‘నీకు సినిమా తీయడమే రాదు’ అన్నారు!

2009లో ‘కరెంట్‌’... 2015లో ‘కుమారి 21ఎఫ్‌’... 2022లో ‘18పేజెస్‌’... పదమూడేళ్లలో మూడంటే మూడుసార్లే వెండితెరపైన దర్శకుడిగా తన పేరు చూసుకున్నాడు

Updated : 08 Jan 2023 11:41 IST

‘నీకు సినిమా తీయడమే రాదు’ అన్నారు!

2009లో ‘కరెంట్‌’... 2015లో ‘కుమారి 21ఎఫ్‌’... 2022లో ‘18పేజెస్‌’... పదమూడేళ్లలో మూడంటే మూడుసార్లే వెండితెరపైన దర్శకుడిగా తన పేరు చూసుకున్నాడు పల్నాటి సూర్యప్రతాప్‌. కానీ, ‘రంగస్థలం’, ‘పుష్ప’ వంటి బ్లాక్‌బస్టర్లకు స్క్రీన్‌రైటర్‌గా తను చిరపరిచితుడు. భద్రాచలంలో ప్రారంభమైన తన ప్రయాణం ఎన్ని స్పీడ్‌బ్రేకర్లనూ, మరెన్ని యాక్సిడెంట్లనూ దాటి సినీ గమ్యానికి చేరుకుందో చెబుతున్నాడిలా...

మాది మధ్యతరగతి కుటుంబం. నాన్న సత్యనారాయణ అగ్రికల్చర్‌ మార్కెట్‌ కమిటీ సూపర్‌వైజర్‌. సొంతూరు అమలాపురం అయినా ఆయన వృత్తిరీత్యా భద్రాచలంలో ఉండేవాళ్లం. అక్కడే పుట్టి పెరిగా. నాన్నకు కళలంటే ఆసక్తి. రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ గురించి చెబుతూ గీతాంజలి చదివించేవారు. అలా స్ఫూర్తిపొంది నాన్న ప్రోత్సాహంతో ఏడేళ్ల వయసు నుంచే కవితలు రాసేవాణ్ని. అమ్మ అందుకు పూర్తిగా భిన్నం. తనకి చదువు మాత్రమే ఇష్టం. నేను సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరునైౖ విదేశాలకు వెళ్లాలని కలలు కంటుండేది. నన్ను సినిమాలు చూడనిచ్చేది కాదు. ఇంటర్‌లో నేను చూసింది కేవలం రెండే సినిమాలు. అయినా ఎప్పుడూ నా బుర్రలో ఆ సినిమాలే తిరిగేవి. ఆ ఆలోచనల్లోంచే దర్శకుణ్ని అవ్వాలనే ఆశ పుట్టింది. ఇంటర్‌ అయ్యాక అమ్మానాన్నలకి చెబితే ‘ముందు చదువుకో...’ అన్నారు. దాంతో  డిగ్రీలో చేరా. కాలేజీకి వెళుతున్నానన్న మాటేగానీ మనసంతా సినిమాల చుట్టూ తిరిగేది. పైగా అమ్మానాన్నలు నో చెబుతారేమోనని భయమేసేది. వాళ్లతో ఎలాగైనా ఎస్‌ చెప్పించాలనుకున్నా. కాలేజీలో నాటికలు రాస్తూ... డ్రామాలు వేయించేవాణ్ని. వాటికి రాష్ట్రస్థాయి అవార్డులు కూడా వచ్చాయి. అప్పటివరకూ కాకతీయ యూనివర్సిటీకి రకరకాల విభాగాల్లో బహుమతులు వచ్చాయి. మొదటిసారి నాటకాలు- నాటికలు విభాగంలో యూనివర్సిటీకి నా వల్ల బహుమతి వచ్చింది. ఆల్‌ ఇండియా రేడియో కొత్తగూడెం వాళ్లు డ్రామా వేయమని ఆర్నెల్లపాటు కాంట్రాక్టు కూడా ఇచ్చారు. డిగ్రీ చదువుతూనే ఆ పని చేసేవాడిని. దాంతో అమ్మానాన్నలకి నా మీద నమ్మకం కలిగింది. డిగ్రీ పూర్తయ్యాక సినిమాల్లోకి వెళ్లడానికి ఒప్పుకున్నారు. ‘సినీ రంగం ఓ మహాసముద్రం. అందులో దిగితే లోతు ఎంతుందో చూశాకే వెనక్కి రా. మధ్యలోంచి మాత్రం రాకు...’ అంటూ నాన్న ధైర్యం చెప్పి మరీ పంపారు.

హిందీ నేర్చుకున్నా...

హైదరాబాద్‌ రావడానికి ముందు హిందీ స్పష్టంగా చదవడం, రాయడం నేర్చుకున్నా. ఇంగ్లిష్‌పైనా పట్టు సంపాదించుకున్నా. ఆ తరవాతే బ్యాగు నిండా బట్టలు... మనసులో లక్ష్యాన్ని పెట్టుకుని హైదరాబాద్‌ బస్‌ ఎక్కి ఎంబీయే చదువుతున్న మా అక్క దగ్గర వాలిపోయా. అక్క చెప్పిందని ఎంసీయేలో చేరి... సినిమా ప్రయత్నాలు చేసేవాడిని. సురేశ్‌ ప్రొడక్షన్స్‌ వాళ్లు హిందీ సినిమాలు తీసేవాళ్లు. హిందీ తెలిసిన వాళ్లకి అసిస్టెంట్లుగా అవకాశమిస్తున్నారని తెలిసి రామానాయుడు స్టూడియో చుట్టూ తిరిగేవాణ్ని. చేతిలో సరిపడా డబ్బులు ఉండేవి కావు. కొన్నిసార్లు బస్సు ఛార్జీలకోసమని- తినకుండా డబ్బులు మిగుల్చుకునే వాణ్ని. రోజూ అమీర్‌పేట్‌- మైత్రీవనం నుంచి రామానాయుడు స్టూడియో వరకూ రానూపోనూ దాదాపు పద్నాలుగు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లేవాణ్ని. మా అక్క అవన్నీ చూస్తూ తను దాచుకున్న డబ్బులు ఇస్తుండేది. అలా దాదాపు ఏడాది పాటు ఎన్నో ప్రయత్నాలు చేశాక సురేశ్‌ ప్రొడక్షన్స్‌లో హిందీ సినిమాలకు స్క్రిప్టు రాసే అసిస్టెంట్‌ మానేశాడని తెలిసింది. తీరా అక్కడికి వెళ్లాక ఆ అబ్బాయి మళ్లీ తిరిగి రావడంతో అవకాశం చేజారిపోయింది. అదీ చేజారిపోవడంతో కళ్లనిండా నీళ్లు... గుండెలనిండా ఆవేదనతో వెనక్కొచ్చా. ఆ బాధతో తిండి కూడా మానేశా. సరిగ్గా ఐదురోజులకి నాయుడిగారి దగ్గర్నుంచి పిలుపొచ్చింది. అక్కడ చేసే అబ్బాయి పని మానేసి సినిమాకి వెళ్లడంతో కోప్పడిన రామానాయుడుగారు నన్ను గుర్తు పెట్టుకుని మరీ పిలిపించారని తెలిసింది. అలా సురేశ్‌ ప్రొడక్షన్స్‌లో పందొమ్మిదేళ్ల క్రితం నా ప్రయాణం మొదలైంది. ఎంసీయే మానేసి మరీ వెళ్లా. హిందీలో సునీల్‌శెట్టితో రీమేక్‌ చేస్తున్న ‘శివయ్య’ సినిమాకి తొలిసారి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా క్లాప్‌ కొట్టా. ఆ సినిమాకి పని చేయడంతో నామీద నాకు నమ్మకం పెరిగింది. కానీ, మరో సినిమాలో వెంటనే అవకాశం లేదు. దాంతో కష్టాలు మళ్లీ మొదటికొచ్చాయి.

ఆ చెక్‌ ఇప్పటికీ దాచుకున్నా

మొదటి సినిమాకి ఎలా తిరిగానో రెండోదానికోసం అంతకంటే ఎక్కువే కష్టపడ్డా. అవమానాలు అనుభవించా. ఒకానొక దశలో మళ్లీ చదువుకుందామా అనుకున్నా. కానీ అలా చేస్తే నాకూ, నా లక్ష్యానికీ¨ విలువేముంటుంది. ఎలాగైనా పోరాడాలని నన్ను నేను మోటివేట్‌ చేసుకున్నా. నాన్న సముద్రం లోతు తెలుసుకోమన్నారుగానీ, మధ్యలోంచి రమ్మనలేదు. ఆ మాటలూ గుర్తు తెచ్చుకున్నా. అదే పనిగా నిర్మాతల చుట్టూ తిరిగేవాడిని. కొందరు నాలుగురోజులు ఆగి కలువూ, వారం తరవాత కనిపించూ అనేవారు. ఆ సమయంలో వాళ్లు ఆ నాలుగు రోజుల తరవాత ఏం చెబుతారోననే ఆలోచనల కింద మనసు నలిగిపోయేది. ఆశగా వాళ్లని కలవడానికి వెళితే కొందరు మొహం చాటేసేవారు. ఇంకొందరు ‘రేపు రా మాపు రా’ అంటూ తిప్పించుకునేవారు. అయినా సరే అలానే కాలినడకనే ఎన్ని కిలోమీటర్లయినా వెళ్లేవాణ్ని. పద్మాలయ స్టూడియోస్‌లో కొందరు నిర్మాతలు షటిల్‌ ఆడుతుంటారని అక్కడకు వెళ్లేవాణ్ని. కాలేజీ రోజుల్లో నేను షటిల్‌ ఛాంపియన్‌ని అని తెలుసుకుని నాతో ఆడటానికి ఆసక్తి చూపేవారు తప్ప సినిమాల గురించి మాట్లాడే వారుకాదు. అక్కడా ఫలితం లేకపోయింది. అలాంటి పరిస్థితిలో ఓ దర్శకుడు అసిస్టెంట్‌గా అవకాశమిచ్చాడు. మర్నాడు వచ్చి కలవమన్నాడు. ఎంతో ఉత్సాహంగా బయల్దేరా. బస్సులో ఖాళీ లేకపోవడంతో ఫుట్‌బోర్డు మీద నిల్చున్నా. కొద్దిదూరమెళ్లాక బ్యాలెన్స్‌ చేసుకోలేక కిందపడ్డా. ఆ సమయంలో బాగానే దెబ్బలు తగిలాయి. కానీ అవకాశం కోల్పోతాననే బాధ ముందు ఆ దెబ్బలు నొప్పిగానే అనిపించలేదు. ఏడ్చుకుంటూ ఇంటికెళ్లా. అది చూసి అక్క మర్నాడు ఫోన్‌ కొనిచ్చి... దర్శకుడి దగ్గరకు పంపింది. లక్కీగా ఆ రోజు కూడా నేను వెళ్లకపోతే వేరేవాళ్లకు ఆ అవకాశం దక్కేది. అదే ‘హనుమాన్‌ జంక్షన్‌’ సినిమా. అక్కడే నాకు దర్శకుడు సుకుమార్‌ అన్న పరిచయమయ్యారు. అక్కడి నుంచి కొత్త జీవితం మొదలైంది. ‘హనుమాన్‌ జంక్షన్‌’ తరవాత ఈనాడు- ఈటీవీ కోసం పనిచేసే అవకాశం వచ్చింది. అప్పుడే ఈనాడు పత్రికలో విద్య, వైద్యం, టెక్నాలజీ, యూత్‌ అంశాలతో కూడిన స్పెషల్‌ పేజీలు రోజుకొకటి
ఇవ్వడానికి ప్లాన్‌చేశారు. వాటిని తీసుకు రావడానికి ముందు ఈటీవీలో ప్రసారం చేయడానికి యాడ్‌ చేయమన్నారు. అందుకోసం ఏడు రకాల యాడ్స్‌ చేశా. తరవాత కళాంజలి చీరల ప్రకటనలూ, ఓటర్‌ అవగాహన యాడ్స్‌ చేసే అవకాశమిచ్చారు. వాటికిగానూ రామోజీరావుగారు సంతకం చేసిన చెక్కును ఆయన చేతుల మీదుగానే అందుకోవడం నాలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఎన్నో కష్టనష్టాలకు ఎదురీది... ఓ లెజెండ్‌ చేతుల మీదుగా తీసుకున్న ఆ చెక్‌ పాజిటివ్‌ ఎనర్జీనిచ్చింది. ఇప్పటికీ దాన్ని అపురూపంగా దాచుకున్నా.

పనికి రావన్నారు...

క్రమంగా అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా నంబర్‌ వన్‌ స్థాయికి వెళ్లా. ‘అల్లరి’, ‘సోగ్గాడే’, ‘నీకు నేను నాకు నువ్వు’, ‘అమ్మాయిలు అబ్బాయిలు’... చెప్పుకుంటూపోతే చాలా సినిమాలకు పనిచేశా. డైరెక్టర్‌ అవ్వాలని కొన్ని కథలూ సిద్ధం చేసుకున్నా. ఓ నిర్మాత నాతో సినిమా తీయాలనుకున్నాడు. ‘కథ వినాల్సిన పనిలేదు. నువ్వు సినిమా మొదలుపెట్టు...’ అని అతను అన్నా బలవంతంగా కథ చెప్పా. అది వినగానే ‘నిన్ను నమ్ముకుని ఎవరికీ డబ్బు ఇవ్వలేదు కాబట్టి సరిపోయింది. నీకు సినిమా తీయడమే రాదు...’ అన్నాడు. అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా మంచి పేరునూ, నిర్మాతల నమ్మకాన్నీ సంపాదించుకున్నా. అలాంటి నన్ను అతని మాటలు ఎంతోబాధపెట్టాయి. ఎవరికీ చెప్పుకోలేను. నెలరోజులపాటు ఒంటరిగా గడిపా. నన్ను నేను విశ్లేషించుకునే ప్రయత్నం చేశా. అప్పుడు తెలిసింది నాకు స్క్రీన్‌ ప్లే రాయడం రాదని. నా లోపం నేను తెలుసుకోవడంతో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఎలాగైనా స్క్రీన్‌ ప్లే నేర్చుకోవాలనుకున్నా. కానీ అప్పటికే ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌లలో సీట్లు అయిపోయాయి. చెన్నైలోని అడయార్‌ ఇనిస్టిట్యూట్‌, పుణె ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌లకు వెళ్లి అందుకు సంబంధించిన మెటీరియల్‌ తెచ్చుకుని... రాత్రింబగళ్లూ అదే సాధన చేస్తూ ఉండేవాణ్ని. దాదాపు ఏడాదిన్నరపాటు స్క్రీన్‌ప్లే రాయడం ప్రాక్టీస్‌ చేసి ఆ విషయంలో పట్టు తెచ్చుకున్నా. అప్పటికి దాచుకున్న డబ్బులన్నీ అయిపోయాయి. పరిస్థితి మళ్లీ రోడ్డు మీదకొచ్చింది. కానీ అప్పటికి నన్ను నేను అన్నివిధాలుగా సిద్ధం చేసుకోవడం వరమైంది. స్క్రీన్‌ ప్లే రైటర్‌గా అవకాశాలు వచ్చాయి. చేతి నిండా పని దొరికింది. కొన్నిరోజులకు ‘కరెంట్‌’ తీసే అవకాశం వచ్చింది. అది థియేటర్‌లో నిరాశ పరిచినా మ్యూజికల్‌ హిట్‌ అయింది. టీవీల్లోనూ టీఆర్పీ రేటింగ్‌ తెచ్చింది. నేను ఇంకా బాగా తీయొచ్చు అనుకుంటున్న సమయంలోనే సుకుమార్‌ అన్న ‘దర్శకుడిగా నువ్వేమీ ఫెయిల్‌ అవ్వలేదు’ అంటూ ‘సుకుమార్‌ రైటింగ్స్‌’ టీమ్‌లో చేర్చుకున్నారు. అప్పటికే అన్నతో ‘ఆర్య’కి పని చేశా. ఆ తరవాత సుకుమార్‌ అన్న సినిమాల్లో ‘వన్‌’కి చేశా. అలానే ఆయన తీయాలని ‘కుమారి 21 ఎఫ్‌’ కథ రాసుకున్నారు. దానికి నేను స్క్రీన్‌ప్లే రాసిన తీరు చూసి ‘ప్రతాప్‌, ఈ సినిమా నువ్వే తీస్తే బాగుంటుంది’ అన్నారు. ఆ సినిమాలో హీరోయిన్‌ను చాలా బోల్డ్‌గా చూపించాం. సున్నితమైన అంశాలను టచ్‌ చేశాం. ఆడియెన్స్‌లోకి అది ఎలా వెళుతుందోనని సుకుమార్‌ అన్న భయపడ్డారు. నిజాన్ని నిజంగా చూపిద్దామని, నేను చెప్పాలనుకున్నది ఆ సినిమాలో చెప్పా. సినిమా విజయం సాధించింది. ఆడవాళ్లూ మెచ్చుకున్నారు. పాటలకీ మంచి పేరొచ్చింది. ఆ తరవాత కొన్ని సినిమాలు తీసే అవకాశం వచ్చింది. ఈలోపు సుకుమార్‌ అన్న ‘రంగస్థలం’కోసం పదిరోజులు పని చేయమన్నారు. అది కాస్తా మూడేళ్లు పట్టింది. ఈ తరవాత  మరికొన్ని సినిమాలకు పనిచేసి ‘18 పేజెస్‌’ తీద్దామని ప్రిపేర్‌ అయ్యేలోపు కష్టాలు కొవిడ్‌ రూపంలో వచ్చాయి. పరిస్థితులు అదుపులోకి వచ్చే సమయానికి హీరోహీరోయిన్లు వేరే సినిమాలు ఒప్పుకున్నారు. నేనూ ‘పుష్ప’కి పనిచేయాల్సి వచ్చింది. ఆ తరవాత ‘18 పేజెస్‌’ పట్టాలెక్కి తెర మీదకొచ్చేసరికి ఇంత సమయం పట్టింది. సెల్‌ఫోన్‌ లేనప్పుడు, టెక్నాలజీ అందుబాటులో లేనప్పుడు మనం ఎలా ఉన్నాం, ఇప్పుడు అన్నీ ఉన్నాక ఏం కోల్పోయాం అన్నది చూపించే ప్రయత్నం చేశా. ఈ సినిమా విజయం మరో ముగ్గురు అగ్ర నిర్మాతలతో కలిసి పని చేసే అవకాశం తెచ్చిపెట్టింది. ఈ ఉత్సాహంతో ఇక బ్రేక్‌ లేకుండా... సినిమాలు చేయాలని అనుకుంటున్నా.


వాళ్లే నా బలం

నా జీవితమనే డైరీలో ప్రతి పేజీ అమ్మానాన్నలకే అంకితం. వాళ్లు లేనిదే ఇవాళ నేను లేను. తెలిసినవాళ్లు ‘మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు? సినిమాల్లోకి ఎందుకు పంపారు?’ అని ఎగతాళి చేసినప్పుడూ, సినిమాల మధ్య గ్యాప్‌ రావడంతో నా గురించి చులకనగా మాట్లాడినప్పుడూ అమ్మ ఎంతగానో బాధపడింది. నేను అనుకున్నది సాధిస్తానని నాన్న నమ్మకంతో ఉండేవారు. ఉత్తరాలతో ఉత్సాహపరిచేవారు. నన్ను ప్రోత్సహించాలని అక్క తన పెళ్లిని కూడా  ఆలస్యం చేసింది. నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్న భార్య పదేళ్లుగా నా సినిమా కష్టాల్లో పాలు పంచుకుంటోంది. వీళ్లందరి బలమే నన్ను ముందుకు నడిపిస్తోంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు