Updated : 02 Oct 2022 03:49 IST

కశ్మీరు కొండల్లో... సుందర సరస్సుల్లో..!

మంచుకురిసే కశ్మీరులోయలో విహరించాలనీ అక్కడి అందాలని ఆసాంతం ఆస్వాదించాలనీ కోరుకోని వాళ్లెవరూ ఉండరు. అయితే ఆ ఎత్తైన కొండకోనల్లోని క్లిష్టమైన దారుల్లో నడుచుకుంటూనే అక్కడ ప్రవహించే సరస్సులన్నింటినీ చూసి రావాలని మాత్రం కొందరే అనుకుంటారు. అలాంటి అరుదైన అనుభూతిని సొంతం చేసుకుని, ఆ విశేషాలను ఈనాడు ఆదివారంతో పంచుకుంటున్నారు దిల్లీకి చెందిన ‘అవడం రంగనాథ్‌’.

శ్మీరులోయలోని ఎత్తైన పర్వతాల మధ్యలో పదమూడు వేల అడుగుల ఎత్తున ఉన్న సుందరమైన సరస్సులను ఒకదానివెంట ఒకటి చూసుకుంటూ చేసే సాహసయాత్రనే ‘కశ్మీర్‌ గ్రేట్‌ లేక్స్‌ ట్రెక్‌’గా పిలుస్తున్నారు. మంచు పర్వతాల మధ్యలో సహజంగా ఏర్పడిన ఈ కొలనుల్ని సందర్శించడానికి యూత్‌ హాస్టల్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా ఈ ఆరు తటాకాల ట్రెక్‌ను నిర్వహిస్తోంది. ఇందుకోసం ముందుగానే బుక్‌ చేసుకోవాలి. ఆగస్టు 13వ తేదీన విమానమెక్కి దిల్లీ నుంచి శ్రీనగర్‌కు మధ్యాహ్నం ఒంటిగంటకు చేరుకున్నాం. దిగగానే సిఆర్‌పిఎఫ్‌ అధికారులు స్వాగతం పలికారు. 75వ స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించుకుని అందరికీ జాతీయ జెండాలు ఇచ్చారు. వాళ్లతో ఫొటోలు దిగి ‘భారతమాతాకీ జై...’ అంటూ నినాదాలు చేశాం. తరవాత ట్యాక్సీ మాట్లాడుకుని సాయంత్రానికి సోనామార్గ్‌కి చేరుకున్నాం. ఆ దారి వెంబడి దేవదారు, చినార్‌, సిల్వర్‌ బిర్చ్‌ చెట్లు కనిపించాయి. సోనామార్గ్‌ ప్యాలస్‌ హోటల్‌లో మాకు వసతి ఏర్పాట్లు చేశారు.

నడక మొదలు...

మా బ్యాచ్‌లో మొత్తం 18 మంది ఉన్నాం. సాయంత్రం యూత్‌ హాస్టల్స్‌ అసోసియేషన్‌ వాళ్లు ఇచ్చిన ధ్రువపత్రాలు సమర్పించి మర్నాడు చేయాల్సిన కార్యక్రమాల గురించి తెలుసుకుని హోటల్‌ గదికి వెళ్లి కశ్మీరీ థాలీ తిని విశ్రాంతి తీసుకున్నాం. ఉదయాన్నే ఐదు గంటలకే లేచి ఓ గంటసేపు వ్యాయామం చేసి అల్పాహారం తీసుకున్నాక దగ్గరలో ఉన్న థాజివాస్‌ గ్లేసియర్‌ దగ్గరకు తీసుకెళ్లారు. తిరిగి వచ్చి, భోజనం చేశాక... పర్వత ప్రాంతాల గురించిన ఓరియెంటేషన్‌ క్లాసు జరిగింది. అక్కడ ఎలా ఉండాలీ, తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటీ అన్నది చెప్పారు.

