కార్తికానికి కొత్త శోభ!

కార్తిక మాసమంతా పండుగ వాతావరణమే ఉంటుంది. శివుడితోపాటూ దైవారాధనకు ఉపయోగించే సమస్త పుష్ప, పత్రాలన్నింటిలో ఉత్తమమైనదిగా భావించే తులసి మొక్కనూ ఈ నెల భక్తి శ్రద్ధలతో కొలుస్తుంటారు.

Published : 13 Nov 2022 00:08 IST

కార్తికానికి కొత్త శోభ!

కార్తిక మాసమంతా పండుగ వాతావరణమే ఉంటుంది. శివుడితోపాటూ దైవారాధనకు ఉపయోగించే సమస్త పుష్ప, పత్రాలన్నింటిలో ఉత్తమమైనదిగా భావించే తులసి మొక్కనూ ఈ నెల భక్తి శ్రద్ధలతో కొలుస్తుంటారు. ఆ పూజ మరింత ప్రత్యేకంగా జరిపించుకోవడానికి మార్కెట్లో వచ్చినవే ఇవి!


మెరుపుల కోటలు!

చాలావరకూ ఇళ్లల్లో దేవుని గదితో పాటూ తులసి కోట కూడా ఉంటుంది. అందుకే ఎంతో పవిత్రంగా భావించే తులసి మొక్క కోసం- చూడగానే ఆధ్యాత్మిక శోభ తీసుకొస్తూనే ఆకట్టుకునేలా ఉండేందుకు మార్కెట్లోకి ఎన్నో రకాల కోటలొచ్చాయి. మొదట్లో మట్టి కోటలే ఉంటే ఆ తర్వాత వాటికి బదులు పాలరాయి, కలపతో చేసిన అందమైన తులసి కోటలు ఇంటింటా చేరిపోయాయి. అయితే ఇప్పుడు వెండీ, ఇత్తడీ మెరుపులతో తులసి కోటలు వస్తున్నాయి. ఇలాంటివి ఇదివరకే ఉన్నాయి కదా అంటారేమో... కాస్త ఆగండి. అవన్నీ ఏదైనా వేడుకకు రిటర్న్‌ గిఫ్టులుగా ఇవ్వడానికో, ఇంట్లో పూజ గదిలో పెట్టుకోవడానికో ఉపయోగపడే మినియేచర్‌ తులసి కోట విగ్రహాలు మాత్రమే. కానీ ఇప్పుడు తులసి మొక్కను పెంచేలా పెద్ద పరిమాణంలోనే  వచ్చాయి. అది కూడా లక్ష్మి, గణపతి, విష్ణుమూర్తి... ఇలా దేవుళ్ల బొమ్మలతో ఉంటాయి. అంటే మిగతా పూజ సామగ్రిలో వచ్చిన మార్పులాగే దీంట్లోనూ కొత్తదనం వెల్లివిరుస్తోంది. కోటపైన వెండీ, ఇత్తడీ పూతలే కాబట్టి తక్కువ ధరలోనే లభిస్తూ సరికొత్త శోభను తీసుకొస్తాయి!


తులసి దీపం!

చాలామంది మహిళలు ప్రతిరోజూ ‘తులసి శ్రీసఖి శుభే పాపహారిణి పుణ్యదే’ అంటూ తులసికోటకు ప్రదక్షిణం చేస్తూ ఉదయమూ, సాయంత్రమూ దీపారాధన చేస్తుంటారు. ఏడాది మొత్తం వేరు ఈ నెల సంగతి వేరు. కార్తికంలో పొద్దుపొద్దున్నే తులసి కోట ముందు దీపం వెలిగించాకే రోజును మొదలుపెడతారు. వెలిగించే ఆ దీపం ఇంకాస్త ప్రత్యేకంగా ఉండటానికి ఈమధ్య ‘తులసి దియా’ పేరుతో కొత్తరకం దీపాలు దొరుకుతున్నాయి. తులసి కోట ఆకారంలో ఉన్న ఈ దీపాల్లో కొన్ని రెడీమేడ్‌గా వెలిగించుకునేలా క్యాండిల్‌ వత్తితో సహా వస్తున్నాయి. ఇంకొన్ని ఇత్తడి దీపాల్లా కోట రూపులో నూనె పోసి వెలిగించుకునేలా ఉంటున్నాయి. ఆన్‌లైన్లో అందుబాటులో ఉన్న వీటిని - మీ తులసి కోట ముందు వెలిగించేయండి మరి!


ఉసిరి జ్యోతి వెలిగిద్దామిలా...

సిరిని శ్రీమహాలక్ష్మికి గుర్తుగా భావిస్తుంటారు. అందుకే కార్తికమాసంలో ఉసిరి దీపం వెలిగించిన వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్ముతుంటారు. ఎవరికివారు తోచినట్టుగా ఈ సమయంలో ఉసిరి కాయలతో దీపారాధన చేస్తుంటారు. అయితే ఉసిరి నేలపైన నిలబడాలంటే దాన్ని కాస్త చెక్కి పైన దీపం పెట్టాలి. అలా చేయకుండానే ఉసిరి జ్యోతిని పెట్టొచ్చు. ఆ సౌకర్యాన్ని ఇవ్వడానికే ఈ మధ్య ‘ఆమ్లా దియాలు’ వచ్చాయి. ఒకవైపు కొనతో, మరోవైపు గిన్నెలా ఉంటాయివి. కొనతో ఉసిరికాయను గుచ్చి పైనున్న ప్రమిద లాంటి దాంట్లో నూనె పోసి వత్తి పెట్టుకోవచ్చు. ఒకదానిమీద ఒకటి అలా ఎన్నైనా ఉసిరి కాయలు పేర్చుకుని పడిపోకుండా వెలిగించుకోవచ్చు. పైగా దీపం కూడా ఎక్కువసేపు వెలుగుతుంది. కొన్ని విడివిడిగా ఉంటే ఇంకొన్ని రకరకాల ఆకారాల్లో సెట్ల రూపంలో వస్తున్నాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు