ఒక్కడు... వందల జీవితాల్ని మార్చాడు!

ఈ మధ్య అమితాబ్‌ బచ్చన్‌ నటించిన బయోపిక్‌ ‘ఝుండ్‌’... నాగ్‌పూర్‌కి చెందిన విజయ్‌బార్సేది. ఆయన ఎంతోమంది చీకటి జీవితాల్ని వెలుగులోకి తెచ్చి వారికి కొత్త జీవితాల్ని ప్రసాదించిన రియల్‌ హీరో. కోరి మరీ అమితాబ్‌ ఆ పాత్రలో ఎందుకు నటించాడో విజయ్‌ బార్సే ప్రయాణం గురించి తెలుసుకుంటే అర్థమవుతుంది.

Updated : 18 Apr 2022 12:46 IST

ఒక్కడు... వందల జీవితాల్ని మార్చాడు!

ఈ మధ్య అమితాబ్‌ బచ్చన్‌ నటించిన బయోపిక్‌ ‘ఝుండ్‌’... నాగ్‌పూర్‌కి చెందిన విజయ్‌బార్సేది. ఆయన ఎంతోమంది చీకటి జీవితాల్ని వెలుగులోకి తెచ్చి వారికి కొత్త జీవితాల్ని ప్రసాదించిన రియల్‌ హీరో. కోరి మరీ అమితాబ్‌ ఆ పాత్రలో ఎందుకు నటించాడో విజయ్‌ బార్సే ప్రయాణం గురించి తెలుసుకుంటే అర్థమవుతుంది.

ఒకరు కాదు ఇద్దరు కాదు, వ్యసనాలతో జీవితాన్ని చీకటి చేసుకున్న ఎందర్నో వెలుగులోకి తీసుకొచ్చిన విజయ్‌ బార్సే నాగ్‌పూర్‌లోని హిస్లాప్‌ కాలేజీలో పీఈటీగా పని చేసేవాడు. 2001లో ఒకసారి కాలేజీ పని మీద బయటకెళ్లిన విజయ్‌ వర్షం పడుతుండటంతో ఓ చెట్టుకింద నిల్చున్నాడు. అప్పుడు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా కొందరు పిల్లలు పగిలిపోయిన బకెట్‌ని కాలితో తన్నుతూ ఫుట్‌బాల్‌ ఆడటం గమనించాడు. కొన్నాళ్లపాటు రోజూ ఆ చెట్టు కిందే నిల్చుని పిల్లల్ని గమనిస్తుండేవాడు. ఈ క్రమంలోనే వాళ్లంతా వ్యసనపరులనీ, నేరాలు చేసేవారనీ తెలుసుకున్నాడు విజయ్‌. దాంతో వాళ్ల జీవితాల్ని ఆటతో బాగు చేయాలని నిర్ణయించుకున్నాడు. వాళ్లందర్నీ మార్చడం అంత తేలిక కాకపోవచ్చు కానీ, అసాధ్యం మాత్రం కాదని నమ్మిన విజయ్‌ ముందుగా ఆ పిల్లలకి బంతిని బహుమతిగా ఇచ్చి స్నేహం కుదుర్చుకున్నాడు. తనతో ఫుట్‌బాల్‌ ఆడితే రూ.5 ఇస్తానని చెప్పి మైదానానికి రప్పించుకున్నాడు.

అయితే ఆ మురికివాడల పిల్లల్లో దాదాపు 99 శాతం మద్యం, డ్రగ్స్‌, స్మగ్లింగ్‌, గ్యాంబ్లింగ్‌ తదితర కేసుల్లో ఇరుక్కున్నవారే. వాళ్లందరికీ సమాజం పట్ల గౌరవాన్ని పెంచి ఆ సమాజం కూడా గౌరవించే స్థాయికి తీసుకెళ్లాలనుకున్నాడు. ఇంతలో పీఈటీగా రిటైర్‌ అయ్యాడు. ఆ సందర్భంగా వచ్చిన పద్దెనిమిది లక్షల రూపాయలతో ‘స్లమ్‌ సాకర్‌’ పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థను స్థాపించి ఫుట్‌బాల్‌ నేర్పించడం మొదలుపెట్టాడు. ఆ పిల్లలకి జెర్సీలూ, షూస్‌, బాల్‌ లేకపోయినా ఉన్న వాటితోనే ఆటల్లో మెరుగ్గా రాణించేలా తీర్చిదిద్దేవాడు. దాంతోపాటు వ్యసనాల నుంచి బయట పడలేని వారికి చికిత్స చేయించేవాడు. క్రమంగా మురికివాడల పిల్లలతో టోర్నమెంట్‌లు నిర్వహిస్తూ గెలిచిన వారికి బహుమతులూ, ఉచితంగా ఆహారం, దుస్తులూ అందించడంతోపాటు చదివిస్తాననీ ప్రకటించాడు. అంతేకాదు, వారిలో ప్రతిభావంతుల్నీ ఎంపిక చేసి ‘హోమ్‌లెస్‌ వరల్డ్‌ కప్‌’కి పంపడానికి ప్రణాళిక వేసుకున్నాడు.

మండేలా మెప్పు...

విజయ్‌ గురించి తెలిసిన నెల్సన్‌మండేలా 2007లో దక్షిణాఫ్రికాలో జరిగే హోమ్‌లెస్‌ వరల్డ్‌ కప్‌లో ఆడాల్సిందిగా విజయ్‌ బృందాన్ని ఆహ్వానించాడు. అంతా బాగానే ఉంది కానీ, ఆ పిల్లలంతా కేసుల్లో ఇరుక్కున్నవారు. దాంతో విజయ్‌ ఎన్ని ప్రయత్నాలు చేసినా పాస్‌పోర్టు రాకపోవడంతో కోర్టు మెట్లు ఎక్కి పోరాటం చేసి అనుకున్నది సాధించాడు. అందుకోసం తన నాలుగెకరాల భూమినీ, భార్య బంగారాన్నీ తాకట్టు పెట్టాడు. ఆ డబ్బుతోనే టికెట్లూ, జెర్సీలూ, షూలూ, ఫుట్‌బాల్‌ కిట్లూ కొని పిల్లల్ని ద]క్షిణాఫ్రికాకు తీసుకెళ్లి వారిని ప్రపంచకప్‌ బరిలో నిల్చోబెట్టాడు. క్రమంగా విజయ్‌ గురించి ఆ నోటా ఈ నోటా తెలియడంతో ఇతర రాష్ట్రాల పిల్లలు కూడా ఫుట్‌బాల్‌ శిక్షణకు రావడం మొదలుపెట్టారు. వారికి ఆశ్రయమిచ్చి ఫుట్‌బాల్‌ నేర్పించి టోర్నమెంట్‌లకు పంపుతుండేవాడు. చాలామంది పిల్లలు జాతీయ స్థాయిలో ఆడి ప్రభుత్వ ఉద్యోగాలకు
అర్హత సాధించారు. మరికొందరు కోచ్‌లుగా, పీఈటీలుగా వెళ్లారు. నిస్వార్థంగా సేవ చేస్తున్న విజయ్‌ని గుర్తించి రిలయన్‌్్స సంస్థ ‘రియల్‌ హీరో’ అవార్డు ఇచ్చింది. ఆ తరవాత-నేరాలు చేసిన నేపథ్యం నుంచి సేవ చేసే స్థాయికి ఎదిగిన అఖిలేష్‌ పాల్‌తోపాటు గురువు విజయ్‌నీ ఆమిర్‌ఖాన్‌ సత్యమేవజయతే కార్యక్రమానికి పిలవడంతో ఆయన గురించి దేశవ్యాప్తంగా తెలిసిపోయింది. ఆ సమయంలో కొందరు విజయ్‌ చేస్తున్న పని నచ్చక పేద వారికి ఆటలు నేర్పించొద్దని ఇబ్బంది పెట్టేవారు. ఫుట్‌బాల్‌ టీంని ‘గొర్రెల మంద’(హిందీలో ఝుండ్‌) అంటూ ఎగతాళి చేసేవారు. అవేమీ పట్టించుకోకుండానే కేరళ, తమిళనాడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌, గుజరాత్‌, జమ్మూకశ్మీర్‌... ఇలా మొత్తం 24 రాష్ట్రాలకు చెందిన వేల మంది పిల్లలకు ఫుట్‌బాల్‌ నేర్పించి- 2500 టీముల్ని మహారాష్ట్ర టోర్నమెంట్‌కూ, 128 టీముల్ని జాతీయ స్థాయికీ, 25 టీముల్ని హోమ్‌లెస్‌ వరల్డ్‌ కప్‌కీ పంపాడు. విజయ్‌ది ఇంత స్ఫూర్తిదాయకమైన జీవితం కనుకే ఆ పాత్రలో నటించడానికి ఇష్టంగా ముందుకొచ్చాడు అమితాబ్‌ బచ్చన్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..