మర్నాడు ఉదయం ఆరున్నరకే అల్పాహారం చేసి, భోజనం డబ్బాలో పెట్టుకున్నాం. ఏడు గంటలకు 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని తొమ్మిది వేల అడుగుల ఎత్తులో ఉన్న సోనామార్గ్‌లో యూత్‌ హాస్టల్స్‌ అసోసియేషన్‌ అధికారులతో జరుపుకుని మొదటిరోజు ట్రెక్కింగ్‌కి బయలుదేరాం. సరిగ్గా 7.45కి సోనామార్గ్‌ నుంచి బయలుదేరి ఒక్కో కొండనీ దాటుకుంటూ మార్గమధ్యంలోని సెలయేళ్ల అందాలను చూస్తూ ఫొటోలు తీసుకుంటూ మాతో తెచ్చుకున్న తినుబండారాలు తింటూ ఎలాంటి అలసటా లేకుండా ముందుకెళ్లాం. ఆర్మీపోస్ట్‌లు వచ్చినప్పుడల్లా ఆధార్‌ కార్డు చూపించి నమోదు చేయించుకోవాలి.

ఆగస్టు 15 కావడంతో ఆర్మీ అధికారులూ మాకు రకరకాల ఆహారపదార్థాలను అందించారు. ఆ రోజు ఎక్కడ చూసినా భారత్‌మాతాకీ జై, జైహింద్‌... నినాదాలే వినిపించాయి. వాటికి మేం కూడా కోరస్‌ కలుపుతూ ఉత్సాహంగా నడిచాం. దారిలో మంచుకొండలమీద నుంచి ఉరికే జలపాతాలు మా కళ్లను కట్టిపడేసి అడుగు ముందుకు సాగనిచ్చేవి కావు. అలా ప్రకృతిని ఆస్వాదిస్తూ కొండలెక్కుతూ ముందుకెళ్లాం. పదివేల అడుగుల ఎత్తుకి వచ్చేసరికి కొన్ని వృక్షజాతులూ జంతువులూ కనిపించాయి.

ఆ చెట్లలో ఎక్కువ శాతం భోజపత్ర వృక్షాలే. కాగితం కనుగొనకముందు ఈ ఆకులనే రాయడానికి వాడేవారు. ఎత్తైన కొండలమీద నడుస్తున్నప్పుడు మేఘాలు మనకంటే కింద ఉండి, మేఘాలమీద నడుస్తున్న అనుభూతిని కలిగించాయి. అలా మొదటిరోజు 12 కి.మీ. ట్రెక్కింగ్‌ చేశాక సాయంత్రం 4 గంటలకు నిశ్చనై క్యాంప్‌కి చేరుకున్నాం. నిశ్చనై అనే ఈ ప్రాంతం కొండల మధ్యలో ఉన్న చిన్న పీఠభూమి. ఇక్కడ యూత్‌ హాస్టల్స్‌ క్యాంపు ఉంది. ఆ రాత్రికి అక్కడే మా బస...

చుట్టూ ఎత్తైన కొండలూ... ఆ మధ్యలో చేతికి అందుతున్నట్లుగా ఉన్న మేఘాలూ... ఎవరో తరుముకుని వస్తున్నట్లే పరిగెడుతున్న మేఘాలను అంత దగ్గరగా చూసి చిన్నపిల్లల్లా కేరింతలు కొట్టాం. కాసేపు వాన... అంతలోనే ఎండా... ఈ రెండింటి మధ్యలో నింగిలో విరిసిన హరివిల్లు... ఇలా వాతావరణం ప్రతి ఐదు నిమిషాలకీ మారిపోతూ ఓ చిత్రమైన అనుభూతిని కలిగించింది. మా బృందంలో ఉన్న ఓ సభ్యుడు రాక్‌ బ్యాలెన్సింగ్‌లో నిష్ణాతుడు. రాళ్లను ఒకదానిమీద ఒకటి పేర్చి చూపించాడు. ఆ సాయంత్రం అందరం సరదాగా గడిపి టెంట్‌లో నిద్రపోయాం.

రెండోరోజు...

అల్పాహారం ముగించి, భోజనం డబ్బాలో పెట్టుకుని మళ్లీ ట్రెక్కింగ్‌కి బయలుదేరాం. ఎత్తైన పర్వతాల్ని ఒక్కోటీ దాటుకుంటూ మేఘాలతో ముచ్చట్లాడుతూ సెలయేళ్లలోని చల్లని నీళ్లలో తడుస్తూ మధ్యాహ్నం రెండున్నరకి విష్ణుసర్‌ క్యాంప్‌కి చేరుకున్నాం. అక్కడ మాకు వేడి వేడి పకోడీలూ మధురమైన కశ్మీరీ టీతో స్వాగతం పలికారు క్యాంప్‌ ఇన్‌ఛార్జ్‌. అక్కడే మా లగేజీని ఉంచి, రెండు కి.మీ. దూరంలో ఉన్న విష్ణుసర్‌, కృష్ణసర్‌ సరస్సుల్ని చూడ్డానికి వెళ్లాం. ఉదయం నుంచి 14 కి.మీ. నడిచిన శ్రమంతా ఆ రెండు సరస్సుల్నీ చూడగానే ఎగిరిపోయింది. కొండలపైనున్న మంచు కరగడంతో ఏర్పడ్డాయివి. నీళ్లు నీలిరంగులో మెరుస్తున్నాయి. ఇక్కడి సరస్సులన్నీ ట్రౌట్‌ చేపలకు ప్రసిద్ధి. అక్కడ ఫొటోలు దిగి, చల్లని నీటితో ఆడుకుంటూ గడిపాం. అక్కడనుంచి బయటకి వచ్చాక గానీ చలి అంటే ఏమిటో తెలియలేదు. సాధారణ స్థితికి రావడానికి గంటపైనే పట్టింది. అలా సాయంత్రం వరకూ అక్కడే గడిపి మళ్లీ రెండు కి.మీ. నడిచి విష్ణుసర్‌ క్యాంప్‌కి చేరుకున్నాం.

మూడో రోజు...

ఈ రోజు నడక కష్టంగా ఉంటుందని ముందే చెప్పారు. 17 కి.మీ. నడవాలి అదీ అత్యంత కఠినమైన పర్వతమ్మీద... అంటే ఎగుడుదిగుడు రాళ్లతో 45 డిగ్రీల వాలులో ఉన్న కొండమీద కేవలం రెండే అడుగుల వెడల్పు ఉన్న దారిలో నడుచుకుంటూ వెళ్లాలన్నమాట. ఒక్కసారి పట్టు తప్పితే పడేది లోయలోకే. దీన్నే గాడ్సర్‌ పాస్‌ అంటారు. అయితే అందరం 35 ఏళ్లలోపు వాళ్లం కావడం, ట్రెక్కింగ్‌లో అనుభవం కూడా ఉండటంతో అంత కష్టం అనిపించలేదు. ఉదయాన్నే బయలుదేరి, మధ్యమధ్యలో విశ్రాంతి తీసుకుంటూ గాడ్సర్‌ పాస్‌ని దాటగలిగాం. ఆరు కి.మీ. దూరానికి ఐదు గంటల సమయం పట్టింది. ఆ తరవాత అంత కష్టమైన దారి లేదుగానీ బండరాళ్లూ బురదా... కలగలిసిన ఆ మార్గంలో మరో 11 కి.మీ. నడిచాం. ఎలాగైతేనేం... సాయంత్రానికల్లా 17 కి.మీ. నడిచి గాడ్సర్‌ క్యాంప్‌కి చేరుకున్నాం. అక్కడికి కొద్ది దూరంలోనే ఉంది గాడ్సర్‌ లేక్‌. అప్పటికే అందరం అలిసిపోయాం. కానీ ఆ సరస్సుని చూడగానే ఎక్కడలేని హుషారూ వచ్చింది. లోతుగా గంభీరంగా కనిపించే ఆ సరస్సులోకి దిగే దారిలోనే మరో రెండుమూడు చిన్న కొలనులు ఉన్నాయి. ముందుగా వచ్చే కొలనుని స్థానికులు యమ సరోవరం అంటారట. ఇది దాటాక మరో సరస్సు వస్తుంది. దీనికి సమీపంలోనే ఉన్న పూలలోయలతో ఆ ప్రాంతం ఓ అద్భుతంలా తోచింది. కశ్మీరు అందాలన్నీ ఈ సరస్సు దగ్గరే కుప్ప పోసినట్లుగా అనిపించింది. అంత దూరం నడిచామేమో ఆ రాత్రికి క్యాంపులో ఆదమరచి నిద్రపోయాం.

