వరుసలహారంలో కాసుల పేరు!

అప్పుడు అమ్మమ్మకు నచ్చిన బంగారు కాసుల హారం... ఆ తర్వాత అమ్మకోసం రత్నాలూ, ముత్యాలూ పొదువుకుని చక్కని డిజైన్లతో మెప్పించింది. మరి ఇప్పుడు అమ్మాయినీ ఆకట్టుకోవాలంటే... కాస్త ఫ్యాషన్‌

Published : 31 Jul 2022 00:49 IST

వరుసలహారంలో కాసుల పేరు!

అప్పుడు అమ్మమ్మకు నచ్చిన బంగారు కాసుల హారం... ఆ తర్వాత అమ్మకోసం రత్నాలూ, ముత్యాలూ పొదువుకుని చక్కని డిజైన్లతో మెప్పించింది. మరి ఇప్పుడు అమ్మాయినీ ఆకట్టుకోవాలంటే... కాస్త ఫ్యాషన్‌ టచ్‌ ఇవ్వాల్సిందే.  అందుకే ఈతరానికి తగ్గట్టు ‘లేయర్డ్‌ కాసుల హారం’గా ముస్తాబై వచ్చేసింది. నగల ప్రియుల్ని ప్రేమలో పడేసింది! 

ధగధగ మెరిసే బంగారు నగ... అమ్మాయి మెడలోకి చేరిందంటేనే లక్ష్మీకళ వచ్చేస్తుంది. అలాంటిది లక్ష్మీదేవి రూపాలతో ఉండే కాసుల పేరు వేశామంటే ఎవరైనా సరే, మహాలక్ష్మిగా వెలిగిపోకుండా ఉంటారా! అందుకే మరి ఎన్నెన్ని సరికొత్త నగలు వచ్చినా... కాసులపేరు వన్నె కాస్తంత అయినా తగ్గలేదు. మగువల మనసుల్లో దాని చోటూ మారలేదు. పైగా వట్టి బంగారు కాసులతోనే ఉండే ఈ హారం ఎప్పటికప్పుడు మార్పులు చేసుకుంటూ ట్రెండ్‌కు సరిపోయేలా వస్తోంది. ఈసారైతే ఆ మార్పు మరింత గ్రాండ్‌ లుక్‌తో వచ్చింది. పట్టుచీరల్లో చందమామల్లా మెరిసిపోయే అమ్మాయిల మెడలో మరే నగకీ చోటు ఇవ్వకుండా అంతా అదే ఆక్రమించడానికి సిద్ధమైపోయింది.

నిజానికి బంగారమన్నా, భగవంతుడన్నా చాలామందికి ఎంతో ప్రీతి. అది గమనించే అప్పటి డిజైనర్లు ఇష్టమైన బంగారంలోకి ఆరాధించే దేవుళ్లరూపాల్ని చొప్పించి కాసులపేర్లలాంటి జ్యువెలరీకి రూపమిచ్చినట్టున్నారు. కాలం మారినా... కొన్ని ఇష్టాలు అలాగే ఉంటాయి కదా. అందుకే ఆ ఇష్టానికి కొత్త డిజైన్లతో పట్టం కడుతున్నారు ఇప్పటి డిజైనర్లు. అందులో భాగంగానే ఈ లేయర్డ్‌ కాసుల పేర్లను తీసుకొచ్చారు. మామూలు కాసుల దండలో అయితే హారమంతా కాసులు మాత్రమే ఉంటాయి. కానీ ఈ వరుసల కాసుల హారంలో అదనంగా పచ్చలూ, కెంపులూ, ముత్యాలూ, బంగారు పూసలు... వంటివెన్నో సన్నని వరుసలుగా రెండూ, మూడూ లేయర్లుగా కిందికి వేలాడుతుంటాయి. వీటన్నింటినీ కలిపి ఉంచే బిళ్లలూ దేవీదేవుళ్ల రూపాలతో, చక్కని చెక్కుళ్లతో, వివిధ ఆకృతుల్లో ఎంతో అందంగా ఉంటాయి. 

ఒక్కటి చాలు...

ఈ లేయర్డ్‌ కాసుల హారాల్లోనూ బోలెడన్ని డిజైన్లు వచ్చేశాయి. కావాలంటే మన అభిరుచికి తగ్గట్టు కాసుల డిజైన్‌ను బట్టి రకరకాల సైజుల్లో, నచ్చిన వాటితో ఆ వరుసల్ని సెట్‌ చేసుకోవచ్చు. ట్రెడిషనల్‌ నగకే ట్రెండీ స్టైల్‌నీ తెచ్చేయొచ్చు. మామూలుగా పట్టుచీర కట్టుకున్నప్పుడు గ్రాండ్‌ లుక్‌ కోసం పైన నెక్లెసో, చోకరో పెట్టుకుని మధ్యలో మరో చెయిన్‌... దాని కింద ఇంకాస్త పెద్ద హారం వేసుకుంటారు. కానీ ఈ వరుసల కాసుల హారం ఒక్కటంటే ఒక్కటే... ఆ నిండుదనమంతటినీ ఇచ్చేస్తుంది. మిగతా నగలు వేసుకోవాల్సిన అవసరమే లేకుండా చేస్తుంది. మరి ఈసారి వ్రతానికో, పూజకో ఇలాంటి ఒక్క నగను వేసుకుని చూడండి... అందరి చూపూ మీ కంఠం వైపే ఉంటుందంటే అతిశయోక్తి లేదు! 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..