Updated : 26 Jun 2022 07:15 IST

మా ఆయన కోసం సల్మాన్‌ఖాన్‌ని వదులుకున్నా!

అమ్మా అత్తా పాత్రలు కాటన్‌ చీరతో, కష్టాలూ కన్నీళ్లతో మనసును బరువెక్కించేలా కాకుండా- మోడ్రన్‌ లుక్‌తో, ట్రెండీ దుస్తులతో, అడుగడుగునా ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతూ... వెండితెరపైన నటి నదియా రూపంలో తారసపడుతున్నాయి. ఆధునిక అమ్మ పాత్రలకు కేరాఫ్‌గా మారి సెకండ్‌ ఇన్నింగ్స్‌లో స్టార్‌డమ్‌ తెచ్చుకున్న నదియా- హుందాగా, ఫిట్‌గా కనిపించే తీరే అందుకు కారణమంటూ తన సినీ ప్రయాణం ఎలా మొదలైందో... ఎటు నుంచి ఎటు మలుపులు తిరిగిందో చెబుతున్నారిలా...

తెలుగు నేర్చుకుని స్పష్టంగా మాట్లాడాలనేది చాలా రోజులుగా నా కల. ఎందుకంటే ‘మిర్చి’లో అవకాశం వచ్చినప్పుడు భాష రాకపోవడంతో నటించడానికి భయపడ్డాను. డైలాగులు కరెక్ట్‌గా చెప్పలేకపోతే ముఖంలో హావభావాలు కూడా సరిగా పలికించలేం. దర్శకులు ఇచ్చిన సపోర్ట్‌తో నేను నటించగలిగాను గానీ, సంతృప్తి కలగలేదు. లాక్‌డౌన్‌లో తీరిక దొరకడంతో స్పష్టంగా తెలుగు నేర్చుకున్నాను. అంతేకాదు, ‘అంటే... సుందరానికీ’లో డబ్బింగ్‌ కూడా చెప్పా. ఇక మీదట కూడా నా పాత్రలకు నేనే డబ్బింగ్‌ చెప్పాలనుకుంటున్నాను. నేనిప్పుడు ఇలా తాపత్రయ పడటం చూసిన చాలామంది ‘హీరోయిన్‌గా టాలీవుడ్‌కు చాలా దూరంగా ఉన్నారు, సెకండ్‌ ఇన్నింగ్స్‌లో మాత్రం తెలుగు తెరను అసలు వదలట్లేదేంటీ...’ అని అడుగుతారు. నిజానికి నేనెప్పుడూ నా జీవితంలో- ఇదిలా ఉండాలీ, ఇప్పుడిలా చేయాలీ అని ప్లాన్‌ చేసుకోలేదు. అన్నీ అలా జరిగిపోయాయంతే. నా జీవితంలోకి ఒకసారి తొంగి చూసుకుంటే నాకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే... నా పేరులానే నాజీవితం కూడా పలు మలుపులు తిరుగుతూ పరిగెడుతోంది. 

