తండాలో వెలిసిన భూకైలాసం

ఏ శివాలయంలో అయినా... భక్తులు నేరుగా వెళ్లి స్వామిని దర్శించుకుంటారు. కానీ ఈ ఆలయంలో మాత్రం భక్తులు నీళ్లల్లోని ద్వాదశజ్యోతిర్లింగాలను స్పృశించుకుంటూ వెళ్లి... గర్భాలయాన్ని చేరుకోవాల్సి ఉంటుంది. భూకైలాసంగా పిలిచే ఈ ఆలయంలో ఇతర దేవతల విగ్రహాలూ ఉండటం విశేషం.

Updated : 04 Sep 2022 00:25 IST

తండాలో వెలిసిన భూకైలాసం

ఏ శివాలయంలో అయినా... భక్తులు నేరుగా వెళ్లి స్వామిని దర్శించుకుంటారు. కానీ ఈ ఆలయంలో మాత్రం భక్తులు నీళ్లల్లోని ద్వాదశజ్యోతిర్లింగాలను స్పృశించుకుంటూ వెళ్లి... గర్భాలయాన్ని చేరుకోవాల్సి ఉంటుంది. భూకైలాసంగా పిలిచే ఈ ఆలయంలో ఇతర దేవతల విగ్రహాలూ ఉండటం విశేషం.

విశాలమైన ప్రాంగణంలో... పచ్చని చెట్లమధ్య కనిపిస్తుంది భూకైలాస్‌ ఆలయం. ఈ ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెడితే... మొదట 65 అడుగుల భారీ శివుడి విగ్రహం ఉంటుంది. అక్కడినుంచి కాస్త ముందుకెళ్తే... నీటి మార్గం ద్వారా లోపలికి వెళ్లేలా ప్రత్యేక ఏర్పాటూ... ఆ నీటిలో ద్వాదశజ్యోతిర్లింగాలూ ఉంటాయి. అదేవిధంగా ప్రాంగణంలో భారీ అడుగుల్లో వీరభద్రుడు, ఆంజనేయుడు, కాలభైరవుడు, వినాయకుడు, తుల్జాభవానీ, కాళికాదేవి.... వంటి విగ్రహాలనూ దర్శించుకోవచ్చు. తెలంగాణలోని వికారాబాద్‌ జిల్లా తాండూరు మండలం అంతారం తండాలో ఉండే ఈ పరమశివుడిని దర్శించుకుంటే కష్టాలు పోతాయనేది భక్తుల నమ్మకం.

స్థలపురాణం

అంతారం తండాలో ఉంటున్న వాసుపవార్‌నాయక్‌ అనే శివభక్తుడు సుమారు ఇరవైఏళ్లక్రితం నేపాల్‌లోని పశుపతినాథ ఆలయానికి వెళ్లాడట. అక్కడే నాలుగేళ్లపాటు ఉండిపోయి పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న ఆ భక్తుడు... తన తండాలోనూ ఓ శివాలయాన్ని నిర్మించాలని అనుకున్నాడట. అదే విషయాన్ని తన సోదరుడు శంకర్‌పవార్‌నాయక్‌కి చెప్పడంతో ఇద్దరూ కలిసి ఆలయ నిర్మాణంపైన దృష్టిపెట్టారు. తాము నిర్వహించే స్థిరాస్తి వ్యాపారాల్లో వచ్చే ఆదాయంలో యాభై శాతాన్ని ఆలయ నిర్మాణం కోసం కేటాయించడం మొదలుపెట్టారు. దాతల నుంచి విరాళాలనూ సేకరించారు. అలా 2001లో ఐదెకరాలకుపైగా స్థలంలో ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించారు. తొమ్మిదేళ్లకు నిర్మాణాన్ని పూర్తిచేయడంతో 2010 నుంచీ భక్తుల కోసం ఈ ఆలయాన్ని తెరిచామని చెబుతారు వాసుపవార్‌నాయక్‌.

ఘనంగా బ్రహ్మోత్సవాలు

ఇక్కడ స్వామికి నిత్యపూజలతోపాటూ, ప్రతిరోజూ రుద్రాభిషేకాన్ని చేస్తారు. మహాశివరాత్రి రోజున వారంరోజులపాటు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. ఆ సమయంలో జరిగే శివపార్వతుల కల్యాణం, హోమాలూ, అభిషేకాలూ, ఇతర పూజలతోపాటూ గిరిజన మహిళల సంప్రదాయ నృత్యాలు వంటి ఎన్నో కార్యక్రమాలను చూసేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తోపాటూ కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన వేలాది భక్తులు ఈ ఆలయానికి రావడం విశేషం. ఇక్కడకు వచ్చే భక్తులకు నిత్యాన్నదానం... పేద జంటలకు కల్యాణం, విద్యార్థుల చదువులకు ఆర్థికసాయం వంటి కార్యక్రమాలనూ ప్రారంభించారు ఆలయ నిర్వాహకులు.

ఎలా చేరుకోవచ్చు

ఈ ఆలయం వికారాబాద్‌ జిల్లాలోని తాండూరు మండలం అంతారం తండాలో ఉంది. హైదరాబాద్‌ నుంచి రైళ్లు, బస్సులు, ప్రయివేటు వాహనాల్లో తాండూరుకు చేరుకోవాలి. అక్కడి నుంచి నాలుగైదు కిలోమీటర్లు ప్రయాణిస్తే ఆలయం వస్తుంది.

- కొంపల్లి రమేశ్, న్యూస్‌టుడే

తాండూరు గ్రామీణం


ఇది విన్నారా...

సంతానాన్ని ప్రసాదించే గర్భరక్షాంబికా దేవి

పిల్లల్లేని జంటలే కాదు... గర్భం దాల్చినవారు సైతం ఈ ఆలయంలో కొలువైన దేవిని దర్శించుకుంటే నవమాసాలూ ఎలాంటి ఆటంకాలు లేకుండా గడిచి పండంటి పాపాయిని ఎత్తుకుంటారని భక్తుల నమ్మకం. అందుకే దేశవిదేశాలకు చెందినవారు ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు. గర్భరక్షాంబికా దేవిగా పిలిచే ఈ అమ్మవారి ఆలయం తమిళనాడులోని తంజావూరు జిల్లా తిరుకరుకవూర్‌లో ఉంది. ఓసారి గౌతమ, గార్గేయ మహర్షులు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు సంతానంలేని ఓ జంట కనిపించిందట. రుషుల సలహాతో ఆ జంట గర్భరక్షాంబికా దేవిని పూజించడంతో ఆమె గర్భం దాల్చిందట. అయితే... నెలలు నిండాక కొన్ని సమస్యలు ఎదురయ్యాయనీ... అప్పుడు దేవి ప్రత్యక్షమై వాటిని నివారించిందనీ అంటారు. అలా ఆ మహర్షుల కోరిక మేరకు దేవి ఇక్కడే కొలువయ్యిందట. ఇక... ఇక్కడ స్వయంభువుగా వెలసిన శివుడిని దర్శించుకుంటే అనారోగ్యాలు నయమవుతాయట. ఈ ఆలయంలోని శివుడికి ఎలాంటి అభిషేకాలూ చేయరు. భక్తుల కోరిక మేరకు పునుగు సత్తం పేరుతో తైలాభిషేకాన్ని చేసి... ఆ తైలాన్ని ప్రసాదంగా పంచుతారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..