Published : 03 Apr 2022 01:07 IST

అజిత్‌ అనే ఓ సాహసి కథ!

‘నాలుగు హిట్లతో మాస్‌ హీరో అయిపోవడం... భారీగా అభిమాన సంఘాల్ని ఏర్పాటుచేయడం... పార్టీ పెట్టడం... నేరుగా సీఎం అయిపోవడం!’ - తమిళ సీమలో ఈ కలలేని కథానాయకుడు ఎవరూ ఉండరనే చెప్పొచ్చు. అలాంటి వాతావరణంలో నవతరం సూపర్‌స్టార్‌గా పేరుతెచ్చుకున్నవాడు కాస్తా తన అశేష అభిమాన సంఘాల్ని రద్దు చేసుకున్నాడంటే నమ్మగలమా! అజిత్‌కుమార్‌ అదే చేశాడు. తాను పోషించే హీరో పాత్రలకన్నా తమ వ్యక్తిగత జీవితం ఉదాత్తంగా ఉండటం ఏ కొందరికో మాత్రమే సాధ్యమవుతుంది. అజిత్‌ వ్యక్తిత్వం అలాంటిదే. మీరే చూడండి..

అదో భారీ సభ. సీఎం కరుణానిధితో పాటూ మంత్రులూ... సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ సహా టాప్‌ సినీహీరోలందరూ ఒకే వేదికని పంచుకుంటున్నారు. అటు అధికారపార్టీ కార్యకర్తలూ ఇటు సినిమా అభిమానులతో ఆ హాలు కిక్కిరిసిపోయి ఉంది. మొదట సినీ ప్రముఖుల తరఫున మాట్లాడటానికి మైక్‌ అందుకున్నాడు అజిత్‌ కుమార్‌. ‘సీఎంగారూ! సినీ పరిశ్రమ కోసం మీరెంతో మేలు చేస్తున్నారు కానీ నాదో చిన్న విన్నపం దాన్ని కూడా ఆలకించండి. మీ పార్టీలోని కొందరు మా సినిమావాళ్లని బెదిరించి మరీ మీ కార్యక్రమాలకి రప్పిస్తున్నారండీ. దయచేసి ముందు వాళ్లని కంట్రోల్‌ చేయండి!’ అన్నాడు. ఆ మాటలకి హాలంతా ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. దాన్ని చీల్చుకుంటూ పెద్దగా ఈల ఒకటి వినిపించింది. ఆ ఈల వేసింది ఎవరో కాదు...  సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌! కింద కూర్చున్న జనాలందరూ ఆయనకి జత కలవడంతో హాలంతా హోరెత్తిపోయింది. విమర్శించింది తన పార్టీవాళ్లనే అయినా సీఎం కూడా అజిత్‌ని మెచ్చుకోలుగా చూస్తుండిపోయారు. 2011లో జరిగిన సంఘటన ఇది. నాటి తమిళనాడు సీఎం కరుణానిధికి రాష్ట్రంలో ఎక్కడోచోట ఏదో ఒక సన్మాన కార్యక్రమం జరుగుతుండేది. వాటి కోసం సినిమా తారల్ని తీసుకొచ్చేవాళ్లు. దానిపైనే అజిత్‌ ఆ రోజు అనూహ్యంగా స్పందించాడు. అధికార పార్టీవాళ్లు తలుచుకుంటే తన కెరీర్‌ని ఇబ్బంది పెట్టొచ్చని తెలిసినా... అసలు విషయాన్ని కుండబద్దలుకొట్టాడు!  నమ్మినదానికోసం ఎంతకైనా తెగించే ఆ సాహసమే ఒకప్పటి ఈ మోటార్‌సైకిల్‌ మెకానిక్‌ని- ఎఫ్‌2 కారు రేసర్‌గా మార్చింది. అట్నుంచటు నేరుగా సినిమాల్లోకి దూసుకొచ్చేలా చేసింది. ఒకప్పుడు తమిళం కూడా సరిగ్గా రానివాడిని ‘తల’(తలైవర్‌ అన్న తమిళ పదానికి పొట్టి రూపం అని అర్థం) నాయకుడు అంటూ ఆరాధించేలా చేసింది. అతని చిత్రమైన ప్రయాణం హైదరాబాద్‌లోనే మొదలైంది...

పదో తరగతీ దాటలేదు...
అజిత్‌ నాన్న సుబ్రమణిది తమిళకుటుంబమే కానీ... ఆయన పూర్వీకులు ఎప్పుడో కేరళలోని పాలక్కాడులో స్థిరపడ్డారట. ఫార్మసీ చదువుకున్న సుబ్రమణికి కోల్‌కతాలో ఉద్యోగం వచ్చింది. అక్కడే మోహినితో ప్రేమలో పడ్డారు. ఆమె పుట్టింది పాకిస్థాన్‌లోని కరాచీలో. దేశవిభజన తర్వాత కోల్‌కతా వచ్చి స్థిరపడ్డ సింధీ కుటుంబం ఆమెది. పెళ్ళయ్యాక ఆయనకి సికింద్రాబాద్‌లోని ఓ ఫార్మా కంపెనీలో ఉద్యోగం వస్తే ఇక్కడ ఐదారేళ్లపాటున్నారు. మొదటి సంతానం అనిల్‌ తర్వాత అజిత్‌. అజిత్‌కి ఏడాదిన్నర వచ్చాక ఆ కుటుంబం చెన్నైకి వెళ్లి అక్కడే స్థిరపడింది. అక్కడికెళ్లాక అజిత్‌కి తమ్ముడు కూడా పుట్టాడు. ఉన్నత మధ్యతరగతి కుటుంబంవాళ్లది. ఇంట్లో అందరూ ఇంగ్లిషే మాట్లాడుతుండటంతో... అజిత్‌కి  ఏ ప్రాంతీయ భాషా సరిగ్గా రాలేదు. అంతేకాదు, అతనికి అక్షరాలతోనూ అంకెలతోనూ పెద్దగా సఖ్యత కుదర్లేదు! క్లాసులో ఎప్పుడూ అట్టడుగు ర్యాంకే. కానీ ఆటల్లో బాగా రాణించేవాడు. మంచి క్రికెటర్‌ అనిపించుకున్నాడు. ఎన్‌సీసీలో మంచి ర్యాంకులు సాధించాడు. ఆ రెండింట్లోనే తన భవిష్యత్తు అనుకుని... పగలూరాత్రీ ప్రాక్టీస్‌ చేసేవాడు. కానీ అతనొకటి తలిస్తే... స్కూలు యాజమాన్యం వేరేలా ఆలోచించింది. ఒక్క వాక్యం కూడా తప్పుల్లేకుండా రాయలేని అతణ్ణి... పదోతరగతి పరీక్షకి పంపించలేమని కరాఖండిగా చెప్పేసింది. కొన్నాళ్లకి స్కూలు నుంచీ పంపించేసింది. అలా ఖాళీగా ఉన్నప్పుడే ఓసారి వాళ్ల నాన్నతో ఆఫీసుకెళ్లాడట. అక్కడి ఎండీ గదిలో రేసు బైకుల నమూనాని చూశాడట. తానూ ఆ రంగంలోకి వెళ్లాలనుకున్నాడు. అందుకోసమే రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైకు తయారీ కంపెనీలో మెకానిక్‌- అప్రెంటీస్‌గా చేరాడు. పదహారేళ్లకే రిపేరింగూ నేర్చుకుని సొంతంగా సంపాదించసాగాడు. కానీ అతని తల్లిదండ్రులకి ఇవేవీ నచ్చలేదు!

బాలు కుటుంబంతో...
కారు-మోటారు బైకు రేసుల గురించి పెద్దగా అవగాహనలేని రోజులవి. వీటిని కేవలం బాగా డబ్బున్నవాళ్ల హాబీగానే చూస్తుండేవారు. చెన్నైలాంటి మహానగరంలోనూ మెయిన్‌ రేసులు అరుదుగా జరిగేవి. అలాంటివాటిపైన అజిత్‌ మోజు పెంచుకోవడం, అందుకోసమే మెకానిక్‌గా మారడం తల్లిదండ్రులు సహించలేకపోయారు. ‘మావాడు మెకానిక్‌ అంటే నవ్వుతున్నారందరూ!’ అని కోప్పడేవాడు వాళ్లనాన్న. బలవంతంగా మెకానిక్‌ పని మాన్పించి ఓ గార్మెంట్‌ ఎక్స్‌పోర్ట్‌ కంపెనీలో ఉద్యోగం ఇప్పించాడు కూడా. అక్కడ పనిచేస్తున్నా సరే, అజిత్‌ రేసులపైన ఆశలు వదులుకోలేదు. తనకొచ్చిన జీతానికి స్నేహితుల దగ్గర సాయమడిగి భారీగా డిపాజిట్‌ కట్టి... బైకు రేసుల్లో పాల్గొనేవాడు. అలా సాయపడ్డ స్నేహితుల్లో ఎస్పీబీ చరణ్‌ ఒకడు. పదో తరగతి కోసం ట్యుటోరియల్‌కి వెళ్లినప్పుడు ఇద్దరికీ స్నేహం కుదిరింది. ఇద్దరూ కలిసి విశాఖ వచ్చి ఆంధ్రా మెట్రిక్‌ పరీక్ష రాసి వెళ్లేవారు. అప్పట్లో మోటారుబైకుపైన అతనికున్న మక్కువని చూసి... తన తల్లి సావిత్రమ్మ దగ్గర్నుంచి డబ్బులు ఇప్పించేవాడట చరణ్‌. ఆ స్నేహమే అజిత్‌ సినిమాల్లోకి రావడానికీ కారణమైంది. అందులోకి రావడానికి ముందు అజిత్‌ జీవితంలో ఆర్థికంగా ఓ పెద్ద కుదుపు ఏర్పడింది.

హీరోగా తెలుగులోనే...
అజిత్‌ గార్మెంట్‌ ఎక్స్‌పోర్టింగ్‌ బిజినెస్‌లోనూ చక్కగా రాణించాడు. నాలుగేళ్ల తర్వాత తాను సంపాదించిన సొమ్మంతా పెట్టి సొంతంగా గార్మెంట్‌ బిజినెస్‌ ఏర్పాటుచేసుకున్నాడు. లోతు తెలియకుండా అడుగేశాడేమో... తీవ్రంగా నష్టపోయాడు. అప్పట్లోనే లక్ష రూపాయలకుపైగా అప్పులయ్యాయి. అప్పటికి వాళ్లన్నయ్య అమెరికాలో ఎమ్మెస్‌ చదువుతుంటే, తమ్ముడు ఐఐటీ మద్రాసులో చేరాడు. ఆ ఇద్దరికే డబ్బు సర్దాల్సి రావడంతో తల్లిదండ్రులు ఇతణ్ణి పట్టించుకునే పరిస్థితి లేదు. అప్పుడే... ఎవరో ‘నువ్వు చూడ్డానికి చాలా బావుంటావ్‌. మోడలింగ్‌ చేస్తే కొంతైనా నీ ఇబ్బందులు తీరొచ్చు!’ అని సలహా ఇచ్చారట. పెద్దగా కష్టంలేకుండానే ఆ రంగంలో అవకాశాలొచ్చాయి అతనికి. అప్పుడే గొల్లపూడి మారుతీరావు వాళ్లబ్బాయి శ్రీనివాస్‌ ‘ప్రేమ పుస్తకం’ అన్న సినిమా ప్రారంభించాడు. ఆ సినిమా నిర్మాత అట్లూరి పిచ్చేశ్వరరావుకి ఎస్పీ బాలసుబ్రమణ్యమే అజిత్‌ని పరిచయం చేశాడు. విశాఖలో షూటింగ్‌ మొదలైంది. ఓ రోజు సముద్రతీరాన బండపైన నిల్చుని సీన్‌ చెబుతుండగా... ఓ పెద్ద అల వచ్చి శ్రీనివాస్‌ని తీసుకెళ్లిపోయింది. మళ్లీ రాలేదతను. కళ్లెదుటే కొడుకు కనుమూసిన విషాదాన్ని గుండెల్లో దాచుకుని... నెల తర్వాత గొల్లపూడి మారుతీరావే మెగాఫోన్‌ చేతబట్టారు. అజిత్‌ హీరోగా(శ్రీకర్‌ అని పేరుమార్చారు) అలా తొలిసినిమాని రిలీజు చేశారు. ఆ సినిమా సరిగా ఆడక పోవడంతో... తెలుగులో అజిత్‌కి మళ్లీ అవకాశాలు రాలేదు. ఈసారి తమిళంలో సెల్వ అనే కొత్త దర్శకుడు సినిమా తీస్తుంటే... మళ్లీ ఎస్పీబీయే అజిత్‌కి అవకాశం ఇప్పించారు. అలా ‘అమరావతి’ అన్న ఆ సినిమా పట్టాలకెక్కి షూటింగ్‌ కూడా చకచకా పూర్తిచేసుకుంది. రెండేళ్లపాటు షూటింగులతో రేసింగ్‌లకి దూరమైన అజిత్‌ మనసు మళ్లీ అటువైపు పరుగెత్తింది. ఓ ప్రధాన రేస్‌కి ముందు ట్రయల్‌ కోసం వెళుతుండగా... బండి తిరగబడింది. వెన్నెముక విరగడంతో ఆరునెలలపాటు ఐసీయూలో ఉండాల్సి వచ్చింది. ‘అమరావతి’ హిట్టయితేనేం... అజిత్‌ దాన్ని ఆస్వాదించే స్థితిలో లేడప్పుడు.

అన్నీ కోల్పోయిన దశ అది...
‘మొదట్లో డబ్బు కోసమే సినిమాల్లోకి వచ్చాన్నేను. నటనపైన ఆసక్తేమీ లేదు. కానీ... నా మొదటి హిట్టు తర్వాత చాలామంది నిర్మాతలు నన్ను వెతుక్కుంటూ ఆసుపత్రికి వచ్చారు. చేయలేనని తెలిసి వెళ్లిపోయారు. అప్పుడే నా నటనపైన నాకు నమ్మకం వచ్చింది...’ అంటాడు అజిత్‌. ఆ నమ్మకంతోనే కసిగా వెన్నెముక సర్జరీ నొప్పుల్ని తట్టుకుంటూ హీరోగా సిద్ధమయ్యాడు. రాధికతో కలిసి చేసిన ‘పవిత్ర’ అనే సినిమాలో క్యాన్సర్‌ పేషంట్‌గా అతని నటనకి చక్కటి ప్రశంసలొచ్చాయి. సెకెండ్‌ హీరోగా అవకాశాలొచ్చాయి. అప్పుడే దర్శకుడు మణిరత్నం నిర్మించిన ‘ఆశ’... సూపర్‌డూపర్‌ హిట్టయింది. ఆ తర్వాతి ఏడాదే విడుదలైన ‘ప్రేమలేఖ’ టీనేజీ యువతలో విపరీతమైన క్రేజ్‌ని సంపాదించిపెట్టింది. సరిగ్గా ఆ సమయంలోనే ఓ హీరోయిన్‌తో ప్రేమలో పడ్డాడు అజిత్‌. ఆ తర్వాతి ఏడాది షూటింగ్‌ చేస్తుండగా గాయమై... మళ్లీ పాత వెన్నెముక సమస్య తిరగబెట్టింది. సర్జరీ చేశారు... ఈసారి ఆరునెలలపాటు లేవలేదు. అది పెద్ద సమస్య కాదుకానీ... 1997లో విడుదలైన అతని సినిమాలన్నీ బాక్సాఫీస్‌ వద్ద బోల్తాకొట్టాయి. ఆ ఓటమికి తోడు... ప్రేమించిన అమ్మాయి దూరమైంది! ‘అవి నేను మానసికంగా తీవ్ర కుంగుబాటుకి గురైన రోజులైతేనేం, అవే నా వ్యక్తిత్వాన్ని చెక్కాయి. ఆ తర్వాత దేనికీ నేను కుంగిపోలేదు!’ అంటాడు అజిత్‌. ఆపరేషన్‌ తర్వాత మళ్లీ వచ్చిన అజిత్‌... మరింత ఉత్సాహంగా దూసుకెళ్లాడు. 1999లో ద్విపాత్రాభినయం చేసిన ‘వాలి’ బ్లాక్‌బస్టర్‌గానే కాదు... అజిత్‌ని గొప్ప నటుడిగా నిలబెట్టింది. అదే ఏడాది అమర్కలం(తెలుగు ‘అద్భుతం’) షూటింగ్‌లో షాలినిని ప్రేమించి... తర్వాత ఏడాది పెళ్ళిచేసుకున్నాడు. పెళ్ళై ఇరవైయేళ్లు దాటితేనేం... తమిళ అభిమానులకి ఇప్పటికీ వీళ్లిద్దరే బెస్ట్‌ పెయిర్‌!

‘వలిమై’ దాకా...
నాటి ‘ప్రేమపుస్తకం’ నుంచి నేటి ‘వలిమై’ దాకా... అరవై పైచిలుకు చిత్రాల అజిత్‌ కెరీర్‌లో అద్భుతమైన హిట్సే కాదు, అవమానకరమైన ఫ్లాప్సూ ఉన్నాయి. వరస సర్జరీల కారణంగా స్టెరాయిడ్స్‌వాడి ఓ దశలో వందకేజీల దాకా బరువెక్కాడు. అందగాడు కాస్తా అనాకారిగా మారాడు. అతని ఫొటోని ముఖచిత్రంగా పెట్టి ‘ఈయనెవరూ చెప్పుకోండి!’ అంటూ ఎగతాళి చేశాయి పత్రికలు! కేవలం రెండు నెలల్లో పాతిక కేజీలదాకా తగ్గి ఫిట్‌గా మారాడు అజిత్‌. ఆ తర్వాత వచ్చిన ‘బిల్లా’ సినిమాలో సరికొత్త స్టైల్‌తో అభిమానులని అలరించాడు.
అజిత్‌కి అది దాదాపు సెకెండ్‌ ఇన్నింగ్స్‌లాంటిది. ముందు నుంచే తెలుగు డబ్బింగ్‌లో మంచి మార్కెట్‌ ఉన్న అజిత్‌ గ్రాఫ్‌ని వెంకట్‌ప్రభు ‘గ్యాంబ్లర్‌’, గౌతమ్‌ మేనన్‌ ‘ఎంత వాడుగానీ...’ బాగా పెంచాయి. తలనెరిసినా ‘సాల్ట్‌ అండ్‌ పెప్పర్‌’ స్టైల్‌లో అలరించిన ‘విశ్వాసం’ ఇక్కడా కొత్త ట్రెండు సృష్టించింది. తాజాగా ‘వలిమై’తో మరోసారి డూప్‌లేకుండా రియల్‌ రేసింగ్‌లో తన పవరేమిటో మళ్లీ చూపించాడు అజిత్‌.
ఓ రెండేళ్ల కిందటిదాకా అజిత్‌ రాజకీయాల్లోకి వస్తున్నాడనీ... అందుకు అభిమాన సంఘాలని ఉపయోగించుకుంటున్నాడనే ప్రచారం జోరుగా సాగింది. అది అతని చెవిదాకా వెళ్లిందేమో వెంటనే ఆ సంఘాలన్నింటినీ రద్దు చేస్తున్నట్టు ప్రకటించాడు. అప్పుడు అతను చేసిన ప్రకటన... ఇప్పటికీ ఏ సినీ అభిమానికైనా గొప్ప పాఠం. సంక్షిప్తంగా దాని సారాంశం ఇది... ‘డియర్‌ సర్స్‌ అండ్‌ మేడమ్స్‌! నేననే కాదు ఏ నటుడి కోసమూ మీ విలువైన సమయాన్ని వృథా చేసుకోకండి. ఓ మెకానిక్‌నైన నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చానంటే కారణం సమయాన్ని సద్వినియోగం చేసుకోవడమే. నామీద ప్రేమతో మీరు పెట్టిన ఈ అభిమాన సంఘాల వల్ల మీ సమయం వృథా అవుతోందనిపించే వాటిని రద్దు చేయమంటున్నాను. దయచేసి మీ దృష్టంతా మీ కెరీర్‌పైనా కుటుంబంపైనా పెట్టండి... ఆ క్రమంలో సాధించే ఏ చిన్న విజయమైనా చాలు... అదే నాకు మీరిచ్చే వెలలేని కానుక’.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

ap-districts
ts-districts