నాన్న ఎస్‌.కె.మొయిదు ముస్లిం. అమ్మ లలిత హిందువు. ఇద్దరూ మలయాళీలే గానీ, ప్రేమ వివాహం చేసుకున్నారు. నేను పుట్టక ముందే నాన్న వృత్తిరీత్యా మా కుటుంబం ముంబయిలో స్థిరపడింది. నాకో చెల్లి. చిన్నతనంలో చదువూ, టీవీ రెండే నా ప్రపంచం. ఇంట్లో ఉంటే టీవీకి అతుక్కుపోయేదాన్ని. సాధారణంగా ఎవరైనా టీవీ చూసేటప్పుడు ప్రకటనలు వస్తే విసుక్కుంటుంటారు. నేను మాత్రం ఆ ప్రకటనల కోసమే టీవీ చూసేదాన్ని. ఎందుకో తెలియదు గానీ చిన్నప్పుడు యాడ్స్‌ అంటే నాకు చాలా ఇష్టం. పెద్దయ్యాక నేను కూడా అలాంటి ప్రకటనలు రూపొందించాలని కలలు కంటుండేదాన్ని. ఎంబీఏ చదివితే యాడ్స్‌ చేయొచ్చని తెలిసి అదే చదవాలని నిర్ణయించుకున్నాను. అయితే పదో తరగతి పూర్తి చేసి ఇంటర్‌లో చేరాక మా వీధిలో ఉండే శిరీష్‌ గాడ్బోలేతో ప్రేమలో పడ్డాను. అతని పరిచయం వల్ల ఒక్కసారిగా నా లక్ష్యం మారిపోయింది. ఎందుకంటే తనకి విదేశాల్లో చదువుకుని మంచి ఉద్యోగం చేయాలనే కోరిక ఉండేది. దాంతో నేనూ అతని లక్ష్యాన్ని గౌరవించి తనకి ఉద్యోగం వచ్చాక అమ్మానాన్నలకి చెప్పి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నా. అప్పటి వరకైనా చదువుకోవాలని కాలేజీకి వెళ్లేదాన్ని. నేను ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌లో ఉన్నప్పుడనుకుంటా... కేరళ నుంచి నాన్న ఫ్రెండ్‌ ఒకరు మా ఇంటికొచ్చారు. ఆయన మలయాళీ దర్శకుడు ఫాజిల్‌కి స్వయానా అన్నయ్య. ఆయన వచ్చి వెళ్లిన తెల్లారే ఫాజిల్‌ నుంచి నాన్నకి ఫోన్‌ వచ్చింది. ‘మోహన్‌లాల్‌తో మేం తీయబోయే సినిమాలో హీరోయిన్‌ కోసం చూస్తున్నాం. మీ అమ్మాయి అయితే ఆ పాత్రకి బాగుంటుంది. ఆడిషన్‌కి తీసుకొస్తారా...’ అని అడిగారు. అప్పటి వరకూ మాకెవరికీ సినిమాల ఆలోచనే ఉండేది కాదు. అయినా ఒప్పుకున్నారు. ‘ఈ రంగం కొత్తగా ఉంటుంది. ఒకసారి ప్రయత్నించు. ఒకవేళ చేయలేను అనిపిస్తే ఇంకే సినిమా ఒప్పుకోకు’ అని చెప్పి నాన్న కేరళకు తీసుకెళ్లారు. నాన్న మాటలు నాపైన మంత్రంలా పనిచేశాయి. దర్శకుడు చెప్పినట్టు చేశాను. అలా చేసిన నా మొదటి సినిమా ‘నొక్కేత దూరత్తు కన్నుమ్‌ నట్టు’. ఆ సినిమా హిట్‌ అవ్వడంతోపాటు నాకు ఉత్తమ నటిగా ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డునీ తెచ్చి పెట్టింది. దాంతో మలయాళం, తమిళంలో సినిమా అవకాశాలు వరస కట్టాయి.

శిరీష్‌ని పెళ్లి చేసుకునే వరకైనా నటిద్దాం అనుకుని వచ్చిన సినిమాలన్నీ చేయడం మొదలుపెట్టాను. మరోవైపు శిరీష్‌ చదువుకోవడానికి అమెరికా వెళ్లాడు. ఇప్పట్లోలా అప్పట్లో ఫోన్లూ, చాటింగ్‌లూ, సామాజిక మాధ్యమాలూ ఉండేవి కాదు. మాట్లాడాలంటే ట్రంక్‌ కాల్‌ బుక్‌ చేసుకోవాలి, లేదంటే ఉత్తరాలు రాసుకోవాలి. షూటింగ్‌ వల్ల వాటికీ సాధ్యమయ్యేది కాదు. మరోవైపు తనకి ఉద్యోగం రానిదే అమ్మానాన్నలకి అసలు విషయం చెప్పడానికి వీలు లేక ఇబ్బంది పడుతుండేదాన్ని. మరోవైపు విరామం లేకుండా తమిళం, మలయాళం, తెలుగులో నటిస్తుండేదాన్ని. ‘బజారు రౌడీ’, ‘వింత దొంగలు, ‘ఓ తండ్రి ఓ కొడుకు’... నేను హీరోయిన్‌గా చేసిన తెలుగు సినిమాలు. అవి చేశాక తెలుగులో ఇంకా కొన్ని అవకాశాలు వచ్చాయి గానీ, ఆ లోపులో శిరీష్‌కి అమెరికాలో ఉద్యోగ మొచ్చింది. దాంతో తను ఇండియాకొచ్చి మా పెద్ద వాళ్లతో మాట్లాడి పెళ్లికి ఒప్పించాడు. అతని తీరు నచ్చడంతో అమ్మానాన్నలు వెంటనే పెళ్లికి ఒప్పుకున్నారు. సరిగ్గా అప్పుడే ‘మైనే ప్యార్‌ కియా’లో అవకాశం వచ్చింది. ఒక్క క్షణం- పెళ్లిని వాయిదా వేసి ఆ సినిమా చేద్దామా అనిపించింది కానీ, ఆ లోపు ఏదన్నా సమస్య వస్తే మొదటికే మోసం వస్తుందని భయపడి నో చెప్పాను. అలా 1988లో మా పెళ్లైంది. అంతకు ముందు ఒప్పుకున్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి మావారితోపాటు అమెరికా వెళ్లాను.

