ఒక్క వీడియో... జీవితాన్ని మార్చేసింది

ఒక సినిమా ఎంత బాగా తీసినా... అది ప్రేక్షకులను మెప్పించాలంటే ఎడిటింగ్‌ బాగుండాలి. అంతటి కీలకమైన పని చేయాలంటే ఎంత అనుభవం కావాలో అంటారా? అయితే, అనుభవం కంటే నైపుణ్యం, ఆ పనిపై ఉండే ఆసక్తే

Published : 01 May 2022 00:16 IST

ఒక్క వీడియో... జీవితాన్ని మార్చేసింది

ఒక సినిమా ఎంత బాగా తీసినా... అది ప్రేక్షకులను మెప్పించాలంటే ఎడిటింగ్‌ బాగుండాలి. అంతటి కీలకమైన పని చేయాలంటే ఎంత అనుభవం కావాలో అంటారా? అయితే, అనుభవం కంటే నైపుణ్యం, ఆ పనిపై ఉండే ఆసక్తే ముఖ్యం అంటాడు ఈ ఇరవై ఏళ్ల కుర్రాడు ఉజ్వల్‌ కులకర్ణి. ఫ్యాన్‌మేడ్‌ వీడియోలు తెచ్చిన క్రేజ్‌తో పాన్‌ఇండియా సినిమానే ఎడిట్‌ చేయగల స్థాయికి ఎదిగాడు. హాలీవుడ్‌ స్థాయిలో ఎడిటింగ్‌ చేసి అందరితో అదరహో అనిపించుకుంటున్నాడు.

‘నైపుణ్యం మనదైతే... అనుభవం అడ్డేరాదు’... సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది సీనియర్‌ ఎడిటర్లు ఉన్నా... ఈ అవకాశం నా వరకూ రావడానికి ఇదే కారణమని నమ్ముతా. అలాగని నేనేమీ ఎడిటింగ్‌లో డిగ్రీలు చేయలేదు. అనుభవం అంతకన్నా లేదు. చాలామంది కుర్రాళ్లలాగే నాకూ ఫ్యాన్‌మేడ్‌ వీడియోలు చేయడమంటే ఆసక్తి. అదే నాకీ రోజు గుర్తింపుని తెచ్చి పెట్టింది. అసలింతకీ నాకు ఈ నైపుణ్యం ఎలా వచ్చిందీ అంటే నటుడు కావాలనుకున్న మా అన్నకి వీడియోలు తీయడం, ఎడిట్‌ చేసి పెట్టడం వంటివి చేయడంతో నా ప్రయాణం మొదలైంది. ఈ పనంతా మొబైల్‌లోనే చేసినప్పటికీ అందరూ బాగుందని కితాబివ్వడంతో మరింత ఉత్సాహంగా కొత్త రకాల సాంకేతికతపై పట్టు సాధించా. మరిన్ని ప్రయోగాలూ చేశా. క్రమంగా చదువుపైన ఆసక్తి తగ్గింది. దాంతో ఇంటర్మీ డియట్‌ మొదటి సంవత్సరం మధ్యలోనే ఆపేశా. ఇంతకీ కె.జి.యఫ్‌2కి పనిచేసే అవకాశం నాకెలా వచ్చిందంటారా? 

మాది ఉత్తర కర్ణాటకలోని గుల్బర్గా. అందరూ అనుకుంటున్నట్లు నా వయసు పందొమ్మిది కాదు ఇరవై. మధ్యతరగతి కుటుంబం మాది. నాన్న గోవిందరాజ్‌ కులకర్ణి ఎల్‌ఐసీ ఉద్యోగి. అమ్మ రమా కులకర్ణి గృహిణి. అక్క అనూశ్రీ. మొదట్లో నేను చదువు పక్కన పెట్టి వీడియోలు చేస్తుంటే అమ్మానాన్నలు కోప్పడేవారు. సమయం వృథా చేసుకుంటున్నానని బాధపడేవారు. కానీ ఆ మాటలేవీ నా చెవికెక్కేవి కావు. పైగా నటుడు యశ్‌ అంటే గొప్ప అభిమానం. ఆయన సినిమా అంటే చాలు స్నేహితులతో కలిసి థియేటర్ల దగ్గర రచ్చ రచ్చ చేసేవాడిని. ఫ్యాన్‌మేడ్‌ వీడియోలు చేస్తూ సామాజిక మాధ్యమాల్లో వదిలేవాడిని. అలా కె.జి.యఫ్‌ మొదటి భాగాన్ని వీడియో ఎడిటింగ్‌ చేయగా అది వైరల్‌ అయ్యి ప్రశాంత్‌ నీల్‌ దగ్గరకు చేరింది. ఆయనకు అది నచ్చడంతో నా నంబర్‌ సంపాదించి ఫోన్‌ చేశారు. నమ్మలేక పోయా. నిజమేనని తెలిశాక... మేఘాల్లో తేలిపోయా. ఇప్పటికీ నాది అదే పరిస్థితనుకోండీ! వివరాలడిగి కొన్ని వీడియో రషెస్‌ ఇచ్చి టీజర్‌ కట్‌ చేయమన్నారు. నచ్చితే అఫిషియల్‌గా విడుదల చేస్తామని చెప్పారు. కలో నిజమో తెలియని సందిగ్ధావస్థ. దాన్నుంచి తేరుకుని ‘ఇంతకంటే గొప్ప అవకాశం రాదు. అందుకే ఎలాగైనా సద్వినియోగం చేసుకోవాలీ అనుకున్నా. మెదడుకి పనిపెట్టా. ఐదు రోజుల్లోనే ఆ పని పూర్తి చేసి ఆయన్ని మెప్పించగలిగా. దేశవ్యాప్తంగా మంచి పేరొచ్చింది.

200 మిలియన్లకు పైగానే వ్యూస్‌ వచ్చాయి. ఇవన్నీ నా జీవితాన్నే మలుపుతిప్పాయి. కె.జి.యఫ్‌2 నువ్వే ఎడిట్‌ చేస్తున్నావని ఆయన చెబితే... సరదాకి అంటున్నా రనుకున్నా. సీరియస్‌గానే చెప్పారని అర్థమయ్యాక సంతోషంతో పాటు కాస్త భయమూ వేసింది.

రిస్కేమో అన్నారు...

సినిమా వాస్తవిక సంఘటనల్లా సాగిపోవాలే తప్ప ముక్కలు అతికించినట్లు ఉండకూడదు. అందుకే సినిమా వరుస క్రమం ఎలా ఉండాలీ ఎక్కడ నెమ్మదిగా సాగాలీ ఏ సీన్‌లో వేగం పెంచాలి వంటివన్నీ డైరెక్టర్‌తో పాటు ఎడిటర్‌కీ తెలియాలి. ప్రశాంత్‌ నీల్‌ నన్ను టీజర్‌ కట్‌ చేయమన్నప్పుడు పెద్దగా ఆలోచించలేదు. కానీ సినిమా మొత్తం ఎడిట్‌ చేయాల్సి వచ్చిప్పుడు మాత్రం ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకున్నా. కొత్తబ్బాయితో ప్రయోగాలు చేయడం రిస్కేమో అని ఎందరు చెప్పినా, ఆయన నా మీద నమ్మకం ఉంచారు. పైగా ‘ప్రయోగాలు చేయకపోతే అనుకున్నది చేయలేం. అయినా... ఎవరికైనా అవకాశం ఇస్తేనే కదా వారి ప్రతిభ నిరూపించుకోగలిగేది’ అంటూ తనకు ఎదురైన విమర్శలన్నీ తిప్పికొట్టారాయన.  ఎంతోమంది సీనియర్లను కాదని నాకు ఇంత పెద్ద బాధ్యత అప్పగించారు. ఇందుకోసం చావో రేవో అన్నట్లుగా కష్టపడాలని నిర్ణ యించుకున్నా.  అయినా కూడా... సినిమా మొత్తంమీద ఎక్కడా నేను ఒత్తిడికి గురయిన సందర్భాలు లేవు. ఆ రోజులన్నీ ఎంతో సరదాగా గడిచిపోయాయి. ప్రశాంత్‌ సార్‌, యశ్‌ నుంచీ ఎన్నో విషయాలు తెలుసుకున్నా. సినిమా విడుదలయ్యాక నా ఎడిటింగ్‌కి మరింత పేరొచ్చింది. ఇప్పుడు అంతా నన్ను గుర్తిస్తుంటే భలేగా ఉంది. ఇంట్లో వాళ్లూ, బంధువులూ ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారు. ఒక్క అవకాశం నా జీవితాన్ని ఎంతగానో మార్చేసింది.  ప్రస్తుతం ప్రభాస్‌ నటిస్తోన్న సలార్‌ సినిమా ఎడిటింగ్‌ పనిలో ఉన్నా. మనమీద మనకి నమ్మకం ఉండి, భవిష్యత్తు మీద ఆశ వదులుకోకపోతే చాలు, అవకాశాలు అవే వస్తాయి. అందుకు నేనే ఉదాహరణ. మీరూ మీ లక్ష్యాలను చేరుకోవడానికి వందశాతం కష్టపడండి. విజయం మీదే!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..