ఆయన్ని చూస్తే వణికిపోయేవాణ్ని!

దిల్లీలో ఓ చిన్న ఉద్యోగం చేస్తుండేవాడు అతను. ఉద్యోగం చిన్నదా పెద్దదా అని కాదు... భవిష్యత్తులో తాను పెట్టబోయే వ్యాపారానికి ఈ అనుభవం అవసరమనుకున్నాడు. రేపోమాపో వ్యాపారం ప్రారంభిద్దాం అనుకునేలోపు జరిగిందా దుర్ఘటన... రోడ్డు ప్రమాదంలో తండ్రి మరణించాడు.

Updated : 23 Jun 2024 06:38 IST

దిల్లీలో ఓ చిన్న ఉద్యోగం చేస్తుండేవాడు అతను. ఉద్యోగం చిన్నదా పెద్దదా అని కాదు... భవిష్యత్తులో తాను పెట్టబోయే వ్యాపారానికి ఈ అనుభవం అవసరమనుకున్నాడు. రేపోమాపో వ్యాపారం ప్రారంభిద్దాం అనుకునేలోపు జరిగిందా దుర్ఘటన... రోడ్డు ప్రమాదంలో తండ్రి మరణించాడు. ఒక్కసారిగా అతని ప్రపంచం తలకిందులైంది! ఆ సంక్షోభ సమయంలో ఓ గొప్ప సంకల్పంతో తండ్రి రాజకీయ వారసత్వాన్ని అందుకున్న ఆ కుర్రాడే... ఉత్తమ పార్లమెంటేరియన్‌గా పేరుతెచ్చుకుని పుష్కరం దాటకుండానే- కేంద్రమంత్రి అయిన కింజరాపు రామ్మోహన్‌ నాయుడు. తాజాగా పౌరవిమానయాన శాఖ మంత్రిగా కొలువు దీరిన ఆయన మనోభావాలివి.

రామ్మోహన్‌ నాయుడు... మోదీ క్యాబినెట్‌లో పిన్నవయస్కుడైన మంత్రి అనీ, వాళ్ల నాన్నలానే అనర్గళంగా ఉపన్యాసాలు ఇస్తాడనీ, వాగ్ధాటి బాగుంటుందనీ చాలామంది అంటుంటారు. నాన్న ఎర్రన్నాయుడు- తన వారసుడిగా రాజకీయాల్లోకి తీసుకురావాలనే నన్ను అలా తయారు చేశారనీ అనుకుంటారు. నిజం ఏమిటంటే... నేను ఏ రోజూ పాలిటిక్స్‌లోకి రావాలనుకోలేదు. నన్ను తీసుకురావాలనీ నాన్నా కోరుకోలేదు. నేను వ్యాపారవేత్తగా స్థిరపడితే చూడాలని ఎన్నో కలలు కన్నారు. తీరా ఆ కలలు నిజమవుతాయనుకున్న తరుణంలో మా జీవితాలు తారుమారయ్యాయి. నా కలల్ని పక్కన పెట్టి... నాన్న ఆశయాలనే నా లక్ష్యంగా మార్చుకున్నా. ఆయనలా పార్లమెంట్‌ మెట్లు ఎక్కి- కేంద్రమంత్రి స్థాయికి ఎలా ఎదిగానో ఆలోచించుకుంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అందుకోసం ఎంత ఒత్తిడికి గురయ్యానో, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపానో నాకు మాత్రమే తెలుసు. ప్రసంగాల వీడియోలు వైరల్‌ అయినంత తేలిగ్గా ఏమీ సాగలేదు నా ప్రయాణం...

నాకు ఊహ తెలిసేటప్పటికి నాన్న శ్రీకాకుళం జిల్లా హరిశ్చంద్రపురం ఎమ్మెల్యే. మా ఇల్లు ఎప్పుడూ వచ్చిపోయే జనాలతో కోలాహలంగా ఉండేది. ప్రజల మన్ననలు అందుకునే నాన్న- గంభీరమైన ప్రవర్తనతో నాకు చాలా ప్రత్యేకంగా కనిపించేవారు. ఆహార్యం వల్లో, వాగ్ధాటి వల్లో కానీ- నాతోపాటే నాలో ఆయన పట్ల భయం కూడా పెరిగి పెద్దదైంది. ఇంట్లో ఉన్నప్పుడు ‘రామూ...’ అని గట్టిగా పిలిస్తే వణికిపోయేవాణ్ని. దగ్గరకు వెళ్ళడానికీ జంకేవాణ్ని. మా అక్క భవాని కాస్త ఫర్వాలేదు... ధైర్యంగా నాన్న ముందుకెళ్ళి మాట్లాడేది. నాన్నేమో ‘రాజకీయాలు నా వరకే - కుటుంబానికీ, పిల్లలకీ ఏ సంబంధమూ ఉండకూద’ని చెబుతుండేవారు. ముఖ్యంగా నేను బాగా చదువుకుని వ్యాపారవేత్తనవ్వాలని కోరుకున్నారు. ఆయన రాజకీయంలో పడుతున్న కష్టాలను చూసి నేను కూడా వాటికి దూరంగా ఉండి తన కోరికను నేరవేర్చాలనుకున్నా. ఇక, మేం ఇంట్లో ఎలా చదువుతామోనని నన్నూ, అక్కనీ యూకేజీలోనే బోర్డింగ్‌ స్కూలుకు పంపారు. నాన్న అసెంబ్లీలో విప్‌ అయ్యాక మమ్మల్ని హైదరాబాద్‌కి తీసుకొచ్చి భారతీయ విద్యాభవన్‌లో చేర్పించారు. నేనక్కడ నాలుగో తరగతిలో ఉన్నప్పుడు లోకేష్‌ అన్న ఆరో తరగతి చదివేవారు. నాన్న ఎంపీ అయ్యాక మమ్మల్ని కూడా దిల్లీ తీసుకెళ్లి దిల్లీ పబ్లిక్‌ స్కూల్లో చేర్పించారు. నేను అక్కడ ఆరో తరగతి నుంచి ఇంటర్‌ వరకూ చదివా. మొదట్లో ఆ వాతావరణానికి అలవాటు పడటం కష్టంగానే అనిపించింది. మార్కులు తక్కువ వస్తే అస్సలు ఊరుకునేవారు కాదు! అందుకే ‘రాముడు మంచి బాలుడు’ అన్నట్టు బుద్ధిగా చదివేవాడిని. ఇంటర్‌ అయ్యాక ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ చేయాలనుకున్న నన్ను అమెరికాలోని పర్డ్యూ యూనివర్సిటీకి పంపారు. ఆరో తరగతి నుంచి దిల్లీ పబ్లిక్‌ స్కూల్లో చదవడం వల్ల తెలుగు మాట్లాడం అంతగా వచ్చేది కాదు! భాష నేర్చుకోవాలని తెలుగు సినిమాలు చూసేవాడిని. అలానే ఫ్రెండ్స్‌తో కలిసి యాక్టింగ్‌ చేస్తూ కొన్ని వీడియోలు తీసుకుని యూట్యూబ్‌లో పెట్టేవాణ్ని. తెలుగు విద్యార్థులు ఆ వీడియోలు చూసి ఇంకా చేయమని ప్రోత్సహించేవారు. ఆ పని చేస్తూనే ఇంజినీరింగ్‌ పూర్తి చేశా. తరవాత సింగపూర్‌లో కొంత కాలం పని చేసి, దాన్ని మానేసి న్యూయార్క్‌లో ఎంబీఏ చేశా. ఇంట్లో వాళ్ల మీద ఆధారపడకుండా ఆ సమయంలో పార్ట్‌టైమ్‌ ఉద్యోగం చేసేవాడిని. 2012లో ఎంబీఏ అయ్యాక దిల్లీలోని ఓ ఇంటీరియర్‌ డిజైనింగ్‌ సంస్థలో ఉద్యోగానికి చేరా. దాదాపు ఎనిమిది నెలలు పని చేశానక్కడ. ఇక సొంతంగా ఓ కంపెనీ పెడదామని అనుకుంటున్నప్పుడు... ఓ ఫోన్‌ వచ్చింది. అది నా జీవన గమనాన్నే మార్చేసింది.

చంద్రబాబు తోడున్నారు...

ఆరోజు 2012, నవంబర్‌ 2, తెల్లవారు జామున రెండింటికి ఓ స్నేహితుడు ఫోన్‌ చేశాడు. ‘మీ నాన్నకి యాక్సిడెంట్‌ అయిందని టీవీలో చూపిస్తున్నారు... చూడు’ అన్నాడు. టీవీ పెడితే- ప్రమాద దృశ్యాలు! ఆ క్షణాల్లో నా కాళ్ల కింద భూమి కంపించినట్టైంది. అమ్మకి ఫోన్‌ చేస్తే ‘అంతా బాగానే ఉంది కానీ, ముందు నువ్వు వచ్చెయ్‌’ అంది. ఆమె గొంతులో ఏదో వణుకు! అప్పుడు విశాఖపట్నానికి ఫ్లైట్‌లు ఏమీ లేవు. కాళ్లూ చేతులూ ఆడలేదు. టైమ్‌ మూడున్నర అవుతోంది. సరిగ్గా అప్పుడే ఫోన్‌ చేశారు చంద్రబాబు సర్‌. ‘నువ్వేమీ కంగారు పడకు, దిల్లీలో దొరికిన ఫ్లైట్‌ ఎక్కి హైదరాబాద్‌ వచ్చేసెయ్‌. నీకోసం ప్రత్యేక విమానంతో రెడీగా ఉంటా’నని చెప్పారు. అప్పటికే నాన్న చనిపోయినట్టు ఖరారైంది. చంద్రబాబు నన్ను శంషాబాద్‌ విమానాశ్రయంలో రిసీవ్‌ చేసుకుని మా సొంతూరు నిమ్మాడకు బయల్దేరారు. ఇంటికి చేరే వరకూ నాన్న జ్ఞాపకాలే మనసులో మెదిలాయి. చెబితే నమ్మరుగానీ నా ఇరవై ఐదేళ్ల జీవితంలో నేనూ, నాన్నా మాత్రమే కలిసి గడిపింది రెండ్రోజులు మాత్రమే. న్యూయార్క్‌లో ఉన్నప్పుడు ఓసారి పార్టీ సమావేశానికి వచ్చి నా దగ్గరున్నారు. ఆ సమయంలో ఆయన్ని కారులో న్యూయార్క్‌ అంతా తిప్పి... సెలూన్‌లో హెయిర్‌ కట్‌ చేయించా. ఇద్దరం స్నేహితుల్లా ఎన్ని కబుర్లు చెప్పుకున్నామో. ఈ ఆలోచనలతో ఎప్పుడు ఫ్లైట్‌ దిగామో, కారులోకి ఎప్పుడు మారామో కూడా చూసుకోలేదు. ‘నా జీవితంలో నాన్నతో అలా గడపడం అదే మొదటిసారీ చివరిసారీ కదా’ అని అనుకుంటూ ఉండగా కారు మా ఇంటి దగ్గర ఆగింది. నిర్జీవంగా ఉన్న నాన్ననీ, నిస్సహాయంగా ఉండిపోయిన అమ్మనీ చూశాక ఎంత ఆపుకుందామన్నా ఏడుపు ఆగలేదు! ఆ కఠిన వాస్తవాన్ని జీర్ణించు కోవడానికి చాలా సమయమే పట్టింది.

ఆ క్షణం నిర్ణయించుకున్నా...

నాన్న అంత్యక్రియలయ్యాక పరామర్శకొచ్చిన అభిమానులూ, కార్యకర్తలూ, ప్రముఖులతో ఇల్లు కిక్కిరిసిపోయింది. వాళ్లందరి ఆదరాభి మానాలు చూశాక- నాన్నని అంతగా నమ్ముకున్న వాళ్ళకి తోడుగా నిలవాలని పించింది. ఆయన లేని లోటుని కొంతవరకైనా పూడ్చాలనిపించింది. ప్రజాసేవలోకి రావాలని... ఆ క్షణానే నిర్ణయించుకున్నా. నా నిర్ణయాన్ని విని చిన్నాన్న అచ్చెన్నాయుడు ఎంతో సంతోషించారు. చంద్రబాబు నన్ను ప్రోత్సహించాలని శ్రీకాకుళం లోక్‌సభ ఇన్‌ఛార్జిగా నియమించారు. రాజకీయ నాయకుడిగా కాలు బయట పెట్టాక ప్రత్యేకంగా కనిపించడానికి లాల్చీ పైజమా వేసుకోవడం, నాన్నలా నుదుట బొట్టు పెట్టుకోవడం అలవాటు చేసుకున్నా.  లోక్‌సభ ఇన్‌ఛార్జిగా నా పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ స్థానాల్లో- అందరివాడినని చెబుతూ జనాల్లోకి వెళ్లా. ప్రజలు కూడా ఎర్రన్న బిడ్డగా నన్ను ఆదరించారు. పెద్ద నాయకులు ఎలా మాట్లాడుతున్నారో గమనించుకుంటూ స్పీచ్‌లు ఇవ్వడానికి నన్ను నేను సిద్ధం చేసుకుంటూనే నాకున్న అవగాహనతో జనాల్లో మాట్లాడేవాణ్ని. 2014 ఎన్నికలకు ముందు శ్రీకాకుళంలో నెలరోజులపాటు 700 కిలోమీటర్లు సైకిల్‌ యాత్ర  చేశా. ఎక్కడికి వెళ్లినా అందరూ నాన్నతో పోల్చేవారు. ఒకరకంగా ఆయన వ్యక్తిత్వం నామీద బరువును పెంచిందనే చెప్పాలి. ఆయన్ని ఊహల్లో కూడా అందుకోలేనేమో అనే ఒత్తిడికి గురయ్యేవాణ్ని. కొన్ని నెలలపాటు నాలో నేను బాధపడ్డాక- నాన్నలా నిస్వార్థంగా, ఏ తప్పూ చేయకుండా నాకు నచ్చిన పద్ధతిలో పని చేయాలని నిర్ణయించుకున్నా. అదే సమయంలో చంద్రబాబు పాదయాత్ర ముగింపుసభలో మాట్లాడినప్పుడు మంచి స్పందన వచ్చింది. మరుసటి రోజు పేపర్లలో ఎర్రన్నాయుడు వారసుడొచ్చాడు, అద్భుతంగా మాట్లాడాడు అని రాసినప్పుడు ధైర్యమొచ్చింది.

లోక్‌సభలోకి...

2014 ఎన్నికల్లో తొలిసారి శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేసి గెలిచా. 2018లో ప్రధాని మోదీపై అవిశ్వాస తీర్మానం సందర్భంలో- వైజాగ్‌ రైల్వేజోన్‌, ప్రత్యేక హోదా, పోలవరం గురించి దాదాపు పావుగంట మాట్లాడా. ఆ స్పీచ్‌ను ప్రారంభించడానికి కాస్త జంకాను గానీ... ఫ్లో అలా వెళ్లిపోయింది. చెప్పాల్సిన విషయాన్ని మొక్కుబడిగాకాక పూర్తి గణాంకాలతో ఒకింత ఉద్వేగంతో చెప్పడంతో దేశం నలుమూలల నుంచీ అభినందనలు వచ్చాయి. ఓ ఆరునెలల తరవాత మోదీ కూడా ఓ ఫంక్షన్‌లో కలిసి ‘సభలో చాలా బాగా మాట్లాడుతున్నావ్‌... నేనూ నిన్ను టీవీలో చూస్తున్నా’నని చెప్పినపుడు ఎంతో సంతోషమనిపించింది. 2019లో రెండోసారి గెలిచాక- రాష్ట్రంలో తెలుగుదేశం ప్రతి పక్షంలో ఉండటంతో కార్యకర్తలు ఎక్కడా డీలా పడకుండా వెన్నంటే ఉన్నా. మూడోసారి గెలుపు మాత్రం నాకు ప్రత్యేకం. నాన్న కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చోటే నేనూ చేయడం గొప్ప అనుభూతి! రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణస్వీకారం చూసినప్పుడు తెలియని ఉద్వేగం కలుగుతుంది. రోమాలు నిక్కబొడుచుకుంటాయి. మొదటి రెండుసార్లు ఎంపీగా మోదీ ప్రమాణస్వీకారాన్ని చూడ్డానికి వెళ్లినప్పుడు రకరకాల ఆలోచనలు. మంత్రులు ఏం ఆలోచిస్తారు... రాష్ట్రపతి భవన్‌ ముందున్న రాజసాన్ని ఆస్వాదిస్తున్నారా... వాళ్లతో మాట్లాడి తెలుసుకుందామా... అనుకునే వాడిని. మూడోసారి ఆ ఆలోచనలకు తావు లేకుండా ప్రజల ఆదరాభిమానాల వల్ల నేనే కేంద్ర క్యాబినెట్‌ మంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం గొప్పగా అనిపించింది. ఆ రోజు వేదిక మీద ఉన్నంత సేపూ నాన్నే మదిలో మెదిలారు. అంతేకాదు, నాన్న చనిపోయింది మొదలు నా చేయి పట్టుకుని నడిపిస్తున్న చంద్రబాబునాయుడు కూడా ఆ క్షణంలో తండ్రిలానే నన్ను చూసి గర్వించారు.పదేళ్లలో నేను ఈస్థాయికి వస్తానని ఎప్పుడూ అనుకోలేదు. నాలో చాలా పరిణతి వచ్చింది. ప్రణాళికా బద్ధంగా పనులు చేసుకోవడం, సమయపాలన వంటివి అలవడ్డాయి. ఏ విషయమైనా లోతుగా మాట్లాడే అనుభవం వచ్చింది. నేను ఎక్కడున్నా, ఏ స్థాయిలో ఉన్నా అందరూ గుర్తుపెట్టుకునేలా మంచి పనులు చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నా.


స్ఫూర్తినిచ్చిన వ్యక్తి

నాకు వృత్తిగతంగానూ, వ్యక్తిగతంగానూ స్ఫూర్తినిచ్చిన వ్యక్తి చంద్రబాబునాయుడు. ఆయన దార్శనికత నాకు నచ్చుతుంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు దూరదృష్టితో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. వాటిని ఆచరణలో పెట్టడానికి ఎంతో కష్టపడతారు. నాకు రాజకీయాల్లో ఏది కష్టంగా అనిపించినా దాన్ని అధిగమించి నిలబడటానికి ఆయన్నే ఆదర్శంగా తీసుకుంటా. ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొని నిలబడటం ఆయనకొక్కరికే చెల్లింది. 75 ఏళ్ల వయసులోనూ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతోపాటు, కేంద్రంలోనూ కీలకంగానూ మారారు. అనుభవంలోనూ వయసులోనూ చిన్నవాణ్ణయినా సరే, మొన్న కేంద్రమంత్రిగా అమరావతి వెళ్ళినప్పుడు- మిగతా పెద్దలతో సమానంగానే నన్నూ గౌరవించారు. అంతకన్నా ఆదర్శం నాకు ఇంకెవరుంటారు?!


పెళ్లి... పిల్లలు

మాది పెద్దలు కుదిర్చిన ప్రేమ పెళ్లి. నా భార్య శ్రావ్యను వైజాగ్‌లోని ఓ కార్యక్రమంలో చూశా. తను నచ్చడంతో మా పెద్దల ద్వారా వాళ్ల కుటుంబ సభ్యులకు పెళ్లి ప్రపోజల్‌ పంపా. వాళ్లకీ మా సంబంధం నచ్చడంతో 2017లో మా పెళ్లైంది. నేను తనకి సమయం కేటాయించ లేకపోయినా, కొన్నిసార్లు అభిమానులు ఆమెను కూడా పక్కకు తోసేసి నన్ను చుట్టుముట్టిన సందర్భాల్లోనూ... అర్థం చేసుకుంటుంది. పెళ్లయ్యాక నా భార్యతోగానీ, మూడేళ్ల మా పాపతోగానీ గడిపింది చాలా తక్కువ సమయం. అందుకు కాస్త బాధగానే ఉన్నా- నాన్న స్ఫూర్తితో ప్రజలనే నా కుటుంబంగా భావించి ముందుకు వెళుతున్నా. దొరికిన కాస్త సమయంలోనే ఇంట్లో వాళ్లతో ఆనందంగా గడిపేలా చూసుకుంటున్నా.

-చల్లా విజయభాస్కర్‌, ఈనాడు, దిల్లీ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..