ఎవరో వస్తారని... ఎదురుచూడలేదు!

‘ఎవరో వస్తారని... ఏదో చేస్తారని... ఎదురుచూసి మోసపోకుమా... నిజము మరచి నిదురపోకుమా!’ - మహాకవి శ్రీశ్రీ పాట ఇది. ప్రభుత్వాల నిర్లక్ష్యంపైన యాభై ఏళ్ల కిందట రాసిన ఆ పాట ఈ మూడు ఊళ్ళ విషయంలో ఇప్పటికీ వర్తిస్తూనే ఉంది.

Published : 10 Sep 2022 23:45 IST

ఎవరో వస్తారని... ఎదురుచూడలేదు!

‘ఎవరో వస్తారని... ఏదో చేస్తారని... ఎదురుచూసి మోసపోకుమా... నిజము మరచి నిదురపోకుమా!’ - మహాకవి శ్రీశ్రీ పాట ఇది. ప్రభుత్వాల నిర్లక్ష్యంపైన యాభై ఏళ్ల కిందట రాసిన ఆ పాట ఈ మూడు ఊళ్ళ విషయంలో ఇప్పటికీ వర్తిస్తూనే ఉంది. వంతెనా, రోడ్డూ, పోస్టాఫీసుల కోసం ప్రజలు చేస్తున్న వినతులను ప్రభుత్వం పట్టించుకోలేదు. చూసిచూసి వేసారిన ప్రజలు ఇక సర్కారు ఏదో చేస్తుందని ఎదురుచూస్తూ కూర్చోకూడదనుకున్నారు. లక్షల రూపాయల ఖర్చుతో తమకుతామే వాటిని నిర్మించుకున్నారు. ఎలా చేశారో చూడండి...


సొంత డబ్బుతో రోడ్డు వేయించారు!

చంద్రశేఖరన్‌ది తమిళనాడులోని విళుప్పురం జిల్లా నల్లవూరు అనే మారుమూల గ్రామం. ఆ గ్రామానికి పక్కా రోడ్లు వేసి దాదాపు పాతికేళ్లవుతోందట. అప్పటి నుంచీ పట్టించుకునే నాథుడు లేకపోవడంతో వీధులన్నీ గుంతలమయమైపోయాయి. ఆ మధ్య ‘వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌’ తీసుకుని స్వగ్రామంలోనే ఉంటున్న చంద్రశేఖరన్‌ దృష్టి రోడ్లపైన పడింది. ఈ సమస్యకి పరిష్కారం కావాలంటూ పంచాయతీ ఆఫీసుకి వెళితే నిధులు లేవన్నారట. కనీసం తన వీధికైనా రోడ్డు వేయించాలనుకున్న చంద్రశేఖరన్‌... తన పెళ్ళికని దాచుకున్న పదిలక్షల రూపాయల్ని ఖర్చుపెట్టాలనుకున్నాడు! ఆ నిర్ణయానికి తల్లిదండ్రులు అడ్డుచెప్పలేదు కానీ స్థానిక రాజకీయనాయకులు మోకాలడ్డటం మొదలుపెట్టారు. దాంతో కలెక్టర్‌ కార్యాలయం నుంచి అనుమతులు తీసుకున్న చంద్రశేఖరన్‌... 230 మీటర్ల పొడవున్న తమ వీధికి కాంక్రీట్‌ రోడ్డుని వేయించాడు! చంద్రశేఖరన్‌ పరోపకారాన్నీ పట్టుదలనీ మెచ్చుకుంటూ పత్రికల్లో వార్తలు వచ్చాకకానీ ప్రభుత్వం దారికిరాలేదు. గ్రామంలోని మిగతావీధుల్లో రోడ్డు పనుల్ని ఇటీవల మొదలుపెట్టింది.


పోస్ట్‌ ‘ఆఫీస్‌’ కట్టించారు!

‘ఈ కాలంలోనూ పోస్ట్‌ ఆఫీసుల అవసరమేంటీ!’ అని మనం అనుకోవచ్చుకానీ... ఆ కుగ్రామంలోని ప్రజలు అలా అనుకోరు. ప్రయివేటు కొరియర్‌ సర్వీస్‌లకి చాలా దూరంలో ఉన్న ఆ ఊరికి ఏ పార్సిల్‌ రావాలన్నా పోవాలన్నా తపాలా కార్యాలయమే శరణ్యం. పేటీఎంలూ, ఏటీఎంల గురించి పెద్దగా తెలియని వీళ్లకి... మనియార్డర్‌లే కీలకం. అందుకే ఒడిశా కేంద్రపారా బ్లాక్‌లోని గాగువా గ్రామానికి చెందిన గిరిజనులు పాడుపడిపోయిన పోస్టాఫీసుని సొంత డబ్బుతో నిర్మించి ఇచ్చారు. ఈ పోస్టాఫీసు 1927 నాటిది. మొదట్నుంచీ పూరిగుడిసెలో ఉంది. అదీ కొన్నేళ్లకిందటే కూలిపోయే పరిస్థితికి వచ్చింది. ఈ గిరిజన ప్రాంతంలోని దాదాపు సగంమంది ఇందులో పొదుపు ఖాతా ఉన్నవారే కావడంతో... ఈ తపాలా కార్యాలయాన్ని బాగుచేయాలని ఎన్నో ఏళ్లుగా కోరుతున్నా అధికారులు పట్టించుకోలేదు. ‘ఆ పోస్టాఫీసుకి నెలవారీ ఖర్చులకిగాను కేటాయిస్తున్నది రూ.250 మాత్రమే. అది తప్ప ఇంకే ఖర్చూ పెట్టలేం’ అనేశారట. దాంతో ఇక్కడి గిరిజనులే చందా వేసుకుని సిమెంట్‌తో కూడిన పక్కా భవనాన్ని నిర్మించాలనుకున్నారు. నిర్ణయం తీసుకున్నదే తడవుగా రెండు లక్షలు సేకరించారు. తలా ఓ చేయి వేసి ఇటీవలే నిర్మాణం పూర్తిచేసి... తపాలా ఉన్నతాధికారులకి తాళాలిచ్చారు!


వంతెన నిర్మించారు...

ప్రకాశం జిల్లాలోని అతిపెద్ద నది గుండ్లకమ్మ. కురిచేడు, త్రిపురాంతకం మండలాలు ఆ నదికి చెరోవైపున ఉంటాయి. ఈ రెండు మండలాలని కలుపుతూ ఓ వంతెన కట్టాలని ఇక్కడి ప్రజలు ఎప్పటి నుంచో కోరుతున్నా ఏ ప్రభుత్వమూ పట్టించుకోలేదు. వంతెన లేకపోవడం వల్ల కురిచేడు మండలంలోని ప్రజలు త్రిపురాంతకం మండలకేంద్రానికి వెళ్లాలంటే 40 కి.మీ చుట్టుతిరిగి ప్రయాణించాలి. అదే కురిచేడు మండలంలో ఉన్న ఎం.గంగవరం- త్రిపురాంతకం మండలంలోని ముడివేముల మధ్య నదిపైన ఓ వంతెన కడితే... ఆ ప్రయాణదూరం 15 కిలోమీటర్లకి తగ్గుతుంది. వంతెన లేకపోవడం వల్ల వ్యవసాయపనులప్పుడు కూలీలు వచ్చిపోవడమూ కష్టంగా ఉండేది. ఇదే అదనుగా కొందరు బల్లకట్టు ఏర్పాటుచేసి నదిని దాటిస్తూ ప్రయాణికుల నుంచి అధికమొత్తం వసూలు చేసేవారు.

ఈ సమస్యని ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో తామే ముందుకు కదిలారు రెండు మండలాలకి చెందిన పదహారు గ్రామాల ప్రజలు! చందాల ద్వారా రూ.20 లక్షలు సేకరించి... 46 మీటర్ల పొడవైన వంతెన నిర్మాణానికి నడుంబిగించారు. ఏ ప్రభుత్వ ఇంజినీరు సాయమూ లేకుండానే వంతెన నిర్మాణాన్ని మూడునెలల్లో పూర్తిచేసి ఇటీవలే ప్రారంభోత్సవమూ జరుపుకున్నారు!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..