కన్నయ్యకు... కమ్మని నివేదన!

కృష్ణాష్టమి రోజున వెన్నదొంగకు నివేదించేందుకు పాలు, పెరుగు, వెన్న లాంటివి ఉండనే ఉంటాయి. అవి కాకుండా... ఇంకేం చేయొచ్చని ఆలోచిస్తుంటే వీటిని చూడండోసారి.

Updated : 18 Aug 2022 12:06 IST

కన్నయ్యకు... కమ్మని నివేదన!

కృష్ణాష్టమి రోజున వెన్నదొంగకు నివేదించేందుకు పాలు, పెరుగు, వెన్న లాంటివి ఉండనే ఉంటాయి. అవి కాకుండా... ఇంకేం చేయొచ్చని ఆలోచిస్తుంటే వీటిని చూడండోసారి.


అటుకుల జంతికలు

కావలసినవి: బియ్యప్పిండి: కప్పు, అటుకులు: అరకప్పు, పుట్నాలపప్పు: పావుకప్పు, నూనె: వేయించేందుకు సరిపడా, కారం: చెంచా, జీలకర్ర: చెంచా, ఉప్పు: తగినంత.

తయారీ విధానం: ముందుగా అటుకులూ పుట్నాలపప్పును మిక్సీలో వేసుకుని మెత్తని పొడిలా చేసుకుని జల్లించుకోవాలి. ఇందులో బియ్యప్పిండి, తగినంత ఉప్పు, కారం, జీలకర్ర, టేబుల్‌స్పూను వేడి నూనె వేసుకుని కలుపుకోవాలి. తరువాత నీళ్లు పోస్తూ జంతికల పిండిలా చేసుకోవాలి. ఈ పిండిని జంతికల గొట్టంలోకి తీసుకుని కాగుతున్న నూనెలో జంతికల్లా ఒత్తుకుంటూ... ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి.


కారా బేసన్‌ బిస్కెట్‌

కావలసినవి: సెనగపిండి: కప్పు, మినప్పప్పు: పావుకప్పు, వంటసోడా: పావుచెంచా, ఉప్పు: ఒకటింబావు చెంచా, నూనె: వేయించేందుకు సరిపడా, కారం: చెంచా, చాట్‌మసాలా: అరచెంచా, ఆమ్‌చూర్‌పొడి: చెంచా.

తయారీ విధానం: ముందుగా మినప్పప్పును మిక్సీలో వేసి మెత్తని పొడిలా గ్రైండ్‌ చేసుకుని ఓ గిన్నెలో వేసుకోవాలి. ఇందులో సెనగపిండి, వంటసోడా, ముప్పావుచెంచా ఉప్పు, రెండు చెంచాల వేడి నూనె వేసుకుని కలుపుకోవాలి. తరువాత నీళ్లు పోస్తూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఈ పిండిని అయిదు నిమిషాలు నాననిచ్చి... కాస్త పిండి తీసుకుని చపాతీలా చేసుకుని చాకుతో పొడుగాటి ముక్కల్లా కోసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పిండినీ చేసుకోవాలి. ఈ ముక్కల్ని కాగుతున్న నూనెలో నాలుగైదు చొప్పున వేసుకుంటూ ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి. ఇప్పుడు మిగిలిన ఉప్పు, కారం, చాట్‌మసాలా, ఆమ్‌చూర్‌పొడిని ఓ గిన్నెలో తీసుకుని కలిపి ఈ మసాలాను బేసన్‌ బిస్కెట్లపైన చల్లితే సరి.


పనీర్‌ మలై లడ్డు

కావలసినవి: వెన్నతీయని పాలు: రెండు లీటర్లు, నిమ్మరసం: రెండు టేబుల్‌స్పూన్లు, నెయ్యి: అర చెంచా, పాలు: పావుకప్పు, క్రీమ్‌: పావుకప్పు, పాలపొడి: ముప్పావుకప్పు, కండెన్స్‌డ్‌మిల్క్‌: ముప్పావుకప్పు, యాలకులపొడి: పావుచెంచా.

తయారీ విధానం: ఓ గిన్నెలో వెన్నతీయని పాలను తీసుకుని స్టౌమీద పెట్టాలి. అవి మరుగుతున్నప్పుడు నిమ్మరసం వేసి కలిపితే పాలు విరుగుతాయి. ఆ మిశ్రమాన్ని మెత్తని వస్త్రంలో వేసుకుని నీరంతా పోయేవరకూ వడకట్టుకుని పనీర్‌ను విడిగా తీసుకోవాలి. స్టౌమీద కడాయి పెట్టి నెయ్యి వేయాలి. అది వేడెక్కాక పాలు పోయాలి. అవి మరుగుతున్నప్పుడు పాలపొడి కలిపి అయిదు నిమిషాలయ్యాక మిగిలిన పదార్థాలను ఒక్కొక్కటిగా వేసుకుని మరోసారి కలిపి స్టౌని సిమ్‌లో పెట్టాలి. ఈ మిశ్రమం దగ్గరకు అవుతున్నప్పుడు దింపేసి... వేడి కొద్దిగా చల్లారాక లడ్డూల్లా చుట్టుకోవాలి. 


డ్రైఫ్రూట్స్‌- కోకోనట్‌ ఖీర్‌

కావలసినవి: పాలు: అరలీటరు, చక్కెర: పావుకప్పు, కండెన్స్‌డ్‌మిల్క్‌: అరకప్పు, కొబ్బరిపొడి: పావుకప్పు, బాదం-జీడిపప్పు పలుకులు: అరకప్పు చొప్పున, పిస్తా పలుకులు: రెండు టేబుల్‌స్పూన్లు, యాలకులపొడి: చెంచా, నెయ్యి: టేబుల్‌స్పూను.

తయారీ విధానం: స్టౌమీద కడాయి పెట్టి నెయ్యి వేసి... బాదం-జీడిపప్పు-పిస్తా పలుకులు, సగం కొబ్బరిపొడిని వేయించుకుని విడిగా తీసుకోవాలి. అదే బాణలిలో పాలు పోయాలి. అవి మరుగుతున్నప్పుడు కండెన్స్‌డ్‌మిల్క్‌, చక్కెర కలపాలి. అయిదు నిమిషాలయ్యాక వేయించి పెట్టుకున్న డ్రైఫ్రూట్స్‌ పలుకుల్ని వేసి బాగా కలిపి స్టౌని సిమ్‌లో పెట్టాలి. పాలు మరుగుతున్నప్పుడు యాలకులపొడి, మిగిలిన కొబ్బరిపొడి వేసి అన్నింటినీ కలిపి అయిదు నిమిషాలయ్యాక దింపేయాలి.


చిట్కా

ఇంట్లోనే కండెన్స్‌డ్‌మిల్క్‌, క్రీమ్‌!

పాయసం, హల్వా, బర్ఫీ... లాంటి వాటికి చిక్కదనంతోపాటు రుచిని తెచ్చేందుకు క్రీమ్‌, కండెన్స్‌డ్‌మిల్క్‌ను వాడుతుంటాం. వీటిని అప్పటికప్పుడు ఇంట్లో చేసుకోవాలనుకుంటే...

* కండెన్స్‌డ్‌మిల్క్‌ కోసం: రెండుకప్పుల పాలపొడి, చెంచా మొక్కజొన్నపిండి, పావుచెంచా వంటసోడా, కప్పు పాలు, కప్పు చక్కెర తీసుకోవాలి. ఓ గిన్నెలో ఇవన్నీ వేసి కలుపుకోవాలి. స్టౌమీద కడాయి పెట్టి.. ఈ మిశ్రమాన్ని వేసి మంట తగ్గించి కలుపుతూ ఉండాలి. చిక్కగా అవుతున్నప్పుడు దింపేసి చల్లారనిస్తే కండెన్స్‌డ్‌మిల్క్‌ సిద్ధమైనట్లే.

* క్రీమ్‌ కోసం: ఇందుకోసం పావుకప్పు కరిగించిన వెన్న, ముప్పావుకప్పు చిక్కని పాలు తీసుకోవాలి. వీటిని బాగా గిలకొడితే క్రీమ్‌ తయారైనట్లే. లేదంటే మిక్సీలో వేసుకుని గ్రైండ్‌ చేసుకున్నా సరే. ఒకవేళ వెన్న తీసిన పాలను వాడుతుంటే గనుక చిక్కదనం కోసం టేబుల్‌స్పూను మొక్కజొన్నపిండిని కలపొచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..