నాలుగోరోజు...

ఉదయాన్నే గాడ్సర్‌ క్యాంపు నుంచి బయల్దేరి 11 కి.మీ. దూరంలో ఉన్న సత్సర్‌ క్యాంప్‌కి వెళ్లాలి. ఆ దారి పొడవునా నాటిన లావెండర్‌ తోటల్ని చూస్తుంటే భూదేవి ఊదారంగు చీర కట్టుకుని విహరిస్తుందా అనిపించింది. ఆ పూల అందాలను ఆస్వాదిస్తూ సాయంత్రం నాలుగు గంటలకి సత్సర్‌ క్యాంప్‌కి చేరుకున్నాం. క్యాంప్‌లో లగేజీ ఉంచి కిలోమీటరు దూరంలో ఉన్న కొలను దగ్గరకు వెళ్లి సేదతీరాం. మర్నాడు సత్సర్‌ నుంచి బయలుదేరి అక్కడికి 10 కి.మీ. దూరంలో ఉన్న గంగాబల్‌ సరస్సుకి చేరుకునేసరికి మధ్యాహ్నం నాలుగయింది. ఇది- ఇప్పటివరకూ చూసిన అన్ని సరస్సుల్లోకీ అత్యంత విశాలమైనదీ సుందరమైనదీనూ. కానీ ఇక్కడ విపరీతమైన చలి... కాబట్టి ఎక్కువసేపు ఉండలేకపోయాం. ఓ గంటసేపు అక్కడ గడిపి క్యాంప్‌కు చేరుకుని రాత్రి భోజనం ముగించి నిద్రపోయాం.

ఐదోరోజు...

ఉదయం ఏడు గంటలకి గంగాబల్‌ క్యాంప్‌ నుంచి బయలుదేరి దారిలో వచ్చిన నందకోల్‌ సరస్సుని సందర్శించాం. ఈ దారిలోనే కైలాసాన్ని తలపించే హరముఖ్‌ శిఖరం కనిపిస్తుంది. తటాకాలన్నీ చూసి, 12 కి.మీ. ట్రెక్కింగ్‌ చేస్తూ నరనాగ్‌ గ్రామానికి చేరుకున్నాం. ఇది కశ్మీరులోని పురాతన చారిత్రక గ్రామం. గందర్బల్‌ జిల్లాలో ఉన్న ఈ ఊళ్లో హిందూ గుడులూ విగ్రహాలూ చాలానే ఉన్నాయి. కానీ అవన్నీ అవసాన దశలో ఉన్నాయి. చుట్టూ కొండలూ పచ్చని ప్రకృతితో కూడిన అందమైన గ్రామం ఇది. ఇక్కడికి చేరుకునేసరికి మధ్యాహ్నం అయింది. అక్కడి నుంచి యూత్‌హాస్టల్‌వాళ్లు సోనామార్గ్‌కి చేరుకోవడానికి వాహనాన్ని ఏర్పాటుచేశారు. దాంతో సాయంత్రానికల్లా సోనామార్గ్‌కు చేరుకుని రాత్రికి అక్కడే విశ్రాంతి తీసుకుని, శ్రీనగర్‌కు చేరుకున్నాం. అక్కడినుంచి ఎవరెస్ట్‌ ఎక్కి వచ్చినంత విజయగర్వంతో దిల్లీకి తిరిగివచ్చాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని