Published : 03 Sep 2022 23:40 IST

ఇలా మొదలవుతుంది!

ఉదయం లేవగానే చేసే వ్యాయామం శారీరకంగానూ మానసికంగానూ ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది. అందుకు ఒక్కొక్కరు ఒక్కో రకం వ్యాయామాన్ని ఎంచుకుని సాధన చేస్తుంటారు. మరి ఈ ప్రముఖులు తమ దినచర్యని ఏ ఎక్సర్‌సైజ్‌తో మొదలుపెడతారో వారి మాటల్లోనే చదివేయండి.

ధ్యానం తప్పనిసరి

- సత్య నాదెళ్ల

నేను ఎక్కడున్నా, రాత్రి ఎంత ఆలస్యంగా పడుకున్నా, ఎంత పని ఒత్తిడి ఉన్నా సరే... పొద్దున్నే అరగంట సేపు పరుగెత్తడం ఓ అలవాటుగా పెట్టుకున్నా. అలానే మంచం దిగేముందు ఓ పదినిమిషాలపాటు ధ్యానం చేసుకుని నెగెటివ్‌ ఆలోచనలన్నీ దూరం చేసుకుంటా. నేను ఎక్కడి నుంచీ వచ్చానో నా మూలాల్ని ప్రతిరోజూ గుర్తు చేసుకుంటా. ఈ చర్యలూ, వ్యాయామం మిగిలిన రోజును సాఫీగా సాగేలా చేస్తాయి. అందుకే క్రమం తప్పకుండా చేస్తా.


సైకిల్‌తో స్టామినా

- సుందర్‌ పిచాయ్‌

చిన్నప్పట్నుంచీ నాకు క్రికెట్, ఫుట్‌బాల్‌ చాలా ఇష్టం. అందుకే ఆ ఆటల్ని వ్యాయామంగా ఎంచుకుని వారంలో రెండుమూడుసార్లైనా ఆడుతుంటా. అలా చేయడం వల్ల రోజంతా హుషారుగా అనిపిస్తుంటుంది. శరీరం ఉత్తేజితమవుతుంది. మిగతా రోజుల్లో సైకిల్‌ తొక్కుతా. దానివల్ల కండరాలు ఫ్లెక్సిబుల్‌గా అవ్వడంతోపాటు స్టామినా లభిస్తుంది. అందుకే ఎంతదూరమైనా తేలిగ్గా నడవగలను, ఎన్ని మెట్లైనా ఎక్కేయగలను.


అప్పట్నుంచీ పరుగెత్తుతున్నా

బిల్‌గేట్స్‌

ఉదయం వ్యాయామం జ్ఞానాన్నీ, ఏకాగ్రతనీ పెంచడంలో కీలకపాత్ర పోషిస్తుందని 2019లో బ్రిటిష్‌ జర్నల్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌ మెడిసిన్‌లో ఓ వ్యాసం చదివా. అప్పట్నుంచీ నేను క్రమం తప్పకుండా ఉదయం నిద్రలేవగానే ట్రెడ్‌మిల్‌పైన ఓ గంట పరుగెత్తుతా. అంతకు మించి మరే వ్యాయామం చేయను. పరుగెత్తని రోజు మాత్రం నాకు ఏమీ తోచదు. ఆరోజంతా ఏదో అసంతృప్తిగా అనిపిస్తుంది. అందుకే వేరే ప్రాంతాలకు వెళ్లినా, వెకేషన్‌లో ఉన్నా- హోటల్‌ రూమ్‌ నుంచి బయటకు వెళ్లి కాసేపు రన్నింగ్‌ చేస్తా.


అందుకే వ్యాయామం

- టిమ్‌కుక్‌

నాకు చిన్నతనం నుంచీ తెల్లవారుజామున 3.45కే లేవడం అలవాటు. ఆ సమయంలో మెలకువగా ఉండటం వల్ల బద్ధకం దూరమై, బుర్ర చురుగ్గా పనిచేస్తుంది. ఇక ఇంట్లోనూ, ఆపిల్‌ ఆవరణలోనూ జిమ్‌లు ఉన్నప్పటికీ- నాకు బయట జిమ్‌కో, పార్కుకో వెళ్లి వ్యాయామం చేయడం ఇష్టం. కనీసం ఆ పేరుతో అయినా బయట ప్రపంచంలోకి వెళ్లి లోకం పోకడ గమనించొచ్చని అనుకుంటా. సామాన్యుల అవసరాల్లోంచే మెరుగైన వ్యాపార ఆలోచనలు వస్తాయని నా నమ్మకం. అందుకే కొన్నిసార్లు పార్కుకి వెళ్లి వాకింగ్‌ చేస్తుంటా, మరికొన్నిసార్లు జిమ్‌లో వెయిట్‌ ట్రైనింగ్‌ తీసుకుంటా.


యుద్ధవిద్యలు ఇష్టం

- ఎలన్‌మస్క్‌

ఎందుకో తెలియదు నాకు రన్నింగ్, వాకింగ్‌ అస్సలు ఇష్టముండవు. నిపుణుల ఆధ్వర్యంలో వెయిట్‌ ట్రైనింగ్‌ మాత్రం చేస్తా. చిన్నప్పట్నుంచీ మార్షల్‌ ఆర్ట్స్‌ చాలా ఇష్టం. స్కూల్‌లో ఆ పోటీల్లో పాల్గొని ఎన్ని బహుమతులు గెలుచుకున్నానో. ఆ ఇష్టంతోనే రోజూ కాసేపు తైక్వాండో, కరాటే, జూడో వంటివి సాధన చేస్తుంటా. మా పిల్లలకు కూడా ఆరేళ్ల వయసు నుంచే వాటిల్లో శిక్షణ ఇప్పిస్తున్నా. ఆ యుద్ధవిద్యల వల్ల ఆత్మవిశ్వాసం పెరగడంతోపాటు కండరాలు పటిష్టంగా మారతాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని