తీరిక దొరికితే హిమాలయాలకు...

సినిమావాళ్ల తలరాతలు శుక్రవారం తారుమారవుతాయంటారు. ఒక సినిమాతో శిఖరాల్ని అధిరోహించినవాళ్లే... ఇంకో సినిమాతో నేలమీదకు దిగాల్సి వస్తుంది. సంయుక్త మేనన్‌ టాలీవుడ్‌ ప్రయాణం అందుకు భిన్నంగా నడుస్తోంది.

Updated : 22 Feb 2024 16:34 IST

సినిమావాళ్ల తలరాతలు శుక్రవారం తారుమారవుతాయంటారు. ఒక సినిమాతో శిఖరాల్ని అధిరోహించినవాళ్లే... ఇంకో సినిమాతో నేలమీదకు దిగాల్సి వస్తుంది. సంయుక్త మేనన్‌ టాలీవుడ్‌ ప్రయాణం అందుకు భిన్నంగా నడుస్తోంది. ప్రతి సినిమాతో పైపైకి ఎదుగుతూ... ‘గోల్డెన్‌ లెగ్‌’ అంటూ ప్రశంసలు అందుకుంటోంది. 25 సినిమాల తర్వాతా నేర్చుకోవడానికి సంసిద్ధంగా ఉండటమే ఆమె విజయాలకి ప్రధాన కారణమని చెప్పాలి. తన సినిమా కెరియర్‌ గురించి సంయుక్త ఏం చెబుతుందంటే...

సినిమాల్లోకి కలలుగని రాలేదు. మొదట్లో అసలు దీన్నో కెరియర్‌గానే అనుకోలేదు. మోడలింగ్‌ చేసే అవకాశం వచ్చింది. అక్కణ్ణుంచి మలయాళ సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. మొదట చిన్న పాత్రలు చేశా. 2016లో ‘పాప్‌కార్న్‌’తో నాకంటూ ఓ గుర్తింపు వచ్చింది. అప్పటికీ పూర్తిగా సినిమాల్లోనే ఉండాలన్న ఆలోచనలు లేవు. 2018లో ఒకే నెలలో ‘తీవండి’, ‘లిల్లీ’ సినిమాలు విడుదలై నాకు మంచి బ్రేక్‌ ఇచ్చాయి. ‘తీవండి’ కమర్షియల్‌గా నిలబెట్టింది. ‘లిల్లీ’ నటిగా సంతృప్తినిచ్చింది. అందులో ఒక గర్భిణిగా కనిపించా. నాదే లీడ్‌ రోల్‌. సినిమాలపైన నా దృక్పథాన్ని మార్చింది ‘లిల్లీ’. సినిమా ఒక కళ. దీంతో సామాజిక స్పృహ కలిగించవచ్చని అర్థమైంది. ఆ తర్వాతే నా లక్ష్యం, గమ్యం సినిమా అని బలంగా అనుకున్నా. నేనేదైనా కోరుకుంటే దాని గురించి గట్టిగా ప్రయత్నిస్తా. స్కూల్‌ రోజుల్లోనూ అంతే. వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో సీరియస్‌గా పోటీపడి గెలిచేదాన్ని. ఒక సబ్జెక్ట్‌, పాఠం బాగా నచ్చితే పూర్తిగా అందులో లీనమైపోయేదాన్ని. పరీక్షలో వందకు వంద లక్ష్యం పెట్టుకుంటే సాధించితీరేదాన్నంతే. సినిమాల్లో నిలదొక్కుకోవాలంటే నటనపైన పట్టు అవసరమని... అంతర్జాతీయ సినిమాలు చూసేదాన్ని, యాక్టింగ్‌కు సంబంధించిన పుస్తకాలు చదివేదాన్ని, ఆన్‌లైన్లో యాక్టింగ్‌ క్లాసులు చూసేదాన్ని.

డాక్టర్‌ అవ్వాలనుకుని...

సినిమాలకు ముందు నేనేంటో చెప్పలేదు కదూ! మా సొంతూరు పాలక్కాడ్‌కు దగ్గర్లోని చిట్టూర్‌. కేరళ-తమిళనాడు సరిహద్దుల్లో ఉంటుంది. చిన్న నది, పచ్చని పొలాలు, అందమైన ఇళ్లు, మాయామర్మం తెలియని ప్రజలు! సంస్కృతీ, సంప్రదాయాలకూ పెద్దపీట వేస్తారక్కడ. ఊళ్లో ఉండేవి రెండు మూడు స్కూళ్లు. పెద్ద ఊరే అయినా అందరూ అందరికీ తెలుసు. సినిమాల్లోకి వచ్చాక ఎక్కువగా మిస్సయ్యేది ఊరినే. అమ్మ శ్రీదేవి సింగిల్‌ పేరెంట్‌. అమ్మమ్మ-తాతయ్యలతో ఉండేవాళ్లం. టెన్త్‌వరకూ చిట్టూర్‌లోని ‘చిన్మయ విద్యాలయ’లో చదివా. చదువులో చురుకే. ఇంటర్‌ త్రిశూర్‌లో చదివా. మెడిసిన్‌ చేయాలనుకునేదాన్ని. మొదటి ప్రయత్నంలో సీటు రాలేదు. దాంతో లాంగ్‌ టెర్మ్‌ కోచింగుకి వెళ్లా. అప్పుడు ర్యాంకు వచ్చింది కానీ. ఫ్రీ సీటు రాలేదు. దాంతో మరోసారి లాంగ్‌టెర్మ్‌కి కూర్చున్నా. ఆ టైమ్‌లో ‘సీటు కోసం ఇంత కష్టపడుతున్నా... మెడిసిన్‌ పూర్తిచేస్తే జీవిత కాలం డాక్టర్‌గా పనిచేయగలనా’ అన్న ఆలోచనలు మొదలయ్యాయి. ముందైతే పరీక్ష రాద్దామని చదువు కొనసాగించా. ఆ సమయంలోనే ఫేస్‌బుక్‌లో నా ఫొటోల్ని చూసిన ఓ ఫొటోగ్రాఫర్‌ వాటిని ఓ మ్యాగజైన్‌ కవర్‌కు ఇస్తానంటే... సరేనన్నా. ఆ ఫొటోని చూసిన ‘పాప్‌కార్న్‌’ దర్శకుడు ఆ సినిమాలో అవకాశం ఇచ్చారు. అప్పటికే చదువు కొనసాగించాలా వద్దా అన్న సందేహంలో ఉన్న నాకు సినిమాల్లో ప్రయత్నించి చూద్దామనిపించింది. మూడో ప్రయత్నంలో ర్యాంకు వచ్చింది. ఏదో ఒక కాలేజీలో సీటు వచ్చేది కానీ, అప్పటికే నా మనసు మారిపోయింది. ఇంట్లో విషయం చెప్పా. నేను మొండి అన్న సంగతి వాళ్లకి తెలుసు. ‘సరే ప్రయత్నించు, సినిమాలు నచ్చకపోతే తిరిగి చదువు కొనసాగించాలి. నచ్చితే అందులో కొనసాగుతూ ప్రైవేటుగా చదవాలి’ అన్నారు. అలా సినిమాల్లో అడుగుపెట్టా. అక్కడా మొదట సాఫీగా ఏం నడవలేదు. ఓ రెండు సినిమాల తర్వాత గ్యాప్‌ వచ్చింది. మళ్లీ సందిగ్ధం. అంతలో ‘లిల్లీ’, ‘తీవండి’... రూపంలో హిట్లు వచ్చాయి.

‘నందిని’ పాత్ర కోసం...

టీనేజర్‌గా నా ఆలోచనలు పరిపరి విధాలుగా ఉండేవి. ఒకసారి బాగా చదువు కోవాలని ఉండేది, ఇంకోసారి ఇంకో అంశం మీదకు దృష్టి మళ్లేది. కానీ ఇరవై దాటి పాతికేళ్లకు వచ్చేసరికి స్థిరంగా ఉండటం అలవాటైంది. దాంతో సినిమాలమీద శ్రద్ధ పెట్టగలిగా. అభిమానులూ, శ్రేయోభిలాషులూ చూపించే ప్రేమాభిమానాలు ఇక్కడ చాలా ఎక్కువ. వాళ్లకు వ్యక్తిగతంగా తెలియకపోయినా... పుట్టినరోజున లక్షల మంది విష్‌ చేస్తారు. సినిమా ప్రయాణంలో నాకు ఇంకో గొప్ప అంశం అనుభవమవుతుంది... అదే అహాన్ని వీడటం. ఒక పాత్రలో లీనమైపోతే నన్ను నేను మర్చిపోతా. దానివల్ల కొన్ని రోజులపాటు అహాన్ని నానుంచి దూరం చేసుకోగలుగుతా. నాకు ఆధ్యాత్మిక భావనలు ఎక్కువ. ఆ విధంగా ఇది నాకు సంతృప్తినిచ్చే అంశం. నా సినిమా రివ్యూల్లో ‘కథ అద్భుతం, డైరెక్షన్‌, హీరో నటన బావున్నాయి. హీరోయిన్‌ చాలా అందంగా కనిపించింది’ అన్నట్టు ఉండకూడదనుకుంటా. అలా రాస్తే సినిమాలో నేనున్నా లేనట్టే! నా పాత్రకీ, నటనకీ ప్రాధాన్యం ఉండేవే ఎంచుకుంటా. అలా ఎంచుకున్నవే తెలుగులో నా సినిమాలన్నీ. 2021లో ‘బింబిసార’ ఆఫర్‌ వచ్చింది. కథ భిన్నంగా అనిపించి చేయడానికి సిద్ధమయ్యా. ‘భీమ్లానాయక్‌’లో నా పాత్ర నిడివి తక్కువేకానీ ప్రాధాన్యం ఎక్కువ. ‘సర్‌’ లాంటి సందేశాత్మక చిత్రంలో నటించడం నా వృత్తి ధర్మం. దాంతో తమిళం, తెలుగు సినిమాల్లో ఒకేసారి హిట్‌ కొట్టాను కూడా! ‘విరూపాక్ష’ కోసం ఆడిషన్‌ చేస్తామన్నారు. అప్పటికే 20 సినిమాలు చేశా. అయినాసరే ఆడిషన్స్‌కి సరేనన్నా. ప్రేమ, కోపం, జాలి... ఇలా ప్రతి భావాన్నీ కళ్లతోనే పలికించాలన్నారు. ఆ పరీక్షలో పాసయ్యా. కెరియర్‌ మొదట్లో యాడ్స్‌ చేసేటప్పుడు చాలామంది నా కళ్లను విమర్శించేవాళ్లు. చిన్నగా ఉంటాయనేవాళ్లు. ఇప్పుడు నా కళ్లే భావాల్ని బాగా పలికిస్తున్నాయని మెచ్చుకుంటున్నారు. ‘విరూపాక్ష’లో నందిని పాత్ర కొన్నేళ్లపాటు ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది. ‘విరూపాక్ష’ సమయంలో కేవలం కెమెరా ముందుకు వచ్చినప్పుడే ఆ క్యారెక్టర్‌ని పోషించలేదు, షూటింగ్‌ జరిగినన్ని రోజులూ ఆ పాత్రతో జర్నీ చేశా. ఏదైనా సీన్లో నా పాత్ర ఇలా చేస్తే బావుంటుందనిపిస్తే డైరెక్టర్‌ కార్తీక్‌కు చెప్పేదాన్ని, తన అభిప్రాయమూ చెప్పేవారు. అలా చర్చించుకోవడంవల్ల ఒకే భావాన్ని కథకు అనుకూలంగా రెండు మూడు కోణాల్లో పలికించే అవకాశం వచ్చింది. ప్రతి సినిమాకీ ఎంతో కొంత నేర్చుకుంటా. ‘విరూపాక్ష’తో మాత్రం చాలా చాలా నేర్చుకున్నా. తెలుగులో నా జర్నీ బావుంది. చేసిన నాలుగు సినిమాలూ హిట్టయ్యాయి. ప్రస్తుతం కల్యాణ్‌రామ్‌తో ‘డెవిల్‌’ చేస్తున్నా. ‘విరూపాక్ష’, ‘డెవిల్‌’ షూట్‌ షెడ్యూళ్లు ఒకేసారి పడ్డాయి. షూటింగ్‌లు పక్క పక్క సెట్లలో జరిగేవి. ఉదయం ఒకచోట, మధ్యాహ్నం మరోచోట పనిచేసేదాన్ని. అయినా ఏమంత కష్టమనిపించలేదు. కారణం మలయాళ సినిమాల్లో అనుభవమే. అక్కడ వేగంగా షూటింగ్‌ చేస్తారు. ఆ వేగం ఇక్కడ పనికొచ్చింది. డైలాగులు నేర్చుకోవడానికి ఎక్కువ టైమ్‌ పట్టదు, ఎక్కువ టేకులూ తీసుకోను. మలయాళ సినిమాల్లో చేయడమంటే ఒక మంచి యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసినట్టని నా అభిప్రాయం.

ఇక చదువు సంగతంటారా... ప్రైవేటుగా రెండుసార్లు డిగ్రీ కట్టా కానీ, వరుస సినిమాలవల్ల సకాలంలో అసైన్‌మెంట్లు పూర్తిచేయలేకపోయా. దాంతో మధ్యలోనే వదిలేయాల్సి వచ్చింది. అలాగని చదవడం మానేయలేదు. నవలలు చదువుతుంటా. సినిమా రిఫరెన్స్‌ల కోసమూ పుస్తకాలు తిరగేస్తా. నాలుగైదేళ్ల కిందట సినిమాలు ఎక్కువగా చేసేదాన్ని. ఏడాదికి నాలుగైదు ప్రాజెక్టులు. దాంతో తీరిక ఉండేది కాదు. మధ్యలో కొవిడ్‌. ఇప్పుడు పరిస్థితి మారింది. అప్పటిలా మరీ ఎక్కువ సినిమాలు చేయడంలేదు. ఆర్థిక పరిస్థితి మెరుగైంది. ఇకనైనా డిగ్రీ పూర్తిచేయడంమీద దృష్టి పెట్టి ఇంట్లోవాళ్లకి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా. భవిష్యత్తు గురించి ఆలోచించేటప్పుడు నటనలో కొనసాగడం, సినిమా ప్రపంచానికి పూర్తిగా దూరంగా ఉండటం, దర్శకత్వం చేపట్టడం, సేవారంగంలో అడుగుపెట్టడం... ఇలా బోలెడు ఆలోచనలు వస్తాయి. వీటిలో ఏదైనా జరగొచ్చు. ఇంకేదైనా కొత్త ఆలోచనైనా రావొచ్చు. అయితే, వీటిలో సేవా కార్యక్రమాల్ని మాత్రం సినిమాల్లో ఉండగానే త్వరలోనే మొదలుపెడతా.


గంగా తీరంలో సేదదీరుతా...

ప్రతిరోజూ ఒకేలా గడిస్తే నచ్చదు. అందుకేనేమో సినిమా రంగం నా గమ్యమైంది. కొత్త విషయాలు తెలుసుకోవడం, కొత్త ప్రదేశాల్ని చూడ్డం... నాకిష్టం. ఒంటరితనాన్నీ ఇష్టపడతా. ఒంటరిగా ప్రయాణాలు చేస్తా. 20వ పుట్టినరోజు సందర్భంగా ఒక్కదాన్నే తమిళనాడులో మదుర మీనాక్షి, ధనుష్కోటి మొదలైనచోట్ల తిరిగి వచ్చా. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఎక్కువగా ఉంటున్నా. ఖాళీ దొరికితే అమ్మ దగ్గరకు కొచ్చి వెళ్లొస్తా. సినిమాల మధ్య విరామం దొరికితే బ్యాగు సర్దుకుని ఋషికేశ్‌ చేరుకుంటా. అక్కణ్నుంచి హిమాలయాల్లో ట్రెక్కింగ్‌కీ, ఆలయాలు చూడ్డానికీ వెళ్తుంటా. ‘చిన్మయ విద్యాలయ’లో చదవడంవల్ల చిన్నప్పుడు ఆధ్యాత్మిక అంశాలూ, గంగా, హిమాలయాల పవిత్రత గురించీ ఎక్కువగా తెలుసుకున్నా. 11-12 ఏళ్లప్పుడు శ్లోకాల్నీ నేర్చుకున్నా. అప్పుడు అర్థం పూర్తిగా తెలిసేది కాదు. వాటినిప్పుడు చదువుతూ అర్థం చేసుకుంటా. గంగా ఒడ్డునో, ఏదో ఆలయ ప్రాంగణంలోనో ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుతూ కూర్చుంటా! కొన్నిసార్లు పర్యటక ప్రదేశాలకూ వెళ్తా. భుజం వెనక భాగంలో మలయాళంలో ‘సంచారి’ అని ఓ టాటూ కూడా వేయించుకున్నా.


సోషల్‌ మీడియాని పక్కనపెట్టలేం కానీ, అదే పనిగా అందులో టైమ్‌ వేస్ట్‌ చేసుకోకూడదు. నేనైతే నా కెరియర్‌ విషయాలు అభిమానులతో పంచుకోవడానికి సోషల్‌ మీడియాని ఉపయోగించుకుంటా. వ్యక్తిగత విషయాల్ని అక్కడ పంచు కునేది తక్కువ.


నటిగా నాలోని వైవిధ్యాన్ని పరీక్షించుకోవడానికి ప్రయోగాలకూ వెనకాడను. క్లాస్‌, మాస్‌ అన్న తేడా లేకుండా అన్ని వర్గాలకూ దగ్గరవ్వాలనేది నా ఉద్దేశం. 

* మితాహారం తీసుకుంటా. ఏం తిన్నా ఎరుకతోనే.


అమ్మతో సినిమా కథలూ, రెమ్యునరేషన్‌ గురించీ ఏమీ చర్చించను. నాతోపాటు సెట్స్‌కీ తీసుకుపోను. తల్లీకూతుళ్ల మధ్య అనుబంధం వేరు. అందులో వృత్తికి చోటివ్వకూడదన్నది నా ఉద్దేశం. పిల్లలు డాక్టర్లూ, ఇంజినీర్లూ అయితే వారి వృత్తిలో తల్లిదండ్రులు తలదూర్చరు కదా. ఇక్కడా అలానే ఉండాలనుకుంటా. చిన్నప్పట్నుంచీ అలానే పెరిగా. అందుకు కారణం పరిస్థితులు కావొచ్చు, నా మనస్తత్వం కావొచ్చు. ఎప్పుడైనా కాస్త దిగులుగా ఉన్నప్పుడు మాత్రం ‘స్ట్రాంగ్‌ పర్సన్‌ డల్‌గా కనిపిస్తున్నారు. ఏంటి విషయం’ అని దగ్గరకు తీసుకుంటుంది అమ్మ.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..