృందం సభ్యులు విసిరిన దిండు మరో బృందంలోని కెప్టెన్‌కి తాకితే ఆ టీమ్‌ పాయింట్‌ కోల్పోయినట్లు. అలా తగలకుండా రెండు బృందాల్లో ఒక్కో పోటీదారు దుప్పటితో దిండుని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తారు. మిగిలినవాళ్లు దిండుతో కొట్టుకునే పనిలో ఉంటారు.


రోజుకి అరగంటే నిద్రపోతాడట!

మనకు రెండు మూడు రోజులు వరుసగా ఓ గంటా రెండు గంటల నిద్ర తగ్గితే ఒంట్లో ఉత్సాహం కూడా తగ్గినట్లనిపిస్తుంది. జపాన్‌కి చెందిన డాయ్‌సుకె హొరి మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. ఇతగాడు గత పన్నెండేళ్లుగా రోజుకి కేవలం అరగంట మాత్రమే నిద్రపోతున్నాడట. స్థానిక ‘షార్ట్‌ స్లీపర్‌ అసోసియేషన్‌(తక్కువగా నిద్రపోయే సంఘం)’కి ఛైర్మన్‌ అయిన హొరి ఎన్నో ఏళ్లుగా తన నిద్రా సమయాన్ని కొద్ది కొద్దిగా తగ్గించుకుంటూ చివరికి అరగంటకు తెచ్చాడట. అయినా ఏ ఆరోగ్య సమస్యలూ లేవట. ‘మన జీవితంలో చాలా సమయం నిద్రకే వృథా అవుతోంది. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికే మా సంఘంలోని సభ్యులు ప్రయత్నిస్తుంటారు’ అంటాడు హొరి. ‘ఇతడు నిజమే చెబుతున్నాడా’ అని తెలుసుకోవడానికి ఓ టీవీ ఛానెల్‌ మూడు రోజుల పాటు అతడి దినచర్యను షూట్‌ చేసింది కూడా.Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని