Mohan Raja: అంతగా వెక్కిరిస్తారని అనుకోలేదు!

ఒక భాష నుంచి మరో భాషలోకి తర్జుమా చేయడం- సాహిత్యంలో రెండు రకాలుగా ఉంటుంది. మూలంలో ఉన్నదాన్ని మక్కీకి మక్కీకి దించేయడాన్ని ‘అనువాదం’ అంటారు. మాతృకలోని ఆలోచనని మాత్రమే తీసుకుని సొంతదారిన నడిస్తే అనుసృజన అంటారు.

Updated : 23 Oct 2022 09:43 IST

Mohan Raja: అంతగా వెక్కిరిస్తారని అనుకోలేదు!

ఒక భాష నుంచి మరో భాషలోకి తర్జుమా చేయడం- సాహిత్యంలో రెండు రకాలుగా ఉంటుంది. మూలంలో ఉన్నదాన్ని మక్కీకి మక్కీకి దించేయడాన్ని ‘అనువాదం’ అంటారు. మాతృకలోని ఆలోచనని మాత్రమే తీసుకుని సొంతదారిన నడిస్తే అనుసృజన అంటారు. మోహన్‌రాజా చేసే రీమేక్‌ సినిమాలు ఈ రెండోరకం సాహిత్యంలాంటివి. మెగాస్టార్‌ చిరంజీవి తాజా సంచలనం ‘గాడ్‌ఫాదర్‌’ ఆ సృజనకి తలమానికం అనొచ్చు! అలాంటి రాజా- ఈ రీమేక్‌ల విషయమై ఎన్నో అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చిందట. ఎంతో సంఘర్షణకి లోనయ్యాడట. ఎందుకో... ఆయన మాటల్లోనే...

న్నెండేళ్ళ కిందటి మాట ఇది... ఆ రోజు నేను భార్యాపిల్లల్తో చెన్నైలోని ఓ షాపింగ్‌ మాల్‌కి వెళ్లాను. అక్కడున్న కొందరు నన్ను గుర్తుపట్టి ఆటోగ్రాఫ్‌ తీసుకుంటూ ఉంటే అక్కడున్న వాచ్‌మ్యాన్‌ వచ్చి ‘రాజాసార్‌... నెక్ట్స్‌ సినిమా కూడా డబ్బింగే చేస్తున్నారా! మీరు సొంతంగా ఎప్పుడు ఆలోచిస్తారో ఏమో!’ అన్నాడు వెటకారంగా! ఆ మాటకి చుట్టూ ఉన్నవాళ్లందరూ గొల్లుమన్నారు. డబ్బింగ్‌కీ రీమేకింగ్‌కీ తేడా తెలియని అతనిపైన నాకు కోపం రాలేదు కానీ... ‘నా గురించి అందరూ ఇలాగే ఆలోచిస్తున్నారా!’ అన్న బాధ నిలువెల్లా దహించేసింది. భార్యాపిల్లల్ని అక్కడే వదిలిపెట్టి... చరచరా ఇంటికొచ్చేశాను. వాస్తవానికి నేను చేసిన రీమేక్‌లని అసలు రీమేక్‌లని చెప్పలేం. ఓపెనింగ్‌ సీన్‌, ఇంటర్వెల్‌ బ్యాంగ్‌, క్లైమాక్స్‌ అన్నీ మూలంకన్నా చాలా భిన్నంగా ఉంటాయి. చాలామంది ఇతర భాషల్లోని కథలు తీసుకుని చిన్నపాటి మార్పులు చేసి సొంత కథేనని ప్రచారం చేసుకునే రోజుల్లో... ఆ విషయాన్ని బాహాటంగా చెప్పుకోవడంలో ఓ నిజాయతీ ఉందనుకునేవాణ్ణి. అయినాసరే, కొన్ని పత్రికలు ‘ఆయన మోహన్‌రాజా కాదు... పరభాషా కథలు కాపీ చేసే జిరాక్స్‌ రాజా!’ అంటూ నెగెటివ్‌ ప్రచారం చేస్తుండేవి. అది ఇంతగా జనంలోకి  వెళ్ళిందని ఊహించలేకపోయాను! అప్పటికి నేను పరిశ్రమలోకి వచ్చి పదేళ్లు. ఆ పదేళ్లూ నాలోపల అణచిపెట్టుకుని ఉన్న ఓ సంఘర్షణని ఆ షాపింగ్‌మాల్‌ ఘటన తట్టిలేపింది. ఒకప్పటి నా ఆశయాలు గుర్తొచ్చి తీవ్ర నిస్పృహ ఆవరించింది. ఎప్పట్లాగే మా అమ్మ నన్ను అందులో నుంచి బయట పడేసింది. అన్నట్టు... అందరికీ మా నాన్న ఎడిటర్‌ మోహన్‌ తెలిసినంతగా అమ్మ వరలక్ష్మి తెలియదు. నా కథను ఆమె నుంచే మొదలుపెట్టడం సముచితంగా ఉంటుంది...

మతాంతర వివాహం వాళ్ళది...

మానాన్న అసలు పేరు మహ్మద్‌ జిన్నా అబ్దుల్‌ ఖాదర్‌... మదురైలోని ఓ ముస్లిం కుటుంబానికి చెందినవారు. సినిమాలపైన ఆసక్తితో... పన్నెండేళ్ళకే ఇల్లొదిలి చెన్నై వచ్చేశారు. బాలకార్మికుడిగా హోటళ్లలో పనికి కుదిరారు. ఆ తర్వాత తంగవేలు అన్న సీనియర్‌ కమెడియన్‌ ఇంట్లో పనివాడిగా చేరారు. నాన్న పేరుని మోహన్‌ అని మార్చింది ఆయనే. ఆయన ద్వారా కొన్ని స్టూడియోల్లో ఎడిటింగ్‌ అసిస్టెంట్‌గా వెళ్ళడం ప్రారంభించారు. ఎన్టీఆర్‌ హీరోగా వచ్చిన ‘చిక్కడు దొరకడు’, ‘అగ్గిపిడుగు’ వంటి సినిమాలకి పనిచేశారు. చేతికి కాస్త డబ్బులొచ్చాక... ఓ పెద్ద బంగళా ముందున్న వాచ్‌మ్యాన్‌ గదిని అద్దెకు తీసుకున్నారట. ఆ కాంపౌండుకి పక్కనే ఓ అర్చకుల ఇల్లుండేది. ఆ ఇంటివాళ్ళకి నాన్న చేదోడువాదోడుగా ఉండేవారట. వాళ్లమ్మాయి వరలక్ష్మినే నాన్న ప్రేమించారు. వాళ్ళ ప్రేమకి అమ్మ ఇంట్లోనివాళ్ళు అభ్యంతరం చెప్పలేదు కానీ నాన్న వైపు మాత్రం పెద్ద రాద్ధాంతం జరిగింది. వాళ్లని ధిక్కరించి నాన్న పెళ్ళి చేసుకున్నారు. ఏడాది తర్వాత నేను పుట్టాను. నాకు ఊహ వచ్చేనాటికి మేం ఓ చిన్న పెంకుటింట్లో ఉండేవాళ్ళం. ప్రేమ-పెళ్ళితో ఆగిపోయిన తన చదువుని అమ్మ కొనసాగిస్తుండేది. నన్ను ఒళ్ళో పెట్టుకునే... నిత్యం పుస్తకాలు తిరగేస్తుండేది. ఎంతగా ప్రేమించి పెళ్ళి చేసుకున్నా... అమ్మానాన్నలు వేర్వేరు సంస్కృతులకి చెందినవాళ్ళు కాబట్టి... అమ్మలో ఓ రకమైన అభద్రత ఉంటూనే ఉండేది. ముఖ్యంగా మా నాన్నమ్మ ఇంటికి వచ్చినప్పుడు అమ్మ చాలా సంఘర్షణకు గురవుతున్నట్లు నాకు అనిపించేది. అప్పటిదాకా పెట్టుకున్న బొట్టు తీసేసేది... ఇంట్లోని హిందూమతం గుర్తుల్ని చెరిపేస్తుండేది. ‘నా ముందు ఎంతో ధైర్యంగా ఉండే అమ్మ నాన్నమ్మ వస్తే మాత్రం ఎందుకిలా చేస్తోంది?’ అనుకునేవాణ్ణి. మరోవైపు - పుట్టింటి వైపు బంధువులు కొందరు అమ్మనీ మమ్మల్నీ చిన్నచూపు చూస్తుండేవారు. అన్ని అభద్రతల మధ్య సంసారాన్ని మొదలుపెట్టిన అమ్మ- నేను చూస్తుండగానే అటు పుట్టింటివాళ్ళకీ ఇటు అత్తింటివాళ్ళందరికీ తలలో నాలుకైపోయింది. తను మాంసాహారం ముట్టకున్నా సరే మిగతావాళ్ళకి మటన్‌ చికెన్‌లు చక్కగా వండిపెడుతుండేది. సంసారంలో ఆమె సాధించిన ఆ గెలుపూ... పరిస్థితులకి తగ్గట్టు తనని తాను మలచుకున్న ఆ నేర్పూ... నేను నేర్చుకున్న తొలి బతుకు పాఠాలని చెప్పొచ్చు. మరి అలాంటి భార్య తోడున్న భర్త- తన వృత్తిలో ఏ సాహసం చేయడానికైనా సై అంటాడు కదా! నాన్న అదే చేశారు. ఎడిటింగ్‌ అసిస్టెంట్‌ నుంచి ఎడిటర్‌ అయ్యారు. ఆ రంగంలో తనే ది బెస్ట్‌ అనిపించుకున్నాక డబ్బింగ్‌ సినిమాల నిర్మాతగా మారారు. తెలుగులో వచ్చిన ఎన్నో సినిమాలని తమిళంలోకి అనువదించసాగారు. నేను ఏడో తరగతి చదువుతున్నప్పుడు... తొలిసారి ఆయన డబ్బింగ్‌ స్టూడియోలోకి అడుగుపెట్టాను. ఓ రకంగా అమ్మ ఒడి దాటి నాన్న సినిమా ప్రపంచంలోకి నేను అడుగుపెట్టిన రోజది...  

స్టూడియోల్లోనే తెలుగు నేర్చుకున్నా...

నాన్న తెలుగు సినిమాను తమిళంలోకి డబ్‌ చేస్తున్నప్పుడు రెండు సినిమాల్నీ పదేపదే తెరపైన చూడాల్సి వస్తుండేది. అలా చూస్తూనే నేను తెలుగు మాట్లాడటమూ చదవడమూ నేర్చుకున్నాను. నాన్న ఓ వైపు మాస్‌ చిత్రాల్ని డబ్‌ చేస్తూనే... మరోవైపు ప్రపంచస్థాయి సినిమాలని నాకు పరిచయం చేస్తుండేవారు. ఏ హాలీవుడ్‌ దర్శకుడు ఏ టేక్‌ ఎందుకలా తీస్తాడో- ‘24 క్రాఫ్ట్స్‌’ కోణంలో వివరిస్తుండేవారు. వాటి ప్రభావంతో సత్యజిత్‌ రేలా- తీస్తే క్లాసిక్సే తీయాలని టీనేజీలోనే నిశ్చయించుకున్నాను. ఆ లక్ష్యంతోనే ఇంటర్‌, డిగ్రీలు ముగించి చెన్నై ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చేరాను. అందులో అడుగుపెట్టిన క్షణం నుంచీ నేను భవిష్యత్తులో తీయబోయే క్లాసిక్స్‌ గురించి కలలు కనడం ప్రారంభించాను. నా ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ప్రాజెక్టులో భాగంగా ‘పళయ కరై’ అని ఓ ఆర్ట్‌ సినిమా తీశాను. దాన్ని చూసిన మా నాన్నకి నేను వెళుతున్న దారేమిటో అర్థమైనట్టుంది. చీవాట్లెట్టలేదుకానీ ‘ఈ రకం సినిమాలు నీకూ నాకూ కూడు పెట్టవు. నువ్వు జోలె తగిలించుకుని తిరగాల్సిందే!’ అన్నాడు. ఆయనకి ఎదురుచెప్పే ధైర్యం లేకున్నా... నాదారే సరైందని దృఢంగా నమ్మాను. 2000 నాటికి నా ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ డిప్లొమా పూర్తికాగానే... నాన్న నన్ను దర్శకుణ్ని చేసే ప్రయత్నాల్లో పడ్డారు. నాకు ఆయన తరహా కమర్షియల్‌ సినిమాలు తీయడం సుతరామూ ఇష్టంలేదు. అందువల్ల- ‘నేనో మంచి కథతో వస్తానుండు’ అని చెప్పి రాయడం మొదలుపెట్టాను. రెండు నెలలైనా అది కొలిక్కి రాలేదు. ఈలోపు నాన్న మలయాళంలో హిట్టయిన ‘తెన్కాశి పట్టణం’ సినిమాని ఓసారి చూడమన్నారు. దాన్ని చూసి బావుంది అంటే నన్నే దర్శకత్వం చేయమంటాడని భయపడి ‘బాగాలేదు!’ అని చెప్పాను. ఆయన విన్లేదు. నేను అలాంటి కమర్షియల్‌ సినిమాలు చేయలేననీ కరాఖండిగా చెప్పాను. ఆరోజు నాన్న మాట కాదంటున్నానన్న బాధ ఓ వైపూ, నాకిష్టంలేని సినిమాలు చేయకూడదన్న పట్టుదల మరోవైపూ నన్ను తీవ్ర సంఘర్షణకి గురిచేశాయి. అవన్నీ అమ్మతోనే పంచుకున్నాను అప్పట్లో. అమ్మ - ‘కమర్షియల్‌ సినిమా అయినా కళాత్మక సినిమా అయినా... రెండింటికీ ‘క్రాఫ్ట్‌’ ఒక్కటే. నీ సత్తా అందులో ఎంతుందో నాన్న చెప్పిన సినిమాతో రుజువు చెయ్‌. ఆ తర్వాత నీ తరహా సినిమాలు చేద్దువు’ అంది. దాంతో ‘తెన్కాశి పట్టణం’ సినిమాని తెలుగులో ‘హనుమాన్‌ జంక్షన్‌’గా మార్చి... మెగాఫోన్‌ చేతబట్టాను. నా ఇష్టాయిష్టాలన్నీ కట్టిపెట్టి ప్రతి సీన్‌నీ ప్రాణంపెట్టి తీశాను. ఆ సినిమా పెద్ద హిట్టయింది! విజయోత్సవం రోజు నా భుజం తట్టిన నాన్న ‘ఇండస్ట్రీకి కావాల్సింది సక్సెస్సే రాజా! కాసులు కురవకుండా... ఎంత కళాత్మకమైన సినిమా తీసినా ఎవరూ నిన్ను గౌరవించరు. నా 40 ఏళ్ళ కెరీర్‌లో నేను నేర్చుకున్న పాఠం ఇది!’ అన్నారు. అనడమే కాదు... తెలుగు ‘జయం’ రీమేక్‌ హక్కులు కొని... దానితో మా తమ్ముడు రవిని హీరోగా పరిచయం చేసే బాధ్యతను నాకు అప్పగించారు.

మా తమ్ముణ్ణి హీరోగా నిలబెట్టితీరాలన్న తపనతోనే తమిళంలో ‘జయం’ చేశాను. ఆ సినిమా బ్లాక్‌ బస్టర్‌ అయింది. దాంతో మొదలుపెట్టి ‘ఎం.కుమరన్‌ సన్నాఫ్‌ మహాలక్ష్మీ’(అమ్మానాన్నా ఓ తమిళ అమ్మాయి), ఉనక్కుం ఎనక్కుం(నువ్వొస్తానంటే నేనొద్దంటానా), సంతోష్‌ సుబ్రమణ్యం(బొమ్మరిల్లు), తిల్లాలంగడి(కిక్‌) ఇలా వరస రీమేక్‌లతో ఘన విజయాల్ని అందించాను. తమ్ముడు స్టార్‌ అయిపోయాడు. తమిళ మెగాస్టార్‌ విజయ్‌తో చేసిన ‘వేలాయుధం’(అజాద్‌) కూడా మంచి విజయం అందుకుంది. పరిశ్రమకి ఇన్ని విజయాలనిచ్చినా సరే కొన్ని పత్రికల్లో వెక్కిరింత కూడా మొదలైంది. దాని ప్రభావం ఆ రోజు షాపింగ్‌మాల్‌లో ఎదురైన పరాభవంలో కనిపించింది...  
సొంత సరకు ఇది...

‘ఇలాంటి అవమానాలూ నీ మంచికేరా! దీన్నో పునర్జన్మ అనుకో. కొత్తగా ఆలోచించు!’ అంది అమ్మ. అలా వచ్చిందే ‘తని ఒరువన్‌’(ధృవ) కథ. హీరో-విలన్‌- వాళ్ళమధ్య ప్రతీకారం అన్న పాత ఫార్ములాకి భిన్నంగా... అత్యంత బలమైన ప్రతినాయకుణ్ణి సృష్టించాను. అతనితో నేరుగా ఏ శత్రుత్వమూ లేని హీరో... ఓ సగటు మనిషిలా అతణ్ణి ఎదుర్కోవడమే కథ. అది క్లాసిక్‌గా నిలవడమే కాదు... కాసుల వర్షాన్నీ కురిపించింది. నాతోపాటూ నలుగురికి ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులొచ్చాయి. ఒకప్పుడు వెక్కిరించినవాళ్లే ‘రాజా సత్తా చూపించాడు!’ అంటూ ఆకాశానికెత్తేశారు. తెలుగులోనూ ధృవగా రీమేక్‌ అయి... ఆ సినిమా పెద్ద హిట్టయింది. ఆ తర్వాత పిల్లలు తినే బ్రాండెడ్‌ ఆహారపదార్థాలతో వచ్చే నష్టాలపైన ఓ సందేశాత్మకమైన సినిమా తీయాలనుకున్నాను. ‘ఈ కాలంలో అలాంటివి పనికిరావు!’ అన్నారందరూ. ఆ మాటనే ఛాలెంజ్‌గా తీసుకుని శివకార్తికేయన్‌తో ‘వేలైక్కారన్‌’ (జాగో) అన్న సినిమా తీశాను. నా అంచనాలు నిజమై... అది కూడా పెద్ద హిట్టయింది. ఆ ఉత్సాహంతోనే మా తమ్ముడు రవితో కలిసి ‘ధృవ 2’ మొదలుపెట్టాను. తెలుగులోనూ నేనే డైరెక్ట్‌ చేయాలనుకుని రామ్‌చరణ్‌తో చర్చలు జరుపుతూ వచ్చాను. అప్పుడే నిర్మాత ప్రసాద్‌.వి పొట్లూరి మలయాళం ‘లూసిఫర్‌’ సినిమాని చిరంజీవి చేయాలనుకుంటున్నారని చెప్పారు. అప్పటికే ఇద్దరు దర్శకులు మారినా అది పట్టాలెక్కక, దాదాపు ఆ ప్రాజెక్టు వదులుకునే పరిస్థితొచ్చిందని వివరించారు. నన్నూ ఓసారి ప్రయత్నించమన్నారు. ‘మళ్ళీ రీమేకా?’ అనుకోలేదు నేను. అమ్మ ఇదివరకు చెప్పినట్టే దాన్నో ‘క్రాఫ్ట్‌’గా మాత్రమే చూడాలనుకున్నాను. కథాచర్చల్లో పాల్గొన్న రెండోరోజే కొన్ని మార్పులు చెప్పాను. అందులో ప్రధానమైంది. - ఈ సినిమాలో హీరోయిన్‌(హీరో చెల్లెలు) ముఖ్యమంత్రి కావడం. మలయాళంలో హీరోగారి వ్యూహాలన్నీ భూతకాలంలో ఉంటే... నేను వర్తమానంలోకి మార్చాను. ఓ అభిమానిగా చిరంజీవిగారి కోసం ఎన్నో ఫ్యాన్‌ మూవ్‌మెంట్స్‌ యాడ్‌ చేయడంతో... థియేటర్లలో అడుగడుగునా విజిల్స్‌ వినిపిస్తున్నాయిప్పుడు!  

ఇది నా విజయం అయితే...

నా తమ్ముడు టైటిల్‌ రోల్‌లో నటించిన ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ కలెక్షన్స్‌లో రికార్డు సృష్టిస్తోంది!

ఇద్దరం కలిసి ఒకే సినిమాతో ఎన్నో విజయాలు అందుకున్నాం కానీ... రెండు భిన్నమైన సినిమాలతో ఇలా భారీ విజయాల్ని చవిచూడడం ఇదే తొలిసారి.

ఇద్దర్నీ సినిమాల్లోకి తేవాలని ఆశపడ్డ మా అమ్మానాన్నల కలలు సంపూర్ణంగా సాకారమైన క్షణాలివి...

ఫొటోలు: మధు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..