Published : 01 May 2022 00:39 IST

వాచీ మేళా!

 

వాచీలు టైం కోసమే అన్న భావన పోయి అవి కూడా జ్యువెలరీలో ఓ భాగమనే కాలం వచ్చేసింది. అందుకే అన్నింటా పుట్టుకొస్తున్న నయా ట్రెండ్సూ ఎప్పటికప్పుడు చేతి మీదా ప్రత్యక్షమవుతున్నాయి. సరికొత్తగా వచ్చిన ఆ వాచీలేంటో ఒకసారి చూసేద్దామా!


అటు చిత్రం... ఇటు సమయం!

వాచీల్లో కొత్త లుక్కు తీసుకురావడానికి తయారీదారులు మెటల్‌ నుంచి లెదర్‌ వరకూ రకరకాల స్ట్రాపుల్ని మారుస్తుంటారు. తెలుపూ నలుపుల నుంచి రెయిన్‌బో రంగుల వరకూ డయళ్లనీ తీర్చిదిద్దుతుంటారు. అవన్నీ కాదు, ఇంకా అంతకుమించి కొత్తదనంతో ఈతరాన్ని ఆకట్టుకోవాలి అంటూ కొన్ని లగ్జరీ వాచీ కంపెనీలు రివర్సబుల్‌ వాచీల్ని తీసుకొచ్చాయి. జెజేర్‌ లెకొట్రె కూడా ఇలాంటి వాచీల్ని తయారుచేసింది. అయితే డయల్‌ను అటూ ఇటూ తిప్పేయడానికి వీలుగా ఉండే ఈ వాచీల్లో ఒకవైపు సమయం చూసుకోవచ్చు సరే, మరో వైపు సాదాగా ఉండటం ఎందుకు అనుకున్నారో ఏమో, ఆర్ట్‌ వర్క్‌తో అదనపు సొబగులు తీసుకొచ్చారు. మామూలుగా చూస్తే టైమ్‌ చూపించే డయలే కనిపించినా దాన్ని మరో వైపు తిప్పగానే చక్కని బొమ్మ కనిపిస్తుంది. ఎనామిల్‌ రంగులూ, రాళ్లచమక్కుల్ని అద్దిన పూలసోయగాలూ, ముచ్చటైన చిత్రాలూ ఉంటాయన్నమాట. కాస్త వైవిధ్యాన్ని ఇష్టపడేవారికి ఈ రివర్సబుల్‌ ఆర్ట్‌ వాచీ కచ్చితంగా నచ్చుతుంది!


డయల్‌ కాన్వాస్‌ అయితే...

ఒకప్పుడు గోడమీద ఫ్రేముల్లోనే ఎక్కువగా కనిపించే అందమైన పెయింటింగ్స్‌ నెమ్మదిగా ఫ్యాషన్‌ రంగంలోకీ దూకేశాయి. అమ్మాయిల చీరల నుంచి కుర్తీల వరకూ రకరకాల డ్రెస్సుల మీదకు చేరిపోయాయి. ఇప్పుడా కనువిందు చేసే చిత్రాలు వాచీల్లోకీ వచ్చేశాయి. ‘హ్యాండ్‌ పెయింటెడ్‌’ పేరుతో చూడచక్కని చిత్రాల వాచీలు మార్కెట్లో దొరుకుతున్నాయి. డయల్నే ఇప్పుడు కాన్వాసుగా చేసుకుని ఈ కొత్తరకం వాచీల్ని తీసుకొచ్చారు. అల్లుకున్న లతలూ తీగలూ, సూర్యోదయమూ, పంటపొలాలూ వంటి ప్రకృతి చిత్రాలు... వినాయకుడూ, శివపార్వతులూ లాంటి దేవీదేవతలు... ఇంకా అందమైన అమ్మాయిలూ, పిచ్వాయి ఆర్టూ, రకరకాల జంతువుల బొమ్మలూ...ఇలా ఎన్నెన్నో చిత్రాల్ని ఈ వాచీల మీద చూడొచ్చు. ఆన్‌లైన్లో అందుబాటులో ఉన్న ఈ పెయింటింగ్‌ వాచీల్ని కావాలంటే కస్టమైజ్డ్‌గా మనకు నచ్చిన బొమ్మలతో ప్రత్యేకంగా చేయించుకోవచ్చు కూడా. ఈసారెప్పుడైనా ప్రియమైనవారి పుట్టినరోజునో, పెళ్లిరోజునో ఈ వాచీని బహుమతిగా ఇచ్చి ఆశ్చర్యపరచండి. చూసినవారంతా ‘అరె, ఈ వాచీ సమయం తెలుసుకోవడానికా... అందులోని చక్కని బొమ్మను చూడ్డానికా’ అంటూ సందిగ్ధంలో పడతారంతే!


స్మార్ట్‌వాచీకీ జ్యువెలరీ చెయిన్‌!

ఫోన్‌ చేసే పనులన్నింటినీ వాచీతో చేసుకోవడానికి వీలుగా బోలెడన్ని ఆప్షన్లతో స్మార్ట్‌వాచీలు వస్తున్నాయి. అయితే ఇవన్నీ కూడా ఇంచుమించు ఒకేరకమైన డయలూ, స్ట్రాపులతో వస్తూ ఈతరం వారిని అంతగా మెప్పించలేకపోతున్నాయి. అందుకే స్మార్ట్‌వాచీల పనితీరు మాట అటుంచితే, వాటి లుక్కు వల్ల కొంతమంది అమ్మాయిలు పెట్టుకోవడానికి ఇష్టపడరు. అలాంటి వారికోసమే ఇప్పుడు జ్యువెలరీ చెయిన్‌ స్మార్ట్‌ వాచీలు వస్తున్నాయి. స్టీలూ, బంగారు రంగు చెయిన్లతో రకరకాల డిజైన్లలో దొరుకుతున్నాయి. అంతేకాదు, ఆపిల్‌ లాంటి బ్రాండెడ్‌ స్మార్ట్‌వాచీలకు తగ్గట్టు విడివిడిగా చెయిన్‌ స్ట్రాపులూ, ఇతర యాక్సెసరీలూ వస్తున్నాయి. కావాలంటే వాటి బెల్టుల్నిమార్చి నచ్చిన జ్యువెలరీ చెయిన్‌ సెట్‌ చేసుకోవచ్చు. డయల్‌పైన కూడా మెరిసే రాళ్లతో ఉండే వాచీ కేసుల్నీ అమర్చుకోవచ్చు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని