పిల్లలూ కట్టొచ్చు తాజ్‌మహల్‌!

‘జిగ్సా పజిల్‌’ పూర్తిచేస్తే ఓ చక్కని చిత్రమో, ఇచ్చిన ఫొటోనో రావడం మనకు తెలిసిందే. కానీ అదే ముక్కలు అతికిస్తూపోతే ఓ అందాల మేడనో, అద్భుతమైన కట్టడమో, ఆకట్టుకునే విమానమో

Published : 17 Apr 2022 00:25 IST

పిల్లలూ కట్టొచ్చు తాజ్‌మహల్‌!

‘జిగ్సా పజిల్‌’ పూర్తిచేస్తే ఓ చక్కని చిత్రమో, ఇచ్చిన ఫొటోనో రావడం మనకు తెలిసిందే. కానీ అదే ముక్కలు అతికిస్తూపోతే ఓ అందాల మేడనో, అద్భుతమైన కట్టడమో, ఆకట్టుకునే విమానమో ప్రత్యక్షమైతే ఆ పజిల్‌ మస్త్‌ మజాగా అనిపించదూ! ఇదిగో ఈ ‘త్రీడీ జిగ్సా పజిళ్ల’తో అచ్చంగా ఆ అనుభూతిని పొందొచ్చు!

పిల్లల్లో సృజనాత్మకత పెంచడానికి ఉపయోగపడేలా మార్కెట్లో రకరకాల పజిళ్లు వస్తుంటాయి. అందులో జిగ్సా ఒకటి. దీంట్లో ముక్కలన్నీ వరసగా పేర్చుతూపోతే పజిల్‌ పూర్తి అవుతుంది. కాస్త చిన్నపిల్లలైతే సరేగానీ, పదేళ్లు దాటిన పిల్లలెవరైనా వీటిని నిమిషాల్లో పెట్టేయగలరు. అందుకే అలాంటి పెద్ద పిల్లలకోసం మెదడుకు పనిపెట్టేలా ఇప్పుడు కాస్త క్లిష్టంగా జిగ్సా పజిల్‌ని త్రీడీ రూపంలోకి తీసుకొచ్చారు. వందలకొద్దీ ముక్కల్ని పేర్చితేనే ఈ పజిల్‌ పూర్తవుతుంది. అప్పుడే కనువిందు చేసే బొమ్మ ఒకటి కళ్లముందు కనిపిస్తుంది. ఇక్కడున్న తాజ్‌మహలూ, అదిరిపోయే భవంతులూ, చూడచక్కని ఇళ్లూ, రైలూ, డబుల్‌ డెక్కర్‌ బస్సూ, కారూ, ఓడా, విమానమూ... అన్నీ అలా వచ్చినవే. ఇవే కాదు... ప్రపంచంలోని మరెన్నో ప్రసిద్ధ నిర్మాణాలూ ఈ పజిల్స్‌ రూపంలో దొరుకుతాయి.

‘మామూలు జిగ్సా పజిల్లో అయితే కాస్త ఆలోచిస్తూ ముక్కల్ని ఒకదాని పక్కన ఒకటి కలుపుతూ పోతే సరిపోతుంది. కానీ ఈ త్రీడీ బొమ్మ రావాలంటే చాలా కష్టమేమో, పిల్లలు అస్సలు చేయలేరేమో’ అనుకుంటున్నారా... అలాంటి ఇబ్బంది లేకుండా, పజిల్‌ బాక్స్‌లో దాంట్లోని బొమ్మకు సంబంధించిన బోలెడన్ని ముక్కలతో పాటూ ఓ చిన్న పుస్తకమూ వస్తుంది. అందులో ఉన్న సూచనల్నీ, బొమ్మపైన ఉన్న రంగులనూ, ముక్కలమీద ఉన్న అంకెలనూ గమనించుకుంటూ ముక్కల్ని కలుపుతూపోతే పజిల్‌ పూర్తై త్రీడీ బొమ్మ రూపం వచ్చేస్తుంది. అట్టముక్కలూ, పాలీఎథిలిన్‌ ఫోమ్‌ షీట్లతో తయారుచేసే ఈ పజిళ్లు చూడ్డానికి మెరిసేరంగుల్లో ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. అయితే ఈ పజిల్‌ చేయడం మరీ అంత సులువేం కాదు... ఎంతో ఏకాగ్రతా, కొన్ని గంటల సమయమూ కావాల్సిందే. ఖాళీగా ఉన్నప్పుడు ఎంచక్కా స్నేహితులతో కలిసి ఈ పజిల్‌ను నిదానంగా పూర్తి చేసుకోవచ్చు. అటు హాయిగా ఆడుకున్నట్టూ ఉంటుంది ఇటు సృజనాత్మకతా, తెలివితేటలూ పెరుగుతాయి. పిల్లలకే కాదు, పెద్దలకూ ఈ పజిల్స్‌ మంచి టైమ్‌పాస్‌. పూర్తిచేసిన పజిల్‌ బొమ్మను కావాలంటే సరదాగా షోకేస్‌లోనూ పెట్టుకోవచ్చు. చిన్నారుల మనసును మెప్పిస్తూనే, వాళ్లకెంతో ఉపయోగపడే బహుమతి ఇస్తే బాగుంటుందనుకునేవారికి ఈ త్రీడీ జిగ్సా పజిల్‌ కచ్చితంగా మంచి ఛాయిస్‌ అవుతుంది!

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..