తెలియకుండా గడిపా...

అక్కడ ఖాళీగా ఉండటం ఇష్టం లేక  మీడియా మేనేజ్‌మెంట్‌లో గ్రాడ్యుయేషన్‌ చేశా. ఇంకా చదువుకుందామనుకున్నాను కానీ మా అమ్మాయిలు పుట్టడంతో ఇంటికే పరిమితమయ్యాను. వాళ్ల బాగోగులు చూసుకుంటూ సమయం తెలియకుండా పద్దెనిమిదేళ్లు గడిపాను. అయితే 2003లో ఒకసారి ముంబయి వచ్చాను. అమ్మ అడిగిందని ఒకరోజు తనని షాపింగ్‌కి తీసుకెళితే అక్కడ నన్ను చూసిన ఓ దర్శకుడు తాను తీస్తోన్న తమిళ సినిమాలో చేయమని అడిగారు. నాకసలు అలాంటి ఆలోచన లేనే లేదని చెప్పేశాను. ఇంటికెళ్లాక శిరీష్‌కీ అదే విషయం చెబితే ‘నువ్వు ఇప్పటి వరకూ మాకోసం చాలా చేశావ్‌. ఇక చాలు. ఇప్పుడు సినిమా అవకాశం వస్తే మాత్రం వదులుకోకు’ అన్నారు. తనలా అనడంతో వెంటనే నన్ను సంప్రదించిన దర్శకుడికి ఫోన్‌ చేసి కథ చెప్పమన్నాను. అతడు వెంటనే నన్ను కలిసి ‘అమ్మానాన్నా ఓ తమిళ అమ్మాయి’ సీడీ ఇచ్చి...‘ఈ సినిమానే తమిళంలో రీమేక్‌ చేస్తున్నాం. జయసుధ నటించిన పాత్రను మీరు పోషించాల్సి ఉంటుంది’ అని చెప్పారు. ఆ సినిమా సగం కూడా చూడకుండానే  ఆఫర్‌ను ఒప్పుకున్నాను. ఇక అది మొదలు సెకండ్‌ ఇన్నింగ్స్‌లోనూ సినిమా అవకాశాలు బారులు తీరడంతో బిజీ అయిపోయాను. ఏ మాత్రం ఖాళీ దొరికినా మా పిల్లల దగ్గరకు వెళ్లి వస్తుండేదాన్ని. ఆ ఇబ్బందిని గమనించిన మావారు 2007లో తన ఉద్యోగాన్ని ముంబయికి మార్చుకున్నారు.

నాకోసం నేను...

దాంతో నాకు పూర్తిగా సినిమాల మీద దృష్టి పెట్టే అవకాశం లభించింది. అలా నేను దూసుకుపోతున్నప్పుడే కొరటాల శివ నన్ను కలిశారు. కానీ, భాష ఇబ్బంది వల్ల ఆ అవకాశాన్ని వదిలేద్దామనుకున్నాను. ‘మిర్చి’ కథ విన్నాక మాత్రం నేనే చేయాలని ఒప్పేసుకున్నాను. ఎందుకో తెలియదు ఇద్దరూ ఆడపిల్లలు కావడం వల్లనేమో ప్రభాస్‌తో నటిస్తున్నంతసేపూ ఇలాంటి కొడుకు కూడా ఉంటే బాగుంటుందనిపించింది. ఆ సినిమా విడుదలై తెలుగులోనూ మంచి పేరు వచ్చింది. ఆ తరవాత త్రివిక్రమ్‌ ‘అత్తారింటికి దారేది’ కథతో వచ్చి స్ట్రాంగైన అత్త పాత్రలో చేయాలి అన్నప్పుడు- నేను చాలా కూల్‌ అండ్‌ సింపుల్‌ పర్సన్‌ని... అది నెగెటివ్‌ పాత్రేమో దానికి నేను సూట్‌ కానని చెప్పాను. ‘మీరే ఈ పాత్రకు న్యాయం చేస్తారు. మిమ్మల్ని ఆ పాత్రలో చూసిన తరవాత అమ్మ, అత్త పాత్రలకి అర్థం మారుతుంది’ అనడంతో ఓకే చెప్పాను. అన్నట్టుగానే మోడ్రన్‌ అమ్మ పాత్రలకి నేను కేరాఫ్‌గా మారిపోయా. అంతేకాదు, అప్పటి వరకూ నటించిన సినిమాలన్నీ ఒకెత్తు అయితే... ఆ ఒక్క సినిమా ఒకెత్తు. ఎంత మంచి పేరు వచ్చిందో. క్యారెక్టర్‌ ఆర్టిస్టునైన నాకు స్టార్‌డమ్‌ని తెచ్చి పెట్టింది. ఆ సినిమా తరవాత ‘అ ఆ’, ‘దృశ్యం1’, ‘బ్రూస్‌ లీ’, ‘నా పేరు సూర్య’, ‘దృశ్యం2’, ‘మిస్‌ ఇండియా’, ‘వరుడు కావలెను’, ‘గని’, ‘సర్కారువారి పాట’, ‘అంటే... సుందరానికీ’ సినిమాల్లో నటించాను. ప్రస్తుతం రామ్‌ నటించిన ‘ది వారియర్‌’ విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఇప్పటికీ నేను ఎక్కడికెళ్లినా ‘అత్తారింటికి దారేది’ సినిమా గురించే మాట్లాడతారు. ‘అ ఆ’లో కూడా ఇంచుమించు అలాంటి పాత్రే. అవి చూశాక ఆడవాళ్లు ముఖ్యంగా అమ్మలు అంతే స్ట్రాంగ్‌గా ఆత్మవిశ్వాసంతో ఉండాలి అని చాలామంది చెప్పారు. కొందరైతే ఆ సినిమాలు చూసి నేను నిజంగానే బయట అంత సీరియస్‌గా, పొగరుగా ఉంటానని అనుకుంటుంటారు. నిజానికి నేను నవ్వుతూ నా చుట్టూ ఉన్నవారిని నవ్విస్తూ ఉంటాను. సింప్లిసిటీని ఇష్టపడతాను. ఫిట్‌నెస్‌కి ఎక్కువ ప్రాధాన్యమిస్తాను. మధ్య వయసుకొస్తేనేం- ఆరోగ్యం, అందం పరంగా జాగ్రత్తలు తీసుకుని మనం బాగుంటేనే మన కుటుంబం కూడా బాగుంటుందని ఆడవాళ్లకి చెబుతుంటాను. కానీ చాలామంది పెళ్లై పిల్లలు పుట్టాక వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకోరు. నేను మాత్రం ఆ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుని నాకోసం నేను సమయం కేటాయించుకుంటాను. అందుకే అమ్మ పాత్రలు చేసే నేను హీరో హీరోయిన్లకు అక్కలా కనిపిస్తానని నా స్నేహితులూ, తోటి నటీనటులూ అంటుంటారు. అంత కంటే గొప్ప పొగడ్త ఇంకేముంటుంది.


నదిలా సాగాలనీ...

నా అసలు పేరు జరీనా మొయిదు. నేను సినిమాల్లోకి వచ్చేటప్పటికే హిందీ నటి జరీనా వహాబ్‌ ఫేమస్‌. అందుకే దర్శకుడు- గలగల పారే నది అని అర్థం వచ్చేలా ‘నదియా’ అనే పేరును పెట్టారు. అంతేకాదు, సినీ రంగంలో కూడా ఎక్కడా ఆగకుండా నదిలా పరవళ్లు తొక్కుతూ ముందుకెళ్లాలని ఆశించారు. అందుకేనేమో ఎన్ని మలుపులున్నప్పటికీ ఈ రంగంలోనే ఇప్పటికీ కొనసాగుతున్నా.

* నాకు ఇద్దరు ఆడపిల్లలు. పెద్దమ్మాయి సనమ్‌, చిన్నది జానా... సనమ్‌ వెస్ట్రన్‌ మ్యూజిక్‌ సింగర్‌. చాలా సంగీత నాటకాల్లో పాల్గొంది. జానాకి డాన్స్‌ ఇష్టం. హిప్‌హాప్‌, జాజ్‌ చేస్తుంది. కానీ, ఇద్దరికీ చదువంటేనే ఎక్కువ ఇష్టం.
* ‘మైనే ప్యార్‌ కియా’ అవకాశాన్ని వదులుకున్న నేను ఇప్పటికీ పిల్లలతో సరదాగా ‘సల్మానా? మీ డాడీనా?... అంటే మీ డాడీకే ఓటేశా తెలుసా’ అని అంటుంటా.  
* నేను మంచి ఫుడీని. బాగా తింటా. అందుకు తగ్గట్టే వ్యాయామం చేస్తాను. వాకింగ్‌, వెయిట్‌ట్రైనింగ్‌, యోగా రోజూ చేయాల్సిందే.
* ఎందుకో తెలియదు మొదట్నుంచీ నా సినిమాల్ని నేను చూసుకోను. వేరే నటులు నటించిన సినిమాల్ని చూడ్డానికైతే ఓపిగ్గా థియేటర్‌ వరకూ వెళతాను.


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని